కంచర గాడిద
ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2024 సెప్టెంబరు 29, 13:53 (UTC) (30 రోజుల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
కంచర గాడిద | |
---|---|
పెంపుడు జంతువులు
| |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | |
Binomial name | |
none | |
Synonyms | |
|
కంచర గాడిద (ఆంగ్లం: Mule) మగ గాడిద, ఆడ గుర్రం మధ్య సంకరం ద్వారా పుట్టిన జంతువు. కంచర గాడిదలు వాటి బలానికి, ఓర్పుకు, తెలివితేటలకు బాగా ప్రసిద్ధి చెందాయి. ఇది చాలా మొండి జంతువు. ఎంతటి కష్టాన్నైనా మొండిగా సహిస్తుంది. అధిక బరువులను ఓపిగ్గా మోస్తూ ఎక్కువ దూరాలు ప్రయాణించగలదు. చరిత్రలో కంచర గాడిదలు బరువులు మోసే జంతువులుగా, పోలంపనులకు, పర్వత స్వారీకి ఉపయోగపడే జంతువులుగా పేరుమోసాయి. ముఖ్యంగా వీటిని రవాణా, వ్యవసాయం, సైనిక కార్యకలాపాల వంటి వివిధ రంగాలలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. కంచరగాడిదలు స్టెరైల్, అంటే అవి పునరుత్పత్తి చేయలేవు.
వారసత్వం
[మార్చు]మచ్చిక గాని అడవి గాడిదను ఆంగ్లంలో ‘Ass’ అని, మచ్చికైన పెంపుడు గాడిదను ‘Donkey’ అని పిలుస్తారు. మగ గాడిదను జాక్ (Jack), ఆడ గుర్రాన్ని మరే (Mure) అని పిలుస్తారు. ఒక మగ గాడిద (జాక్) కు, ఒక ఆడ గుర్రం (మరే) నకు పుట్టిన హైబ్రిడ్ జంతువులు కంచర గాడిదలు (మ్యూల్స్) కాబట్టి వాటికి తమ తల్లిదండ్రులైన గుర్రం, గాడిదల నుండి మేలైన లక్షణాలు వారసత్వంగా సంక్రమించాయి. కంచర గాడిదలు గుర్రం (తల్లి) నుండి బలం, సత్తువ (strength and stamina) లను వారసత్వంగా పొందితే, గాడిద (తండ్రి) నుండి సహనం (endurance), కచ్చితమైన అడుగులను, తెలివితేటలను, కోప స్వభావాన్ని వారసత్వంగా పొందాయి. అంటే కంచర గాడిదలు గుర్రంలా బలిష్ఠమైనవి, సత్తువ గలవి. గాడిదల వలె ఓర్పు సహనం గలవి, తెలివైనవి.
చరిత్ర
[మార్చు]మధ్య ఆసియాలో క్రీ.పూ 3500 ప్రాంతాలలో గుర్రాలను మచ్చిక చేయబడటం ఆరంభమయ్యింది. అదే సమయంలో, ఈశాన్య ఆఫ్రికాలో పెంపుడు జంతువులుగా గాడిదలను పెంచడం కూడా ప్రారంభమైంది. క్రీ.పూ. 1000 కంటే ముందు పశ్చిమాసియాలోని అనటోలియా పీఠభూమి, మెసొపొటేమియా ప్రాంతాలలో ఈ దేశీయ గుర్రం, పెంపుడు గాడిద శ్రేణులు విస్తరించినప్పుడు, కంచర గాడిదల పెంపకం సాధ్యమైంది. భౌగోళిక విస్తరణలలో అతివ్యాప్తి ఉన్నప్పటికీ, గుర్రాలు, గాడిదలు వాటి విభిన్న సంభోగ ప్రవర్తనలు, సామాజిక నిర్మాణాల కారణంగా అడవులలో సంతానోత్పత్తి చేయలేదు. నియంత్రిత సంతానోత్పత్తి కార్యక్రమాలను ఉపయోగించి, వాస్తవానికి మానవ జోక్యం ద్వారా మాత్రమే కంచర గాడిదలు మొదట ఉత్పత్తి చేయబడ్డాయి.
ఈజిప్టులోని నైలు నది ఒడ్డున ఉన్న థీబ్స్‌లోని నెబామున్ సమాధిలో క్రీ.పూ. 1350 నాటి ఒక పురాతన చిత్రం లభ్యమైంది. ఈ చిత్రంలో మ్యూల్స్ లేదా హిన్నీగా గుర్తించబడిన రెండు జంతువులు ఒక రథాన్ని లాగుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ను డేవిడ్ రాజు (క్రీ. పూ. 1000) పాలించిన కాలంలో ఇజ్రాయెల్ లో, మ్యూల్స్ ఉండేవి. క్రీస్తు పూర్వం తొలి సహస్రాబ్ది కాలంనాటి మెసొపొటేమియా కళాఖండాలలో కంచర గాడిదలను ప్రతిబింబించే అనేక చిత్రణలు కనిపిస్తాయి. క్రీ.పూ 800 లో హోమర్ తన ఇలియడ్ గ్రంథంలో ఆసియా మైనర్‌లో కంచరగాడిదలు రావడాన్ని గుర్తించాడు. క్రిస్టోఫర్ కొలంబస్ కొత్త ప్రపంచానికి మ్యూల్స్ లను తీసుకురావడంతో, అమెరికా ఖండాలలో కూడా మ్యూల్స్ పెంపకం ఆరంభమయ్యింది. "మ్యూల్స్, గాడిదల కంటే ఎక్కువ విధేయత కలిగివుండటమే కాక వాటి పెంపకం చౌక" అని అర్ధం చేసుకొన్న జార్జ్ వాషింగ్టన్ మౌంట్ వెర్నాన్‌లోని తన ఇంటిలో కంచర గాడిదలను పెంచుకొన్నాడు. పంతొమ్మిదవ శతాబ్దంలో పొలాలు, కాలువ పడవలను లాగడం, కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ నుండి బోరాక్స్ ముడి ఖనిజంతో నింపబడిన భారీ బళ్ళను లాగడం వంటి తదితర పనుల్లో వివిధ సామర్థ్యాలలో మ్యూల్స్ లను, డ్రాఫ్ట్ యానిమల్స్‌గా (లాగుడు జంతువులుగా) ఉపయోగించారు. రెండవ ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్‌లో పర్వత మార్గాలపైకి సామాగ్రిని రవాణా చేయడానికి, భారీ ఫీల్డ్ గన్‌లను చక్రాలతో లాగడానికి సైన్యాలు కూడా వీటిని ఉపయోగించాయి.
