ఏనిమల్ ఫార్మ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏనిమల్ ఫార్మ్
Animal Farm
అమెరికా మొదటి ప్రచురణ కవర్
కృతికర్త: జార్జ్ ఆర్వెల్
అసలు పేరు (తెలుగులో లేకపోతే): Animal Farm: A Fairy Story
దేశం: యు.కె.
భాష: ఇంగ్లీష్
విభాగం (కళా ప్రక్రియ): వ్యంగ్యం
ప్రచురణ: Secker and Warburg (London)
విడుదల: 17 ఆగష్టు 1945
ప్రచురణ మాధ్యమం: ప్రింట్
పేజీలు: 112 పేజీలు (UK paperback edition)
దీనికి ముందు: The Lion And The Unicorn
దీని తరువాత: Nineteen Eighty-Four
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 0-452-28424-4 (present) ISBN 978-0-452-28424-1


ఏనిమల్ ఫార్మ్ (Animal Farm), 1945లో ప్రచురింపబడిన ఒక ఆంగ్ల నవల. దీని రచయిత జార్జ్ ఆర్వెల్. నవలలో రెండవ ప్రపంచ యుద్ధం ముందుగా స్టాలిన్ పాలనాకాలంలో సోవియట్ యూనియన్ చరిత్రలోని కొన్ని రాజకీయ పరిస్థితులను వ్యంగ్యంగా రచయిత తన కథనంలో ఇమిడ్చాడు.[1] ఇది స్టాలిన్ విధానాలకు వ్యతిరేకంగా చేసిన నవల అని రచయిత చెప్పాడు. ("contre Stalin").[2]

మొదట ప్రచురించినపుడు నవల పేరు Animal Farm: A Fairy Story, కాని తరువాత A Fairy Story అనే పదాలను 1946 ప్రచురణలో తొలగించారు. తరువాత వెలువడిన అనేక అనువాదాలలో తెలుగు అనువాదంలో మాత్రమే ఒరిజినల్ పేరు ఉంచారు. 1923-2005 మధ్యకాలంలో వెలువడిన పుస్తకాలలో మొదటి 100 నవలలో ఇది ఒకటి అని టైమ్ మాగజైన్ అభివర్ణించింది.[3] ఇంకా ఈ నవలకు అనేక ప్రశంసలు, పురస్కారాలు లభించాయి.

(దుప్పల రవికుమార్ అనే రచయిత తన చదువు-బ్లాగులో "ఉన్నత ఆదర్శాలు – అధమ ఆచరణకు వ్యంగ్యరూపం" అన్న పేరుతో వ్రాసిన పరిచయం ఈ వ్యాసానికి మూలం).

పరిచయం

[మార్చు]

జీవితాన్ని యథార్థంగా ప్రతిబింబించేదే సాహిత్యం. నిజం చేదుగా ఉంటుంది. అలాంటి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పి సత్యపు విశ్వరూపం ప్రదర్శింప జేయడం అన్ని సందర్భాలలో అందరి ఆమోదం పొందకపోవచ్చు. అలాంటి సందర్భాలలో నిజాన్ని వ్యంగ్యభరితం చేయడంద్వారా మరింత లోతుగా ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పవచ్చు. ముఖ్యంగా సామాజిక అవలక్షణాలైన మూఢనమ్మకాలను వ్యంగ్యభరితంగా చిత్రించడం ద్వారా మనిషి తనలో తర్కరాహిత్యాన్ని తను స్పష్టంగా గుర్తిస్తాడు. తద్వారా తననుతాను సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. ప్రపంచ సాహిత్యంలో జొనాథన్ స్విఫ్ట్ రచించిన ‘గలివర్ ట్రావెల్స్’ ఇందుకు చక్కటి ఉదాహరణ. తెలుగు సాహిత్యంలోనైతే కందుకూరి వీరేశలింగం రచనలు చూపించవచ్చు.

