Jump to content

గంగారాం ఆర్య

వికీపీడియా నుండి

గంగారాం ఆర్య (Gangaram Arya) ఆర్యసమాజ సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. చివరి నిజాం పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ పై హత్యాప్రయత్నానికి ప్రసిద్ధుడయ్యాడు.

గంగారాం ఆర్య, మహబూబ్ నగర్ జిల్లా పాలుమాకులలో 1922లో ఒక సాధారణ నాయీబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మొదటి నుంచి ఇతనికి ఆర్యసమాజంతో అనుబంధం ఉంది. అక్కడే తెలుగు, హిందీ భాషలలో ప్రావీణ్యం సాధించాడు. హైదరాబాదులో హిందువులపై ముస్లింపాలకులు, ముస్లిం తొత్తులైన నాటి దొరలను,రజాకార్లు చేస్తున్న దుండగాలు, దుర్మాగాలు, అత్యాచారాలు చూసి చలించిపోయాడు.[1] నారాయణరావు పవార్, జగదీశ్ ఆర్య లతో కలిసి పోరాటం కొనసాగించారు. వీరు ముగ్గురు హైదరాబాదు స్వాతంత్ర్య పోరాట త్రిమూర్తులుగా కీర్తిగడించారు. పవార్, జగదీస్, గంగారాం ఆర్యా ముగ్గురు కలిసి నిజాం మీద బాంబులు విసరాలని పథకం రూపొందించారు. 1947 డిసెంబరు 4న సాయంత్రం కింగ్‌కోఠి ప్రాంతంలో ఆల్‌సెయింట్స్ స్కూలు మలుపులో కారులో ప్రయాణిస్తున్న నిజాంపై గంగారాం ఆర్యా బాంబు విసిరి చంపే ప్రయత్నం చేశాడు. బాంబు విసరడం సఫలమైనా గురి తప్పడంతో నిజాం ప్రాణాలు కోల్పోలేడు. గంగారాం ఆర్యకు పట్టుకొని రాజద్రోహం నేరం కింద అరెస్టు చేశారు. ఆ తర్వాత పోలీసు కస్టడీకి, తదుపరి జుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇతనికి యావజ్జీవ కారాగారశిక్ష విధించారు. ఆ తర్వాత పోలీసు చర్య జరగడంతో భారత ప్రభుత్వం నిజాం కాలంలో అరెస్టు అయి జైళ్ళలో ఉన్నవారందరినీ విడుదల చేసింది. 1949లో గంగారాం కూడా విడుదలైనాడు. జైలు నుంచి వచ్చిన పిదప ఘనంగా సత్కరించబడ్డాడు.

మూలాలు

[మార్చు]
  1. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, ప్రథమ ముద్రణ, 2006, పేజీ 243