Jump to content

కాయ

వికీపీడియా నుండి
బొప్పాయి చెట్టు ఉదాహరణగా పండు యొక్క వివిధ దశలు
అమ్మకానికి సిద్ధంగా ఉన్న నీరు నిల్వ ఉన్న కొబ్బరి కాయలు

వృక్షం యొక్క పూత పిందెగా ఆ తరువాత పిందె కాయగా మారుతుంది. కూరగాయలన్నింటిని కాయలు అనవచ్చు కాని కాయలన్నింటిని కూరగాయలు అనలేము. పిందె పండుగా మారెందుకు ముందు కాయ అని అంటారు.

పిందె

[మార్చు]

వృక్షం యొక్క పూత కాయగా మారెందుకు మునుపు పిందె అని అంటారు. మామిడి పిందె కొంత కాలం తర్వాత పక్వం చెంది పండుగా మారుతుంది.

ప్రాచీన సాహిత్యంలో కాయల ప్రస్థావన

[మార్చు]

ప్రాచీన సాహిత్యంనుంచి [1] ఊరగాయల గురించి ఒక మంచి పద్యం:

సీ. మామిడికాయయు, మారేడుగాయయు,

గొండముక్కిడికాయ, కొమ్మికాయ
గరుగుకాయయు, మొల్గుకాయ, యండుగుకాయ,
లుసిరికెకాయలు, నుస్తెకాయ,
లెకరక్కాయయు, వాకల్వికాయయు,
జిఱినెల్లికాయయు, జిల్లకాయ,
కలబంద, గజనిమ్మకాయ, నార్దపుకాయ,
చిననిమ్మకాయయు, జీడికాయ,

తే.గీ.కుందెనపుకొమ్ము, మామెనకొమ్ము, బుడమ

కాయ, యల్లము, మిరియంపుకాయ, కలివి
కాయ, కంబాలు, కరివేపకాయ లాది
యైన యూరుగాయలు గల వతని యింట.

ఈ పద్యం నుంచి 18వ శతాబ్దంలో తెలుగువాళ్ళు ఎన్నో రకాల ఊరగాయలని చేసుకొని తినేవారని తెలుస్తుంది.[2] ఈ పద్యం చదివినప్పుడల్లా ఏ తెలుగువారికైనా నోరు ఊరుతుంది.

కాలగమనంలో వివిధ రకాల కాయల నామాల మార్పు

[మార్చు]

14వ శతాబ్దములో కాకతీయుల కాలములో పద్యాలలో పేర్కొనబడిన కాయలకు ప్రస్తుతం వాడుకలో ఉన్న నామాలు పై విభాగంలో పద్యాలలో పేర్కొనబడిన కాయలు కాసే కొన్ని మొక్కలకు వాడుకలో ఉన్న పేర్లు కాలగమనంతో మారాయి. వాటి ప్రస్తుత నామాలూ, వాటినిగురించి కొన్ని వివరాలు [3]

