కుబేర్‌నాథ్ తంజావూర్‌కర్
కుబేర్‌నాథ్ అప్పస్వామి తంజావూర్‌కర్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1917 |
సంగీత శైలి | నాట్యం |
వృత్తి | భరతనాట్య గురువు |
కుబేర్‌నాథ్ అప్పస్వామి తంజావూర్‌కర్ భరతనాట్య కళాకారుడు, నాట్యాచార్యుడు.
విశేషాలు
[మార్చు]ఇతడు భరతనాట్య కళాకారుల కుటుంబంలో 1917లో అప్పస్వామి, కాంతిమతి అమ్మ దంపతులకు జన్మించాడు.[1]ఇతని తండ్రి అప్పస్వామి కళాభిరుచి కలిగిన నట్టువనార్. ఇతని తాత, నాన్నమ్మ, తల్లిదండ్రులు అందరూ భరతనాట్య కళాకారులే. ఇతడు బాల్యంలోనే కళలను అభ్యసించడం ప్రారంభించాడు. ఇతడు పందనల్లూర్ మీనాక్షి సుందరంపిళ్ళై వద్ద భరతనాట్యం గురుకుల పద్ధతిలో అభ్యసించాడు. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని బాలకృష్ణ పిళ్ళై వద్ద అభ్యసించాడు. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని ఆగ్రా ఘరానాకు చెందిన "అఫ్తాబ్ ఎ మౌసికి" ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ వద్ద నేర్చుకున్నాడు. ఇతడు మృదంగ విద్వాంసుడు కూడా. 1941లో ఇతడు లక్నోలోని భతకండే సంగీత కళాశాలలో నాట్యాచార్యునిగా చేరాడు. ఇతడు వదోదరా వచ్చి అక్కడ బరోడా మహారాజు ఆస్థానంలో నట్టువనార్‌గా 1948-50ల మధ్య పనిచేశాడు. 1950లో ఇతడు మహారాజా సయాజీరావ్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగంలో డాన్స్ ప్రొఫెసర్‌గా చేరి 1981లో పదవీ విరమణ చేశాడు.
తరువాత ఇతడు 1983లో "తంజావూర్ నృత్యశాల"ను, 1993లో "తంజావూర్ డాన్స్, మ్యూజిక్ అండ్ ఆర్ట్ రీసెర్చ్ సెంటర్" పబ్లిక్ ట్రస్టును స్థాపించాడు. ఇతడు ఈ సంస్థల ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాట్య శిక్షణ ఇప్పించాడు. ఇతని శిష్యులలో ప్రతిభా పండిట్, మధుభాయ్ పటేల్, ఇలాక్షి ఠాకూర్, నేహా పారిఖ్, పరుల్ పటేల్ మొదలైన వారెందరో ఉన్నారు. ఇతడు హిందుస్తానీ రాగాలతో భరతనాట్య నృత్యాలను హిందీలో రూపొందించాడు. ఇతడు "సంక్షిప్త భాగవత్", "రాధ - ను - శ్యామ్‌ను", "మీరాభజన్", "నవకర్ మంత్ర", "భుకణ భుజంగ్", "ఢమరు", "ఎటా ఇరండు పెసుమ్", "మధురాష్టకమ్"మొదలైన వాటికి భరతనాట్య నృత్యాలను రూపొందించి ప్రదర్శింపజేశాడు.
ఇతడు దక్షిణ ఆఫ్రికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, ఐరోపాలోని అనేక ప్రాంతాలను సందర్శించి నాట్యప్రదర్శనలు గావించాడు. ఇతనికి 1993లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. ఇంకా ఇతడు గుజరాత్ సంగీత అకాడమీ అవార్డు, సారంగదేవ్ అవార్డు, త్రివేణి అవార్డు, సంస్కారభారతి అవార్డు, ఐ.టి.సి. అవార్డు మొదలైనవి లభించాయి.
మూలాలు
[మార్చు]- ↑ web master. "Gurushri Kubernath Appaswamy Tanjorkar". Tanjore Dance Music & Art Research Centre. Retrieved 20 April 2021.