గాదిలింగన్న గౌడ్
యెమ్మిగనూరు గాదిలింగన్న గౌడ్ (అక్టోబర్ 1, 1908[1] - ఏప్రిల్ 18, 1974[2]) కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఈయన నాలుగవ లోక్‌సభలో (1967–71) [3] సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నియోకవర్గం నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]గాదిలింగన్న గౌడ్ 1909లో కర్నూలు జిల్లాలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు.[4] ఈయన తండ్రి గౌడప్ప గౌడ్. గాదిలింగన్న గౌడుకు 17 ఏళ్ల వయసులో 1925, డిసెంబరు 25న బసమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
రాజకీయ జీవితం
[మార్చు]గౌడ్ 1926లో 17 ఏళ్ల వయసులో గుడికల్ యూనియన్ బోర్డు అధ్యక్షునిగా (సర్పంచి) ఎన్నికై, ఆ పదవిలో 1953దాకా కొనసాగాడు. మూడు దశాబ్దాల పాటు స్వగ్రామంలో సర్పంచిగా కొనసాగిన గాదిలింగన్న గౌడ్, 1946 నుండి 1950 వరకు మద్రాసు ప్రావిన్స్ పంచాయితీల సంఘానికి సహ కార్యదర్శిగా పనిచేశాడు. 1947 నుంచి 1950 వరకు బళ్ళారి జిల్లా ఎడ్యుకేషనల్ కౌన్సిలుకు ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. అవే కాక ఆదోని తాలూకా బోర్డు సభ్యుడిగా, ఆదోని సహకార సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు.
1951లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికలలో ప్రజా సోషలిష్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి ఉమ్మటి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ, పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్న హాలహర్వి సీతారామరెడ్డి చేతిలో 13,013 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5] కానీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కరపత్రాలు పంచారని కేసువేయగా, న్యాయస్థానం హాలహర్వి సీతారామరెడ్డి ఎన్నికను రద్దుచేసి, ఆయన స్థానంలో గాదిలింగన్న గౌడ్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనట్టు ప్రకటించింది.[6] ఈ విధంగా గాదిలింగన్న గౌడ్ కర్నూలు నియోజకవర్గం నుండి తొలి ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టాడు. ఆ తరువాత గౌడ్ అనేక ప్రజాసేవ పదవుల్లో కొనసాగాడు.
రాజగోపాలాచారి ప్రారంభించిన స్వతంత్ర పార్టీలో చేరి, 1966 నుండి 1968 వరకు స్వతంత్ర పార్టీ సహ కార్యదర్శిగా పనిచేశాడు. 1967 లోక్‌సభ ఎన్నికలలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రేసు పార్టీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్యను 10,783 ఓట్ల తేడాతో ఓడించి నాలుగవ లోక్‌సభ సభ్యుడయ్యాడు. 1971 ఎన్నికలలో తిరిగి అదే నియోజకవర్గం పోటీ చేసినా, కాంగ్రేసు అభ్యర్థి కె.కోదండరామిరెడ్డి చేతిలో ఓడిపోయాడు.
గాదిలింగన్న గౌడ్, ఏప్రిల్ 18, 1974 న 66 సంవత్సరాల వయసులో యెమ్మిగనూరులోని స్వగృహం దేవీ నివాస్లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-06-30. Retrieved 2014-12-20.
- ↑ India. Parliament. Lok Sabha (2003). Indian Parliamentary Companion: Who's who of Members of Lok Sabha. Lok Sabha Secretariat.
- ↑ "4th Lok Sabha Members". Archived from the original on 2012-02-12. Retrieved 2013-06-26.
- ↑ "Page 12, Kurnool(Andhra Pradesh) Parliamentary Constituency - Y. Gadilinganna Goud was only 17 yrs old in 1926 when he won as President of Gudikal Union Board". Archived from the original on 2012-11-03. Retrieved 2013-06-26.
- ↑ STATISTICAL REPORTS OF LOK SABHA ELECTIONS - 1951 p.
- ↑ Aiyar, A. N. (1953). Election Law Reports Volume VI (PDF). Delhi: Election Commission of India. p. 44. Retrieved 21 December 2014.