చీరమీను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Gracile lizardfish
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
S. gracilis
Binomial name
Saurida gracilis
(Quoy & Gaimard, 1824)

చీరమీను గోదావరీ ప్రాంతాల్లో దొరికే ఒక రకమైన చేప. ఇది శీతాకాలం ప్రారంభంలోనే దొరుకుతుంది.[1][2] ఈ చేప ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సమృద్ధిగా ఉన్న లిజర్డ్‌ఫిష్ జాతికి చెందినది.

దొరికే సమయం[మార్చు]

గోదావరిజిల్లాల వాసులు ఎంతో ఇష్టంగా తినే చీరమీను శీతాకాలం ప్రారంభంలోనే దొరుకుతుంది. ఎక్కువగా దసరా నుంచి దీపావళి- మహా అయితే నాగులచవితి వరకూ మాత్రమే లభ్యమవుతుంది. మొత్తమ్మీద ఇది బాగా దొరికేది ఏడాదికి ఇరవై రోజులు మాత్రమే.చల్లగా వీచే తూర్పుగాలులకు చీరమీను నీటి అడుగుభాగం నుంచి ఉపరితలం మీదకు చేరుకుంటుంది. గుంపులుగుంపులుగా వస్తోన్న వాటికోసం మత్స్యకారులు కాపు కాస్తుంటారు. వేళ్లసందుల్లోనుంచీ వలల్లోనుంచీ కూడా జారిపోయేంత చిన్నగా ఉండటంవల్లే వీటిని చీరలతో పట్టుకుంటారు. అందుకే ఈ చేపకి చీరమీను అని పేరు.[3]

శాస్త్రీయంగా సారిడా గ్రాసిలిస్‌, టంబిల్‌, ఆండోస్క్వామిస్‌ జాతులకు చెందిన పిల్ల చేపల్నే చీరమీనుగా పిలుస్తారు గోదావరీవాసులు. సముద్రనీరూ గోదావరీ జలాలూ కలిసే బురదనీటి మడుగుల్లో- అంటే మడ అడవులు ఎక్కువగా పెరిగే ఆ నీళ్లలో ఆక్సిజన్‌ సమృద్ధిగా ఉండటంతో ఆ జాతులకు చెందిన చేపలు అక్కడికి వచ్చి గుడ్లు పెడతాయి.[4] సముద్రంమీద తూర్పుగాలులు వీచగానే ఆ బురదనీటిలోని గుడ్లన్నీ పిల్లలుగా మారి ఒక్కసారిగా గోదావరీ జలాల్లోకి ఈదుకొస్తాయి. వాటి రాకను గమనించిన పక్షులు వాటిని తినేందుకు ఆ నీళ్లపైన ఎగురుతుంటాయి. అది చూసి మత్స్యకారులు ‘చీరమీను వస్తుందొహో’ అనుకుంటూ వాటిని పట్టుకునేందుకు చీరలు తీసుకుని పడవల్లో బయలుదేరతారు. యానాంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం, కోటిపల్లి, ఐ పోలవరం, కాట్రేనికోన ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా దొరుకుతుంది.[1]

ధర[మార్చు]

అత్యంత అరుదుగా మాత్రమే దొరికే ఈ చేపను చెట్లకు బలం అన్న భావనతో గతంలో కోనసీమవాసులు కొబ్బరితోటలకు ఎరువుగానూ వేసేవారు. ఇటీవల దీన్ని వైజాగ్‌, హైదరాబాద్‌... వంటి నగరాలకూ ఎగుమతి చేస్తున్నారు. యానాం నుంచయితే ఫ్రాన్స్‌ దేశానికీ ఈ చేపపిల్లలు ఎగుమతి అవుతుంటాయి. దాంతో ధర అధికం. అంగుళం పొడవు కూడా లేని ఈ చిట్టి చేపల్ని అక్కడ తవ్వ, సేరు, కుంచం, బిందెలతో కొలిచి అమ్ముతారు. ప్రస్తుతం సేరు 700- 1500 రూపాయల వరకూ పలుకుతుంది. బిందె ధర 12 వేల రూపాయల పైనే.[3]