విప్లవం పేరిట సోవియట్ రష్యాలో అనేక మార్పులు జరిగాయి. మన రాజుల పాలనను పోలివుండే జారిస్టుల పాలనను అంతమొందించి సమసమాజం ఏర్పరచడంలో దగ్గరదగ్గర నాలుగైదు తరాలు తమ సమకాలీన ప్రపంచంతో తీవ్రంగా పోరాడవలసి వచ్చింది. ఎన్నో ఆటుపోట్లు. ఎన్నో పూలూరాళ్లూ. ఎన్నో భూషణదూషణాలు. అన్నింటికీ ఎదురునిలిచి కష్టసాధ్యమైన ఆశయాన్ని సుసాధ్యం చేసుకున్నారు. అయితే నాయకత్వాన్ని నిలబెట్టుకునే క్రమంలో అణచివేతలు తప్పలేదు. హత్యలూ తప్పలేదు. ఇలా సోవియట్ రష్యాలో జరిగిన తతంగాన్ని “ఏనిమల్ ఫార్మ్” నవలలో జార్జి ఆర్వెల్ ఎంతో వ్యంగ్యభరితంగా చిత్రించారు. స్టాలిన్ ను వ్యంగ్యంగా చిత్రించినందుకో, కమ్యూనిజం భావాలమీద రాళ్లు విసిరినందుకో, అపురూప వ్యంగ్య వైభవాన్ని తన రచనలో చిత్రించినందుకో, ఇందుకే అని చెప్పలేం గానీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన నవలగా ఈ “ఏనిమల్ ఫామ్” ఖ్యాతి పొందింది.

రచయిత

[మార్చు]

ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ అన్నాయన ఇండియాలోనే (బెంగాల్లో) పుట్టాడు. కొన్నాళ్లిక్కడే పెరిగి తర్వాత పై చదువులకోసం ఇంగ్లండ్ వెళ్లాడు. చదువు పూర్తయ్యాక ఇండియన్ ఇంపీరియల్ పోలీస్ సర్వీసులో ఉద్యోగంలో చేరి బర్మాలో ఐదేళ్లపాటు పనిచేశాడు. ఆ ఉద్యోగం విడిచిపెట్టేసి మళ్లీ ఇంగ్లండు చేరి పద్దెనిమిది నెలలున్నాడు. విసుగేసి అక్కడనుంచి పారిస్ ప్రయాణం కట్టాడు. జర్నలిజం వృత్తిలో దిగాడు. “డౌన్ అండ్ అవుట్ ఇన్ పారిస్ అండ్ లండన్” పేరుతో ఒక పుస్తకం రాసి ఎందరో ప్రచురణకర్తలకు చూపించాడు. అన్ని చోట్లా అది గోడకు కొట్టిన బంతే అయింది. అప్పట్లో ఫేబర్ అండ్ ఫేబర్ అనే ప్రచురణ సంస్థను మహాకవి టి.ఎస్. ఇలియట్ నడిపేవాడు. అక్కడనుంచి కూడా ససేమిరా అనే జవాబు రావడంతో ఒక చిన్న ప్రచురణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా 1933లో తన మొదటి పుస్తకాన్ని ఆర్థర్ బ్లెయిర్ ఒక మారుపేరుతో ప్రచురించాడు – జార్జ్ ఆర్వెల్ గా. ఆ పుస్తకం పెద్దగా ప్రజాదరణ పొందలేదు. తరువాత స్పెయిన్ వెళ్లి అంతర్యుద్ధంలో పాల్గొని బాగా గాయాలపాలయ్యాడు. బతుకుతెరువు కోసం మళ్లీ జర్నలిజమ్ వృత్తినే చేపట్టాడు. వృత్తిలో భాగంగా రెండు ప్రపంచ యుద్ధాలనూ ప్రత్యక్షంగా పరిశీలించాడు. జార్జి ఆర్వెల్ పేరుతోనే చాలా నవలలు, వ్యాసాలు రాశాడుగానీ అతడి వ్యంగ్య వైభవంతో చిరస్థాయిగా నిలిచిపోయిన నవల “ఏనిమల్ ఫామ్” 1945 మేలో వెలువడింది. 1947లో స్కాట్ లాండ్ చేరుకుని అక్కడ స్థిరపడిన జార్జి ఆర్వెల్ 1949లో మరో ఆణిముత్యంలాంటి నవల “1984″ను వెలువరించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే చనిపోయాడు.

