గుయెర్నికా (చిత్రం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుయెర్నికా అన్నది సుప్రసిద్ధ చిత్రకారుడు పాబ్లో పికాసో జూన్ 1937లో పూర్తి చేసిన మ్యూరల్-సైజు తైలవర్ణ చిత్రం.[1] బూడిద రంగు, నలుపు, తెలుపుల్లో చిత్రీకరించిన ఈ తైలచిత్రం పలువురు కళా విమర్శకుల నుంచి చరిత్రలోకెల్లా అత్యంత ప్రభావశీలమైన యుద్ధ వ్యతిరేక కళాఖండంగా పేరొందింది.[2] 3.49 మీటర్లు (11 అడుగుల 5 అంగుళలు) పొడవు, 7.76 మీటర్ల (25 అడుగుల 6 అంగుళాలు) వెడల్పుతో, విస్తారమైన పరిమాణంలోని ఈ మ్యూరల్ చిత్రం హింస, గందరగోళాల్లో ప్రజల బాధలను ప్రతిబింబిస్తుంది. చెల్లాచెదురైన గుర్రం, ఎద్దు, మంటలు ఈ చిత్రం కూర్పులో ప్రముఖంగా కనిపిస్తాయి.

ఈ చిత్రాన్ని ఉత్తర స్పెయిన్ లోని బాస్క్యూ ప్రాంతపు పల్లెటూరు అయిన గుయెర్నికాపై స్పానిష్ జాతీయవాదుల కోరికపై నాజీ జర్మనీ, ఫాసిస్టు ఇటలీ యుద్ధ విమానాలు జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా సృజించారు. పూర్తయ్యాకా గుయెర్నికాను 1937లో ప్యారిస్ లో జరిగిన అంతర్జాతీయ ఫెయిర్ లో స్పానిష్ ప్రదర్శనలో ప్రదర్శించారు, ఆపైన ప్రపంచంలోని అనేక ఇతర వేదికలపైనా ప్రదర్శించడం ప్రారంభించారు. గుయెర్నికా చిత్రపు టూరింగ్ ప్రదర్శన స్పెయిన్ యుద్ధ ఉపశమన చర్యలకు నిధులు సేకరించేందుకు ఉపయోగించారు.[3] ఈ పెయింటింగ్ ప్రపంచ ప్రసిద్ధి చెంది, విస్తృతంగా ప్రశంసలు పొందింది, ఆ పరిణామం స్పానిష్ అంతర్యుద్ధం ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకు ఉపకరించింది.

మూలాలు[మార్చు]

  1. Richardson (2016)
  2. "Pablo Picasso". Biography.com. మూలం నుండి 2016-10-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-10-12.
  3. Cohen (2003).