గ్రేస్ ఓ'మాలీ
గ్రైన్నే ఓ'మాలీ ; (సుమారు సా.శ. 1530 – 1603), ఐర్లాండ్‌కు పశ్చిమాన ఉన్న ఓ'మాలీ తెగకు నాయకురాలు. గ్రేస్ ఓ'మాలీ అని కూడా ఈమెను పిలుస్తారు. ఈమె ఇయోఘన్ దుబ్దారా ఓ'మాలీ కుమార్తె. చిన్నవయసు నుంచే ఆమె సాహస కార్యాల పాట్ల ఆసక్తి చూపించేది. బాల్యంలో తన తండ్రి వ్యాపారం కోసం నౌకల్లో స్పెయిన్ వెళ్తూంటే తానూ వస్తానని పట్టుబట్టింది. నౌకపైన ఆమె పొడుగు జుట్టు వల్ల ఇబ్బందులు ఎదురవ్వవచ్చని సర్దిచెప్పడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తే తన పొడుగాటి జుట్టును కత్తిరించేసుకుంది. ఐరిష్ జానపద కథలలో ఆమెను సాధారణంగా గ్రైన్నే మ్హాల్ అని ప్రస్తావిస్తారు. ఆ పదానికి జుట్టులేనిదని అర్థం. ఈ సంఘటన వల్లనే ఆమెకు ఆ పేరు వచ్చింది.[1]
తండ్రి మరణం తర్వాత, తన సోదరుడు ఉన్నా అతన్ని కాదని తండ్రికి ఉన్న రాజ్యాధికారాన్ని, నాయకత్వాన్ని తానే చేపట్టింది.[2] ఓ ఫ్లైత్‌బ్‌హార్టైగ్ తెగ నాయకుడి కుమారుడైన డోనాల్ అన్ చోగైధ్‌ని పెళ్ళిచేసుకోవడం ఆమెకు మరింత సంపదను, ప్రాముఖ్యతని సంపాదించి పెట్టింది. దానివల్ల 1000 పశువులు, గుర్రాలు ఆమె మందలో పెరిగాయి. మొదటి భర్త 1565లో మరణించడంతో మరొక ఐరిష్ ప్రభువంశీకుడైన రిచర్డ్‌ని పెళ్ళిచేసుకుని మరింతగా రాజకీయ సంబంధాలను బలపరుచుకుంది.
తన జీవిత పర్యంతం బలమైన నాయకురాలిగా, పోరాట యోధురాలిగా పేరొందే పనులు చేసింది. ఇంగ్లిష్ వారు ఐరిష్ భూభాగాల్లోకి చొచ్చుకురావడాన్ని అడ్డుకునేందుకు సముద్రపు దొంగతనాలు, పోరాటాలు చేసింది. క్రమేపీ ఐర్లాండులో ఇంగ్లిష్ ప్రభావం బలపడుతూ వచ్చింది. 1593లో ఆమె ఇద్దరు కుమారులనూ, సవతి సోదరుడినీ కనాక్ట్‌ని పరిపాలిస్తున్న ఇంగ్లిష్ గవర్నర్ సర్ రిచర్డ్ బింగ్‌హామ్ బందీలుగా పట్టుకున్నాడు. ఓ'మాలీ ఇంగ్లండుకు వెళ్ళి వాళ్ళ విడుదల కోసం విజ్ఞాపన చేసుకుంది. లాంఛనప్రాయంగా తన ఈ అభ్యర్థనను గ్రీన్‌విచ్ ప్యాలెస్‌లో రాణి ఎలిజబెత్ Iకి సమర్పించింది.[3] మొదట ఎలిజబెత్ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోయినా పట్టుబట్టి తన కుటుంబసభ్యుల విడుదల, తమ భూములకు రక్షణ వంటి రాయితీలను సంపాదించింది.
