గరికిపర్తి కోటయ్య దేవర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గరికిపర్తి కోటయ్య దేవర 19-20వ శతాబ్దాలకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు. వేలాది మంది శిష్యులను సంగీతజ్ఞులుగా తయారు చేశాడు. సంగీతం కోటయ్యదేవర, జంగం కోటయ్యదేవర అని కూడా ఇతడిని పిలిచే వారు.

బాల్యం[మార్చు]

ఇతడు వీరశైవ జంగమ కులంలో 1864వ సంవత్సరంలో లక్ష్మయ్య, బసవమ్మ దంపతులకు బందరులోని ఇంగ్లీషు పాలెంలో జన్మించాడు[1]. ఇతని తండ్రి ఫిడేలు బాగా వాయించేవాడు. ఇతడు తన తండ్రి వద్ద నుండి చిన్నవయసు నుండే సంగీతం నేర్చుకున్నాడు. ఇతడు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బందరుకు ఉప్పెన వచ్చిన కారణంగా కరువు ఏర్పడి జరుగుబాటు కాకపోవడంతో ఇతని తండ్రి మకాంను బందరు నుండి హైదరాబాదుకు మార్చాడు. హైదరాబాద్ నవాబు గారి వద్ద దివానుగా పనిచేస్తున్న సాలార్ జంగ్ కోటయ్య దేవర వాయులీనవాద్యాన్ని స్వయంగా విని ముగ్ధుడై అతడిని తల్లిదండ్రుల అనుమతితో చేరదీసుకుని విద్య చెప్పించాడు.

సంగీత ప్రస్థానం[మార్చు]

పది సంవత్సరాలు సాలార్ జంగ్ ఇతడికి విద్య చెప్పించాడు. ఆ తర్వాత ఇతడు నైజాం ఆస్థాన సంగీత విద్యాంసులలో ఒకడిగా నియమించబడి 20 సంవత్సరాలు కొనసాగాడు. ఇతడ్ కర్ణాటక సంగీత సంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రాచ్య పాశ్చాత్య సంగీత మాధుర్యాన్ని కూడా నేర్చుకున్నాడు. అంతటితో సంతృప్తి పడక సంగీత విద్వాంసుల వద్దకు తీర్థయాత్రలకు సేవించినట్టుగా దక్షిణ దేశ ప్రయాణం చేశాడు. 1894లో తంజావూరు వెళ్లి పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, తోడి సుందరరావు, తిరక్కూడి కావల్ కృష్ణ అయ్యర్ మొదలైన పండితుల సరసన కూర్చుని వారి చేత శభాష్ అనిపించుకున్నాడు. మద్రాసు, తంజావూరు ప్రాంతాలలో అనేక కచేరీలను చేసి పలు సన్మాన సత్కారాలను పొందాడు. 1896లో బందరులో 300 మంది విద్యార్థులతో ఒక సంగీత పాఠశాలను ప్రారంభించాడు. ఈ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికీ ఉచితంగా సంగీత విద్య చెప్పడమే కాక పాటకచ్చేరిల మీద వచ్చిన డబ్బుతో విద్యార్థులకు భోజన, నివాస సౌకర్యాలను ఉచితంగా కల్పించాడు. వల్లూరు, చల్లపల్లి సంస్థానాలు ఇతడికి ఆర్థికంగా సహకరించాయి. ఇతడు సురభి నాటక కంపెనీలు రామయ్య కంపెనీ, వెంకోజీరావు కంపెనీ, కృష్ణయ్య కంపెనీ మూడు కంపెనీల వారికి సంగీతశిక్షణ ఇచ్చి సురభి నాటకాలలో సంగీతానికి ప్రాధాన్యత కలగడానికి దోహదం చేశాడు. నాదస్వరంలో అనేక బాణీలను సృష్టించి నాదస్వర విద్వాంసులకు ఉపాధి కల్పించాడు.

బందరుకు రైలుమార్గం[మార్చు]

1903లో కె.డి.యాంషైర్ గవర్నర్ ఒకసారి బందరు వచ్చినప్పుడు ఇతడి పాటకచ్చేరీ ఏర్పరచారు. ఇతడు స్వయంగా ఇంగ్లీషు ట్యూనులో ఒక పాట కట్టి వినిపించాడు. బందరు నుండి బెజవాడకు వెళ్ళాలంటే కాలినడకనో, పడవలమీదనో భయాందోళనలతో ప్రయాణం చేయవలసి వస్తుంది. బందరు నుండి బెజవాడకు రైలు మార్గాన్ని నిర్మించమని తన పాటతో గవర్నరును కోరాడు. గవర్నరు ఆ పాటను విని ఎంతో ఆనందించి విజయవాడ నుండి మచిలీపట్నానికి రైలు మార్గం నిర్మాణం జరిగేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చాడు. 1907లో విజయవాడ నుండి మచిలీపట్నానికి రైలు మార్గం నిర్మాణం పూర్తి అయింది. ఈ రైలు మార్గం ఏర్పడటానికి కోటయ్య దేవర కారణభూతుడు.

బిరుదులు, సన్మానాలు[మార్చు]

ఇతనికి ఆంధ్రగాయక పితామహుడు, గాంధర్వ కళాతపస్వి అనే బిరుదులు లభించాయి.

కుటుంబం[మార్చు]

ఇతనికి పాపయ్య నాగం దేవర, సుబ్రహ్మణ్యం దేవర, చంద్రమౌళి దేవర, రాజమౌళి దేవర అనే నలుగురు కుమారులు కలిగారు. పాపయ్య నాగం దేవర ఫ్లూట్ వాయిద్యంలోను, సుబ్రహ్మణ్యం దేవర వయోలిన్ వాయిద్యంలోను ప్రతిభావంతులైనారు. హార్మోనియం, తబలా, ఫ్లూట్, ఫిడేల్, ఆర్గన్, పియానోలు తయారు చేయడంలో చంద్రమౌళి దేవర, రాజమౌళి దేవరలు సిద్ధహస్తులైనారు.

మరణం[మార్చు]

ఇతడు 1924, డిసెంబరు 24వ తేదీన మరణించాడు. ఇతడు మరణించే నాటికి ఆరు వందల మంది శిష్యులు అతని చెంతనే ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. విడియాల, చంద్రశేఖరరావు (1 October 1971). "గాంధర్వ కళా తపస్వి గరికిపర్తి కోటయ్య దేవర". నాట్యకళ: 42–45. Retrieved 6 January 2018.[permanent dead link]