Jump to content

కిరణ్ బాల బోరా

వికీపీడియా నుండి
కిరణ్ బాల బోరా
কিৰণ বালা বড়া
జననం1904 (1904)
ఉత్తర హైబోర్గావ్, నాగావ్, అస్సాం, భారతదేశం
మరణంజనవరి 1993 (aged 88–89)
పానిగావ్ చోయాలీ, నాగావ్, అస్సాం, భారతదేశం
వృత్తిస్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజిక కార్యకర్త
క్రియాశీల సంవత్సరాలు1919–1947
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సంఘ సంస్కర్త
తల్లిదండ్రులు
  • కమల్ చంద్ర పండిట్ (తండ్రి)
  • సరోజ్ ఐదేవ్ (తల్లి)

కిరణ్ బాల బోరా (అస్సామీ: কিৰণ বালা বড়া; 1904 - 1993 జనవరి 8) భారతదేశంలోని అస్సాంకు చెందిన మహిళా స్వాతంత్ర్య సమర యోధురాలు. సామాజిక కార్యకర్త. ఆమె 1930 - 1940లలో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమాలలో చురుకుగా పాల్గొని భారతదేశ స్వాతంత్ర్యానికి దోహదపడింది.[1]

జీవిత చరిత్ర

[మార్చు]

1904లో అస్సాంలోని నాగావ్ జిల్లాలోని ఉత్తర హైబోర్గావ్ గ్రామంలో కమల్ చంద్ర పండిట్, సరోజ్ ఐదేవ్ దంపతులకు కిరణ్ బాల బోరా జన్మించారు. ఆమె తండ్రి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. ఆ సమయంలో భారతీయ సమాజంలో మహిళలను పాఠశాలకు పంపడంపై ఆంక్షలు ఉన్నప్పటికీ కిరణ్ బాల బోరా 3వ తరగతి వరకు చదువుకున్నారు. ఆమె కంపూర్‌ (నాగావ్‌) లోని పరోలి గురికి చెందిన సాకి రామ్ లస్కర్‌ను వివాహం చేసుకుంది. ఆ తరువాత ఆమె దేశంలోని విప్లవాత్మక ఉద్యమాలపై ఆసక్తిని పెంచుకుంది.

1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం సాధించేవరకు పోరాడిన ఆవిడ ఇక తన పిల్లలను చూసుకుంది. ఆమె కుమార్తెలకు విద్యాబుద్ధులు నేర్పించారు. తరువాత ప్రసిద్ధ కుటుంబాలలో వివాహం చేసుకున్నారు. ఆమె కుమారులు స్థిరపడడంలో ఆమె కృషి సల్పారు.

ఆమె రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలచే స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్లతో సత్కరించబడింది. కిరణ్ బాల బోరా 1993 జనవరి 8న మరణించారు. ఆమె మరణించే వరకు చురుకైన శ్రీమంత శంకరదేవ సంఘ కార్యకర్తనే కాక భక్తురాలుగా కొనసాగారు.

స్వాతంత్ర్య ఉద్యమం

[మార్చు]

1920వ దశకంలో

[మార్చు]

జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత మహాత్మా గాంధీ నేతృత్వంలో వందలాది మంది ప్రజలు భారతదేశ వ్యాప్తంగా అహింసాయుత నిరసనల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య పోరాట నాయకులు చేస్తున్న త్యాగాలు, సవాళ్లను చూసి కిరణ్ బాల బోరా స్ఫూర్తి పొందారు. ఇక ఆమె ఉద్యమ కార్యకలాపాలలో పాల్గొనడం ప్రారంభించింది. క్రమంగా దాని కోసం తన సమయాన్ని వెచ్చించింది. దేశంలోని ఈశాన్య ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకలాపాల కోసం నిధుల సేకరణలో చురుకుగా పాల్గొన్నారు. పూర్ణ చంద్ర శర్మ, మహీధర్ బోరా, హలధర్ భుయాన్, దేవకాంత బారుహ్ వంటి నాయకుల ప్రోత్సాహంతో ఆమె బలమైన స్వాతంత్ర్య సమరయోధురాలిగా మారారు. ఆమె అస్సాంకు చెందిన గొప్ప రచయిత, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన చంద్రప్రవ సైకియానిని కూడా కలిశారు. కిరణ్ బాల బోరా ఆమెతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె ఆదేశాల మేరకు చాలా సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.