తర్వాతి సంవత్సరాల్లో ఓ'మాలీ పరిపాలనకు సర్ రిచర్డ్ బింగ్‌హామ్ నుంచి సవాళ్ళు ఎదురయ్యాయి. బింగ్‌హామ్ ఎలాగైనా ఓ'మాలీ అధికారాన్ని అణచివేయాలని నిశ్చయించుకుని పోరాడాడు. స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవడానికి ఆమె పోరాటంతోనూ, రాజనీతితోనూ ప్రయత్నాలు చేసినా చివరకు సాధ్యం కాలేదు. ఐర్లాండ్‌లోని మున్‌స్టర్ ప్రాంతానికి పారిపోయి తన భూములు లాక్కున్నందుకు బ్రిటిష్ రాణిని భరణం ఇప్పించమని కోరి సాధించింది. ఐర్లాండు ప్రభువర్గీయులు తిరుగుబాటు చేసిన తొమ్మిదేళ్ళ యుద్ధ కాలంలో తన కుమారిడిని విడిపించుకుని ఎలిజబెత్ Iకు అనుకూలంగా స్వంత రక్తసంబంధీకులపైనే పోరాడేలా ప్రోత్సహించింది. తద్వారా తాము కోల్పోయిన రాజ్యాధికారం చేజిక్కించుకునే అవకాశం ఉందేమోనని ప్రయత్నించింది.
రాక్‌ఫ్లీట్ కోటలో, ఎలిజబెత్ మరణించిన ఏడాదే (1603), మరణించివుండవచ్చని అంచనా. కానీ, ఆమె మరణించిన సంవత్సరం, ప్రదేశాలపై చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. ఓ'మాలే జీవితం చాలామంది సంగీతకారులకు, నవలాకారులకు, నాటకకర్తలకు ప్రేరణగా నిలిచింది. ఇంగ్లండ్ ఆధిపత్యంపై ఐరిష్ ప్రతిఘటన చేసిన వ్యక్తిగా, సాహసోపేతమైన కార్యకలాపాలు సాగించిన మహిళగా ఆమెను పలు రచనలు, నాటకాలు, సినిమాల్లో చిత్రీకరించారు. ఐర్లాండ్ జాతికే సాకార రూపంగా ఆమెను కళాకారులు చిత్రీకరించారు.
ఓ'మాలీ గురించి ఐరిష్ చరిత్రను నమోదుచేసిన సాలీనా దస్తావేజుల్లో ప్రస్తావన లేదు, కాబట్టి ఆమె జీవితానికి సంబంధించిన లిఖిత ఆధారాలు ఎక్కువగా ఆంగ్ల మూలాల నుండి వచ్చాయి. ముఖ్యంగా మొదటి ఎలిజబెత్ ఆమెకు పంపిన పద్దెనిమిది "ఆర్టికల్స్ ఆఫ్ ఇంటరాగేటరీ" అన్న ప్రశ్నల్లో ఓ'మాలీ ప్రస్తావనలు ఉన్నాయి.[4] ఇంగ్లీషు అధికారిక పత్రాల్లోనూ, ఆ కోవకు చెందిన ఇతర పత్రాల్లోనూ కూడా ఈమె ప్రస్తావన లభిస్తోంది.[5]
పదహారవ శతాబ్దపు ఐరిష్ చరిత్రలో ఆమె ప్రసిద్ధి చెందిన చారిత్రక వ్యక్తి. ఆంగ్ల పత్రాల్లో ఆమె పేరు గ్రైన్ ఓ'మాలీ, గ్రేనీ ఓ'మాలీ, గ్రానీ నీ మాలీ, గ్రానీ ఓ'మాలీ, గ్రేన్ నై మేయ్ల్, గ్రేన్ నే మేల్, గ్రేనీ ఓ'మాలీ, గ్రానీ ఓ'తో సహా వివిధ పద్ధతుల్లో సమకాలీన ఆంగ్ల పత్రాలు ఆమె పేరు రాశాయి. మెయిల్లీ, [6] అరుదుగా గ్రేస్ ఓ'మాలీ అన్న పేరుతో ప్రస్తావనలు లభిస్తాయి. [7] పాపులర్ కల్చర్‌లో, ఆమెను తరచుగా "సముద్రపు దొంగల రాణి" అని పిలుస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ Chambers 2003, p. 57
- ↑ O'Connell
- ↑ Grace O'Malley: the biography of Ireland's Pirate Queen (40th anniversary ed.), 2018
- ↑ See the supplement to Chambers, 2003.
- ↑ Lambeth Palace Library, ms. no 601, p. 10, cited in Chambers 2003, p. 85
- ↑ Chambers 2003
- ↑ There is only one instance recorded in Chambers in Chapter Nine End of an Era where she is referred to in a dispatch as Grace O'Malley