ఒద్దిరాజు సోదరులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒద్దిరాజు సోదరులు

ఒద్దిరాజు సోదరులు గా ప్రసిద్ధులైన ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు గార్లు సంస్కృతాంధ్ర పండితులు, ప్రచురణ కర్తలు. వీరి తల్లిదండ్రులు వెంకట రామారావు, రంగనాయకమ్మలు. వీరు వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా, ఇనుగుర్తి గ్రామ వాస్తవ్యులు. ఈ గ్రామం నుండే వీరు తెనుగు అనే పత్రికను నడిపారు. ఈ పత్రిక 1922 ఆగస్టులో 500 ప్రతులతో ఆరంభమై ఆరు సంవత్సరాలు తెలంగాణ ప్రజా చైతన్యానికి దోహదం చేసింది. వీరు 1918లో విజ్ఞానప్రచారిణీ గ్రంథమాలను స్థాపించి విజ్ఞానదాయకమైన పుస్తకాలను ప్రచురించి తెలంగాణాలో విజ్ఞానవ్యాప్తికి తోడ్పడ్డారు. వీరు నిజాం కాలంలో తెలంగాణా ప్రాంతంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేశారు.[1] వీరు ఇంగ్లీషు, ఉర్దూ, పారసీక, సంస్కృత భాషలు నేర్చారు. సంగీత సాహిత్యాలలో నైపుణ్యం సాధించారు. చరిత్ర, విజ్ఞానశాస్త్రం, వైద్యం మొదలైన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన ఎన్నో వ్యాసాలను వ్రాశారు. తెనుగు పత్రిక మొత్తము 12 పేజీలను వీరు తమ రచనలతోనే నింపేవారు [2]

నాంది : తెలంగాణా వైతాళికులలో ఒక ఉత్తమ స్థానాన్ని పొందిన ఒద్దిరాజు సోదరులు ప్రతి తరము గుర్తుంచుకోవలసిన వ్యక్తుల కోవకు చెందినవారు. వీరు ఇరవయ్యో శతాబ్దపు ప్రథమార్ధంలో చేసిన సాహిత్య, సాంఘిక, సామాజిక సేవ, కృషి గణనీయమైనది. వీరిది పూర్వపు మానుకోట (మహబూబాబాద్) తాలూకా ఇనుగుర్తి గ్రామం. చుట్టూ అడవి వుండి సరైన సౌకర్యాలు, రవాణా లేని కుగ్రామం కావడం చేత వీరి భాషా సేవ ఒక కాలానికే పరిమితమై తదనంతరం మరుగున పడిపోయింది. కాని కీర్తిశేషులు శ్రీ పీ.వీ. నరసింహారావు గారు భారత ప్రధానిగా ఉన్న రోజులలో ఒకసారి హైదరాబాదులో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ స్వర్ణోత్సవ సభ సందర్భంగా వారు చేసిన ఉపన్యాసంలో మహబూబాబాద్ తాలూకా ఇనుగుర్తి గ్రామంలో ఒద్దిరాజు సోదరులు చేసిన భాషా సేవ, ఎటువంటి కనీస సౌకర్యాలు లేకున్ననూ పత్రిక నడిపిన విధానాన్ని ప్రస్తుతించారు. వారు చేసిన ఈ ప్రసంగానంతరం పలు భాషావేత్తలకు, కవులు, నాయకులకు, ప్రసార మాధ్యమాలకు ఒద్దిరాజు సోదరులు ఎవరో, వారిని గూర్చి తెలుసుకోవాలన్న తపన మొదలయింది. ఆ విధంగా ఒద్దిరాజు వారు భాషకై చేసిన సేవ ఆంధ్ర దేశానికి తెలియ వచ్చింది. డాక్టర్ బిరుదరాజు రామరాజు గారు వీరి గురించిన ఒక పరిశోధనా వ్యాసాన్ని 1992 ‘సాహిత్యోద్ధారకులు’ అనే గ్రంథంలో ప్రచురిస్తూ సోదరులు వ్రాసిన 68 వివిధ గ్రంథాల రాతప్రతుల గూర్చి ఉటంకించారు. ఒద్దిరాజు సీతారామచంద్ర రావు గారి కుమారుడైన వెంకటనరసింహారావు గారి ఆధ్వర్యాన రంగరాజు వెంకటేశ్వర్ రావు, ఒద్దిరాజు మురళీధర్ రావు గారు, ఇతర మిత్రుల సహకారంతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఒద్దిరాజు సోదరుల ‘శతజయంతి’ ఉత్సవాన్ని 25-9-1995 రోజున నిర్వహించారు. తరవాతి కాలంలో ఒద్దిరాజు మురళీధర్ రావు గారు, కుటుంబ సభ్యులు రాత ప్రతులలో ఉన్న సోదరుల గ్రంథాలన్నీ 2005 నుండి ముద్రణ వేయించినారు.