  • మామిడి: తెలుగులో ఇంకా ఇదే పేరు వాడుకలో ఉంది. ``అంబళం, ``ఆమడమామి , ఆమ్రం అనేపేర్లుగూడా వివిధప్రాంతాల్లో వాడతారు. సంస్కృతంలో ``ఆమ్రా' అంటారు. ఇంగ్లీషులో Mango అంటారు. మామిడి చెట్టుకి బొటానికల్‌ పేరు Mangifera indica (Anacardiaceae or Mango family). ప్రస్థుతం ప్రపంచంలోని ఉష్నమండలాలన్నిటిలోనూ విరివిగా సాగు చెయ్యబడుతోంది. అన్నికాలాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ సుళువుగా మార్కెటులో లభిస్తుంది.
  • మారేడు: తెలుగులో ఇప్పటికీ ఇదేపేరు వాడుకలో ఉంది కానీ, ఈ కాయలు ఇప్పుడు మార్కెటులో ఎక్కువగా కనపడవు. మారేడు చెట్టు నిమ్మజాతికి చెందుతుంది. సంస్కృతంలో దీని పేరు ``భిల్వా', హిందీలో ``బేల్‌. దీని బొటానికల్‌ పేరు Aegle marmelos (Rutaceae family or citrus family).
  • ముక్కిడి: తెలుగులో వివిధ ప్రాతాలలో ``కొండముక్కిడి , ``మాదలింగ , ``మూకొడి , ``మక్కం అనీ పిలుస్తారు. ముక్కిడి మొక్క గన్నేరు, మల్లె జాతికి చెందినది. బొటానికల్‌ పేరు Schrebera swietenoides (Oleaceae family). మార్కెటులో చూడడం అరుదు, కొన్ని చోట్లే లభిస్తుంది.
  • కొమ్మకాయ: ఇప్పుడు మార్కెటులో ఈ కాయను చూడడం చాలా అరుదు. ఈ మొక్క బొటానికల్‌ పేరు Stylocoryne webera
  • గురుగు లెక గురుగి: గురుగు మొక్క తోటకూర జాతికి చెందుతుంది. పూలతోటల్లో పెంచే ``కోడిజుత్తుతోటకూరా' దీనికి దగ్గర బంధువు. సంస్కృతంలో దీన్ని ``వితున్నా' అంటారు. దీని బొటానికల్‌ పేరు Celosia argentea (Amaranthaceae family). ఇప్పుడు ఎక్కువ వాడకంలో లేదు. సాధారణంగా అడవి, బంజరు ప్రాంతాల్లో కన్పించే గురుగింజ లేక గురువింద (Arbus precatOrius)కీ దీనికి సంబంధం లేదు.
  • మొలుగుకాయ: దిన్ని ``మొలకకాయ , ``ముళ్ళవమ్కాయ అనికూడా పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేష లో సహజంగా పెరిగే మొక్క. వంగమొక్కకి దగ్గర బంధువు, కానీ ఇప్పుడు విరివిగా సాగుచెయ్యబడే వంగమొక్కలు ఇండియాకు ఇతరదేశాలనుంచి తీసుకువచ్చినవి. ఇప్పుడు సాగుచేశే వంకాయ వచ్చాక మొలుగుకాయకు జనాదరణ బాగా తగ్గిపోయింది. ఇప్పటికీ బంజరుప్రాంతాలలో ఈ మొక్క పెరుగుతూ ఉండడం చూడవచ్చు. వాటికి బాగానే కాయలు కాస్తాయి కానీ, వాటిని ఎవ్వరూ తీసుకోవడంలేదు. దీని బొటానికల్‌ పేరు Solanum hirsutum (Solanaceae family (potato family)).
  • ఎడుగు కాయ: ఈ కాయనుగురించి వివరాలు ఏమీ తెలియలేదు. బహుశా కవి ఈ పదాన్ని ``ఎండబెత్తిన ధాన్యపు గింజలూ' అని చెప్పడానికి వాడాడేమో.
  • ఉసిరిక్కాయ: దీన్నే ఇప్పుడు ``రాచ ఉసిరిక్కాయ అంటారు. ఉసిరి జాతిలో చాలా మొక్కలు ఉన్నాయి కానీ, ఇప్పుడు రెందు రకాల ఉసిరి మొక్కలు చాలాచోట్ల కనపడ్తాయి. ఒకటి రాచ ఉసిరి చెట్టు. దీని కాయలు నిమ్మకాయ సైజులో చాలా గట్టిగా ఉంటాయి. ఊరగాయకి ఎక్కువగా వాడేది ఈ రాచ ఉసిరిక్కాయలనే. ఈ చెట్టుకి బొటానికల్‌ పేరు Emblica officinalis (Euphorbiaceae family). దీన్నే సంస్కృతంలోనూ, హిందీలోనూ ఆదిఫల అనీ, ఆమ్ల అనీ పిలుస్తారు. ఈ కాయలు సీజన్లో మార్కెటులో విరివిగా లభిస్తాయి. ఎండబెట్టిన