జంతువలసల పర్యవేక్షణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ లో రేడియో కాలర్ తగిలించిన తోడేలు
రేడియో కాలర్‌ తగిలించిన జంగుపిల్లిని పర్యవేక్షిస్తున్న యుఎస్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ ఉద్యోగి

వన్యప్రాణుల జీవశాస్త్రం, పరిరక్షణ జీవశాస్త్రం, జీవావరణ శాస్త్రం, వన్యప్రాణుల నిర్వహణల్లో అడవిలో జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి జంతువలసల పర్యవేక్షణ ఉపయోగపడుతుంది. దీని కోసం అనుసరించిన తొలి పద్ధతుల్లో ఒకటి పక్షుల బ్యాండింగ్. ఈ పద్ధతిలో పక్షుల కాళ్ళపై గానీ రెక్కలపై గానీ నిష్క్రియాత్మక గుర్తింపు ట్యాగ్లను ఉంచుతారు. భవిష్యత్తులో తిరిగి అదే పక్షిని పట్టుకుని వాటి వలస మార్గం, ఆయుర్దాయం, సంఖ్య, అవి తిరిగే ప్రదేశాలు, ఆహారపుటలవాట్లు తదితర వివరాలు తెలుసుకోవడానికి ఆ ట్యాగ్ ఉపయోగపడుతుంది. రేడియో పర్యవేక్షణ పద్ధతిలో జంతువుకు ఒక చిన్న రేడియో ట్రాన్స్‌మిటర్‌ను తగిలించి దాని సిగ్నల్‌ను RDF రిసీవర్‌తో అనుసరిస్తారు. ట్యాగ్ చేసిన జంతువులను ఉపగ్రహాల సహాయంతో పర్యవేక్షించడం, జీపీయస్ ట్యాగుల ద్వారా జంతువులు తిరిగే ప్రదేశాలను నమోదు చెయ్యడం అధునాతన పద్ధతుల్లో కొన్ని. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆవిర్భావంతో కావల్సిన జంతుజాతులనూ, వాటిలో కూడా కావల్సిన అలవాట్లనూ పర్యవేక్షించడానికి ప్రత్యేకమైన పరికరాలను తయారు చేయడం మొదలైంది. జంతువలస పరిశోధన ముఖ్య లక్ష్యాల్లో ఒకటి జంతువులు ఎక్కడికి వెళుతున్నాయో నిర్ధారించడం. అయితే, అవి ఎందుకు అక్కడికి వెళుతున్నాయో తెలుసుకోవడం కూడా ఆసక్తికరమే. పరిశోధకులు జంతువులు ఎక్కడి నుంచి ఎక్కడికి వలస వెళ్తున్నాయో చూడడమే కాకుండా వలస మార్గాన్ని కూడా పరిశోధిస్తున్నారు. ఆ మార్గాల్లోని కొత్త ప్రదేశాల్లో ఆహార సాంద్రత, నీటి ఉష్ణోగ్రతలో మార్పు లేదా ఇతర ప్రోత్సాహకాల ఆధారంగానే జంతువులు వాటిని ఎంచుకుంటున్నాయా? ఈ మార్పులకు అనుగుణంగా అవి ఎలా అనువర్తించి నడుచుకుంటున్నాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. అడవి జంతువుల జనాభాపై మానవ నాగరికత ప్రభావాన్ని నియంత్రించడానికి, ప్రమాదంలో ఉన్న జాతుల అంతరించిపోవడాన్ని నివారించడానికి చేసే ప్రయత్నాల్లో వలస పర్యవేక్షణ ఒక ముఖ్యమైన సాధనం.

సాంకేతికత

[మార్చు]
కేప్ మే బర్డ్ అబ్జర్వేటరీలో ట్యాగ్ చేసిన మోనార్క్ సీతాకోకచిలుక. మోనార్క్ ఐడెంటిఫికేషన్ ట్యాగింగ్ ప్రోగ్రాం కలిగి ఉన్న సంస్థల్లో కేప్ మే బర్డ్ అబ్జర్వేటరీ ఒకటి. గుర్తింపు సమాచారం ఉన్న ప్లాస్టిక్ స్టిక్కర్లు పురుగుల రెక్కల మీద ఉంచుతారు. మోనార్క్ సీతాకోకచిలుకలు ఎంత దూరం, ఎక్కడ ఎగురుతాయి అన్న సమాచారంతో సహా వాటి వలస విధానాలను అధ్యయనం చేయడానికి ట్రాకింగ్ సమాచారం ఉపయోగపడుతుంది.

