Jump to content

జగ్మీత్ సింగ్ బ్రార్

వికీపీడియా నుండి
జగ్మీత్ సింగ్ బ్రార్
(1958-05-23) 1958 మే 23 (వయసు: 68)
బామ్, ముక్త్సర్ జిల్లా, పంజాబ్, భారతదేశం
చదువుబి. ఏ., ఎంఏ, ఎల్ఎల్సీ
విద్యాలయాలుపంజాబ్ విశ్వవిద్యాలయం
వృత్తిరాజకీయవేత్త, న్యాయవాది, రచయిత, కవి
తండ్రిగుర్మీత్ సింగ్ బ్రార్

జగ్మీత్ సింగ్ బ్రార్ (జననం 1958 మే 23) పంజాబ్‌కు చెందిన న్యాయవాది, రచయిత, కవి, రాజకీయ నాయకుడు. ఆయన పంజాబ్ రాష్ట్రం ఫరీద్‌కోట్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4] శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందినవాడు.[5][6][7]

విద్యాభ్యాసం

[మార్చు]

ఆయన పాటియాలా లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి బి. ఏ., ఎంఏ, ఎల్ఎల్సీ డిగ్రీలు అందుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

జగ్మీత్ సింగ్ బ్రార్ తన తండ్రి, పంజాబ్ మాజీ క్యాబినెట్ మంత్రి గుర్మీత్ సింగ్ బ్రార్ మార్గదర్శకత్వంలో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితం ప్రారంభించాడు.[8]

ఆయన అఖిల భారత సిక్కు విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడిగా పనిచేసాడు. 1975 నుండి 1977 వరకు పంజాబ్ ముక్త్సర్ లోని ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థి నాయకుడిగా అత్యవసర పరిస్థితి సమయంలో ఖైదు చేయబడ్డాడు. రాజకీయ సమస్యలపై అనేకసార్లు అరెస్టయ్యాడు.[9] అకాలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1979 నుండి 1980 వరకు ఆయన ఏడు నెలలు భటిండా జైలులో గడిపాడు. ఫరీద్కోట్ లో కిసాన్ ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు అతనిపై కేసు నమోదైంది.

1980, 1984లలో గిద్దర్‌బాహా శాసనసభ నియోజకవర్గం నుండి ప్రకాష్ సింగ్ బాదల్ వంటి దిగ్గజాలకు వ్యతిరేకంగా ఆయన అనేక కఠినమైన ఎన్నికలలో పోటీ చేసాడు. 1980 లో ఆయన, కేవలం 22 సంవత్సరాల వయస్సులో గిద్దర్‌బాహా నుండి ప్రకాష్ సింగ్ బాదల్ కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసాడు. చివరకు విజయం సాధించి, 1992లో 10వ లోక్‌సభ, 1999లో 13వ లోక్‌సభ లకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై పంజాబ్ లోని ఫరీద్కోట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. 1999లో ప్రకాష్ సింగ్ బాదల్ పంజాబ్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆయన సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ను ఓడించాడు. ఇది ఆయన అందుకున్న భారీ విజయంగా పరిగణిస్తారు. జాతీయ నాయకుడిగా ఉన్నప్పటికీ, 2004, 2009 లోక్‌సభ ఎన్నికలలో ఇద్దరు స్థానిక నాయకుల చేతిలో స్వల్పంగా ఓడిపోయాడు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు కానీ రాష్ట్రవ్యాప్తంగా చురుకుగా ప్రచారం చేసాడు.

ఆయన 2005 నుండి 2012 వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు, మొదట ప్రత్యేక ఆహ్వానితుడిగా, ఆ తరువాత వర్కింగ్ కమిటీకి శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్నాడు. ఆయన కొంతకాలం గోవా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జిగా కూడా పనిచేసాడు. 35 సంవత్సరాలకు పైగా పార్టీకి సేవలందించిన తరువాత కేంద్ర, పంజాబ్ స్థాయిలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదాల కారణంగా ఆయన 2015 జనవరి 5న కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాడు.

ఫరీద్‌కోట్ నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎంపీగా ఉన్న కాలంలో (1992, 1999ల మధ్య) 1984 మారణహోమం, పంజాబ్ నదులు, పంజాబ్ రాజధాని, వ్యవసాయానికి సంబంధించి వివిధ సమస్యలను ఆయన గళం లేవనెత్తాడు. ఆ కృషిని ప్రశంసించిన పంజాబ్ ప్రజలు ఆయనను "ఆవాజ్-ఎ-పంజాబ్" అని పిలిచారు.

భారత జాతీయ కాంగ్రెస్ నుండి నిష్క్రమించిన తర్వాత, ఆయన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ పంజాబ్ శాఖకు అధ్యక్షుడయ్యాడు. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉన్నా కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో, ఆయన 2017 పంజాబ్ శాసనసభ ఎన్నిక లలో కొంతమంది అభ్యర్థులను నిలబెట్టాడు కానీ వారిలో ఎవరూ గెలవలేదు. పంజాబ్ సంబంధిత సమస్యలపై పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో విభేదాల కారణంగా 2017 జనవరి 25న ఆయన తృణమూల్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టాడు.

2019 ఏప్రిల్ 19 న ఆయన శిరోమణి అకాలీదళ్‌లో చేరాడు. తదనంతరం, ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడయ్యాడు. 2022 ఎన్నిక లకు మౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2021 సెప్టెంబరు 1 న ఆయన ఎంఎల్ఏ అభ్యర్థిగా ఎంపికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. Parliament of India: Biographical Sketch – Jagmeet Singh Brar
  2. Business Standard, BSCAL 2 December 1996: Jagmeet Singh Brar returns to Congress
  3. "Brar announces 'alliance' with AAP, Sanjay says only a 'tie-up'". Hindustan Times (in ఇంగ్లీష్). 2016-09-06. Retrieved 2021-09-27.
  4. "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 2021-09-27.
  5. Parliament of India: Biographical Sketch – Jagmeet Singh Brar
  6. Business Standard, BSCAL 2 December 1996: Jagmeet Singh Brar returns to Congress
  7. "Brar announces 'alliance' with AAP, Sanjay says only a 'tie-up'". Hindustan Times (in ఇంగ్లీష్). 2016-09-06. Retrieved 2021-09-27.
  8. "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 2021-09-27.
  9. Service, Tribune News. "Arrest Kairon, Dhindsa for scam: Jagmeet". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2021-09-27.