ప్రస్తావన: పేరుకే వీరు ఒద్దిరాజు సోదరులు, కాని కవలలు కాదు. అన్నగారైన సీతారామచంద్ర రావు గారి  కన్నా తమ్ముడు రాఘవ రంగారావు గారు ఏడు సంవత్సరాల పిన్న వయస్కుడు. వెంకటరామారావు - రంగనాయకమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు.

తొలి విద్యాభ్యాసం :  వీరి తల్లి గారు రంగనాయకమ్మ గారు దేవులపల్లి వారి ఇంటి ఆడబడచు. ఆమె గారి తండ్రి దేవులపల్లి రామకృష్ణారావు, తాత  రాఘవయ్య గారు సంస్కృత, ఆంధ్ర, ద్రావిడ భాషలందు, వేదాంత శాస్త్రమందు గొప్ప పండితులు. సంస్కృత భాషలో గల వింశతి, ముకుంద మాలలను ఆంధ్రీకరించినారు. అదే పరంపర కూతురు రంగనాయకమ్మ గారికి కూడా అబ్బినది. ఆవిడకు ద్రావిడ సాంప్రదాయ ప్రబంధాలు తెలుగు భారత, భాగవతాలు కరతలామలకాలు. అందుచే ఇవన్నీ ఈ సోదరులిరువురికీ ఉగ్గు పాలతో అబ్బినవి. వారి ప్రథమ గురువు తల్లి గారే. వారు వారి జీవిత కాలంలో ఏ బడికి పోలేదు, తమ స్వయంకృషి తో నేర్చుకున్నవే. వారిరువురును ఏకసంథాగ్రాహులు అవడం మూలాన ఏ గురువూ పట్టుమని నాలుగు నెలలు కూడా పూర్తిగా చెప్పలేక పోయారు. చదువునందు వీరి ప్రత్యేక ఆసక్తి గ్రహించి వీరి తండ్రి వెంకట రామారావు గారు హైదరాబాదు నుండి వసుచరిత్ర, మను చరిత్ర మొదలగు నలభై గ్రంధాలను కొని తెప్పించి ఇచ్చారు. ఆ గ్రంధాల అవపోశన తరవాత చరకుపల్లి గోపాలకృష్ణ శాస్త్రి గారి వద్ద వేదాలను, షోడశ కర్మలను, దేవయాజ్ఞీకాన్ని నేర్చినారు. స్థానిక లోకల్ ఫండు పాఠశాల లో పనిచేయు వనం కోటయ్య గారి వద్ద ఉర్దూ, ఫార్సీ భాషలు నేర్చుకున్నారు. నిజాం రాజుల పాలన కావున అధికార భాష ఉర్దూగా ఉండేది. తండ్రి గారు కరణీకం చేసేవారు. ఇనుగుర్తి గ్రామం చుట్టు పక్కల గ్రామాల పట్వారీలు అందరు అక్కడే వుండేవారు. వారందరి పహాణీలు రాయడం, జమాబంది నిర్వహించడం మొదలగునవి వీరు చేసి తమ అవసరాలు, పుస్తకాల కొనుగోలు ఖర్చులు నిర్వహించుకునేవారు. నిజాం పాలన లో ఉర్దూ మొదటి భాష అయినందున బడులలో తెలుగు నేర్చుకొనడం కూడా కష్టమవుతున్నరోజులలో విదేశీ భాష అయిన ఆంగ్లం నేర్చుకొనడం ఇంకా కష్టసాధ్యమైన పనిగా ఉండేది. కాని సోదరులిరువురు ఆంగ్ల భాష ఎంతో శ్రమించి నేర్చుకుని సుసాధ్యం చేసుకున్నారు. నీటిపారుదల శాఖలో పని చేస్తూ ఉండిన కెంప్ గారు చెరువుల పని నిమిత్తం ఇనుగుర్తికి రాగా అతనిని వీరిరువురు పరిచయం చేసుకుని అతని వద్ద ఆంగ్ల అక్షరాలు నేర్చుకుని ఇంగ్లీష్ ప్రయిమర్ లోని 26 పాటాలను 20 రోజులలో పూర్తి చేసినారు. కాని కెంప్ గారు బదిలీ కావడంతో తెనాలి తాలూకా మోపర్రు గ్రామ నివాసి శ్రీ మోపర్తి రామకృష్ణయ్య గారిని తమ ఇంటికి రప్పించుకొని ఒక సంవత్సర కాలం ఇంగ్లీష్ నేర్చుకున్నారు. తరవాత కేసముద్రం రైల్వే స్టేషన్ మాస్టర్ వద్ద కలోనియల్ ప్రొనౌన్సియేషన్ డిక్షనరీ మరయు శంకర్ నారాయణ ఇంగ్లీష్ డిక్షనరీ పొందడం ద్వారా, మానుకోట లో గల ఒక డాక్టర్ గారి వద్ద తీసుకొన్నటైమ్స ఆఫ్ ఇండియా పాత ఇంగ్లీష్ వార్తా పత్రికలను, మ్యాగజీన్లను చదవడం, వాటి శబ్దార్థాలను గ్రహిస్తూ ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యత పొందినారు. ఆ భాషలో కవిత్వం కూడా రాయగలిగారు.

