చెంగల్పట్టు రంగనాథన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెంగల్పట్టు సి. రంగనాథన్
చెంగల్పట్టు రంగనాథన్
వ్యక్తిగత సమాచారం
జననం(1938-06-03)1938 జూన్ 3
చెన్నై
మరణం2011 జూలై 12(2011-07-12) (వయసు 73)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిగాయకుడు

చెంగల్పట్టు రంగనాథన్ ఒక కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు, గురువు[1].

ఆరంభ జీవితం

[మార్చు]

ఇతడు చెన్నై నగరంలో చెల్లప్ప అయ్యంగార్, రాజలక్ష్మి దంపతులకు 1938, జూన్ 3వ తేదీన జన్మించాడు.[2] ఇతని తల్లి టైగర్ వరదాచారి శిష్యుడైన హరిహర అయ్యర్ వద్ద సంగీతం నేర్చుకున్నది. ఇతడు కూడా తన తల్లితో పాటుగా సంగీతపాఠాలను వింటూ ఉండేవాడు. తరువాత ఇతడు వేణునాద విద్వాంసుడు హెచ్.రామచంద్రశాస్త్రి వద్ద సంగీతం నేర్చుకునాడు. తరువాత త్యాగరాజ శిష్యపరంపరలోని వాడైన అలత్తూర్ వెంకటేశ అయ్యర్ వద్ద చేరాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు "అలత్తూర్ బ్రదర్స్"గా పిలువబడే అలత్తూర్ శ్రీనివాస అయ్యర్, అలత్తూర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్‌ల వద్ద గురుకుల పద్ధతిలో శిష్యరికం చేశాడు. 1955లో నెరూర్‌లో సదాశివబ్రహ్మేంద్ర సంగీతోత్సవాల సందర్భంగా ఇతని తొలి కచేరీ జరిగింది. ఆ కార్యక్రమంలో రామనాథపురం ఎం.ఎన్.కందస్వామి మృదంగం, తన గురువు అలత్తూర్ వెంకటేశ అయ్యర్ హార్మోనియంలతో సహవాద్యాన్ని అందించారు.

వృత్తి

[మార్చు]

ఇతడు తన 17వ యేట ఆకాశవాణి నిర్వహించిన పోటీలలో ప్రథమ స్థానాన్ని పొంది భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా బహుమతిని అందుకున్నాడు. ఇతడు ఆకాశవాణిలో ఏ- గ్రేడ్ కళాకారుడిగా గుర్తించబడి, 20 సంవత్సరాలు ఆకాశవాణి స్టాఫ్ ఆర్టిస్టుగా సేవలందించాడు. కళాకారుడిగా ఇతడు ఆకాశవాణి చెన్నైలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించాడు. కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసుడిగా 20 సంవత్సరాలకు పైగా సేవలనందించాడు. మద్రాసు సంగీత అకాడమీ వారి సంగీత ఉపాధ్యాయుల కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.

విజయాలు

[మార్చు]

ఇతడు అలత్తూర్ బాణీని ప్రచారం చేయడంలో పేరు గడించాడు. పల్లవులను ఆలపించడంలో ప్రత్యేకతను సాధించాడు. తిరుప్పగళ్ 72 మేళకర్త రాగాలకు స్వరాలను కూర్చాడు. ఇతడు తన తిల్లానాలను అన్ని 35 తాళాలతో జోడించి వాగ్గేయకారుడని పిలువబడ్డాడు. 2007లో ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డును భారత రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా అందుకున్నాడు. అమెరికా క్లీవ్‌లాండులో జరిగిన త్యాగరాజ సంగీత ఉత్సవాలలో "సంగీత కళాసాగరం" బిరుదుతో సత్కరించబడ్డాడు.

వ్యక్తిగతజీవితం

[మార్చు]

ఇతడు 1968, ఆగష్టు 26వ తేదీన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఆర్.సాయి కృష్ణన్, ఆర్.సాయి నరసింహన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఇద్దరూ శాస్త్రీయ వేణూనాదంలో నిష్ణాతులు. ఇతని రెండవ కుమారుడు ఆర్.సాయి నరసింహన్ గాయకుడు, వేణువాదకుడు, సంగీత స్వరకర్త, మిమిక్రీ కళాకారుడు, టి.వి.కళాకారుడు.చెంగల్పట్టు రంగనాథన్ 2011, జూలై 12వ తేదీన మరణించాడు. సాయి నరసింహన్ తన తండ్రి పేరు మీద ఒక ట్రస్టును ఏర్పాటు చేసి కర్ణాటక సంగీతానికి ప్రాచుర్యం కల్పిస్తున్నాడు.

పురస్కారాలు, బిరుదులు

[మార్చు]
 • 1991లో హరిదాస్ గిరిస్వామి వారిచే "సంగీతాచార్య".[3]
 • 1992లో చెన్నైలో జరిగిన భారతీయార్ సంగీతోత్సవాలలో "నాదక్కనల్" బిరుదు.
 • 1999లో శ్రీరంగ రామానుజ మహాదేశికన్ వారిచే "గాయక కళానిధి" బిరుదు.
 • చైన్నైలోని వడపళని తిరుప్పుగళ్ సభ వారిచే "తిరుప్పుగళ్ మామణి" బిరుదు.
 • 2000లో మద్రాసు సంగీత అకాడమీ వారిచే "సంగీత కళాచార్య".[3]
 • 2002లో రసిక రంజని సభ, చెన్నై వారిచే "కళారత్న".[3]
 • 2003లో ఉడిపి పేజావర మఠం శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీవారిచే "సంగీత సమ్రట్" బిరుదు.
 • 2005లో రాజా అన్నామలైపురం భక్తజనసభ వారిచే"కర్ణాటిక్ మ్యూజిక్ పల్లవి విజార్డ్"
 • 2005లో మైలాపూర్ పంచముఖ ఆంజనేయ ఉత్సవంలో"స్వరరాగ సారజ్ఞర్" బిరుదు.
 • 2006లో పాల్ఘాట్ మణి అయ్యర్ మెమోరియల్ ట్రస్ట్ వారిచే "లయకళానిపుణ" బిరుదం.
 • 2007లో అమెరికా క్లీవ్‌లాండ్ భార్గవి ఫైన్ ఆర్ట్స్ సంస్థ వారిచే త్యాగరాజ సంగీతోత్సవాలలో భాగంగా "సంగీత కళా సాగరం" బిరుదు.

పైన పేర్కొన్నవే కాక మహారాజపురం విశ్వనాథ అయ్యర్ ట్రస్ట్, కపాలి ఫైన్ ఆర్ట్స్, జ్ఞానస్కందన్ ట్రస్టు, కన్నపీరన్ సమాజం, శాంతి ఆర్ట్స్ ఫౌండేషన్, నారద గాన సభ, లయ లావణ్య ట్రస్ట్, గురుకృప ట్రస్ట్, రుక్మిణి ఆర్ట్స్ అకాడమీ, పి.ఎస్.నారాయణస్వామి డిసిపుల్స్ ఫోరం అనేక సంస్థలు, గానసభలు ఇతడిని సత్కరించాయి.

మూలాలు

[మార్చు]
 1. web master. "Chingleput Ranganathan". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 18 సెప్టెంబరు 2020. Retrieved 26 February 2021.
 2. LAKSHMI DEVNATH. "Shaped by the great masters". The Hindu. No. 1 December 2001. Retrieved 26 February 2021.
 3. 3.0 3.1 3.2 Staff Reporter (21 December 2002). "Title for Chengalpattu Ranganathan". The Hindu. Retrieved 26 February 2021.

వనరులు

[మార్చు]