కోరాడ రామచంద్రశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోరాడ రామచంద్రశాస్త్రి
Korada ramachandra sastry.jpg
పుట్టిన తేదీ, స్థలంకోరాడ రామచంద్రశాస్త్రి
1816
అమలాపురం తాలూకాలోని కేశనకుఱ్ఱు
మరణంజూన్ 6, 1897
వృత్తితొలి తెలుగు నాటక రచయిత
పౌరసత్వంభారతీయుడు
రచనా రంగంనాటక రంగం

కోరాడ రామచంద్రశాస్త్రి (1816 - జూన్ 6, 1897) ప్రథమ తెలుగు నాటక రచయిత.[1] క్రీడాభిరామం తరువాత తెలుగు నాటకం వ్రాసిన వారిలో వీరే ప్రథములు. సంస్కృతం నుండి తెలుగులోని అనువాదం చేసిన మొదటి రచయిత కూడా వీరే కావడం విశేషం.

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన 1816లో అమలాపురం తాలూకాలోని కేశనకుఱ్ఱు గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు లక్ష్మణశాస్త్రి. ఈయన నివాసమున్నది బందరులో. జూన్ 6 1897 [2] నిర్యాణం చెందారు. ఈయన చాలా మంచి కవి అని మిత్త్రులు వివాహార్థ మెచ్చరించిరట. ఆసమయమున చిరపరిచయులగు శిష్టుకవిగారు రామచంద్రపురము రాజుగారికి "ఇతని నాస్థాన పండితునిగా గౌరవింపు" డని ఉత్తరము వ్రాసి ఇవ్వగా వారు దేశమున క్షామము వలన నీకవిని రెండు నెలలకంటే నెక్కువ పోషింపలేమని చెప్పిరట. ఆమాట రామచంద్రశాస్త్రికి నచ్చలేదు. మదరాసు పోయి యేదో యుద్యోగము సంపాదించుటకు సంకల్పించి ప్రయాణము సాగించెను. త్రోవలో మచిలీపట్టణమున ఆగవలసివచ్చి ఇంగువ రామస్వామి శాస్త్రి గారియొద్ద మంత్ర శాస్త్రమభ్యసించెను. అప్పుడు వఠ్ఠెం అద్యైత పరబ్రహ్మశాస్త్రి పాండిత్యశక్తి పరీక్షకు వాక్యార్దము చేయగా నందాయనను ధిక్కరించి పెళ్ళిచెడదీసికొని యింటికి బోయెను. ఆయన స్వస్థలము నడవపల్లి. ఆయూరివారు రామచంద్రశాస్త్రి సామర్ద్యము పరీక్షించుటకు శతావధానము చేయమనిరి. మహాకవితాధార కలిగిన వీరి కదియొక లెక్కా ! పద్యములు తడువుకొనకుండ నవధానమున జెప్పెనట. ఆపద్యములు మాత్ర మనుపలబ్ధములు.

క్రమముగా శాస్రిగారి పాండితీకవితా ప్రతిభలు నుతికెక్కినవి. బందరు నోబిల్ పాఠశాలలో నుద్యోగము లభించింది. అక్కడ 43 వత్సరములు పనిచేసిరి. దొరలు వీరి నైష్టికతకు నివ్వెఱపోయెడివారు. ఇత డెవ్వరిని లెక్కసేయలేదు. ఉద్యోగించిన నలువది మూడేండ్లలో ' ఈతప్పుచేసితి ' వని యధ్యక్షునిచే నాక్షేపింపబడలేదు. కళాశాలధ్యక్షుకు నీయనకు నొక శ్లోకార్దములో వ్యతిరేకాభిప్రాయములు వచ్చినవి. శాస్త్రులుగారు ముక్తకంఠమున "మీయర్ధము పొరపా"టని త్రోసివైచిరి. తాత్కాలికముగా అధికారికి క్రోధావేశము కలిగినను శాస్త్రులు గారి యధార్ధవాదిత కాయన తలయొగ్గక తప్పినదికాదు. వెనుక శ్రీ వీరేశలింగం పంతులుగారు రాజమహేంద్రవరమున ఆర్ట్సు కాలేజిలో తెలుగు పండితులు నుండునపుడు కస్తూరి శివశంకర శాస్త్రి గారిది సంస్కృతపండిత స్థానము. శాస్త్రిగారు పరీక్షాపత్రము సెస్సగా వ్రాసినవారికి నూటికి నూటపది మార్కులు వేయుచుండువారట. ప్రిన్సిపాలు ఇదేమి పాపమని యడుగగా, ఆ విద్యార్థి పుణ్యమని నిరంకుశముగా సమాధానించుచుండు వారట. మన రామచంద్ర శాస్రిగారి నైరంకుశ్య మాతీరులోనిదే.