1803 చివరలో, అమెరికన్ ప్రకృతి శాస్త్రవేత్త జాన్ జేమ్స్ ఆడుబన్‌కు వలస పక్షులు ప్రతి సంవత్సరం ఎక్కడి నుంచి బయలుదేరతాయో మళ్ళీ అక్కడికే తిరిగి వెళ్తాయా అనే సందేహం వచ్చింది. ఆ సందేహం తీర్చుకునేందుకు ఒక పక్షి దక్షిణానికి వలస వెళ్ళే ముందు దాని కాలికి ఒక దారం కట్టాడు. తరువాతి వసంతకాలంలో, ఆ పక్షి తిరిగి అక్కడికే రావడం ఆడుబన్ చూశాడు.

జంతువుల కదలికలను పర్యవేక్షించడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికీ లోహపు పట్టీల వంటి ట్యాగ్లను తగిలిస్తున్నారు. లోహపు పట్టీలు తగిలించినప్పుడు వాటి నుంచి సమాచారం సేకరించడానికి జంతువులను తిరిగి బంధించడం అవసరం. అందువల్ల ఈ తరహాలో పొందే సమాచారం జంతువును విడుదల చేసిన స్థలం, దాని గమ్యస్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది.

ఇటీవలి సాంకేతిక ప్రగతి ఈ సమస్యకు పరిష్కారం చూపించింది. కొన్ని ఎలక్ట్రానిక్ ట్యాగులు పదే పదే సిగ్నళ్ళను వెలువరిస్తే, వాటిని రేడియో పరికరాలు గానీ ఉపగ్రహాలు గానీ పసిగడతాయి. ఇంకొన్ని ఎలక్ట్రానిక్ ట్యాగుల్లో సమాచారం భద్రపరిచే సదుపాయం ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ RFID సాంకేతికత లేదా ఉపగ్రహాలను ఉపయోగించి ట్యాగ్ చేయబడిన జంతువులను తిరిగి స్వాధీనం చేసుకోకుండానే వాటి స్థానాలు, కదలికలను ట్రాక్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ ట్యాగ్‌లు ఎక్కువ సమాచారం అందించగలవు. ఆధునిక పరికరాలు చిన్నవిగా కూడా ఉండడం వల్ల జంతువుపై ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంటుంది.

రేడియో ట్రాకింగ్

[మార్చు]
ఈ రెండు బ్రష్-టెయిల్డ్ రాక్-వాలబీలలో కుడి వైపున ఉన్నది రేడియో ట్రాకింగ్ కాలర్ ధరించి ఉంది.