2003 మే 5 న, మాస్కోలోని ఇడాహో విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు, న్యూక్లియర్ ట్రాన్స్‌ఫర్ అనే ప్రక్రియ ద్వారా క్లోన్ చేయబడిన కంచర గాడిద పిల్లను (ఇదాహో జెమ్) సృష్టించారు. ఇది క్లోన్ చేయబడిన మొదటి ఈక్విడ్ (అశ్వ) జాతి జంతువుగా చరిత్ర సృష్టించింది. న్యూక్లియర్ ట్రాన్స్‌ఫర్ అనే ప్రక్రియ ద్వారా ఈ క్లోనింగ్ సాధించబడింది. ఈ ప్రక్రియలో జన్యు పదార్థాన్ని దాత కణం నుండి అండ కణానికి దాని కేంద్రకం తొలగించబడిన తర్వాత బదిలీ చేయబడుతుంది. ఇక్కడ ఒక మ్యూల్ పిండం నుండి ఒక కణాన్ని దాత కణంగా తీసుకొని, దాని కేంద్రకాన్ని తొలగించి, ఆపై జన్యు పదార్థాన్ని వేరొక అండ కణానికి బదిలీ చేయడం ద్వారా క్లోనింగ్ చేయబడ్డ కంచర గాడిద పిల్లను ఉత్పత్తి చేశారు.
భౌతిక లక్షణాలు
[మార్చు]మ్యూల్స్ తమ తల్లిదండ్రుల జాతులపై ఆధారపడి వివిధ సైజు లలో, రంగులలో ఉంటాయి . అవి సైజులో చిన్న పోనీ నుండి పెద్ద డ్రాఫ్ట్ గుర్రం సైజు వరకు ఉంటాయి. మ్యూల్స్ యొక్క తల, ముందరి భాగాలు గాడిద (తండ్రి) మాదిరిగానే ఉంటాయి, అయితే తోక, వెనుక భాగాలు గుర్రాన్ని (తల్లి) పోలి ఉంటాయి. పొడవాటి చెవులు, పొట్టి జూలు, నిక్కబొడుచుకొని ఉండే వెంట్రుకలు కలిగిన తోకలు, పొట్టిగావున్న మందపాటి తోకలు, చిన్న గిట్టలు వంటి ప్రత్యేక భౌతిక లక్షణాలకు మ్యూల్స్ ప్రసిద్ధి చెందాయి.
పరిమాణం
[మార్చు]మ్యూల్స్, గాడిదల కన్నా సైజులో పెద్దవిగా ఉంటాయి. అవి నించున్నప్పుడు, వాటి భుజాల వరకు సుమారు 4.5 నుండి 5.5 అడుగుల ఎత్తు ఉంటాయి. గాడిదలతో పోలిస్తే, పెద్ద సైజులో వున్న మ్యూల్, మరికొంత పొడవుగా, వీపు భాగం కాస్త వంపుగాను (curved back) ఉంటుంది.
నడక
[మార్చు]కంచర గాడిదల శరీరం బలంగా దృఢంగా వుండి, భారీ బరువులను మోయడానికి అనువుగా ఉంటుంది. తొట్రుపాటుకు తావీయని కచ్చితమైన అడుగులతో వాటి నడక ఉండటంతో అవి కొండ ప్రాంతాలలో, అద్వాన్నంగా వున్న ఎగుడు దిగుడు రహదార్లలో ప్రయాణించడానికి సరిగ్గా సరిపోతాయి. మ్యూల్స్ నడిచేటప్పుడు అవి వేసే అడుగుల విధానం ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. గుర్రపు నడక కంటే సున్నితంగా ఉండే నాలుగు-బీట్ పార్శ్వ నడక రీతి (four-beat lateral gait) మ్యూల్స్ లకు ఉంటుంది. ఈ నడక విధానాన్ని "మ్యూల్ వాక్" అని ప్రత్యేకంగా వ్యవహరిస్తారు. ఈ విధమైన నడక రీతి, మ్యూల్స్ లను తక్కువ శ్రమతో ఎక్కువ దూరం ప్రయాణించేలా చేస్తుంది.
