Jump to content

గండి క్షేత్రం

వికీపీడియా నుండి
శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం
(గండి క్షేత్రం)
గండి క్షేత్రం వద్ద పాగాగ్ని నదీ తీరం
గండి క్షేత్రం వద్ద పాగాగ్ని నదీ తీరం
పేరు
ప్రధాన పేరు :శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:వైఎస్ఆర్ జిల్లా
ప్రదేశం:వేంపల్లె
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ఆంజనేయుడు

గండి క్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి-వేంపల్లె మార్గమధ్యంలో పాపఘ్ని నదీతీరాన వెలసింది. పాపఘ్నీ నది ఇక్కడ శేషాచలం కొండను చీలుస్తుంది. కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చింది. ఇది ప్రసిద్ధిచెందిన వీరాంజనేయ క్షేత్రం.

స్థలపురాణం

[మార్చు]

త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణుడు అపహరిస్తాడు. రామలక్ష్మణులు సీతాన్వేషణలో దండకారణ్యం నుండి గండిక్షేత్రం మీదుగా రావడం జరిగింది. అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండిక్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. అతడు రామలక్ష్మణులకు ఆహ్వానం పలికి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకొనగా, రావణవధ అనంతరం తిరుగు ప్రయాణంలో నీ కోరిక తీరుస్తానని వాగ్దానం చేసాడు.

రావణుని చంపి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నపుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు గండిలోని రెండుకొండలకు బంగారు తోరణం నిర్మించి శ్రీరామునికి స్వాగతం పలికాడు. శ్రీరాముడు ఆ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీరాముడు అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై సీతాన్వేషణం మొదలుగా రావణాసురునిపై తన విజయానికి మూలకారణమైన వీరాంజనేయుని తన బాణపు కొసతో కొండశిల మీద చిత్రించాడు. చిత్రం చివరిదశలో లక్ష్మణుడు వచ్చి కాలహరణం సంగతి గుర్తుచేయగా ఆ తొందరలో శ్రీరాముడు ఆంజనేయుని చిత్రం ఎడమచేతి చిటికెనవ్రేలు విడదీయకుండా వెళ్ళిపోయాడు. ఆచిత్రరూపమే శ్రీ వీరాంజనేయుని విగ్రహముగా విరాజిల్లుతున్నది. ఈ విధంగా గండి క్షేత్రం ఏర్పడింది.

చరిత్ర

[మార్చు]

త్రేతాయుగం అనంతరం వసంతాచార్యులనే భక్తుడు చిన్నగుడి నిర్మించి ఆ రేఖాచిత్రానికి పూజలు చేయడం ప్రారంభించాడు. తర్వాత మరికొంతకాలానికి వ్యాసరాయలనే శిల్పాచార్యుడు ఆ రేఖాచిత్రమును విగ్రహముగా మార్చాలని ఉలితో చెక్కుతుండగా వీరాంజనేయస్వామివారి ఎడామచేతి చిటికెనవ్రేలు విడదీసే సందర్భంలో రక్తం ధారలుగా స్రవించిందట. అంతట ఆ శిల్పాచార్యుడు అది గమనించి తన ప్రయత్నమును విరమించి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది.

బంగారు తోరణం

[మార్చు]

థామస్ మన్రో దత్తమండలాలకు కలెక్టర్ గా ఉండేవాడు. ఆయన గండి క్షేత్రం దర్శించినప్పుడు ఆయనకు బంగారు తోరణం కనిపించింది.[1] మహాపురుషులకే ఇలా బంగారు తోరణం కనిపిస్తుంది. బంగారు తోరణం చూసిన వారు ఆరు నెలల్లో మరణిస్తారు. మన్రో మరణం ఆ తర్వాత అరు నెలల్లోపే జరిగింది. నమ్మశక్యం గాని ఈ విషయం వైఎస్ఆర్ జిల్లా గెజెటీర్ లో ఉంది.

తి.తి.దే. యాజమాన్యం

[మార్చు]

2007 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు గండిక్షేత్రాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు.[2] వీరాంజనేయ స్వామివారి ఆలయానికి ప్రహారీ నిర్మించి, ఉత్తరంవైపు గాలిగోపురం, కల్యాణ మండపం, అన్నదాన సత్రం మొదలైన భవనాలు నిర్మించారు.


ఉత్సవాలు

[మార్చు]
  • శ్రావణ మాసోత్సవాలు
  • అన్నదాన కార్యక్రమం

ఇతర విశేషాలు

[మార్చు]
  • ఇక్కడ ఇంకా పావురాల గుట్ట, నామాల గుండు, ఈశ్వరాలయం, భూమానందాశ్రమం చూడదగ్గవి. భూమానందాశ్రమం ఆధ్యాత్మిక చింతనా కేంద్రం. ఈ ఆశ్రమాన్ని కీ.శే. రామకృష్ణానందుల వారు స్థాపించారు.
  • గండి క్షేత్రాన్ని భక్తులు సంవత్సరం పొడవునా దర్శిస్తూ ఉంటారు. శ్రావణ శనివారాల్లో విశేష సంఖ్యలో యాత్రీకులు, భక్తులు గండి వీరాంజనేయ క్షేత్రానికి వస్తూ ఉంటారు.
  • గండి క్షేత్రంలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ఉన్నది.
  • ఇక్కడ శనీశ్వర అలయము ఉంది. నది అవతలి భాగాన శివాలయo కూడా ఉంది.

మూలాలు, వనరులు

[మార్చు]
  1. జనమంచి, శేషాద్రిశర్మ (1927). కడప మండల చరిత్రము (PDF). మద్రాసు. p. 64. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2016. Retrieved 2 July 2018.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  2. గండి క్షేత్రము, వి. శ్రీరామ రెడ్డి, సప్తగిరి మాసపత్రిక, మార్చి 2015, పేజీలు: 40-2.
  • వైఎస్ఆర్ జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి, విద్వాన్ కట్టా నరసింహులు