మాడభూషి వేంకటాచార్యులు మన శాస్త్రిగారి ప్రతిభ నెరుంగదలచి "శ్లో. చింతకాయ కలేకాయ బీరకాయ తమారికే, ఉచ్చింతకాయ వాక్కాయ సాధకాయ తమాంజలిమ్" అని యొక శ్లోకము వ్రాసి శిష్యున కిచ్చి రామచంద్ర శాస్త్రి వీని కర్ధ మెట్లు చెప్పునో కనుగొని రమ్మనెనట. అంతట శాస్త్రులుగారు దాని కర్ధము చెప్పుటయేగాక మాకి రెండు గడ్డు శ్లోకములు వ్రాసి యాచార్యులు గారికి బంపి నిరుత్తరులను జేసిరని వదంతి.

ఈయన సంస్కృతాంధ్రములలో చాలా కృతులు రచించెను. పండ్రెండవ యేటనే ఉపదేశము పొందెను. 'దేవివిజయము', కుమారోదయము' అను గ్రంథములు వీరి యుపదేశ విషయమును స్పుటీకరించును. 1860 ప్రాంతమున మంజరీమధుకరీయ నాటకము సంఘటించిరి. ఈనాటకమునకు ముందు దెలుగున ఎలకూచి బాలసరస్వతి విరచితమగు 'రంగకౌముది' నాటకమున్నట్లు వినుకలి. మంజరీమధుకరీయములోని కథ కల్పితము. ఇది రంగమున కననుకూలము.

రచనలు[మార్చు]

శాస్త్రిగారు కావ్య నాటకాదులను, తర్క వ్యాకరణాది గ్రంథములను చదివి సాహిత్యంలో గొప్ప ప్రావీణ్యత సంపాదించారు. వీరు బందరు కళాశాలలో తెలుగు పండితులుగా పనిచేశారు.

 • వీరు సుమారుగా 30 గ్రంథాలు రచించారు.
 • ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం "మంజరీ మధుకరీయం". దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి గారు 1860 ప్రాంతాల్లో రచించారు; ముద్రణ మాత్రం 1908లో జరిగింది.[3] సంస్కృతంలోని నాటక లక్షణాలను అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన ఇది. ఇందులోని కథ మంజరీ, మధుకరుల మధ్య ప్రణయ వృత్తాంతము. క్షుద్ర మంత్రకత్తే వలన మంజరి అన్నో కష్టాలు అనుభవించి చివరకు రాజును వివాహం చేసుకొనడం కథాంశం. నాటకం అంతా దీర్ఘ సమాసాలతో నిండి పద్య రూపంలో ప్రబంధ ధోరణిలో ఉంటుంది.
 • వీరు సంస్కృతంలోని వేణీ సంహారం నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇది సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన మొదటి నాటకం.

కృతులు[మార్చు]

 • మంజరీ మధుకరీయ నాటిక
 • ఉన్మత్త రాఘవము
 • నయప్రదీపము
 • రథాంగదూతము
 • శాకుంతలము (ఆంఢ్రీకరణం)
 • వేణీసంహారము
 • ముద్రారాక్షసము
 • ఉత్తరరామచరితము
 • పరశురామ విజయము

సంస్కృత రచనలు[మార్చు]

 • కుమారోదయము
 • ఘనవృత్తము[4]
 • దేవీవిజయము
 • శృంగార సుధార్ణవము
 • ఉపమావళి

ఆముద్రిత సంస్కృత కృతులు[మార్చు]

 • మృత్యుంజయ విజయ కావ్యము
 • పుమర్థసేవధి కావ్యము
 • కమనానందభాణము
 • రామచంద్ర విజయవ్యాయోగము
 • త్రిపురాసుర విజయడిమము
 • ఉత్తర రామాయణము
 • ధీసౌధము
 • మంజరీ సౌరభము
 • ...ఇంకా ఎన్నో

మూలాలు[మార్చు]

 1. నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీలు: 42-3.
 2. [రంగస్థల కరదీపిక-కంపా చెన్నకేశవరావు, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం ప్రచురణ]
 3. తెలుగు వెలుగు, వ్యాసాలు. "నాటకానికి అడుగుజాడ కందుకూరి". www.teluguvelugu.in. డా. కందిమళ్ళ సాంబశివరావు. Archived from the original on 23 ఏప్రిల్ 2020. Retrieved 23 April 2020. CS1 maint: discouraged parameter (link)
 4. ఆర్కీవులో ఘనవృత్తము పుస్తక ప్రతి.