పరీక్షలు-పట్టా పత్రాలు: బొంబాయి నుండి ప్రచురింపబడు 'ఆంధ్ర పత్రిక', అందులో 'విజ్ఞాన చంద్రికా పరిషత్తు' వారు మద్రాసు లో నిర్వహించు పరీక్షల గూర్చి ప్రకటన ఇచ్చారు. సోదరులు అందులో కూర్చున వలనని భావించారు.  1912 లో ఈ పరీక్షకు హాజరవ్వాలని భావించి మద్రాసు వారికి మనీ ఆర్డరు చేసారు. కాని వారికి హాల్ టికెట్ రావడం ఆలస్యం అయ్యింది. పరిక్షా సమయానికి పద్దెనిమిది దినముల ముందు పద్దెనమిది పాఠ్య గ్రందాలతో చేరింది. అప్పుడు మొదలుపెట్టి ప్రతీ రోజు ఒక పుస్తకం చదివినా సరిపోని సమయం. అందువలన వెంటనే మద్రాస్ బయలుదేరారు. ఆ తొందరలో పుస్తకాలను ఇంటిలోనే మరచి మద్రాస్ రైల్ ఎక్కారు. అక్కడ కొనవచ్చులే అనుకుని మద్రాస్ లో వాటి గూర్చి వెతికినా లభ్యము కాలేదు . అందువలన ఆ పుస్తకాల ప్రింటర్, పబ్లిషర్ అయిన వీరన్న శెట్టి గారి వద్దకు వెళ్లి అడుగగా అన్నీ కూడా పునర్ ముద్రణలో వున్నాయని తెలిపిన అతడు ఏరోజు అచ్చయిన ఫారాలు ఆరోజు ఇచ్చు ఏర్పాటు చేసాడు. ఆ విధంగా 13 రోజులలో 18 పుస్తకాలు చదివిన సోదరులు పరీక్షకు సన్నద్దులయ్యారు. విశేషం ఏమన సోదరుల ఇరువురి దస్తూరి ఒకేలా ఉండేది. కావున సమాధాన పత్రాలు దిద్దు పరీక్షకులకు అనుమానం వస్తుందని పరీక్షాధికారి అయిన కందుకూరి వీరేశలింగం పంతులు గారిని కలిసుకొని వారికి విషయాన్ని నివేదించినారు. వారి సంతకమును తీసుకొని పరీక్షలు రాసినారు. మధ్యలో సీతారామ చంద్ర రావు గారికి జ్వరం వచ్చింది. కుడి చెయ్యి తీవ్రమైన బాధ వేసింది. అందుచేత వారు తాను ఎడమ చేతి తో రాస్తున్నట్టు తెలిపి భేదము వచ్చిన యెడల అనుమాన పడకూడదని పరీక్షకుని సంతకమును తీసుకొని పరీక్షలు పూర్తి చేసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయి కందుకూరి వీరేశలింగం పంతులు గారిచే పట్టా పత్రాన్ని పొందినారు.  ఆ విధంగానే వీరన్న శెట్టి కి గాఢ మిత్రులయ్యారు. తరచు ఆంధ్ర సభా కార్యక్రమాల్లో పాల్గొనడానికి మద్రాసు వస్తూ వీరన్నశెట్టి గారి వద్ద వుండేవారు. ఈవిధంగా వీరికి తమిళ భాష పై మక్కువ పెరిగింది. తమిళ నిఘంటువులు, వ్యాకరణాలు తెచ్చుకుని భాష పై పట్టు సాధించారు. అదే విధంగా హిందీ భాష కూడా నేర్చుకుని ప్రేమ్ చంద్, త్రివేది, తులసీదాస్ రామాయణము, మాదూరి, విశ్వామిత్ర పత్రికలు చదువుతూ హిందీ పై పట్టు సాధించారు. ఇలా సోదరులు ఇరువురు పలు భాషలను క్షుణ్ణంగా నేర్చిరి.

