కుండలిని

వికీపీడియా నుండి
(కుండలినీ శక్తి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారం లో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.

శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థితి శక్తి (Potential Energy), రెండవది గతి శక్తి(Dynamic or Kinetic Energy). శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది. యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయవచ్చు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహ శుద్ధి (purification of body), నాడీ శుద్ధి (purification of nadis/nervous system), మనో శుద్ధి (purification of mind), బుద్ధి శుద్ధి (purification of intellect) జరగాలి. నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన "సమాధి స్థితి"గా కూడా పేర్కొంటారు. ఈ స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.

చక్రాలు

[మార్చు]
వెన్నెముక లో ఉండే చక్రాలు

షడ్చక్రాలు లేదా సప్తచక్రాలు మన శరీరంలోని వెన్నుపూస లోనున్న ప్రదేశాలు.

  • మూలాధార చక్రము (Mooladhara) : గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. దీని బీజ మంత్రం లం. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.
  • స్వాధిష్ఠాన చక్రము (Swadhisthana) : లింగమూలమున గలదు. ఆరు దళములతో సిందూరవర్ణము గల జలతత్వ కమలము గలది. దీని బీజ మంత్రం వం.
  • మణిపూరక చక్రము (Manipura) : నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి, నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము. దీని బీజ మంత్రం రం.
  • అనాహత చక్రము (Anahatha) : హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం యం.
  • విశుద్ధి చక్రము (Vishuddha) : కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి, శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము. దీని బీజ మంత్రం హం.
  • ఆజ్ఞా చక్రము (Ajna) : భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము. దీని బీజ మంత్రం ఓం.
  • సహస్రార చక్రము (Sahasrara) : బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈ స్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కుండలిని&oldid=2984354" నుండి వెలికితీశారు