చెవులు
[మార్చు]మ్యూల్స్, గుర్రం, గాడిదల సంకరజాతి జంతువు కావడం వలన గుర్రాలతో పోలిస్తే మ్యూల్స్ సాధారణంగా పొడవైన, సూటి మొనతో చెవులను కలిగి ఉంటాయి, కానీ గాడిదల కంటే పొట్టిగా, తక్కువ సూటి మొనతో చెవులను కలిగి ఉంటాయి. మ్యూల్స్ కూడా తమ చెవులను గుర్రాలు, గాడిదలు మాదిరిగానే, కమ్యూనికేట్ చేయడానికి, రాబోయే బెదిరింపులను గుర్తించడానికి ఉపయోగిస్తాయి. మ్యూల్ చెవుల యొక్క ప్రాథమిక విధుల్లో ఒకటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడటం. గుర్రాల కంటే మ్యూల్స్ వేడిని ఎక్కువగా తట్టుకోగలవు. వాటి పెద్ద, సన్నని చెవులు వేడిని వెదజల్లడానికి, వేడి వాతావరణంలో చల్లగా ఉండటానికి సహాయపడతాయి. వాటి చెవుల యొక్క ఉపరితల వైశాల్యం పెద్దదిగా ఉండటంతో, కంచరగాడిదల శరీరం నుంచి వెలుపలికి ఉష్ణ బదిలీ సమర్థవంతంగా జరుగుతుంది. వాటి చర్మం సన్నగ్గా ఉండటం, బొచ్చు కూడా లేకపోవడం వల్ల వేడికి చెమట త్వరగా ఆవిరైపోతుంది. అందువలనే మ్యూల్స్ వేడి వాతావరణాన్ని గుర్రాల కంటే ఎక్కువగా తట్టుకోగలవు.
మ్యూల్స్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అవి తరచుగా తమ తల్లిదండ్రుల నుండి కొన్ని ప్రత్యేకమైన చెవి లక్షణాలను వారసత్వంగా పొందుతాయి. ఉదాహరణకు, ఒక మ్యూల్ యొక్క తల్లి, ప్రత్యేకంగా వ్యక్తీకరించే చెవులను కలిగి వున్న గుర్రం అయినట్లయితే, ఆ మ్యూల్‌కు కూడా అదే విధమైన వ్యక్తీకరణ చెవులు సంక్రమించవచ్చు.
ధ్వని
[మార్చు]గాడిదలు, గుర్రాల మాదిరిగానే, కంచరగాడిద కూడా దాని గొంతుతో ఒక ప్రత్యేకమైన ధ్వనిని చేస్తుంది. ఇది మొరిగే ధ్వని గుర్రం చేసే సకిలింపు, గాడిద పెట్టే ఒండ్రు ధ్వనుల మిశ్రమంగా వుండి విలక్షణమైన ధ్వనిగా ప్రసిద్ధి చెందింది. ఇది గాడిద ఓండ్రు (Bray) ధ్వని మాదిరిగానే ఉన్నప్పటికీ, గాడిద పెట్టే ఓండ్రు కంటే లోతుగా, ప్రతిధ్వనించేదిగా ఉంటుంది. సాధారణంగా మ్యూల్స్ చేసే ధ్వని, గుర్రం యొక్క సకిలింపు మాదిరిగా మొదలై చివరకు గాడిద లాగా -అయ్యో ఆహ్ ఆవ్- అని ముగుస్తుంది. మ్యూల్ చేసే ధ్వని దాని మానసిక స్థితి, పరిస్థితుల బట్టి కూడా మారుతుంటుంది. ఉదాహరణకు, మ్యూల్స్ ఉత్సాహంగా లేదా కలత చెందినప్పుడు, అవి బాగా పెద్దగా, ఎక్కువ పిచ్‌తో మొరుగుతూ ధ్వని చేస్తాయి.
ఇతర లక్షణాలు
[మార్చు]మ్యూల్స్ ఆడ గుర్రానికి, మగ గాడిదకు పుట్టిన హైబ్రిడ్ జాతి కాబట్టి, వీటికి తల్లిదండ్రుల నుండి వారసత్వంగా కొన్ని మేలైన లక్షణాలు సంక్రమించాయి.
బలం-సత్తువ
[మార్చు]మ్యూల్స్ సంకరజాతి జంతువులు అయిన కారణంగా సాధారణంగా గుర్రాలు, గాడిదల రెండింటి కంటే ఇవి మరింత దృఢంగా, బలంగా (tougher and stronger) ఉంటాయి. భారీ బరువులను మోస్తూ ఎక్కువ దూరాలకు ప్రయాణించగల సామర్థ్యం వీటి ప్రత్యేకత. ఇంత బలంగా ఉన్నందున, సాధారణంగా గాడిదల కన్నా మ్యూల్స్ లనే ప్యాక్ యానిమల్స్‌గా ఉపయోగించేందుకు ఇష్టపడతారు.
స్వభావం(Temperament)
[మార్చు]గుర్రాలు లేదా గాడిదల కంటే మ్యూల్స్ ఎక్కువ ఓర్పు, సహనం (Patiance), విధేయత (obeediance) కలిగి ఉంటాయి. ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు అధిక ఒత్తిడి గల వాతావరణంలో అవి చక్కగా పనిచేసేందుకు తోడ్పడతాయి.
తెలివితేటలు
[మార్చు]మ్యూల్స్ వాటి తెలివితేటలకు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి, నిజానికి, గుర్రాలు, గాడిదల కంటే మ్యూల్స్ చాలా తెలివైనవిగా పరిగణించబడతాయి. ఈ తెలివితేటలకు ఒక కారణం ఏమిటంటే, మ్యూల్స్‌కు ప్రత్యేకమైన హైబ్రిడ్ ఓజస్సు (hybrid vigor) ఉంటుంది. ఇది రెండు వేర్వేరు జాతులను క్రాస్ బ్రీడింగ్ చేయడం వల్ల వస్తుంది. మ్యూల్స్ స్వతంత్రమైనవి, తెలివైనవి కాబట్టి ఇవి త్వరగా నేర్చుకోగలుగుతాయి. సూచనలకు బాగా సానుకూలంగా ప్రతిస్పందిస్తాయి. మ్యూల్స్ తమ యజమానులతోను, సంరక్షకులతోను బలమైన బంధాలను ఏర్పరచుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. దీని వలన ఇతర జంతువుల కంటే వీటికి శిక్షణ నివ్వడం మరింత సులభతరం అవుతుంది. వీటిని చక్కని శిక్షణతో మెరుగ్గా పని చేసే జంతువులు (work animals) గా చేయవచ్చు.