కథా సారాంశం

[మార్చు]

“ఏనిమల్ ఫార్మ్” నవల మన పంచతంత్రంలా జంతువుల ప్రతీకలతో నడుస్తున్న సమాజాన్ని రికార్డ్ చేసిన కథ. ఈ నవలలో మిస్టర్ జోన్స్ కు మేనర్ ఫార్మ్ పేరుతో పెద్ద వ్యవసాయ క్షేత్రం వుంటుంది. అందులో ఒక పశువుల శాలను కూడా నిర్వహిస్తుంటాడు. అక్కడ అన్ని రకల జంతువులూ వుంటాయి. వాటిచేతనే అన్ని రకాల పనులు చేయిస్తుంటాడు. వాటి శ్రమతో పంటలు పండించుకోవడమే కాకుండా అవి పెట్టే గుడ్లు, ఇచ్చే పాలు, మాంసం కూడా ఉత్పత్తిలో భాగంగా తేరగా మిస్టర్ జోన్స్ తీసుకుంటుంటాడు. ఈ శ్రమదోపిడీని ఆ జంతువులలో మేజర్ అనే పంది గుర్తిస్తుంది. తన తోటి జంతుజాలాన్ని సమావేశపరిచి ఈ దోపిడీ స్వరూపాన్ని వెల్లడించి, విప్లవం ఆవశ్యకతను వివరించి, వాటిని చైతన్యపరుస్తుంది. మనుషులంతా కలిసి జంతువుల శ్రమను ఎన్ని విధాలుగా దోపిడీ చేస్తున్నారో వివరిస్తుంది. కార్మిక జంతువర్గమంతా ఐక్యమై పోరాడాలని కోరుతుంది. వృద్ధ్యాప్యంవల్ల ఆ తరువాత కొద్ది రోజులకే మేజర్ చనిపోతుంది. ఆ వ్యవసాయ క్షేత్రం యజమాని మిస్టర్ జోన్స్ తాగుడు వ్యసనానికి బానిసై జంతువులను పూర్తిగా పట్టించుకోడు. రోజుల తరబడి పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు విప్లవ కార్యాచరణను స్నోబాల్ అనే పంది తన చేతుల్లోకి తీసుకుంటుంది. జంతువులన్నింటిని ఏకం చేసి తిరుగుబాటుకు మార్గం సన్నద్ధం చేస్తుంది. ఒకరోజు మిస్టర్ జోన్స్ ను, జోన్స్ పరివారాన్ని తరిమికొట్టి జంతువులన్నీ స్వతంత్రం పొందుతాయి. నెపోలియన్ అనే మరోపంది, బాక్సర్, క్లోవర్ లనే గుర్రాలు, తెల్లమేక మురీల్, బెంజామిన్ గాడిద, ఇంకా కుక్కలు, బాతులు, పావురాలు, ఎలుకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు, ఒకటేమిటి… అన్నీ కష్టపడి పనిచేస్తూ మేనర్ ఫార్మ్ ను ఏనిమల్ ఫామ్ గా మార్చుకుని స్వేచ్ఛాసౌఖ్యం పొందుతూ బతకడానికి ‘ఏడు నిబంధనలు’ తయారుచేసుకుంటాయి. అవి:

  1. రెండు కాళ్లతో నడిచే ప్రతిదీ మన శత్రువే.
  2. నాలుగు కాళ్లతో నడిచేది లేదా రెక్కలున్నది ప్రతిదీ మన మిత్రువే.
  3. జంతువులు బట్టలు కట్టాకూడదు.
  4. జంతువులేవీ మంచాలపై పడుకోకూడదు.
  5. జంతువులేవీ మద్యపానం సేవించరాదు.
  6. ఒక జంతువు మరో జంతువును వధించకూడదు.
  7. జంతువులన్నీ సమానమే.