వంటకాలు[మార్చు]

చీరమీనుని ఎక్కువగా మసాలా పెట్టి వండుతారు. ఇంకా చీరమీనుని మినప్పిండిలో కలిపి చీరమీను గారెల్నీ, చింతచిగురు-చీరమీను, చీరమీను-మామిడికాయ, చీరమీను-గోంగూర... ఇలా కలగలుపు రుచుల్లో కూడా వండి వడ్డించేస్తుంటారు గోదావరీ తీరవాసులు.కోనసీమ వాసులు చీరమీను కాలంలో ఇంటికి వచ్చే బంధుమిత్రులకు డబ్బాల్లో పెట్టి అందిస్తారు.గోదావరీ పరీవాహక ప్రాంతంలో మాత్రమే దొరికే చీరమీనును పక్క జిల్లాలవాళ్లూకూడా వచ్చి కొనుక్కుని వెళుతుంటారు.

చీరమీను మసాలా కూర[మార్చు]

కావలసినవి[మార్చు]

చీరమీను: తవ్వ(సుమారు అరకిలో), నూనె: 3 టేబుల్‌స్పూన్లు, కారం: 2 టీస్పూన్లు, పసుపు: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా

పొడి మసాలాకోసం: దాల్చినచెక్క: 3 అంగుళాలముక్క, జీలకర్ర: టీస్పూను, లవంగాలు: మూడు, దనియాలు: 2 టీస్పూన్లు, గసగసాలు: 2 టీస్పూన్లు, యాలకులు: ఒకటి

తడిమసాలాకోసం: ఉల్లిపాయలు: మూడు(పెద్దవి), పచ్చికొబ్బరితురుము: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: నాలుగు, వెల్లుల్లిరెబ్బలు: పది, అల్లంతురుము: టేబుల్‌స్పూను

తయారు చేసే విధానం[మార్చు]

ముందుగా చీరమీనులో ఉప్పు వేసి ఐదారుసార్లు బాగా కడగాలి.

  • బాణలిలో పొడిమసాలాకోసం తీసుకున్నవన్నీ వేసి సిమ్‌లో వేయించి తీసి చల్లారాక మిక్సీలో వేయాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిరెబ్బలు, పచ్చిమిర్చి, అల్లం, పచ్చికొబ్బరితురుము అన్నీ వేసి మెత్తగా రుబ్బాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి రుబ్బాలి. ఈ మసాలా ముద్దని ఓ గిన్నెలో వేసి ఉప్పు, కారం, పసుపు, వేసి బాగా కలపాలి. తరవాత పక్కన ఉంచిన చీరమీను వేసి ఎక్కడా విరగకుండా జాగ్రత్తగా కలపాలి. మొత్తం కలిశాక ఆ మసాలా చేపలకు పట్టేవరకూ సుమారు పావుగంటసేపు పక్కన ఉంచాలి.
  • ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాగాక, మసాలాముద్ద పట్టించిన చేపల్ని వేసి సిమ్‌లో ఉడికించాలి. ఈ కూర వండేటప్పుడు ఎక్కడా గరిటె పెట్టకుండా బాణలి కదుపుతూ సుమారు అరగంటసేపు నూనె బయటకు వచ్చేవరకూ ఉడికించి దించితే రుచికరమైన చీరమీను మసాలా కూర సిద్ఢం..

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "చీరమీను.. తింటే స్వర్గమేను..!". Archived from the original on 2016-10-16. Retrieved 2016-10-16.
  2. telugu chepalu[permanent dead link]
  3. 3.0 3.1 "'Cheerameenu' sells like hot cake". B. V. S. BHASKAR. The Hindu. 22 June 2013. Retrieved 15 October 2016.
  4. "TASTE OF YANAM Cheeramenu". Archived from the original on 2016-11-05. Retrieved 2016-10-16.

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చీరమీను&oldid=3783667" నుండి వెలికితీశారు