మొండితనం
[మార్చు]మ్యూల్స్ మొండితనానికి (stubborness) కూడా బాగా పేరుమోసాయి. అందువలన కొన్నిసార్లు వీటితో పని చేయించడం సవాలుగా ఉంటుంది. 'మ్యూల్ లాగా మొండిగా' అనే పదం తరచుగా వాడబడుతునప్పటికీ నిజానికి గాడిదల కంటే కంచర గాడిదలే తక్కువ మొండిగా ఉంటాయి.
బలమైన రోగనిరోధక వ్యవస్థ
[మార్చు]హైబ్రిడ్ ఓజస్సు వల్ల మ్యూల్స్‌కు తెలివితేటలతో పాటు అనేక ప్రత్యేక లక్షణాలను చేకూరాయి. ఉదాహరణకు బలమైన రోగనిరోధక వ్యవస్థ (stronger immune system), పెరిగిన సత్తువ (increased stamina), వ్యాదులను ప్రతిఘటించే అధిక నిరోధకత్వం (greater resistance to disease) లు వంటి విశిష్ట లక్షణాలు మ్యూల్స్ లకు సమకూరాయి. ఈ ప్రత్యేక లక్షణాలే మ్యూల్స్ లను ఇతర జంతువుల కంటే ఉన్నతంగా చేశాయి. ఫలితంగా ఇవి గుర్రాల వలె అంత సులభంగా వ్యాధుల గురవడం జరగదు. అంతే గాక గాయాలకు కూడా అంత తేలికగా లోనుకావు. ఉదాహరణకు గుర్రాలకు సులభంగా వచ్చే కోలిక్ (colic), లామినిటిస్ (laminitis) వంటి ఆరోగ్య సమస్యలు, మ్యూల్స్ లకు సోకే అవకాశం చాలా తక్కువ.
అనుకూలత (adaptability)
[మార్చు]మ్యూల్స్ వాటి కాఠిన్యతకు (hardiness), అనుకూలతకు (adaptability) బాగా ప్రసిద్ధి పొందాయి. మ్యూల్స్ యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణాలలో ఒకటి కఠినమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, ఇతర జంతువులు జీవించలేని ప్రాంతాల్లో కూడా వృద్ధి చెందగల సామర్థ్యం. ఫలితంగా ఇవి విభిన్న శీతోష్ణపరిస్థితులకు సైతం తేలికగా అలవాటుపడి సర్దుకుపోయి జీవిస్థాయి. అందువలనే మ్యూల్స్ వేడి, శుష్క (hot, arid regions) ప్రాంతాలతో పాటు చల్లని, పర్వత (cold, mountainous regions) ప్రాంతాలలో కూడా చక్కగా మనగలుగుతాయి.
వ్యంధత్వం
[మార్చు]మ్యూల్స్ పునరుత్పత్తి చేయలేవు అంటే అవి స్వంతంగా సంతానోత్పత్తి చేయలేవు. ఈ వంధ్యత్వానికి కారణం గుర్రాలు, గాడిదల మధ్య క్రోమోజోమ్‌ల సంఖ్యలో తేడాలు. గుర్రాలకు 64 క్రోమోజోములు ఉంటే, గాడిదలకు 62 క్రోమోజోములు ఉంటాయి. రెండు జాతులు జతకట్టినప్పుడు, ఫలితంగా పుట్టిన మ్యూల్ 63 క్రోమోజోమ్‌లను వారసత్వంగా పొందుతుంది, ఇది మియోసిస్ (meiosis) కణ విభజన సమయంలో క్రోమోజోమ్‌లను సరిగ్గా జత చేయడం అసాధ్యం చేస్తుంది. ఇది గామేట్స్ లేదా సెక్స్ కణాలను ఉత్పత్తి చేసే కణ విభజన ప్రక్రియ. ఫలితంగా, మ్యూల్స్ ఆచరణీయమైన స్పెర్మ్ లేదా గుడ్లను ఉత్పత్తి చేయలేవు, తద్వారా అవి పునరుత్పత్తి చేయలేవు.
మ్యూల్స్‌లో వంధ్యత్వం అనేది ఒక సహజమైన సంఘటన, దానిని తిప్పికొట్టడం (reverse) సాధ్యం కాదు. అయినప్పటికీ, కొంతమంది పెంపకందారులు మగ మ్యూల్స్ లను ఆడ గుర్రాలతో లేదా ఆడ మ్యూల్స్ లను మగ గాడిదలతో జత కట్టించడం ద్వారా సంతానోత్పత్తి చేయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భాలలో ఆచరణీయమైన సంతానం ఉత్పత్తి చేసే అవకాశాలు బహు తక్కువగా ఉంటాయి, ఆ సంతానం కూడా తరచుగా స్టెరైల్‌గా ఉంటుంది.
మగ మ్యూల్, ఆడ మ్యూల్ తో జత కట్టగలదు, కానీ ఆచరణీయమైన స్పెర్మ్ ను ఉత్పత్తి కాదు అంటే వెలువడిన ఉద్గారం సారవంతమైనది కాదు. అయితే మగ మ్యూల్స్ సంతానోత్పత్తి చేసే అవకాశం ఏదీ లేనప్పటికీ, సాధారణంగా మగ మ్యూల్స్ ల యొక్క విత్తులు తొలగిస్తారు. తద్వారా ఆడ మ్యూల్స్ లపై దానికి గల సహజ ఆసక్తిని పోగొట్టి మగ మ్యూల్స్ ల యొక్క ప్రవర్తనను నియంత్రించే ప్రయత్నం చేస్తారు. ఆడ మ్యూల్ కూడా స్టెరైల్‌గా ఉంటుంది. అంటే ఆడ మ్యూల్స్ ఆచరణీయమైన అండాలను ఉత్పత్తి చేయలేవు. ఆడ మ్యూల్స్ ఈస్ట్రస్ దశ గుండా పోవచ్చు లేదా పోకపోవచ్చు.