కాయలపిండి కూడా పాకెట్టుల్లో అన్నికాలాల్లోనూ మార్కెటులో దొరుకుతుంది. ఈ రాచ ఉసిరిక్కాయ తింటే డయాబెటీసు నయమవుతుందనీ, ఇంకా ఎన్నోరకాలుగా ఆరోగ్యం మెరుగవుతుందనీ ప్రతీతి. రాచ ఉసిరి ఊరగాయకూడా ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు. కానీ సాధారణంగా దంట్లో చాలా ఉప్పు వేస్తారు. తక్కువ ఉప్పు వాడి ఇంట్లో చేసుకున్న రాచ ఉసిరి ఊరగాయ ఒంటికి చాలా మంచిది. ఉసిరిజాతిలో ఎక్కువగా కనపడే ఇంకొక మొక్క పొదలా పెరుగుతుంది. దాన్ని సాధారణంగా ``ఉసిరి పొద అనే పిలుస్తారు. ఆంధ్రాలో చాలా దొడ్లల్లో ఇది కనపడుతుంది. ఇది చాలా విరివిగా కాస్తుంది. కాయలు రాచ ఉసిరికన్నా చిన్నవి, మెత్తగా ఉంటాయి. ఈ కాయ, తీపి, పులుపు రుచులతో తినడానికి బాగుంటుంది. కొందరు వీటితో పప్పు చేస్తారు. ఆ పప్పు చాలా బావుంటుంది.
  • చిరినెల్లికాయ: పద్యలలో చెప్పబడిన ఈ చిరినెల్లి మొక్క కూడా ఉసిరి జాతికి చెందిన ఒక పొద. దీన్ని వివిధ ప్రాతాలలో ``చిన్న ఉసిరి , ``నేల ఉసిరి , ``ఉచ్చి ఉసిరిక , ``పులిసరు , ``ఎత్త ఉసిరిక , అనికూడా పిలుస్తారు. దీని బొటానికల్‌ పేరు Phyllanthus emblica (Euphorbiaceae family).
  • ఉస్తెకాయ: ఉస్తెమొక్క ఆంధ్రప్రదేష్లో సహజంగా పెరుతుతుంది. ఇది వంగజాతికి చెందిన మొక్క (టమోటా, బంగాళదుంప, పొగాకుకూడా ఈ జాతి లోనివే). ఇంగ్లీషులో Gigantic Swallow Wort అంటారు. బొటానికల్‌ పేరు Solanum trilobatum. కొన్నిప్రాతాల్లో అప్పుడప్పుడూ మార్కెటులో లభిస్తుంది.
  • కరక్కాయ: కరక మొక్క బాదం జాతికి చెందిన చెట్టు. ఆయుర్వేదవైద్యంలో కరక్కాయలను దగ్గుమందులో వాడతారు. ఈ చెట్టును సంస్కృతంలో ``హరితకీ' అంటారు. బొటనికల్‌ పేరు Terminelia chebula (Combretaceae family), Chebulic myroblan అనీ, Terminelia indica, Terminelia arjuna అనికూడా అంటారు. మార్కెటులో అరుదుగా లభిస్తుంది.
  • వాకల్వికాయ: దీనినే ``వాక్కాయ అనీ, ``వాకపళ్ళు అనీ కూడా పిలుస్తారు. సీజనులో మార్కెటులో లభిస్తుంది. కాయ పుల్లగా ఉంటుంది. దీంతో పచ్చడి, పులిహోర కూడా చేస్తారు. వాక్కాయ పులుపు మూలాన, దానితో చేశిన పులిహోర చాలా రుచిగా ఉంటుంది. వాక మొక్కకి బొటానికల్‌ పేరు Caris carandas లెక Carissa spirarum (Apocyanaceae or Milkwort family).
  • జిల్లెకాయ: దీనికున్నూ, అన్నిచోట్లా కనపడే జిల్లేడుకున్నూ ఏమీ సంబంధం లేదు. జిల్లెమొక్క ఒక చెట్టు, దాన్నే ``చిల్లచెట్టు , లెక ``ఇందువు చెట్టు అని పిలుస్తారు. దీని బొటానికల్‌ పేరు Strychnos potatorum (Loganiaceae family). ఇప్పుడు ఈ కాయలు మార్కెటులో దొరకడం అరుదు.
  • కలబంద: ఇది ఎడారి ప్రాంతాల్లో పెరిగే చిన్నమొక్క. ఆంధ్రప్రదేష్లో ఇంటితోటల్లో తరచూ కన్పడుతుంది. ఈ మొక్కకి చాలా వెరైటీలు ఉన్నాయి: ``రాకాసి కలబంద , ``పెద్ద కలబంద , ``చిన్న కలబంద , ``ఈనెలకలబంద , ``ఎరికతాళి అనేవి తరచుగా కనపడే వెరైటీలు. ఇంగ్లీషులో ఈ మొక్కను Aloe vera (Liliaceae (i.e., lilly) family) అంటారు. ఈ మొక్క ఆకులు చాలా దళసరిగా ఉంటాయి. ఆకుమధ్య ఆకుపచ్చరంగు జెల్‌ ఉంటుంది. దానిని మందుల్లోనూ, ఒంటికి రాసుకునే లోషన్లు చెయ్యడానికీ వాడతారు. కానీ ఇప్పుడు దీన్ని ఊరగాయల్లోనూ, ఇతరవంటకాల్లోనూ వాడడం నెను చూడలేదు.