వైద్యము: సంస్కృత భాష పై పట్టు సాధించిన తరవాత సోదరులు ఆయుర్వేద గ్రంధాలు చరక సుశ్రూతం, మాధవ నిదానము మొదలగు గ్రంధాలు తెప్పించుకొని వాటిని ఆపోసన పట్టినారు. వరంగల్లు నందు గల గోవిందరాజులు నాయుడు అను అలోపతి  డాక్టర్ గారి స్నేహము చేసి వారి వద్ద నాడీ చూచుట, గుండె వేగాన్ని కనిపెట్టటం, శస్త్ర చికిత్సలో వాడు మత్తు (క్లోరోఫాం) వినియోగ విధానం తెలిసికొని ఆ చికిత్సలో అనుభవం పొందినారు. ఆ దినాల్లో మలేరియా జ్వరం తీవ్రమైనదిగా ఉండేది. దానికి క్వినైన్, సింకోన మందులు వాడేవారు. కాని వాటి వాడకం వలన వాంతులు, వికారం అధికంగా వుండేది. అందువలన ఈ సోదరులు తమ అలోపతి, ఆయుర్వేద వైద్య పద్ధతుల కలయికగా "తిక్త " అనే మందును కనుగొని ప్రచారంలోకి తెచ్చినారు. అది సర్వ జనులకు అందుబాటులోకి వచ్చింది. తరవాత వీరికి హోమియో వైద్యం కూడా చదవాలన్న కోరిక కలిగి కలకత్తా లోని ఎస్.కే.బోసు గారి కాలేజి నుండి హోమియో పుస్తకాలు తెప్పించుకొని, చదివి, హోమియో వైద్య శాస్త్రం లో ఎం.డి.పట్టాను పొందినారు. సోదరులు తమ వైద్య పరిజ్ఞానం ప్రజల సేవ, అవసారాల కొరకు మాత్రమే ఉపయోగిస్తూ నిస్వార్ధంగా పనిచేసారు.