గుర్రాలు, గాడిదల మధ్య క్రోమోజోమ్‌లలో తేడాలకారణంగా మ్యూల్స్‌లో వంధ్యత్వం సహజంగా సంభవిస్తుంది. మ్యూల్స్ పునరుత్పత్తి చేయలేనప్పటికీ, శారీరక సామర్థ్యాలు, బలం, కఠినత్వం, ఓర్పు, తెలివితేటల పరంగా చాలా విలువైనవిగా ఉంటాయి.
జీవిత కాలం
[మార్చు]జాతి, ఆహారం, పర్యావరణం వంటి అంశాలపై ఆధారపడి మ్యూల్ యొక్క జీవితకాలం విస్తృతంగా మారుతూ ఉంటుంది. సగటున, మ్యూల్స్ 30-40 సంవత్సరాల వరకు జీవించగలవు. గుర్రాలు, గాడిదల కంటే మ్యూల్స్ కూడా తక్కువ ఆయుష్షును కలిగి ఉంటాయి. గాడిదలు 40-50 సంవత్సరాల వరకు జీవించగలవు.
పెంపకం
[మార్చు]మ్యూల్స్ తక్కువ-మెయింటెనెన్స్ జంతువులుగా ఖ్యాతిని కలిగి ఉన్నాయి. గుర్రాల పోషణ కంటే వీటి పోషణ చాలా సులభం. మ్యూల్స్‌కు గుర్రాల కంటే తక్కువ ఆహారం, నీరు అవసరమవుతాయి. ఇవి గుర్రాల వలె అంత సులభంగా వ్యాధులకు గురవడం జరగదు. అంతే గాక గాయాలకు కూడా అంత తేలికగా లోనుకావు. ఇవి కఠినమైన శీతోష్ణపరిస్థితులను తట్టుకోగలవు ఎగుడు దిగుడులతో కూడిన కఠినమైన భూభాగాలకు అలవాటుపడగలవు.
కంచర గాడిదలు-ప్రపంచ వ్యాప్తి
[మార్చు]ప్రపంచవ్యాప్తంగా మ్యూల్స్‌ను పెంచే, ఉపయోగించే ప్రధాన దేశాలు చైనా (5 మిలియన్ల), మెక్సికో (దాదాపు 1 మిలియన్), బ్రెజిల్ (8 లక్షలు), అమెరికా, స్పెయిన్ (4 లక్షలు)
5 మిలియన్లకు పైగా మ్యూల్స్ జనాభాతో చైనా ప్రపంచంలోనే అత్యధికంగా మ్యూల్స్ ఉత్పత్తిదారుగా ఉంది. చైనాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, రవాణాలో మ్యూల్స్ విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. మెక్సికోలో మ్యూల్స్ జనాభా దాదాపు 1 మిలియన్‌గా అంచనా వేయబడింది. మ్యూల్స్ లను మెక్సికోలో అనేక ప్రాంతాలలో రవాణా, వ్యవసాయం కోసం ఉపయోగిస్తారు. మూడవ స్థానం బ్రెజిల్: బ్రెజిల్‌లో మ్యూల్స్ జనాభా దాదాపు 800,000 వరకు ఉంటుందని అంచనా.ఈ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయం, మైనింగ్, రవాణాలో మ్యూల్స్‌ను ఉపయోగిస్తారు. యునైటెడ్ స్టేట్స్ లో మ్యూల్స్ గణనీయ సంఖ్యలో ఉన్నాయి. మ్యూల్స్ పెంపకంలో స్పెయిన్ దేశానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ దేశంలో సుమారు 400,000 మ్యూల్స్ జనాభా ఉన్నట్లు అంచనా. ఇంకా ఈజిప్ట్, ఇటలీ, మొరాకో, టర్కీ వంటి దేశాలలో మ్యూల్స్ గణనీయ సంఖ్యలో ఉన్నాయి.
2019లో భారత ప్రభుత్వం నిర్వహించిన 20వ లైవ్‌స్టాక్ సెన్సస్ ప్రకారం, భారతదేశంలోని మ్యూల్స్ మొత్తం జనాభా 1,70,000. ఇటీవలి సంవత్సరాలలో యాంత్రీకరణ వైపు మళ్లడం, వ్యాధులు, వేటాడటం, ఆవాసాల సంఖ్య తగ్గిపోవడం వంటి ఇతర కారణాల వల్ల భారతదేశంలో మ్యూల్స్ సంఖ్య క్రమేణా తగ్గుముఖం పడుతున్నది.