ఇలాంటి పనులు చేస్తున్న స్నోబాల్ వైఖరి నెపోలియన్ కు నచ్చదు. అన్ని పనులకు కమిటీలు వేసుకుని ముందుకు సాగాలనుకోవడం, ప్రతీ విషయాన్ని బహిరంగ చర్చకు పెట్టడం, పందులతో సహా జంతువులన్నీ చదువుకోవాలనుకోవడం, శ్ర మ విభజన చేసుకోవడమే కాకుండా ఉత్పత్తిని సమాన వాటాలుగా పంపిణీ చేయమనడం, కొంత మిగులు ఉత్పత్తిని నిల్వ చేయాలనుకోవడం వంటి పద్ధతులేవీ క్రమక్రమంగా నెపోలియన్ కు నచ్చడం లేదు. ఇంతలో స్నోబాల్ ఒక కీలకమైన ప్రకటన చేస్తుంది. విండ్ మిల్లు ఏర్పాటుచేయడం ద్వారా జంతువులు పడే భౌతిక శ్రమ స్థానంలో యాంత్రికతను ప్రవేశపెట్టి మరింత ఉత్పత్తిని రాబట్టడమే కాకుండా, పని గంటలు కూడా పొదుపు చెయ్యవచ్చనే ఆలోచన అందరికీ పంచుతుంది. ఇక లాభం లేదనుకునిఒక క్రమ పద్ధతి ప్రకారం స్నోబాల్ ను ఏనిమల్ ఫామ్ నుంచి తన్నితరిమేస్తుంది. అక్కడనుంచి కథ మరో మలుపు తిరుగుతుంది.

నెపోలియన్ క్రమంగా ఏడు నిబంధనల స్ఫూర్తికి తూట్లు పొడుస్తుంది. తన వాదనలను మిగతా జంతువుల దగ్గర బలంగా వినిపించడానికి, ప్రచారం చేయడానికీ స్క్వీలర్ పందిని నియమిస్తుంది. ఈ పంది తన అసమానమైన భాషతో, వాదన పటిమతో నెపోలియన్ ఆలోచనలన్నింటిని ఇతర జంతువులన్నింటి చేత అంగీకరింపజేస్తుంది. ఒకవేళ అప్పటికీ ఎవరైనా వినకపోతే వారిని లొంగదీసుకోవడానికి ఎనిమిది బలిష్టమైన కుక్కలతో ప్రైవేట్ ఆర్మీ నడుపుతుంది. ఇరుగుపొరుగు ఫామ్ హౌస్ ల యజమానులు – మనుషులతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంది. జంతువులన్నీ ఎంతో శ్రమతో, త్యాగంతో అష్టకష్టాలు పడి విండ్ మిల్లునుకూడా నిర్మిస్తారు. (ఈ విండ్ మిల్లు నెపంతోనే స్నోబాల్ ను ఆ క్షేత్రంనుంచి తన్ని తరిమేయడం మనం మర్చిపోకూడదు.)

తన వర్గమైన పందులన్నింటికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది. తన శరణుజొచ్చిన వారికి ప్రత్యేక పదవులు లభిస్తాయి. ఎదిరించిన వారికి మరణ శాసనం ఖాయంచేస్తుంది. ఏడు నిబంధనలు మారి మారి క్రమంగా మాయమై ఒకే నిబంధన మిగులుతుంది. ఆ నిబంధన వాక్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది: “అన్ని జంతువులూ సమానమే. కాని కొన్ని జంతువులు మాత్రం కొంచెం ఎక్కువ సమానం”. ఆ దశకల్లా మిష్టర్ జోన్స్ హయాంకంటే హీనమైన గడ్డురోజులు జంతువులు అనుభవిస్తుంటాయి. కొన్ని జంతువులు నెపోలియన్ కుట్రను పసిగడతాయి. అక్కడితో ఈ నవలిక ఆగిపోతుంది. ఇదీ బయటకు కనిపించే నవల. ఉపరితల నిర్మితి (సర్ఫేస్ టెక్చర్) లో పంచతంత్రం కథలా జంతువుల కథ కనిపిస్తుంది కాని, ప్రపంచ చరిత్రతో పరిచయమున్న వారి మనసుల్లోకి మరేవేవో కథలు జ్ఞప్తికి వస్తుంటాయి.