విజ్ఞాన ప్రచారిణి: హైదారాబాదు లో కోదాటి రామకృష్ణా రావు, కోదాటి వెంకటేశ్వర్ రావు, ఎస్.బి రామానుజాచార్యులు, శబ్నవీసు వెంకట రామనరసింహా రావు, అక్కినేపల్లీ జానకిరామారావు గారలు తేది 3- 3- 1918 నాడు సమావేశం అయినారు. ఆ సమావేశంలో ఒద్దిరాజు సోదరులు కూడా పాల్గొన్నారు. అందులో ఒక  విజ్ఞాన ప్రచారిణి  స్తాపించవలెనన్న నిర్ణయం ప్రకారం ఇనుగుర్తి గ్రామంలో విజ్ఞాన ప్రచార గ్రంధమాలను స్థాపించి నారు. అందులో సాంప్రదాయ గ్రంధాలు, విజ్ఞానదాయక గ్రంధాలు, దేశభక్తి ప్రేరకములయిన గ్రంధాలు ప్రచురించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో మొదటగా సీతారామచంద్ర రావు గారు రచించిన  ‘రుద్రమ దేవి' అను చారిత్రిక నవలను విజయవాడ 'మారుతి' ప్రెస్ లో ముద్రింప చేసినారు (1918 ). సోదరులు ఈ నవల ముద్రణా సమయం లో విజయవాడ లో వుండడం వలన ప్రెస్సులో అక్షరాల కూర్పు, చేస్టులు కట్టడం అచ్చు వేయడం మొదలగు పనులు నేర్చిరి.

ప్రింటింగ్ ప్రెస్ (అచ్చు యంత్రము) : తరవాత తామే ఒక అచ్చుయంత్రాన్ని సమకూర్చుకోవాలని తలంచి మద్రాసు వీరన్నశెట్టి గారిని సంప్రదించి ఒక అచ్చు యంత్రము, వర్ణాలు తెచ్చుకున్నారు. దానిని ఇనుగుర్తి లో నెలకొలిపి 'విజ్ఞాన ప్రచార్ణి ముద్రణాలయం’ గా పేరు పెట్టారు. అచ్చుపని తెలుసు కనుక అందులోని పనులన్నీ తామే చేసుకున్నారు. అందులో మొదటగా అచ్చయిన పుస్తకం 'ఉపదేశ రత్నమాల'. ఇది విశిష్టాద్వైత మత గ్రంధము. దీన్ని సోదరులిరువురు కలసి రాసినారు. అందుండి నెలకు ఒక గ్రంధం అచ్చు కావాలని భావించినారు. సోదరులు ఒక పెద్ద యంత్రాన్ని మద్రాసు నుండి తెప్పించినారు. పని భారము అధికమైనందున గ్రామస్తులకు కొందరికి కూర్పు, ముద్రణ, బైండింగు పనులను నేర్పించినారు. ఇందులో సోదరుల రచనలైన 1.బ్రాహ్మణ సాహాసము 2.వరాహముద్ర 3. వీరావేశము 4.రుద్రమదేవి ( ద్వితీయ ముద్రణ 1922 ) 5.శౌర్య శక్తి  6.భ్రమర  7. భక్తిసార చరిత్రము 8. చాయాగ్రహణ తంత్రము  9. ప్రేమ వివాహము 10. పంచ కూళ కషాయము  11.చేతి పనులు  12.విషములు-చికిత్సలు 13.ఉత్తర గురుపరంపర  14. బాల విజ్ఞాన మంజూష మొదలగు ఇరువై పుస్తకాలు అచ్చయ్యాయి. ఈ గ్రంధాలు సోదరులిద్దరు వేరు వేరుగా రాసినవి. చాట్రాతి నర్సమాంబ గారు రాసిన 'అనురాగ విపాకము' ను కూడా ముద్రించినారు.