  • గజనిమ్మకాయ: ఇది ఒక రకం నిమ్మకాయ, కొన్ని ప్రాంతాల్లో లభిస్తుంది. హిందీలో దీన్ని ``మీటానింబూ అంటారు. బొటానికల్‌ పేరు Citrus limettioides (Citrus family, Rutacease).
  • నార్దపుకాయ: దీన్నే ``నారదబ్బకాయ , ``నారదబ్బ , ``దబ్బ అని కూడా పిలుస్తారు. బాగా దళసరి తొక్కతో నారింజపండుకీ, పంపరమనసకీ మధ్య సైజులో ఉంటుంది. నిమ్మజాతి కాయల ఊరగాయలన్నిటిలోకీ దబ్బకాయ ఊరగాయ అతిరుచికరమైనది. బొటానికల్‌ పేరు Citrus medica (Citrus family).
  • చిననిమ్మకయ: చిన్నకాయల నిమ్మజాతి.
  • జీడికాయ: ``జీడి అని, ``జీడిమామిడి అనీకూడా పిలుస్తారు. జీడి పప్పుకి ప్రపంచమంతటా గొప్ప డిమాండు ఉంది గనుక, జీడిమామిడి తోటలు పెంచడం ఇప్పుడు చాలా పెద్ద బిజినెసు అయ్యింది. ఇంగ్లీషులో దీన్ని cashew nut అంటారు. దీని బొటానికల్‌ పేరు Anacardium occidentale (Anacardiaceae family). జీడిమొక్క మామిడిజాతికి చెందిన చెట్టు.
  • బుడమకాయ: ఇది ఒకరకం దోసకాయ. వివిధ ప్రాంతాల్లో దీనిని ``కూతురుబుడమ , ``కోడిబుడమ , అనికూడా పిలుస్తారు. బొటానికల్‌ పేరు Bryonica callosa or Cucumis utilissinus (Cucurbitaceae family).
  • అల్లం: అల్లం ఇప్పటికీ మార్కెటులో విరివిగా లభిస్తోంది. దీన్ని అన్నిరకాల వంటకాల్లోనూ వాడతారు. ``మామిడల్లం , వగైరా పలురకాల అల్లాలు దొరుకుతాయి. ఇంగ్లీషులో దీన్ని Zinger అంటారు.
  • కరివేపకాయ: కరివేప ఆకు చాలా ప్రసిద్ధి చెందింది కదా. ఇండియన్‌ వంటల విశిష్ట లక్షణం ``కర్రీ వాడకం అని చెప్పుకుంటారు కదా, ఆ ``కర్రీ అనే పదం ``కరివేపా' ఆకు నుంచి వచ్చింది. కరివేప ఆకుని ఇంగ్లీషులో curry-leaf అని పిలుస్తారు. ఇప్పుడు కరివేప చెట్టు నుంచి వంటల్లో ముఖ్యంగా వాడేది ఆకు మాత్రమే. కరివేపపంద్లుకూడా చాలా రుచిగా ఉంటాయిగానీ, వాటి గురించి ప్రస్తుతం ఎవ్వరూ పట్టించుకోరు. ఈ పద్యాలు వ్రాశిన కాలంలో కరివేపకాయల్ని కూడా ఊరగాయల్లో వాడేవారని తెలుస్తుంది.
  • మిరియపుకాయ: బహుశా మిరియాలో, లేక ఒకరకం మిరపకాయలో అయిఉండవచ్చు.
  • మిగిలినవి, కుందెనపుకొమ్మ, మామెనకొమ్మ, కలివికాయ, కంబాలు గురించి వివరాలు ఇంకా లభించలేదు.

చిత్రమాలిక

[మార్చు]

సామెతలు

[మార్చు]
  1. కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు

పాటలు

[మార్చు]
  1. ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే - (చిత్రం - వేటగాడు)

బయటి లింకులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. జెజ్జాల కృష్ణమోహన రావు రచ్చబండ గూగుల్ గ్రూపులో లేఖ
  2. అయ్యలరాజు నారాయణామాత్యుడు, హంసవింశతి, 4.135, శృంగార కావ్య గ్రంథ మండలి ప్రబంధ పరంపర - 4 originally published in the later half of eighteenth century, మచిలీపట్టణం, 1938.
  3. (పాలన) పారనంది లక్ష్మీ నరసింహం రచ్చబండ గూగూల్ గ్రూప్స్ లో ఈమెయిల్
"https://te.wikipedia.org/w/index.php?title=కాయ&oldid=3917525" నుండి వెలికితీశారు