గాడిద-కంచర గాడిద ల మధ్య తేడాలు
[మార్చు]- గాడిద - కంచర గాడిద ల మధ్య తేడాలు
సంఖ్య | అంశం | గాడిద (Donkey) | కంచర గాడిద (Mule) |
---|---|---|---|
1 | పుట్టుక | రెండు గాడిదలు మాత్రమే జత కట్టినపుడు ఇవి పుడతాయి | ఆడ గుర్రం, మగ గాడిద జత కట్టినపుడు ఫలితంగా పుట్టిన సంకరజాతి. ఇవి చూడడానికి గాడిదలను పోలి ఉంటాయి, కానీ గుర్రం మాదిరిగా ఎత్తు, శరీర ఆకృతి, ఏకరీతి కోటు (uniform coat), చెవులు, దంతాలు, తోకను కలిగి ఉంటాయి |
2 | శరీర పరిమాణం | గాడిద పొట్టిగా, చిన్నదిగా ఉంటుంది. (నిలుచున్నప్పుడు దాని భుజాల వరకు 3 నుంచి 4 అడుగులు ఎత్తు ఉంటుంది.) | కంచర గాడిదలు సైజులో గాడిదల కన్నా పొడువుగాను, పెద్దవి గాను వుంటాయి. (ఇవి నిలుచున్నప్పుడు 4.5 నుంచి 5.5 అడుగులు ఎత్తు వరకు ఉంటాయి.) |
3 | బరువు (Weight) | తక్కువ బరువు (90–480 kg) కలిగి వుంటాయి. | అధిక బరువు (270–545 kg) కలిగి వుంటాయి. |
4 | రంగు | సాధారణంగా గాడిదలు బూడిద, గోధుమ, నలుపు, తెలుపు రంగులలో వుంటాయి. | కంచర గాడిదలు తమ తల్లి గుర్రం రంగును బట్టి, వివిధ రంగులు, ఛాయల నమూనాలలో ఉంటాయి. |
5 | ముఖం | ముఖం పొట్టి ఉంటుంది | పొడుగు ముఖం కలిగి వుంటాయి |
6 | చెవులు | గాడిదల చెవులు పొట్టిగా, నిటారుగా ఉంటాయి (short & upright). ఈ చెవి అంచులు స్పష్టంగా ముదురు రంగులో ఉంటాయి | కంచర గాడిదల చెవులు కాస్త పొడవుగా, పడిపోతున్నట్లు ఉంటాయి (long and drooping). అయితే ఈ చెవి అంచులు ముదురు రంగులో వుండవు |
7 | గొంతు ధ్వని | గాడిదలు గొంతు ద్వారా ఓండ్రు (Bray) మనే ఒక ప్రతేకమైన ధ్వని చేస్తాయి. | కంచర గాడిదలు చేసే ధ్వని, గుర్రం చేసే సకిలింపు-గాడిద పెట్టే ఓండ్రు ధ్వనుల మిశ్రమంతో కూడి విలక్షణంగా ఉంటుంది |
8 | వీపు భాగం | గాడిదల వీపు భాగం కొంచెం చదునుగా ఉంటుంది. (flat back) | కంచర గాడిదల వీపు భాగం కొంచెం వంపుగా ఉంటుంది (curved back) |
9 | జూలు (mane) | గాడిదల యొక్క కురచైన జూలు రఫ్ గా పెళుసుబారినట్లు ఉంటుంది | మ్యూల్స్ యొక్క కురచైన జూలు అంత రఫ్ గా లేనప్పటికీ, నిక్కబొడుచుకున్నట్లుగా ఉంటుంది |
10 | కాళ్ళు | సాధారణంగా గాడిదల కాళ్ళు పొట్టిగా, మందంగా ఉంటాయి. వీటి కాలి గిట్టలు (hooves) ఇరుకుగా వుంటాయి. అపాయం వస్తుందనుకొన్నప్పుడు, ఇవి తమ వెనుక కాళ్లతో తన్నుతాయి. | సాధారణంగా కంచర గాడిదల కాళ్ళు సన్నగా, పొడవుగా ఉంటాయి. కాళ్లకు వెడల్పాటి గిట్టలు వుంటాయి. అపాయం వస్తుందను కొన్నప్పుడు మ్యూల్స్ కూడా గాడిదల వలె తమ వెనుక కాళ్లతో తన్నుతాయి. |
11 | తోక | ఆవు తోక మాదిరిగా ఉంటుంది. దీని తోక సన్నగా, పొడవుగా ఉండి తోక చివరలో మాత్రమే వెంట్రుకలు ఉంటాయి | గుర్రపు తోక మాదిరిగా ఉంటుంది. దీని తోక ఎముక నుండి పొడవాటి వెంట్రుకలు క్రిందికి వస్తాయి |
12 | దూకడం (Jumping) | గాడిదలు దూకలేవు | కంచర గాడిదలు నిలుచున్న స్థానం నుండి అనేక అడుగుల పైకి దూకగలదు |
13 | క్రోమోజోమ్‌లు | జన్యుపరంగా గాడిదలు 62 క్రోమోజోమ్‌లను కలిగి ఉంటాయి కావున అవి పునరుత్పత్తి చేయగలవు | జన్యుపరంగా మ్యూల్ 63 క్రోమోజోమ్‌లను కలిగి ఉంటుంది అందువలన ఇవి పునరుత్పత్తి చేయలేవు. |
14 | పునరుత్పత్తి | గాడిదలు పునరుత్పత్తి చేయగలవు. ఒక గాడిద మరొక గాడిదతో లేదా గుర్రంతో కూడా పునరుత్పత్తి చేయగలదు. | మ్యూల్స్ పునరుత్పత్తి చేయలేవు విభిన్న క్రోమోజోమ్ నిర్మాణం కారణంగా మ్యూల్స్ స్టెరైల్ గా ఉంటాయి. అనగా ఆడ, మగ మ్యూల్స్ రెండూ జతకట్టినప్పటికీ సంతానోత్పత్తి చేయలేవు. |
15 | బలం (Strength) | గాడిద దాని సైజుకి తగ్గట్టు బలంగా ఉంటుంది, కానీ గుర్రమంత బలంగా ఉండదు. | కంచర గాడిద సంకరజాతికి చెందినది కాబట్టి సాధారణంగా గుర్రం కంటే, గాడిద కంటే దృఢంగా, బలంగా (tougher and stronger) వుంటుంది. భారీ బరువులను మోస్తూ ఎక్కువ దూరాలకు ప్రయాణించగల సామర్థ్యం వీటి ప్రత్యేకత. ఇంత బలంగా ఉన్నందున, సాధారణంగా గాడిదల కన్నా మ్యూల్స్ లను ప్యాక్ యానిమల్స్‌గా ఉపయోగించేందుకు ఇష్టపడతారు. |