రేడియో టెలీమెట్రీ ద్వారా జంతువును ట్రాక్ చేసే విధానంలో రెండు పరికరాలు ఉంటాయి. సాధారణంగా టెలీమెట్రీలో ఒక జంతువుకు అనుసంధానించబడిన ఒక ట్రాన్స్‌మిటర్ రేడియో స్టేషన్ మాదిరిగానే రేడియో తరంగాల రూపంలో ఒక సంకేతాన్ని పంపుతుంది.[1] ఒక శాస్త్రవేత్త జంతువు చీలమండ, మెడ, రెక్క, కారాపేస్ లేదా డోర్సల్ ఫిన్ చుట్టూ ట్రాన్స్‌మిటర్ను ఉంచవచ్చు. ప్రత్యామ్నాయంగా, చిన్నపాటి శస్త్రచికిత్స ద్వారా ట్రాన్స్‌మిటర్‌ను జంతువుల శరీరం లోపల అమర్చుతారు. వీటిపై బయటి వాతావరణ ప్రభావం ఉండకపోవడం వల్ల ఎక్కువ కాలం చక్కగా పనిచేస్తాయి.[2] వీఎచ్‌ఎఫ్ శ్రేణిలో యాంటెనా‌లు చిన్నగా, సౌకర్యవంతంగా ఉంటాయి కాబట్టి ఈ శ్రేణిలోని పౌనఃపున్యాలతో పని చేసే ట్రాన్స్‌మిటర్‌లనే జంతుపర్యవేక్షణకు వాడుతారు. బ్యాటరీ శక్తిని ఆదా చేయడానికి ట్రాన్స్‌మిటర్ సాధారణంగా సెకనుకు ఒకటి చొప్పున సంక్షిప్త పల్స్‌లను ప్రసారం చేస్తుంది. రేడియో డైరెక్షన్ ఫైండింగ్ (ఆర్డీఎఫ్) అనే ఒక ప్రత్యేక రేడియో రిసీవర్ సిగ్నల్‌ను తీసుకుంటుంది. రిసీవర్‌ను సాధారణంగా ట్రక్, ఏటీవీ లేదా విమానంలో ఉంచుతారు.[1] ఒక దిశలోనే సిగ్నల్‌ను బలంగా రిసీవ్ చేసుకునే డైరెక్షనల్ యాంటెనాను (ఉదాహరణకు సాధారణ యాగి యాంటెనా). వరకు యాంటెనాను తిప్పితే, అప్పుడు యాంటెనా జంతువు వైపు తిరిగి ఉంది అని అర్థం. సిగ్నల్ను ట్రాక్ చేయడానికి, శాస్త్రవేత్త రిసీవర్‌ను ఉపయోగించి జంతువును అనుసరిస్తాడు. రేడియో ట్రాకింగ్ విధానాన్ని జంతువును మానవీయంగా పర్యవేక్షించడానికే కాకుండా, జంతువులకు ఇతర పరికరాలను అమర్చినప్పుడు కూడా ఉపయోగిస్తారు. జంతువును పట్టుకుని ఆ పరికరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రిసీవర్ ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా చిన్న పక్షుల వలసలు పర్యవేక్షించడానికి జియోలోకేటర్లు లేదా "జియోలాగర్ల" రూపంలోనూ రేడియో ట్రాకింగ్‌ను ఉపయోగిస్తారు.[3] ఈ పరికరాలు కాంతి సెన్సార్‌ ద్వారా ఎప్పటికప్పుడు కాంతి స్థాయుల్ని కొలుస్తూ (లైట్ లెవెల్ డేటా), పొద్దు నిడివి, మధ్యాన్నపు సమయం ఆధారంగా పక్షులు ఏ ప్రదేశంలో ఉన్నాయో అంచనా వేస్తాయి. ఈ పద్ధతిలో ప్రయోజనాలతో పాటు సవాళ్లు ఉన్నప్పటికీ, వలస సమయంలో దూర దూరాలకు వెళ్ళే చిన్న పక్షులను ట్రాక్ చేయడానికి అత్యంత ఆచరణాత్మక మార్గాలలో ఇది ఒకటి.[3][4]

జంతు కదలికలను పర్యవేక్షించేందుకు వాడే మరొక దూరమితి (టెలిమెట్రి) సాధనం ప్యాసివ్ ఇంటెగ్రేటెడ్ ట్రాన్స్‌పాండర్లు (పీఐటీ). "పిట్ ట్యాగ్లు" ధరించిన జంతువులను తిరిగి స్వాధీనం చేసుకునే అవసరం లేకుండానే పరిశోధకులకు వాటి ఆచూకీ మొదలగు సమచారం తెలుస్తుంది.[3][5] జంతువు ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఉందో ఎలక్ట్రానిక్ ఇంటెరాగేషన్ యాంటెన్నా ద్వారా సేకరించి పర్యవేక్షిస్తారు.[2] ఈ పద్ధతిలో జంతువులను పర్యవేక్షించడానికి పరిమిత సంపర్కమే అవసరం కాబట్టి వ్యాధుల సంక్రమణ, మరణాల ప్రమాదం చాలా తక్కువ. అందువల్ల పిట్ ట్యాగ్లు వాడటం మానవత గల ట్రాకింగ్ పద్ధతి. జంతువు నుండి ట్యాగును తొలగించాల్సిన అవసరం వచ్చినప్పుడు దాన్ని తిరిగి మరొక జంతువుకు తగిలించే అవకాశం ఉండడం వల్ల ఈ పద్ధతి చవకైనది కూడా.[6]

