చౌటి భాస్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చౌటి భాస్కర్
వ్యక్తిగత సమాచారం
జననం(1939-08-10)1939 ఆగస్టు 10
వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ
మరణం1990 ఫిబ్రవరి 4(1990-02-04) (వయసు 50)
హైదరాబాదు, తెలంగాణ
సంగీత శైలిగ్రాత సంగీతం
వృత్తిసంగీత విద్యాంసులు

చౌటి భాస్కర్, (1939, ఆగస్టు 10 - 1990, ఫిబ్రవరి 4) తెలంగాణకు చెందిన ప్రముఖ సంగీత విద్యాంసులు. గాత్ర సంగీతంలో సంగీత విద్వాన్, గాన గంధర్వ మొదలైన బిరుదులతో సత్కరింపబడ్డారు.[1]

జననం, విద్య

[మార్చు]

భాస్కర్ 1939, ఆగస్టు 10న తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణంలో జన్మించారు. బి.ఏ. ఇంగ్లీష్ పూర్తిచేశారు.[2]

కుటుంబం

[మార్చు]

భాస్కర్ కు సులోచనతో వివాహం జరిగింది వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు చౌటి రఘునందన్ తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖలో ఫీల్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.[1]

సంగీత ప్రస్థానం

[మార్చు]

చిన్ననాటి నుండి సంగీతంలో మక్కువ కనబరచిన భాస్కర్, ప్రహ్లాదుని నాటకంలో ప్రహ్లాద పాత్ర పోషించి మెప్పించారు. వేములవాడలోని రాగుల లక్ష్మీరాజయ్య పంతులు వద్ద ప్రాథమిక సంగీత శిక్షణ పొందారు. సంగీతంలో భాస్కర్ ప్రావీణ్యాన్ని గుర్తించిన వేములవాడ దేవస్థానం, సంగీతంలో ఉన్నత శిక్షణ పొందడానికి ఆర్థిక సహకారం అందించారు. దాంతో 1961లో మద్రాసులోని సెంట్రల్ మ్యూజిక్ కాలేజీలో ఉన్నత శిక్షణ పొంది సంగీత విద్వాన్ పట్టా అందుకున్నారు. ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, డా॥డి.కె పట్టమ్మాళ్ మొదలైన సంగీత పండితుల వద్ద కర్ణాటక సంగీతంలోనూ శిక్షణ పొందారు.[2]

మూడు దశాబ్ధాల తన సంగీత ప్రస్థానంలో దేశవ్యాప్తంగా 550 సంగీత కచేరీలు, ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్ ఏ-1 కళాకారుడిగా, దూరదర్శన్ లో కచేరీలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీకి సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేశారు. వేములవాడ దేవస్థానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే త్యాగరాజ ఉత్సవాలు భాస్కర్ గాత్ర కచేరీలోనే ప్రారంభమయ్యేవి. సొంతంగా కృతులను రచించి పాడేవారు.[1]

ఉద్యోగం

[మార్చు]

చిత్రలేఖనంలో ప్రవేశం ఉండడంతో తొలినాళ్ళలో వికారాబాదులో డ్రాయింగ్ టీచర్ ఉద్యోగంలో చేరి, కొన్ని సంవత్సరాలు డ్రాయింగ్ టీచర్ గా పనిచేశారు. తరువాత, సంగీతం మీదవున్న మక్కువతో సంగీతంలో అసిస్టెంట్ లెక్చరర్ పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉద్యోగం సంపాదించారు. సికింద్రాబాదులోని శ్రీ భక్త రామదాసు సంగీత కళాశాలలో 1969 నుండి 1990 వరకు గాత్ర సంగీత అధ్యాపకులుగా సేవలందించి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు.[1]

మరణం

[మార్చు]

భాస్కర్ 1990, ఫిబ్రవరి 4న హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.[1]

భాస్కర్ పేరిట పురస్కారం

[మార్చు]

భాస్కర్ కుమారుడు రఘునందన్ ప్రతి సంవత్సరం భాస్కర్ జయంతి సందర్భంగా ఆయన పేరిట పురస్కారం ఒక పురస్కారాన్ని అందిస్తున్నారు.[2]

  • 2019: కోలంక లక్ష్మణరావు
  • 2022: కొమండూరి శేషాద్రి[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 సంగీత భాస్కరుని అకాల మరణం, ఆంధ్రప్రభ హైదరాబాదు మెయిన్, 1990 ఫిబ్రవరి 7, పేజీ.9.
  2. 2.0 2.1 2.2 సంకేపల్లి, నాగేంద్రశర్మ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర అనువంశిక బ్రాహ్మణ చరిత్ర. pp. 19–22.
  3. శేషాద్రికి పురస్కార ప్రదానం, ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్, 2022 ఆగస్టు 9.