కోల్ బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కోల్‌బర్గ్ అనే సైకాలజిస్ట్ కోల్ బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంను ప్రతిపాదించాడు. ఈయన శిశువును నైతిక తత్వవేత్తగా భావించాడు. నైతికత గురించి వ్యక్తులు ఏం చేస్తారనే దానికంటే ఏం ఆలోచిస్తారనే విషయం గురించి వివరించాడు. నైతిక వికాసం అనేది వ్యక్తి సంజ్ఞానాత్మక వికాసం, పెంపకం, సామాజిక అనుభవంపై ఆధారపడి ఉంటుందని కోల్‌బర్గ్ తెలిపాడు. వ్యక్తుల్లో నైతిక వికాసం జీవితాంతం జరుగుతుందని, ఆలోచన, వివేచన వంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు నైతిక వికాసంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని వివరించాడు.[1]
నైతికతకు ఆధారం
[మార్చు]నైతికత వయస్సుపైన ఆధారపడి ఉండదనీ, ఈ కింది మూడు అంశాలపై ఆధారపడి ఉంటుందనీ ప్రతిపాదించాడు.
1. సంజ్ఞానాత్మకత (జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం)
2. పరిసరాలు (సాంఘిక వికాసం)
3. అంతరాత్మ (ప్రాయిడ్ సిద్ధాంతం) [2]
స్థాయిలు, దశలు
[మార్చు]నైతిక వికాస సిద్ధాంతంలో మూడు స్థాయిలు, ఆరు దశలు (ప్రతి స్థాయిలో రెండు దశలు) ఉండేట్టు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.[3]
సిద్ధాంత ప్రతిపాదన
[మార్చు]1వ స్థాయి ( పూర్వ సంప్రదాయక స్థాయి)
[మార్చు]ఇది 4-10 ఏండ్ల వరకు ఉంటుంది. పిల్లలు మంచీ చెడు అనే అంశాలను వాటి పరిమాణం లేదా పర్యవసానాలకు అనుగుణంగా ఆలోచిస్తారు.
1వ దశ ( శిక్ష-విధేయత )
[మార్చు]ఈ దశలో శిశువు ఏదైతే తన అవసరం తీరుస్తుందో దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాడు. శిశువుకు ఇబ్బంది కలిగించేది తప్పుగాను, అవసరాలు తీర్చేది ఒప్పుగాను అనిపిస్తుంది.
2వ దశ ( సహజ సంతోష అనుకరణ, సాధనోపయోగ దశ)
[మార్చు]బహుమతులు పొందాలనే ఉద్దేశంతో ప్రవర్తిస్తాడు. సానుభూతి, దయ, జాలి కాకుండా స్వయం సంతృప్తి కోసం ప్రవర్తిస్తాడు. తనకు ఏదైతే మంచి చేస్తుందో అది ఒప్పు అని మిగిలిందంతా తప్పని భావిస్తాడు. ఉదాహరణకు అడగ్గానే ఐస్‌క్రీం కొనిపెట్టిన నాన్న మంచివాడని, అమ్మ మంచిది కాదని అనడం. చాక్లెట్ ఇస్తాను అనగానే హోంవర్క్ చేయడం
2వ స్థాయి (సంప్రదాయక స్థాయి)
[మార్చు]ఇది 11-13 ఏండ్ల వరకు ఉంటుంది. ఈ దశ పిల్లలు కౌమార దశలో ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది. మంచీ చెడును నిర్ణయిస్తుంది. సాంఘిక నియమాలకు కట్టుబడి ఉంటుంది.
3వ దశ ( మంచి బాలుడు, మంచి బాలిక భావన)
[మార్చు]మంచి సంబంధాలు ఉండే ప్రవర్తనను మంచి ప్రవర్తనగా భావిస్తారు. ఇతరులతో మంచి అమ్మాయి/అబ్మాయి అనిపించుకోవడం కోసం ప్రయత్నిస్తారు. మంచి ప్రవర్తన అంటే ఇతరులను సంతోష పెట్టేది, ఇతరులకు సహాయపడేది. ఉదాహరణకు ఉపాధ్యాయుని మెప్పు కోసం బుద్ధిగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవడం.
4వ దశ (అధికారం సాంఘిక క్రమ నిర్వహణ)
[మార్చు]ఈ దశలో పిల్లలు నిందలు తప్పించుకోడానికి సంఘం ఆమోదించే నియమాలను పాటిస్తారు. చట్టం, ధర్మం ప్రకారం నడుచుకుంటూ వాటిని గుడ్డిగా అంగీకరిస్తారు. ఉదాహరణకు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్ళడం అనేది బాధ్యతగా భావించటం.
3వ స్థాయి (ఉత్తర సాంప్రదాయ స్థాయి)
[మార్చు]ఈ స్థాయి 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉంటుంది. ఈ స్థాయిను స్వీయ అంగీకార సూత్రాల నైతికతగా పిలుస్తారు. ఇది నైతిక స్థాయిలో అత్యున్నత స్థాయి.
5వ దశ (ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, చట్టనీతి)
[మార్చు]ఈ దశలో పిల్లలు సమాజం, సంక్షేమం, మానవ హక్కులకు విలువనిచ్చి తదనుగుణంగా ప్రవర్తిస్తారు. సమాజ సంక్షేమం కోసం అవసరమైతే చట్టాన్ని సవరించాలని భావిస్తారు. ఈ దశలో సారళ్యత ఉంటుంది. ఉదాహరణకు రాజ్యాంగంలో సవరణలు చేయమని ఆశించటం, మానవ హక్కు లకు విలువనిచ్చి మెర్సికిల్లింగ్ అనే నిర్ణయాన్ని వ్యాధి గ్రస్తునికే వదిలి వేయటం.
6వ దశ (వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి)
[మార్చు]ఈ దశలో వ్యక్తి అంతరాత్మ, గౌరవం, న్యాయం, సమానత్వం అనే సార్వత్రిక సూత్రాలపై నిర్ణయాలు ఆధారపడతాయి. ఉదాహరణకు విశ్వ క్షేమం కోసం సమాజ సేవలో పాల్గొనటం, అవసరమైతే తన ఆస్తులను ఆపన్నులకు పంచటం.[4]
ముగింపు
[మార్చు]కోల్బర్గ్ చాలా మంది ప్రజలు 2వ స్థాయి లోని 4వ దశకు మాత్రమే చేరుకుంటారని భావిస్తాడు. 3వ స్థాయిలోని 6వ దశకు చేరుకున్న వ్యక్తి నైతిక సాధనలో అత్యున్నత స్థాయికి చేరుకోవడంగా భావిస్తాడు.
మూలాలు
[మార్చు]- ↑ బాల్యదశ వికాసం అభ్యసనం (D el ed). తెలుగు అకాడమీ.
- ↑ Levine, Charles; Kohlberg, Lawrence; Hewer, Alexandra (1985). "The Current Formulation of Kohlberg's Theory and a Response to Critics". Human Development. 28 (2): 94–100. doi:10.1159/000272945.
- ↑ "వికాసం , పెరుగుదల". ఈనాడు ప్రతిభ. Archived from the original on 2021-05-15. Retrieved 2021-05-15.
- ↑ "కొల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం". నమస్తే తెలంగాణ 2017,జూన్,29.