మోటస్ వైల్డ్‌లైఫ్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అనేది బర్డ్స్ కెనడా సంస్థ 2014లో అమెరికా, కెనడాల్లో ప్రారంభించిన కార్యక్రమం. 2022 నాటికి వివిధ జంతువులకు (ఎక్కువ శాతం పక్షులు) 40,000కు పైగా ట్రాన్స్మిటర్లు తగిలించి, 34 దేశాల్లో 1500 రిసీవర్లు నెలకొల్పారు. వీటిలో ఎక్కువ శాతం అమెరికా, కెనడాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి.

ఉపగ్రహ పర్యవేక్షణ

[మార్చు]
వలస పర్యవేక్షణ కోసం GPS ఆధారిత ఉపగ్రహ ట్రాన్స్మిటర్ అమర్చిన ఉప్పునీటి మొసలి

సిగ్నల్ రిసీవర్లను భూ-కేంద్రక కక్ష్యలో పరిభ్రమించే ఎఆర్‌జీఓఎస్ వంటి ఉపగ్రహాలలో ఉంచవచ్చు. జంతువులను పర్యవేక్షించడానికి ఉపగ్రహాల సమూహాలను ఉపయోగిస్తారు. సమూహంలోని ప్రతి ఉపగ్రహం ఒక జంతువు మీది ట్రాన్స్‌మిటర్ నుండి ఎలక్ట్రానిక్ సంకేతాలను తీసుకుంటుంది. అన్ని ఉపగ్రహాల నుండి వచ్చే సంకేతాలను ఉపయోగించి జంతువు ఖచ్చితమైన స్థానాన్ని నిర్ణయిస్తారు. జంతువు కదులుతున్నప్పుడు ఉపగ్రహాలు దాని మార్గాన్ని కూడా ట్రాక్ చేస్తాయి. ఉపగ్రహాలను ఉపయోగించినప్పుడు, శాస్త్రవేత్తలు జంతువును వెంబడించడం, దాని కదలికల సమాచారం కోసం ట్యాగును తిరిగి సేకరించడం వంటివి చెయ్యనవసరం లేదు. ఇప్పటికే ఉపగ్రహ సమూహాలను కారిబూ, సముద్ర తాబేళ్లు, తిమింగలాలు, గ్రేట్ వైట్ షార్క్‌లు, సీళ్ళు, ఏనుగులు, గద్దలు, ఆస్ప్రీలు, రాబందుల వలసలూ, కదలికలను ట్రాక్ చేస్తున్నాయి.[7] అదనంగా పాప్-అప్ ఉపగ్రహ ఆర్కైవల్ ట్యాగులు సముద్ర క్షీరదాలూ, వివిధ జాతుల చేపలపై ఉపయోగిస్తారు. ఉపగ్రహ పర్యవేక్షణకు పైన పేర్కొన్న ఆర్గోస్‌తో పాటు జీపీయస్ అనే రెండు ప్రధాన వ్యవస్థలు ఉన్నాయి.[8]ఈ వ్యవస్థల వల్ల జంతు పరిరక్షకులు వలస జంతుజాతులు నివసించే కీలక ప్రదేశాలను కనుగొనగలుగుతున్నారు.[8] ధ్వని దూరమితి (అకూస్టిక్ టెలిమెట్రీ) ద్వారా కూడా ఉపగ్రహ పర్యవేక్షణ చెయ్యవచ్చు. ఈ పద్ధతిలో మూడు మితుల్లో ఒక జంతువు కదలికలను పర్యవేక్షించడానికి పరిశోధకులు ధ్వనిని విడుదల చేసే ఎలక్ట్రానిక్ ట్యాగులు ఉపయోగిస్తారు. ఒకే సమయంలో ఒక జాతికి చెందిన అనేక జంతువులను ట్రాక్ చేస్తున్న సందర్భాల్లో ఈ పద్ధతి సహాయపడుతుంది.[9]