సంకేత సందేశాలు

[మార్చు]

సోవియట్ రష్యా చరిత్రలో పరిచయమున్నవారికి మేజర్ పంది లెనిన్ ను, స్నోబాల్ ట్రాట్ స్కీని, నెపోలియన్ స్టాలిన్ ను గుర్తు తెప్పిస్తారు. జార్ చక్రవర్తుల కులీన మనస్తత్వాల ఇరుకుగదుల్లో బందీలైపోయి అష్టకష్టాలు పడుతున్న రష్యా ప్రజానీకం – మిష్టర్ జోన్స్ ఏలుబడిలో బాధలు అనుభవిస్తున్న జంతువులుగా గుర్తిస్తాం. అయితే నవల జాగ్రత్తగా చదివిన పాఠకులు మాత్రం రచయిత కమ్యూనిస్టుల విప్లవ పోరాటాన్ని హేళన చేస్తున్నాడని ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటు పడరు. కేవలం విప్లవాదర్శాల కార్యాచరణను ఎద్దేవా చేయడం గమనిస్తారు. సాహిత్య ఆశయం, ముఖ్యంగా వ్యంగ్యపు ప్రయోజనం అదే కదా! నాయకత్వం ఏది చెబితే అది నమ్మి సామాన్య కార్యకర్తలైన జంతువులన్నీ నెపోలియన్ తమను ఎలా క్రమక్రమంగా బానిస దాస్య శృంఖలాలలో బంధిస్తున్నదీ తెలుసుకోలేక పోవడం నిజ జీవితంలో (ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల కేడర్ లో)మనం చూస్తున్నదే.

కథంతా ఒకే ఫామ్ హౌస్ లో నడపడం కూడా జీవితం అనే సూక్ష్మ ప్రపంచాన్ని సింబలైజ్ చేయడానికి, జంతువులకూ మిష్టర్ జోన్స్ కూ మధ్య; స్నోబాల్ కూ నెపోలియన్ కూ మధ్య; పందులకూ మిగతా జంతువులకూ మధ్య; ఆ జంతు క్షేత్రానికీ ఇరుగుపొరుగు వారికీ నడుమ ఒక సంఘర్షణ కొనసాగుతుంటుంది. కాని అదంతా దోపిడీదారుడికీ దోపిడీకి గురయ్యేవాడికీ మధ్య జరిగే సంఘర్షణ. ఇంకా చెప్పాలంటే సోషలిస్టు ఉత్తమ ఆదర్శాలకూ అధమ ఆచరణకూ నడుమ జరుగుతున్న సంఘర్షణ. వ్యంగ్య రచన అసలు ఉద్దేశం ఎవరో వ్యక్తినో, ఏదో సిద్ధాంతాన్నో ఎగతాళి చేయడం కాదు. కేవలం పరిస్థితులు మెరుగుపరచాలన్న తాపత్రయమే. అందుకు మంచి ఉదాహరణ ఈ నవలికే.

తెలుగు అనువాదం

[మార్చు]
Napoleon is the one of the major character in the Bible who is based on Joseph Stalin the great Russian leader

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Why I Write" (1936) (The Collected Essays, Journalism and Letters of George Orwell Volume 1 – An Age Like This 1945-1950 p.23 (Penguin))
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Dav అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. Grossman 2005
  • చదువు బ్లాగులో దుప్పల రవికుమార్ వ్రాసిన పరిచయం. తన రచనను తెలుగు వికీలో కాపీ చేయడానికి అనుమతి ఇచ్చినందుకు రచయితకు కృతజ్ఞతలు.

బయటి లింకులు

[మార్చు]