చీరాల బాలకృష్ణమూర్తి
చీరాల బాలకృష్ణమూర్తి రంగస్థల నటుడు.
విశేషాలు
[మార్చు]ఇతని రంగస్థల జీవితం 5వ యేటి నుండి ప్రారంభమైంది. ఐదేళ్ల వయసులో ఉన్న బాలకృష్ణమూర్తి గానాన్ని విన్న వెంకుబాయి సురభి కంపెనీ వారు అడగగానే తండ్రి రంగయ్య వారికి అప్పగించాడు. ఉపనయనం కూడా సురభి కంపెనీ వారే చేశారు. అతనికి 14 వ ఏడు వచ్చేవరకు సురభి కంపెనీలో ప్రహ్లాద, ధ్రువ, లోహితాస్య పాత్రలను ధరించాడు. తరువాత పెంపుడు తల్లి శేషమ్మ కోరికపై తిరిగి వచ్చి ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. అయితే ఇతనికి కళలపై ఉన్న ఆసక్తి చదువును ముందుకు కొనసాగించలేదు. ఇతని ఆసక్తిని గమనించిన గంజి సోమయ్య ఇతనికి సత్యభామ పాత్రను ఇచ్చి తిరిగి రంగస్థల ప్రవేశం చేయించాడు. తరువాత తుర్లపాటి ఆంజనేయులు, యడవల్లి కనకసుందరం గార్ల "కృష్ణ విలాస్" కంపెనీలో మూడు సంవత్సరాలు స్త్రీ పాత్రలు ధరించాడు. తరువాత జొన్నవిత్తుల శేషగిరిరావు, కపిలవాయి లింగమూర్తి, పంచాంగ రామానుజాచార్యులు మొదలైన వారితో చింతామణి, దమయంతి, చంద్రమతి, చిత్రాంగి, కమల, సత్యభామ మొదలైన స్త్రీ పాత్రలను ధరించాడు. పోతుకూచి వెంకటసుబ్బయ్య వ్రాసిన కృష్ణదేవరాయలు నాటకంలో యడవల్లి సూర్యనారాయణ సరసన తిరుమలదేవి పాత్రను ధరించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇతని నటనను ఉప్పులూరి సంజీవరావు, స్థానం నరసింహారావు మొదలైన ప్రముఖ నటులు ప్రశంసించారు. ఇతడు 35 సంవత్సరాలు నాటకరంగానికి సేవలను అందించాడు. తరువాత సారంగి, దిల్ రుబా వంటి సంగీతపరికరాలతో సంగీత కచేరీలు ఇవ్వడం ప్రారంభించాడు. ఇతడు, తబలా విద్వాంసుడు జనాబ్ జాఫర్ ఇద్దరూ కలిసి ఆధ్యాత్మ రామాయణాన్ని, మీరా భక్తి గేయాలను ఆంధ్రదేశం అంతటా సంగీత కచేరీల ద్వారా అందించి ప్రజలను భక్తి పారవశ్యంతో ముంచెత్తారు. ఇతడు 1939లో విడుదలైన ఉషాపరిణయం సినిమాలో యోగి వేషం వేశాడు[1].
మూలాలు
[మార్చు]- ↑ ఎ.బి., కృష్ణమూర్తి (9 October 1980). "నాటకరంగంలో ఒక మణిదీపం శ్రీ చీరాల బాలకృష్ణమూర్తి". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67, సంచిక 187. Retrieved 28 January 2018.[permanent dead link]