16 | తెలివితేటలు | గాడిదలు తెలివైనవి | గాడిదలతో పోలిస్తే కంచర గాడిదలు చాలా తెలివైనవి. చాలా మంచి ఇంగితజ్ఞానాన్ని కలిగి ఉంటాయి |
17 | ఓరిమి, సహనం (Patience) | గాడిదలు ఓరిమి, సహనం గలవి | గాడిదలతో పోలిస్తే కంచర గాడిదలు మరింత ఎక్కువ ఓరిమిని, సహనాన్ని ప్రదర్శిస్తాయి. |
18 | మొండితనం (Stubborness) | గాడిదలు ఎక్కువ మొండిగా ఉంటాయి | మ్యూల్ లాగా మొండిగా అనే పదం తరచుగా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడినప్పటికీ నిజానికి గాడిదల కంటే కంచర గాడిదలు తక్కువ మొండిగా ఉంటాయి. |
19 | స్వభావము (Temperament) | గాడిదలు సహనంగా, విధేయతతో మెలగుతాయి | గుర్రాలు లేదా గాడిదల కంటే కంచర గాడిదలు చాలా ఎక్కువ సహనంతో (Patiance), మరింత విధేయతతో (obeediance) మెలగుతాయి. ప్రశాంతమైన స్వభావంతో ఉంటాయి. |
20 | శిక్షణ-పర్యవేక్షణ (training & supervision) | ఇవి బాగా మొండి పట్టుదలగలవి అందువలన వీటిపై మరింత పర్యవేక్షణ అవసరం | ఇవి బాగా తెలివైనవి, స్వతంత్రమైనవి కాబట్టి ఇవి త్వరగా నేర్చుకోగలవు. బాగా సానుకూలంగా ప్రతిస్పందిస్తాయి. అందువలన వీటిపై తక్కువ పర్యవేక్షణ సరిపోతుంది. |
21 | వాతావరణ అనుకూలత | సాధారణంగా వెచ్చని (warm) వాతావరణంలో గాడిదలను పెంచుతారు | కంచర గాడిదలు శీతల వాతావరణానికి సైతం బాగా తట్టుకొంటాయి కాబట్టి వీటిని వెచ్చని (warm), శీతల వాతావరణంలో కూడా పెంచుతారు |
22 | ఖరీదు (Cost) | సాధారణంగా గుర్రాలు లేదా మ్యూల్స్ కంటే తక్కువ ధర. | సంకర జాతివి కనుక సాధారణంగా గాడిదలు, గుర్రాల కంటే ఖరీదైనవి. |
23 | జీవిత కాలం | గాడిదలకు ఎక్కువ జీవిత కాలం ఉంటుంది. అవి 30 నుండి 50 సంవత్సరాల మధ్య వరకు జీవించగలవు | మ్యూల్స్ తక్కువ జీవితకాలం కలిగి ఉంటాయి. అవి 30 నుండి 40 సంవత్సరాల మధ్య వరకు జీవించగలవు. |
24 | ఉపయోగాలు | సరుకుల రవాణాకు బాగా ఉపయోగపడతాయి. | సరుకుల రవాణాకు, కష్టమైన పనులకు కూడా వీటిని ఉపయోగిస్తారు. పర్వత మార్గాలలోను, అద్వానమైన రహదార్లలోను ముఖ్యంగా దుర్భరమైన శీతల వాతావర పరిస్థితులలో కూడా ఇవి సరుకుల రవాణాకు, బరువులు లాగడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి. |
25 | పనిభారం (Workload) | గాడిద తక్కువ లోడ్లు, తక్కువ దూరాలకు ఉత్తమంగా సరిపోతుంది | కంచర గాడిద అధిక లోడ్లు, ఎక్కువ దూరాలకు బాగా సరిపోతుంది |
బరువులు మోసే సామర్ధ్యం
[మార్చు]మ్యూల్స్ కఠినమైన భూభాగాలపై భారీ భారాన్ని, ఎక్కువ దూరాలకు మోయగల సామర్ధ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అనేక శతాబ్దాలుగా ఇవి ప్యాక్ యానిమల్స్‌గా ఉపయోగించబడుతున్నాయి. మ్యూల్స్ యొక్క బరువులు మోసే సామర్థ్యం దాని పరిమాణం, బలం, శారీరక స్థితితో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సగటున, ఒక ఆరోగ్యకరమైన వయస్సులో వున్న కంచర గాడిద, తన శరీర బరువులో 20% నుండి 30% వరకు ఇబ్బంది లేకుండా మోయగలదు. ఉదాహరణకు, ఒక మ్యూల్ 450 Kg బరువు ఉందనుకొంటే, అది 90, 135 kg మధ్య మోయగలదు. అయితే, ఈ బరువు పరిమితి, అది ప్రయాణించే భూభాగం, ఎత్తు (altitude), వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొన్ని మ్యూల్స్ 160 కిలోల వరకు ప్రత్యక్ష బరువును మోయగలవు, అయితే బరువులను అదనంగా ఓర్చుకోవడంలోనే మ్యూల్ యొక్క గొప్పతనం స్పష్టంగా కనిపిస్తుంది.
ఉపయోగాలు
[మార్చు]చరిత్రలో ఈజిప్ట్, గ్రీకు, రోమన్ వంటి పురాతన నాగరికతల కాలాలలో వేలాది సంవత్సరాల నుండి కంచరగాడిదలు ఉపయోగించబడుతున్నాయి. సరుకుల రవాణా కోసం, బరువులు మోయడానికి, బళ్ళు లాగడానికి వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు. పొలాలను దున్నడం, నాగలి లాంటి వ్యవసాయ పరికరాలను లాగడం తదితర వ్యవసాయ అవసరాల కోసం మ్యూల్స్‌ను విస్తృతంగా ఉపయోగించారు.