పత్రికా నిర్వహణ : వీరి నిరంతర కృషి వలన అనేక పుస్తకాల ముద్రణ కై వస్తున్నా ఈ ప్రాంతాన విద్యా విజ్ఞానదాయక చైతన్య స్ఫూర్తి కలుగు పత్రికలు లేవని అట్టి వారపత్రిక ఒకటి నడపవలెనని నిశ్చయించి అదనంగా మరియొక ముద్రణా యంత్రాన్ని తెప్పించి అప్పటి నిజాము ప్రభుత్వ అనుమతితో పత్రికను ఆరంభించినారు. అట్టి వార పత్రిక 'తెనుగు' దుందుభి భాద్రపద శుద్ధ పంచమి ఆదివారం తేదీ. 27. 8. 1922 రోజున మొదటి సంచిక వెలువరించ బడినది. మొదట 500 ప్రతులను వెలువరించినారు. వార్షిక చందా మూడు రూపాయలే. కాని ఇనుగుర్తి గ్రామమున పోస్టు ఆఫీసు లేక  ప్రతుల పంపిణీ కష్టంగా మారింది. అందువలన డైరెక్టర్ పోస్టు మాస్టర్ ను సంప్రదించి అక్కడ ఒక పోస్టు ఆఫీసును ఏర్పాటు చేసారు. కాని తిరిగి దాని నిర్వహణ బాధ్యత వీరే చెయ్యవలసి వచ్చింది. పత్రికల పంపిణీ, చందా దారుల చేర్పించు భాద్యత వీరే చూసుకొనవలసి వచ్చేది. రెండవ సంవత్సర కాలానికి వెయ్యి ప్రతుల ముద్రుణ చేరింది. నల్లగొండ శబ్నవీసు వారి ' నీలగిరి' పత్రిక కూడా తొలినాళ్ళలో ఈ విజ్ఞాన ప్రచారిణి లోనే ముద్రించి సంచికలను విడుదల చేసినారు. తరవాత నల్లగొండ కు మార్చినారు. ఇలా ఆరు సంవత్సరాలు నడిపిన పిదప దేవులపల్లి వెంకట చలపతి రావు, తూము వరదరాజులు మొదలగు వారి ప్రోద్భలముచే పత్రికా ముద్రణ కార్యకలాపాలు వరంగల్లుకు మార్చినారు. కాని అచట ఆరు నెలలైనా నడువలేదు. తెనుగు పత్రి ప్రచురణ నిలిచిపోయింది.

రచనా వ్యాసంగము, విద్యా భోధన  : తరవాత సోదరులు తాము రచనా వ్యాసంగము చేయడము, విద్యా తృష్ణ తో తమ వద్దకు వచ్చు విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయములు కలిపించి విద్యను నేర్పించేవారు.  రాఘవరంగారావు గారు విద్య గరిపిన అనేక మంది విద్యార్థులు డిగ్రీ, పీ.జీ లను పూర్తి చేసి ఉద్యోగాలలో స్థిర పడినారు. సీతారామ చంద్ర రావు గారు తన అవసాన దశ వరకు కూడా గ్రంధ రచనా వ్యాసంగములో నిమగ్నులై జీవించారు. సోదరులిరువురు విద్యా, శాస్త్రములే కాదు అనేక ఇతర చేతి పనులు వడ్రంగము,కమ్మర, తాపీ పని, చర్మకార పనులలో నిష్ణాతులు. వారి ఇంటి నిర్మాణానికి అవసరపడు ఇంటి ప్లాను వారే వేసుకున్నారు. ఇంటి ముఖ్య ద్వారపు నగిషీ చేక్కణము వారు స్వంతంగా చెక్కి తమ వడ్రంగ పనితనాన్ని తెలియచేసినారు. ఆ ద్వారం ఇప్పడికి చెక్కు చెదరక వున్నది. ఫోటోగ్రఫీ అన్న వీరికి అభిరుచి. కెమరా ఫోటో తీసి వారే స్వయంగా నెగెటివ్ లను కడిగి డెవెలప్ చేసుకునేవారు. వారు ఫోటో తీసి ప్రింటు తీసిన వారి తండ్రి గారైన వెంకట రామారావు గారి ఫోటో ఇప్పటికి వున్నది. ఫోటోగ్రఫి సామ్మను, ఫిల్ము ను కడుగు 'హైఫో' ను లండను నుండి తెప్పించుకునేవారు. అది వారి అభిరుచి పట్టుదల. ఫోటో గ్రాఫి పై ఒక పుస్తకాన్నే రాసి ప్రచురించారు. వీరు యంత్రములను నడపడము, ఇంజన్ల సహాముతో భావి నీటిని తోడి వ్యవసాయ పనులు చెయ్యడం,  రైసు మిల్లులు, నూనె మిల్లులను ఏర్పాటు చేసి నడపడం చేసారు.

