Jump to content

గడియారం వేంకట శేషశాస్త్రి

వికీపీడియా నుండి
(గడియారం వెంకటశేష శాస్త్రి నుండి దారిమార్పు చెందింది)
గడియారం వేంకట శేషశాస్త్రి
ధర్మపత్ని వెంకట సుబ్బమ్మతో వేంకట శేషశాస్త్రి
జననంగడియారం వేంకట శేషశాస్త్రి
1894 ఏప్రిల్ 7
నెమళ్లదిన్నె, పెద్దముడియం మండలం
మరణం1980
ప్రసిద్ధిరచయిత, అనువాదకులు
ఎత్తు15inch
బరువు2.256
భార్య / భర్తవెంకటసుబ్బమ్మ
పిల్లలురామశేషయ్య, వెంకటసుబ్రమణ్య
తండ్రిరామయ్య
తల్లినరసమాంబ

పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం'. భరతమాత పరాయి పాలనలో కళావిహీనమైన తరుణంలో అరుణోదయంగా వెల్లివిరిసింది కావ్యమది. మాతృభాష విముక్తికి మార్గదర్శిగా పంచకావ్యాల సరసన 1943లో 8 ఆశ్వాసముల ప్రబంధంగా శివభారతం వెలుగొందింది. ఈ అద్భుత కావ్య సృష్టికర్త గడియారం వేంకట శేషశాస్త్రి.ఆధునికాంధ్ర కవుల్లో ప్రముఖులు, శతావధాని గడియారం వేంకటశేషశాస్త్రి. ఇతను దుర్భాక శతావధానితో కలిసి కొన్నికావ్వనాటకాలు రాశాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు 1894 ఏప్రిల్ 7న జన్మించాడు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరు చేరుకుని స్థిరపడ్డాడు. గడియారం వేంకట శేషశాస్త్రి ధర్మపత్రి వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య ఇతని పుత్రులు. 1932లో అనిబిసెంట్‌ మున్సిపల్‌ పురపాలిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. బ్రహ్మానందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించాడు. గడియారం వేంకట శేషశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. రూపావతారం శేషశాస్త్రి వద్ద తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, వాసుదేవావధాని వద్ద యజుర్వేదం, ఉపనిషత్తులు, దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరాడు. గోవర్ధన సప్తశతి, ఉత్తర రామాయణ గ్రంథాలు, సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించాడు. పుష్పబాణ విలాసం, వస్తుజంత్రి, మల్లికామారుతం, శ్రీనాథ కవితాసామ్రాజ్యం, రఘునాధీయం, వాల్మీకి హృదయావిష్కరణ వంటి గ్రంథాలను రచించాడు. నన్నయ్య భారతం, పోతన భాగవతం లాగా గడియారం వేంకటశేష శాస్త్రికి చిర కీర్తిని తెచ్చిన పెట్టిన గ్రంథం శివభారతం.

సత్కారాలు

[మార్చు]
  • ప్రొద్దుటూరు రాయల సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో ఎన్నో సాహిత్య ప్రసంగాలు చేసాడు. గోదావరి తీరంలోని రాజమహేంద్రవరంలో శ్రీపాద తల్లావర్ఘుల వారిఎదుట గజారోహణ సత్కారం అందుకున్నాడు.
  • 1945లో అనంతపురంలోని హిందూపురం లలిత కళాపరిషత్తు సభ్యులు స్వర్ణ గండపెండేరం, సువర్ణ కంకణ బహుకరించారు.
  • 1948లో మద్రాసు ప్రభుత్వం దశాబ్ద కాలపు ఉత్తమ సాహితీ గ్రంథంగా శివభారతాన్ని గౌరవించి ప్రథమ బహుమతితో సత్కరించారు.
  • 1967లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డు అందజేసింది.
  • 1968లో ప్రొద్దుటూరులో కనకాభిషేకం,
  • 1974లో మరాఠా మందిర్‌ వారు శివాజి త్రిశత జయంతి ఉత్సవాల్లో భాగంగా బంగారు పతకాన్ని బహుకరించారు.
  • 1976లో వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను అందించారు.
  • 1959 నుంచి 1968 వరకు శాసనమండలి సభ్యునిగానూ, 1969 నుంచి 1973 వరకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు

బిరుదులు

[మార్చు]
  • కవితావతంస
  • కవిసింహ
  • అవధానపంచానన

మూలాలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]