Jump to content

కాకమాని మూర్తి

వికీపీడియా నుండి

కాకమాని మూర్తికవి. తెలుగు కవి. ఇతడు బ్రాహ్మణుడు. ఇంటిపేరు పెన్నేకులవారు. తండ్రి రామలింగభట్టు. తల్లి తిమ్మమాంబిక. ముత్తాత రామపండితుడు. తాత ప్రబోధపండితుడు. ఆపస్తంబసూత్రుడు. ఉభయభాషావిద్వత్కవీంద్రుడు. కవి పట్టభద్రుడు.ఇతడు సంకుసాల నృసింహకవివలె

శా. వ్యాళస్వాంతు లశాంతు లజ్ఞ సతతైకాంతుల్ మహాచేటికా

    శ్రీలోపద్రవ నవ్యపత్రికులు భూరిప్రాజ్ఞవిజ్ఞాపనా
    వేళాకల్పితరక్తవక్త్రులు కళావిజ్ఞాననిర్భాగ్యు లీ
    కాళక్ష్మాతలనేతలం బొగడుటల్ కష్టంబు లర్థార్థికిన్.

అని ఆనాటి రాజులను గూర్చిన తన అభిప్రాయమును వెల్లడిస్తూ 'నదైవం కేశవాత్పరమ్మ'ని తనకృతులలో పాంచాలీపరిణయాన్ని శ్రీరంగపతికి, రాజవాహనవిజయాన్ని శ్రీ వేంకటాచలపతికి గృతి యొసంగెను. ఇతడు రచించిన బహుళాశ్వచరిత్రములోని లక్ష్యములుగా చూపబడిన పద్యములు తప్ప, సమగ్రగ్రంథమెక్కడా లభించలేదు.

కవికాలం

[మార్చు]

సాధారణముగా కవికాలమును నిర్ణయించుటకు కవిస్తుతి, గద్యలు, నరాంకితము చేసి ఉంటే ఆ కృతిపతి వంశకథనము చాలవరకు ఉపయోగపడేవి. ఇతడు తక్కిన కవులను, కవిత్రయాన్నే పేర్కొన్నాడు గాని, తననాటి కవులను పేర్కొనక తన తాత ముత్తాతలను పేర్కొన్నాడు.

పంచమాశ్వాసము లోని,

సీ. అఖిలసీమామూలమై దుర్గమ్ము లు

                        మ్మకలు గల కమ్మ వెలమదొరలు
    చేతి కైదేసివేల్ శివరాయల వరాల
                        నెల కట్టడల పటాణీ ల్గరీబు
    లూళ్ళాయములమీద హొరపుత్తరవు గన్న
                        రాయకై జీతంపు రాయవారు
    పగటిగ్రాసంబు దప్పకయుండ దినరోజు
                        మాదిరి నొంటిరు జోదుమూక

గీ. మొదలుగా గల బారలు మొనకు నిల్చి

    పొడిచి పేర్వాడి వీథు లేర్పడగ జేసి
    గాసి గావించి యరుల జేనాసి యెదుట
    జూపి నిలఱేడు మూడు మెచ్చులున మెచ్చ.

అను పద్యంలో "శివరాయల వరాల"నుటచేత శివదేవరాయలనాటివాడు గాని, తరువాతివాడు అనిగాని నిశ్చయించడానికి ఆధారం ఈ గ్రంధంలోనే లభించింది.అచ్యుతదేవరాయల కుమారుడు మరణించిన తరువాత రంగారాయల కొడుకు సదాశివరాయలు రాజ్యమునకు వచ్చాడు. సదాశివదేవరాయల బావమరిది యకు రామరాజు అతనికి అమాత్యుడుగా ఉన్నాడు. తాళికోట యుద్ధములో 1565 లో రామరాజు మరణించాడు. సేనాని వెంకటాద్రి కూడా మరణించాడు. ఇక మిగిలినది నేనాని తిరుమలరావు ఒక్కడే. అతడు 150 కోట్ల రూపాయిలు, నవరత్నాభరణాలు మొదలైన చాలాధనంతో సదాశివరాయలను తీసుకుని అనంతపురం వద్దనున్న పెనుకొండ దుర్గానికి పారిపోయాడు.1568 వ సం॥మున సదాశివరాయలను చంపి తిరుమలరాయుడే రాజ్యాన్ని ఏలాడు. కానీ అక్కడ నిలవలేక చంద్రగిరికి వచ్చి చేరాడు.ఈ కవి 1568 సం॥ తరువాత సదాశివదేవరాయల వరాలు ప్రచారములో ఉండే కాలంలో జీవించిఉన్నాడని నిర్ధారణ చేయవచ్చును.

మూలాలు

[మార్చు]