వంశ చరిత్ర : ఒద్దిరాజు సోదరుల కుటుంబ వివరాలను వారే శోధించి రాసుకున్నారు. ఒరిస్సా రాష్ట్రం లోని 'ఒద్ర' అనే ప్రాంతం నుండి వీరి మూల పురుషులు ప్రవాసం చేసినట్టు భావిస్తున్నారు.  ఒద్ర నుండి రావడం వల్ల కాలక్రమేణ ఒద్దిరాజు అయినట్టు ఆయన పేరు నుండే ఇక్కడ వీరి వంశం నామం (ఇంటి పేరు) ఆరంభం అయినట్టు భావన. ఒద్దిరాజు వారి వంశలో ఈ సోదరులు 17 వ తరానికి చెందిన వారు.

ఒద్దిరాజు సీతా రామచంద్ర రావు

[మార్చు]

ఒద్దిరాజు సీతారామచంద్రరావు (1887 - 1956) జననం: 2-4-1887 సర్వజిత్ చైత్ర శుద్ధ నవమీ శనివారం. ఒద్దిరాజు సోదరులలో పెద్దవాడు.

వివాహం : సూర్యాపేట తాలూకా చందుపట్ల గ్రామ శ్రీ దేవులపల్లి లక్ష్మినరసింహా రావు రంగనాయకమ్మ ల కుమార్తె నప్పిన్నమ్మ గారితో వివాహం. కాని వారు తన 45 వ ఏట మరణించినారు.

సంతానం: ఒకే కుమారుడు డాక్టర్ వెంకట నరసింహా రావు.

మరణం: సీతారామ చంద్ర రావు గారు తన అరవై ఎనమిదవ ఏట గొంతు క్యాన్సర్ తో  28-1-1956 మన్మధ నామ పుష్య బహుళ పాడ్యమి నాడు మరణించినారు.

చివరి కావ్యం: అవసాన దశలో భయంకర క్యాన్సర్ వ్యాధితో అవస్థ పడుతూ కూడా రచనా వ్యాసంగాన్ని విడువలేదు. మరణించు వారం ముందు వరకు కూడా తాను రాస్తున్న 'సౌదామిని పరిణయం' ప్రభంధ కావ్య రచనను పూర్తి చేసారు.

వీరి రచనలు:

  • రుద్రమదేవి
  • శౌర్యశక్తి
  • భ్రమర
  • బ్రాహ్మణ సాహసం
  • స్త్రీ సాహసం
  • ముక్తలవ
  • మోహినీ విలాసం
  • ప్రేమ ప్రవాహం
  • సౌదామినీ పరిణయం
  • అనాథబాల
  • ఖడ్గ తిక్కన
  • రాకుమారి విద్యాభ్యాసం
  • చ్యవన ప్రతిజ్ఞ
  • లోకేశ్వర శతకం
  • ఛాయాగ్రహణ తంత్రం
  • చేతి పనులు
  • బాలవిజ్ఞాన మంజూష
  • శరీరక విజ్ఞానం
  • విద్యుద్విజ్ఞానం
  • రక్తమూల్యము(కథ)
  • అదృశ్యవ్యక్తి(కథ)
  • నటి(కథ)
  • కృష్ణస్తవః
  • శ్రీస్తవః
  • శుకపక్షీయం
  • ఉత్సవానందబాణం
  • వైభవస్తవః
  • విభక్త్యర్థం
  • ధాతునిఘంటుః
  • పాణిని అష్టాధ్యాయి వ్యాకరణ సూత్రాలకు తెలుగు తాత్పర్యం
  • సిద్ధాంత కౌముదికి తెలుగు అనువాదం
  • భట్టి కావ్యానువాదం
  • నౌకాభంగం
  • ది ఫ్లవర్
  • ది బ్లెస్సింగ్
  • ది ప్రయిడ్ ఆఫ్ ది వెల్త్

సీతారామచంద్ర రావు గారి ప్రభందమైన సౌదామిని పరిణయం కావ్యాన్ని కాకతీయా విశ్వవిద్యాలం తెలుగు విభాగం వారు 1988 లో ముద్రించినారు. వీరి నవలలు రుద్రమదేవి, మగ సంసారం, నీవేనా డిగ్రీ, ఇంటర్, పదవ తరగతి సిలబస్ లలో పాఠ్యంశాలుగా ఉన్నాయి.

ఒద్దిరాజు రాఘవ రంగారావు

[మార్చు]

ఒద్దిరాజు రాఘవ రంగారావు (1894 - 1973) ఒద్దిరాజు సోదరులలో చిన్నవాడు. జననం: 4-4-1894 విజయ నామ సంవత్సర ఫాల్గుణ భ.త్రయోదశి బుధవారం.

దత్తత: తండ్రి గారి చినతాత గారి కుమారుడైన ఒద్దిరాజు చిన నరసింహా రావు రంగనాయకమ్మ (పిచ్చమ్మ) గార్లకు సంతానం లేనందున చిన్న కుమారుడైన రాఘవరంగారావు గారిని దత్తత ఇచ్చినారు.

వివాహం: 16 వ ఏట ఆండాలమ్మగారితో జరిగినా ఆమె మరణాంతరం లక్షమమ్మ, వరలక్ష్మమ్మ, కమలమ్మగార్లతో జరిగింది.

సంతానం: ఏడుగురు కుమార్తెలు ముగ్గురు కుమారులు.

మరణం: దాదాపు పదిహేను సంవత్సరాలు కంటి చూపు పూర్తి మందగించి కనపడని స్థితి లో కూడా తమ వద్దకు వచ్చిన వారికి విద్యాదానం చేస్తూ తన ఎనభయ్యో ఏట లివర్ క్యాసర్ తో తేది 17-5-1973 న స్వర్గస్తులయ్యారు.

వీరి రచనలు:

  • వీరావేశము
  • వరాహముద్ర
  • పంచకూళ కషాయం
  • విషములు - తచ్చికిత్సలు
  • సప్తపది
  • ఉత్తర గురు పరంపర
  • ఆర్త ప్రబంధం
  • సప్తగాథ
  • గురుపరంపరా ప్రభావం
  • ముదలయిరం
  • వణ్ణమా డంగల్
  • మత్కుణోపాఖ్యానం
  • తపతీ సంవరణోపాఖ్యానం
  • లండన్ విద్యార్థి (కథ)

సోదరులు ఇరురువురు కలసి రాసినవి: 1. ఉపదేశ రత్నమాల.  2. తిరుప్పల్లాండు 3. భక్తిసార చారత్ర, 4. సంస్కృత వ్యాకరణం

మూలాలు

[మార్చు]
  1. History of Indian Literature: 1911-1956; page. 856
  2. ముదిగంటి సుజాతారెడ్డి (2002). తెలంగాణా తొలితరం కథలు. హైదరాబాదు: రోహణమ్ పబ్లికేషన్స్. pp. xvii–xviii.