19వ శతాబ్దంలో ముఖ్యంగా అమెరికన్ పశ్చిమ భూభాగంలో గోల్డ్, బాక్సయిట్ తదితర ఖనిజాల కోసం సాగే మైనింగ్ అన్వేషణలో భాగంగా సరుకుల రవాణా కోసం, కంచర గాడిదలను విస్తృతంగా ఉపయోగించడంతో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి, పశ్చిమ అమెరికా అభివృద్ధిలో మ్యూల్స్ ముఖ్యమైన పాత్ర పోషించాయి, అక్కడ వస్తువులను, ప్రజలను విస్తారమైన దూరాలకు రవాణా చేయడంలో ఇవి సహాయపడ్డాయి. అమెరికా దేశంలో ఎరీ కెనాల్, ట్రాన్స్‌కాంటినెంటల్ రైల్‌రోడ్ వంటి గొప్ప మౌలిక సదుపాయాల నిర్మాణంలో కూడా మ్యూల్స్ ఉపయోగించబడ్డాయి.
కంచర గాడిదలు మిలటరీ రంగంలో కీలక పాత్ర పోషించాయి. అమెరికా అంతర్యుద్ధ కాలంలోను ఆ తరువాత మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధ కాలాలలో కూడా మ్యూల్స్ విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. దుర్భేద్యమైన పరిస్థితులలో సైనికులు, సామానుల సరఫరా కోసం బరువులు మోసే జంతువులుగా, రవాణా వాహనాలుగా ఇవి పనిచేసాయి. నిజానికి, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, అమెరికా దేశం తమ సైన్యం పోరాడుతున్న ప్రాంతాలలో సరఫరాలు, సామగ్రిని రవాణా చేయడం కోసం ఒక మిలియన్ కంటే ఎక్కువ మ్యూల్స్‌ను ఉపయోగించింది. నేటికీ కూడా కొన్ని దేశాల మిలిటరీలలో ప్రత్యేకించి వాహనాలు నడప సాధ్యం కాని అత్యంత కఠినమైన భూభాగాల్లో రవాణా చేయడానికి, కంచర గాడిదలను డ్రాఫ్ట్ యానిమల్స్ (లాగుడు జంతువులు) గా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు పాకిస్థాన్, చైనా, భారతదేశం, నేపాల్, ఇరాన్ వంటి దేశాలలో టిబెట్ పీఠభూమి, కారంకోరం, హిందూకుష్, హిమాలయ పర్వత మార్గాల వెంబడి సామాగ్రి రవాణా చేయడానికి ఇప్పటికి కంచర గాడిదలు సైన్యంలో డ్రాఫ్ట్ జంతువులుగా వినియోగించబడుతున్నాయి.
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ముఖ్యంగా రోడ్లు లేదా ఇతర మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో రవాణా కోసం మ్యూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. పర్వత గ్రామాలు, ఎడారి అవుట్‌పోస్టులు వంటి మారుమూల ప్రాంతాలకు వస్తువులు, సామాగ్రిని రవాణా చేయడానికి వీటిని తరచుగా ప్యాక్ యానిమల్స్‌గా ఉపయోగిస్తారు.
మ్యూల్ రేసింగ్, మ్యూల్ జంపింగ్ వంటి క్రీడలలో, వేట వంటి వినోద కార్యక్రమాలలో కూడా వీటిని ఉపయోగిస్తారు. గుర్రాల వలె వేగంగా పరిగెత్తలేనప్పటికీ, మ్యూల్స్ లను బరువులు మోసే రేసింగ్‌లో ఉపయోగిస్తారు. బండ్లను లాగడం నుండి పోటీలలో ప్రదర్శించడం వరకు అనేక రకాల పనులు చేయడానికి కూడా మ్యూల్స్ ఉపయోగిస్తున్నారు. ట్రైల్ రైడింగ్‌లోతో పాటు ఎండ్యూరెన్స్ రైడింగ్ లలో కూడా తరచుగా కంచర గాడిదలను ఉపయోగిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా మాంసం కోసం దాదాపు 3.5 మిలియన్ కంచర గాడిదలు వధించబడుతున్నాయి. మానవాళికి ఎంతో ఉపయోగకర జంతువైనప్పటికీ గణనీయ సంఖ్యలో ఇవి వధించబడ్డానికి కారణాలున్నాయి. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మ్యూల్ మాంసాన్ని రుచికరమైనదిగా భావిస్తారు. చైనా, వియత్నాం, మెక్సికో వంటి దేశాలలో మ్యూల్ మాంసాన్ని ఒక సంప్రదాయ వంటకంగా, తరచుగా వేడుక భోజనంలో భాగంగా స్వీకరిస్తారు. అంతేగాక ఈ దేశాలలో మ్యూల్ మాంసానికి వ్యాధులను నయం చేసే, శక్తిని ప్రసాదించే ఔషధ గుణాలున్నాయని బలంగా నమ్ముతున్నారు. దీనివలన ఆయా దేశాలలో మ్యూల్ మాంసానికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. దీనికి తోడు సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున వ్యవసాయ, రవాణా రంగాలలో మ్యూల్స్ వాడకం తగ్గుతోంది. దానితో మిగులు (surplus) గా ఉండే మ్యూల్స్ సంఖ్య పెరగడానికి దారితీసింది. యజమానులు మ్యూల్స్ లను పోషించలేని స్థితిలో ఉన్నప్పుడు వాటిని లాభదాయకంగా వదిలించుకోవడానికి మాంసం కోసం అమ్ముతున్నారు.