కిరణ్ బాల బోరా సహాయ నిరాకరణోద్యమం లక్ష్యాలలో ఒకటైన విదేశీ వస్తువుల వినియోగాన్ని బహిష్కరించే చర్యలో పాల్గొంది. ఆమె బట్టలతో సహా తన ఇంట్లోని అన్ని రకాల విలువైన విదేశీ వస్తువులను తగులబెట్టింది. ఇతరులకు కూడా ఇది స్ఫూర్తినిచ్చింది. ఆమె పత్తి వడకడం, తను సొంతంగా వస్త్రాన్ని తయారు చేయడం నేర్చుకుంది.

1929లో లాహోర్ కాంగ్రెస్,  1930 జనవరి 26ని పూర్ణ స్వరాజ్ దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది. దీని కోసం కొలియాబోర్‌లో కిరణ్ బాల బోరా నేతృత్వంలో 400 మందికి పైగా మహిళలు ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు

1930వ దశకంలో

[మార్చు]

అనేక సార్లు చట్టాలను ఉల్లంఘించినందుకు కిరణ్‌ బాల బోరాను బ్రిటిష్-భారత ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆమె జైలులో ఉన్నప్పుడు 1931 ఫిబ్రవరి 7న తీవ్ర అనారోగ్యానికి గురైంది. 1932లో ఆమె షిల్లాంగ్ జైలుకు బదిలీ చేయబడింది, అక్కడ ఆమె విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నది.[2]

1930లలో ఉప్పుపై బ్రిటిష్ వారి గుత్తాధిపత్యాన్ని అంతం చేయడానికి మహాత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు. కిరణ్ బాల బోరా ఈ ఉద్యమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రచారం కొనసాగించారు. ఆమె ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూనే స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొనేవారు. ఆమె తన భర్త ఇంట్లో జరిగే సంఘానికి హాజరయ్యేందుకు వచ్చే భక్తులకు దేశ స్వాతంత్ర్యం గురించి బోధించడం ప్రారంభించింది. భారతదేశంలోని బాల్య వివాహం, స్త్రీ విద్య మొదలైన సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడం ద్వారా ఆమె సంఘ సంస్కర్త పాత్రను పోషించింది.

1940వ దశకంలో

[మార్చు]

1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రకటించబడింది. డూ ఆర్ డై నినాదం మార్మోగింది. యావత్ దేశాన్ని చుట్టుముట్టిన ఉద్యమాల కెరటం బ్రిటిష్ వారికి చిరాకు తెప్పించింది. వారు భారతీయులపై కాల్పులు, సామూహికంగా చంపడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఆమె చాలాసార్లు లాఠీ ఛార్జీలకు గురియైంది. అయినా స్వాతంత్ర్య పోరాటం విడవలేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించే వరకు ఆమె పోరాడింది.[3]

మూలాలు

[మార్చు]
  1. Bora, Nilima. Gogoi, Swarna Baruah (ed.). Luit paror Mahila Swadhinota Sangramir Jivan Gatha. Guwahati, Assam: District Library Guwahati, Assam, India. p. 39.
  2. Sharma, Dr. Dipti (1993). Assamese women in the freedom struggle. Punthi-Pustak.
  3. Sharma, Dipti (31 December 1987). Role of the women of Assam in the freedom movement during the period 1921 1947 with special reference to the Brahmaputra valley. Gauhati University. hdl:10603/66690.