ఐఓటీ పర్యవేక్షణ

[మార్చు]

ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వన్యప్రాణుల పర్యవేక్షణ, పరిశోధనలకు ఒక శక్తిమంతమైన వనరుగా ఆవిర్భవిస్తోంది. సురక్షితమైన జిగురుతో జంతువులకు అతికించే లో పవర్ వైడ్ ఏరియా (ఎల్‌పీడబ్ల్యూఏ) సెన్సార్ల నుంచి, అంతర్జాలానికి అనుసంధనమై మర పజ్ఞ (మెషీన్ లెర్నింగ్) ద్వారా చిత్రాలను వర్గీకరించే కెమేరాల దాకా ఎన్నో సాంకేతికతలు ఐఓటీలో భాగం. ఎల్డబ్ల్యూపీఏ ఉపయోగాలు అంతులేనివి. ఏ జంతువుకైనా అఅమర్చే సెన్సార్లను అభివృద్ధి చేయడమే చేయాల్సి ఉంటుంది. సెన్సార్‌కు తక్కువ శక్తి అవసరం కాబట్టి, బ్యాటరీలను మార్చే పని లేదు. "వేర్ ఈజ్ ది బేర్" అనేది శాంటా బార్బరాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగం అభివృద్ధి చేసిన వన్యప్రాణుల పర్యవేక్షణ సాఫ్ట్‌వేర్. దీని సృష్టికర్తలు కెమెరాలనే తమ సెన్సార్లుగా ఉపయోగించి మర ప్రజ్ఞ ద్వారా కెమేరాల చిత్రాల్లోని జంతువులను గుర్తిస్తారు. ఆ కెమేరాలు తీసిన ఖాళీ చిత్రాల్లో జంతువుల చిత్రాలను చొప్పించి (ఎడిట్ చేసి) ఆల్గరిథమ్‌కు శిక్షణ ఇచ్చారు. ఈ మర ప్రజ్ఞ సాఫ్ట్‌వేరును జంతువుల చిత్రాలను వర్గీకరించేందుకే కాకుండా వాణిజ్య, ప్రజా అవసరాల కోసం పెద్ద సమూహాల్లో ఒక వ్యక్తి/వ్యక్తులను గుర్తించేందుకు కూడా వీలుంది.

స్థిర ఐసోటోపులు

[మార్చు]
గుడ్లు పెడుతున్న సముద్రపు తాబేలు. పొదగని గుడ్లను స్థిర ఐసోటోపు విశ్లేషణలో ఉపయోగించవచ్చు.

