జయభేరి (కవిత)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జయభేరి కవిత మహాకవి శ్రీశ్రీ రచించిన సుప్రసిద్ధ కవిత. 20వ శతాబ్ది తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధమైన కవితా సంకలనం మహాప్రస్థానంలో ఇది ఒక కవిత. నేను సైతం ప్రపంచాగ్నికి అంటూ ప్రారంభమయ్యే ఈ కవిత తెలుగు వారి నానుడుల్లో, సినీ గీతాల్లో, పత్రికా పరిభాషలో నిలిచిపోయింది.

రచనా నేపథ్యం[మార్చు]

జయభేరి కవితతో బాటుగా మహాప్రస్థానంలోని అన్ని గేయాలు శ్రీశ్రీ అన్నార్త తృతీయదశకం(హంగ్రీ థర్టీస్)గా భావించే 1930ల్లో రాశారు. ప్రధానంగా 1934 నుంచి 1940 వరకూ ఆయన రాసిన అనేకమైన కవితల్లోంచి గొప్పవాటిని ఎంచుకుని మహాప్రస్థానాన్ని శ్రీశ్రీ ప్రచురించారు.
హంగ్రీ థర్టీస్ (1930 దశకం) ప్రపంచాన్ని ఆకలి, నిరుద్యోగం, విశృంఖలత్వం వీటిన్నిటికీ ఒక విధంగా మూలకారణమైన రెండవ ప్రపంచయుద్ధం, ఆర్థిక మాంద్యం వంటి లక్షణాలతో అతలాకుతలం చేసింది. శ్రీశ్రీ అదే సమయంలో అతని యువతలో చేసిన ఈ రచనల్లో ఆ దశకం యొక్క సాంఘికార్థిక రాజకీయ ప్రభావాలు కనిపిస్తాయి.[1]

కవితా వస్తువు[మార్చు]

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటూ సాగే ఈ కవితలో నేను కూడా అంతటి గొప్ప మహాగ్ని వంటి ఉద్యమానికి చిన్న ప్రయత్నమే చేశానని సూచిస్తూ ప్రారంభించారు. నేను సైతం విశ్వవృష్టికి అతిచిన్నదే అయినా ఒక అశ్రువును ధారపోశానని కొనసాగించారు. ఇలా సాగిన ఆరంభంలో 9 పంక్తులు మధ్యలో కొన్ని పంక్తులతో దారి మార్చి చివరగా అంతంలోని పంక్తుల్లో అవే మార్చి వ్రాశారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుచ్చానునని అన్నవాడే చివరకు నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను అన్నాడు. అలాగే విశ్వవృష్టికి చిన్న అశ్రువు ధారపోశానన్నవాడే తుదకు విశ్వవీణకు ఏకంగా తంత్రినై మూర్ఛనలు పోతానన్నాడు. నా కుహూరుతశీకరాలే, లోకమంతా జల్లులాడే, ఆ ముహూర్తాలాగమిస్తాయి అని ఉజ్వలమైన భవిష్యత్తుని సూచించారు.[1]

ప్రాచుర్యం, స్వీకరణలు[మార్చు]

జయభేరి గీతం తెలుగు నాట విస్తృతమైన ప్రాచుర్యాన్ని పొందింది. నేను సైతం అన్న ఈ పాటలోని పదబంధం తెలుగులో మహదాశయానికి తాను కూడా చేయగల చిన్న ప్రయత్నాన్ని గురించి వివరించడానికి ఉపయోగిస్తున్నారు. రాజకీయ పక్షాలు, సాంఘిక, సాహిత్య సంఘాలు చేసే సభల్లో ఈ పదాన్ని, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్న వాక్యం ఉపయోగిస్తున్నారు.[1] ఈ గీతాన్ని అడాప్ట్ చేసుకుని దానికి తమ సందర్భానికి తగ్గ మార్పులు చేసి సినిమాల్లో వినియోిగించుకున్నారు.

  • రుద్రవీణ (సినిమా)లో చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది అన్న పాట చివర్లో నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను మొదలుకొని కొన్ని పాదాలను వినియోగించుకున్నారు. గీతాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు.
  • ఠాగూర్ (సినిమా)లో నేను సైతం ప్రపంచాగ్నికి (పాట)లో పల్లవి ఈ గీతం నుంచే స్వీకరించారు. రుద్రవీణలో నేను సైతం ప్రపంచాబ్జపు నుంచి మూడు చరణాలు వినియోగించుకోగా దీనిలో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని వున్న మొదటి పాదం నుంచి మూడు పాదాలు ఉపయోగించుకున్నారు. మధ్యలో సుద్దాల అశోక్ తేజ వ్రాసిన మరో మూడు పాదాలుండగా తిరిగి చివర మళ్ళీ నేను సైతం ప్రపంచాగ్నికి వస్తుంది. ఈ సినీగీతానికి ఉత్తమ సినీ గేయరచయితగా సుద్దాల అశోక్ తేజ ప్రతిష్టాత్మకమైన జాతీయ పురస్కారం పొందారు.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 రాధాకృష్ణ, బూదరాజు (1999). మహాకవి శ్రీశ్రీ (ప్రథమ ముద్రణ ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ. ISBN 81-260-0719-2.