Jump to content

కొండ రెడ్లు

వికీపీడియా నుండి

కొండ రెడ్లు : ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కొండ రెడ్లు పోడు వ్యవసాయం చేసుకుని, జీవిస్తున్న ఆదివాసులు. తూర్పు కనుమల నడుమ పారే గోదావరి నదిని ఆనుకొని వున్న కొండలలో కొండ రెడ్లు జీవిస్తున్నారు. ఈ కొండలలో కలప సమృద్ధిగా లభిస్తుంది. కృష్ణానది ఏరకంగా నైతే నిజాం పాలించిన హైదరాబాద్ సంస్థానానికి, మద్రాస్ ప్రెసిడెన్సీకి సరిహద్దుగా ఉండిందో, గోదావరి నది కూడా అప్పటి హైదరాబాద్ సంస్థానానికి, మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన తూర్పు గోదావరి ఎజెన్సీ ప్రాంతానికీ సరిహద్దుగా ఉండేది. ప్రస్తుతం కొండ రెడ్లలో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే నివసిస్తున్నారు. ఏదో కొన్ని కుటుంబాలు పొరుగు రాష్ట్రమైన ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలో చెదురు మదురుగా కనిపిస్తాయి. పేరులో సారూప్యత ఉన్నప్పటికీ ఈ కొండ రెడ్లకూ, హిందూ మతంలో రాజకీయంగా, ఆర్థికంగా శక్తివంతమైన రెడ్లకూ (రెడ్డి కులానికీ) ఏ రకమైన సంబంధం లేదు.

దస్త్రం:Konda reddies.jpg
కొండ రెడ్లు

కొండ రెడ్లంతా నెమ్మదినెమ్మదిగా ఆయా సముదాయాల (community) సమీపంలో ఉన్న హిందూ కులాలలో అంచెలంచెలుగా కలిసి పోతున్నారు. కొండ రెడ్లు మాట్లాడేది తెలుగే అయినప్పటికీ రూపురేఖల్లో, భౌతిక రూపంలో వీరికీ, తెలుగు మాట్లాడే యితర ప్రజలకూ మధ్య కొట్టవచ్చినంత తేడా కనబడుతుంది.

కొండ రెడ్లు అడవిని కొట్టేసి జొన్నలు, సజ్జలు లాంటి చిరు ధాన్యాలూ, యితర కూరగాయలూ పండిస్తారు. ఇవే వారి ప్రధాన జీవనాధారం . నాగలిని ఏమాత్రం ఉపయోగించకుండా కేవలం ఒక చిన్న గొడ్డలి సహాయంతో అడవిని కొట్టి సాగుచేసే కొండ రెడ్ల ఈ పద్ధతిని ఆంధ్రప్రదేశ్‌లో పోడు అంటారు. అదే మధ్యప్రదేశ్‌లో నయితే "బేవార్" Bewar) లేదా " పెండా" (Penda) అనీ, ఈశాన్య భారతంలో "ఝం" (jhum) అనీ అంటారు. కాని వీటన్నింటి మధ్యా కొద్దిపాటి వ్యత్యాసాలున్నాయి. నాగా, నిషి లేదా కొండ మరియ తెగల ఆదివాసులు ఒక పార (Hoe) సహాయంతో కొండ ప్రాంతాలను చదును చేసి సాగు చేస్తుంటారు. అదే సమయంలో గోదావరీ ప్రాంతంలోని కొండ రెడ్లు మాత్రం అడవిని కొట్టేసి, చదును చేసి, చిన్న కర్ర సహాయంతో రంధ్రాలు చేసి జొన్నలు, సజ్జలు లాంటి చిరు ధాన్యాలను చల్లుతారు. మొత్తం ఆసియా ఖండంలోనే యింత మోటు (Crude) పద్ధతుల్లో సాగు చేసే తెగ మరొకటి ఉండదు. కొండ రెడ్లు విల్లంబులతో వేటాడుతారు. గోదావరీ తీరప్రాంతంలో నివసించే కొండ రెడ్లయితే చేపలు పడుతుంటారు. విత్తులు నాటడం దగ్గరనుంచీ "నేలతల్లి" చల్లని దీవెనల కోసం పందులను, కోడి పుంజులను బలి యిస్తుంటారు. "కొండ దేవత"ను ప్రతిష్ఠించి, పూజిస్తుంటారు.

సాంకేతికాభివృద్ధి వల్ల ఈ మధ్య కాలంలో కొండ రెడ్లు యితర సమూహాలకు కూడా అందుబాటులోకి వచ్చారు. అడవిని దోచుకొనే వ్యాపారాత్మకథోరణి ప్రాబల్యం వల్ల కొండ రెడ్ల జీవితంలో గణనీయమైన మార్పు రావడమే కాక వాళ్ళకిదివరకు ఉన్న అడవి మీద స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలునానాటికీ సన్నగిల్లి పోతున్నాయి.

మూలాలు

[మార్చు]