Jump to content

ఒంగోలు ఎన్.రంగయ్య

వికీపీడియా నుండి
ఒంగోలు ఎన్.రంగయ్య
ఒంగోలు నిడమనూరి రంగయ్య
జననం1937
కొత్తకోట, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
వృత్తికర్ణాటక సంగీత విద్వాంసుడు (నాదస్వరం)
పురస్కారాలుసంగీత నాటక అకాడమీ అవార్డు

ఒంగోలు నిడమనూరి రంగయ్య నాదస్వర విద్వాంసుడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు 1937లో ప్రకాశం జిల్లా, కొత్తకోట గ్రామంలో జన్మించాడు. ఇతడు మొదట ఎం.వెంకటరత్నం వద్ద నాదస్వరాన్ని నేర్చుకున్నాడు. తరువాత ఎన్.కె.రాజదొరై కన్నన్, ఎన్.కె.సి.నటరాజన్‌ల వద్ద తన కళకు మెరుగులు దిద్దుకున్నాడు. అలత్తూర్ శ్రీనివాస అయ్యర్ వద్ద గాత్రసంగీతం అభ్యసించాడు.

ఇతడు దక్షిణ భారత దేశంలోని శ్రీరంగం, తంజావూరు, మదురై, చిదంబరం, తిరువయ్యూరు వంటి అనేక దేవాలయాలలో నాదస్వరం వినిపించాడు. చెన్నై, బెంగళూరు, మైసూరు, కలకత్త, ముంబై, ఢిల్లీ వంటి అనేక నగరాలలో సంగీతసభలలో తన కచేరీలు ప్రదర్శించాడు. 1950 నుండి ఆకాశవాణిలో, తరువాత దూరదర్శన్‌లో అనేక నాదస్వర కార్యక్రమాలు నిర్వహించాడు. ఇతడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో నాదస్వర విభాగానికి అధిపతిగా 1981 నుండి 1995 వరకు పనిచేశాడు. ఇతడు తన విద్యను అనేక మందికి పంచి వందలకొద్దీ శిష్యులను నాదస్వర విద్వాంసులుగా తయారు చేశాడు. వారిలో తిరుమంగళం మీనాక్షి సుందరం, వి.ఎన్.సత్యనారాయణ, ఎ.ఎన్.కుప్పుస్వామి మొదలైనవారు ఉన్నారు. ఇతడి కళను గుర్తించి పలు సంస్థలు ఇతడిని సన్మానించాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి కర్ణాటక వాద్య సంగీతం విభాగంలో 2005లో అవార్డును ప్రకటించింది.[1]

మూలాలు

[మార్చు]
  1. "కేంద్ర సంగీత నాటక అకాడమీ సైటేషన్". Archived from the original on 2020-08-12. Retrieved 2021-02-06.