స్థిర ఐసోటోపులు జంతువలసల అధ్యయనంలో ఉపయోగించే అంతర్గత గుర్తులలో ఒకటి.[10] స్థిర ఐసోటోపులు సహా అన్ని అంతర్గత గుర్తులలో అంతర్గత గుర్తుల ప్రయోజనాల్లో ఒకటి - ఒక జీవిని బంధించి, ట్యాగు తగిలించి, తరువాత ట్యాగును పొందడానికి తిరిగి స్వాధీనం చేసుకోవలసిన అవసరం లేదు. ఒక జీవిని బంధించిన ప్రతి సారీ అది తీసుకున్న ఆహారం ఆధారంగా ఎక్కడ సంచరించింది అనే సమాచారం పొందవచ్చు. జంతువలసల అధ్యయనంలో సాధనాలుగా ఉపయోగించగల మూడు రకాల అంతర్గత గుర్తులు: (1) కలుషితాలు, పరాన్నజీవులు, వ్యాధికారకాలు, (2) ట్రేస్ ఎలిమెంట్స్, (3) స్థిర ఐసోటోపులు. కొన్ని భౌగోళిక ప్రాంతాలు నిర్దుష్టమైన నిష్పత్తిలో స్థిర ఐసోటోపులను కలిగి ఉండి, అక్కడ మేసే జంతువుల రసాయనిక కూర్పును ప్రభావితం చేస్తాయి. దీన్ని బట్టి భూమిని "ఐసోస్కేపులు"గా విభజించవచ్చు. ఈ ఐసోస్కేపులను వాడి ఒక జంతువు ఎక్కడ మేస్తుందో శాస్త్రవేత్తలు కనిపెట్టవచ్చు. స్థిర ఐసోటోపు విశ్లేషణను విజయవంతంగా ఉపయోగించడానికి కొన్ని పూర్వాపేక్షితాలు ఉన్నాయి: (1) సదరు జంతువులోని, నమూనాలు సేకరించగల నిర్దుష్టమైన కణజాలంలో కనీసం ఒక తేలికపాటి ఐసోటోపు ఉండాలి (ఎక్కువ శాతం జీవ కణజాలానికి ఈ తేలికపాటి ఐసోటోపులే పునాదులు కాబట్టి ఈ నిబంధనను ఉల్లంఘించే సందర్భాలు చాలా తక్కువ) (2) సదరు జీవి వివిధ ఐసోస్కేపుల మధ్య వలస వెళ్ళి, ఆ ప్రాంతాల ఐసోటోపులను కణజాలంలో నిక్షిప్తం చేసుకుని ఉండాలి. అప్పుడే ఆ ఐసోటోపుల మధ్త వ్యత్యాసాన్ని కనుక్కునే వీలు ఉంటుంది.[10]

స్థిర ఐసోటోపు విశ్లేషణను ఇప్పటికే వివిధ భూ, జలచరాల వలసల అధ్యయనాలకు ఉపయోగించడం జరిగింది. ఉదాహరణకు, గూడు కట్టే లాగర్‌హెడ్ సముద్ర తాబేళ్ళు మేసే ప్రదేశాలను కనుగొనడంలో స్థిర ఐసోటోపు విస్లేషణ పని చేస్తుందని నిర్ధారణ అయింది.[11] ఈ పద్ధతిలో కనుగొన్న ఈ తాబేళ్ళ స్థానమూ, ఉపగ్రహ దూరమితి ద్వారా అవి వాస్తవంగా ప్రయాణించిన ప్రదేశమూ ఒకటేనని కూడా నిర్ధారణ అయింది.[11]

ప్రాముఖ్యత

[మార్చు]

ఎలక్ట్రానిక్ ట్యాగులు వలస క్రతువు మొత్తాన్నీ శాస్త్రవేత్తల కళ్ళ ముందు ఉంచుతున్నాయి. ఉదాహరణకు, శాస్త్రవేత్తలు ఒక కారిబూ మందను పర్యవేక్షించడానికి రేడియో ట్రాన్స్‌మిటర్లను ఉపయోగించినప్పుడు, రెండు ముఖ్యమైన విషయాలను తెలిసాయి. మొదటిది, గతంలో అంచన వేసిన దాని కాంటే చాలా ఎక్కువగా మంద ప్రయాణిస్తోందని వారు తెలుసుకున్నారు. రెండవది, ప్రతి సంవత్సరం ప్రసవ సమయంలో మంద అదే ప్రదేశానికి తిరిగి వస్తుందని వారు తెలుసుకున్నారు. ఈ సమాచారాన్ని "తక్కువ సాంకేతికత" ట్యాగులతో పొందడం కష్టం, అసాధ్యం కుడా.

జంతుజాతులను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, వాటిని పరిరక్షించడానికి వలసలను పర్యవేక్షించడం ఒక ముఖ్యమైన సాధనం. ఉదాహరణకు, ఫ్లోరిడా మానటీలు ఒక అంతరించిపోతున్న జాతి, అందువల్ల వాటికి రక్షణ అవసరం. ఫ్లోరిడా మనాటీలు వలస వెళ్ళినప్పుడు రోడ్ ఐలాండ్ వరకు ప్రయాణించగలవని రేడియో ట్రాకింగ్ ద్వరా తెలిసింది. అమెరికాలోని అట్లాంటిక్ తీరంలో ఎక్కువ భాగం మానటీలకు రక్షణ అవసరమని దీని వల్ల తెలుస్తుంది. గతంలో రక్షణ చర్యలు ప్రధానంగా ఫ్లోరిడా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండేవి.

బీపీ చమురుతెట్టె నేపథ్యంలో, గల్ఫ్‌లో జంతువుల పర్యవేక్షణ ప్రయత్నాలు పెరిగాయి. ఎలక్ట్రానిక్ ట్యాగులను ఉపయోగించే చాలా మంది పరిశోధకులకు కొన్ని ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉంటాయి: పాప్-అప్ ఉపగ్రహ ట్యాగులు, ఆర్కైవల్ ట్యాగులు, ఉపగ్రహ ట్యాగులు. చారిత్రాత్మకంగా ఈ ట్యాగ్లు ఖరీదైనవి; ఒక్కో ట్యాగు విలువ కొన్ని వేల డాలర్లు ఉండేది. అయితే, సాంకేతిక అభివృద్ధి వల్ల తగ్గిన ధరలు శాస్త్రవేత్తలకు ఎక్కువ జంతువులను ట్యాగు చేసే వీలు కల్పిస్తున్నాయి. ట్యాగు చేయగల జంతుజాతులూ, జంతువుల సంఖ్య పెరిగేకొద్దీ ఈ పరికరాల వల్ల ఉన్న ప్రతికూల ప్రభావాల అవకాశాన్ని గుర్తించడం చాలా ముఖ్యం.[12][13]

మూలాలు

[మార్చు]
  1. "Technology and Development at the USDA Forest Service, Satellite/GPS Telemetry for Monitoring Lesser Prairie Chickens". www.fs.fed.us. Retrieved 2017-03-02.
  2. Original text (in public domain):"Internal radio transmitters have the advantage of remaining intact and functioning longer than traditional attachments. Implanted transmitters also are protected from extrinsic variables such as environmental elements and wear (Eagle et al. 1984)." (Lander et al. 2005) http://digitalcommons.unl.edu/cgi/viewcontent.cgi?article=1191&context=usdeptcommercepub (accessed 29 November 2012)
  3. 3.0 3.1 3.2 "Animal Migration Research, Jeff Kelly Lab". www.animalmigration.org. Retrieved 2017-03-02.
  4. Stutchbury, Bridget J. M.; Tarof, Scott A.; Done, Tyler; Gow, Elizabeth; Kramer, Patrick M.; Tautin, John; Fox, James W.; Afanasyev, Vsevolod (2009-02-13). "Tracking Long-Distance Songbird Migration by Using Geolocators". Science (in ఇంగ్లీష్). 323 (5916): 896. Bibcode:2009Sci...323..896S. doi:10.1126/science.1166664. ISSN 0036-8075. PMID 19213909. S2CID 34444695.
  5. "PIT Tag Information Systems (PTAGIS) | Pacific States Marine Fisheries Commission". www.psmfc.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-03-02.
  6. "Passive Integrated Transponder (PIT) Tags in the Study of Animal Movement | Learn Science at Scitable". www.nature.com (in ఇంగ్లీష్). Retrieved 2017-03-02.
  7. SEATURTLE.ORG - Global Sea Turtle Network
  8. 8.0 8.1 Northern Bald Ibis Project
  9. "Acoustic Telemetry Fisheries Research". www.htisonar.com. Retrieved 2017-03-02.
  10. 10.0 10.1 Tracking animal migration with stable isotopes. Hobson, Keith Alan, 1954-, Wassenaar, Leonard I. Amsterdam: Academic Press. 2008. ISBN 9780123738677. OCLC 228300275.{{cite book}}: CS1 maint: others (link)
  11. 11.0 11.1 (2012-09-20). "Inferring Foraging Areas of Nesting Loggerhead Turtles Using Satellite Telemetry and Stable Isotopes".
  12. . "No short- or long-term effects of geolocator attachment detected in Pied Flycatchers Ficedula hypoleuca".
  13. . "Effects of geolocators on hatching success, return rates, breeding movements, and change in body mass in 16 species of Arctic-breeding shorebirds".

బాహ్య లింకులు

[మార్చు]