Jump to content

జలాంతర్గామి

వికీపీడియా నుండి
మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన జర్మన్ UC-1 తరగతి జలాంతర్గామి

జలాంతర్గామి (ఆంగ్లం: submarine) నీటిలో మునిగి ప్రయాణం చెయ్యగల వాహనం. వివిధ దేశాల నావికా రక్షణ దళాల్లో జలాంతర్గామి ఒక ముఖ్య భాగం. జలాంతర్గామిని మొదటగా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో విస్తృతంగా ఉపయోగించారు.[1] భారత నౌకాదళంలో సింధుఘోష్ ముదలగు జలాంతర్గాములు ఉన్నాయి.[2]

ఆద్యుడు అలెగ్జాండర్‌

[మార్చు]

ప్రత్యర్ధులు జలగర్భ మార్గాల ద్వారా దొంగదెబ్బ తీసే అవకాశం ఉందని క్రీ.పూ. 332లోనే గుర్తించాడు అలెగ్జాండర్‌. అందుకే జలాల కింద కూడా పహారా కాయాలని అనుచరులను ఆదేశించాడు. ఓ అమోఘమైన ఘంటజాడీ (డైవింగ్‌ బెల్‌) ని రూపొందించి దాన్లో ఆయనే స్వయంగా జలాల్లోకి దిగినట్టు ప్రతీతి!

డావిన్చీ భయం

[మార్చు]

పదిహేనో శతాబ్దం చివర్లో.. విఖ్యాత దార్శనికుడైన లియోనార్డో డావిన్చీ.. జల మధ్యంలోకి దూసుకుపోయే సైనిక పాటవం గురించి ప్రస్తావించాడుగానీ ఇది 'సముద్రాల అడుగునే మట్టుబెట్టే నరహంతక బుద్ధి'కి ఊతం ఇస్తుందని భయపడి, దానిని పక్కనబెట్టేశాడు.

మొదటి జలాంతర్గమనం

[మార్చు]

జలాల లోలోపల మనిషి కదలికలు ఆరంభమైన సంవత్సరం 1620. ఇంగ్లండ్‌లో ఉంటున్న డచ్‌ వైద్యుడు కొర్నీలియస్‌ డ్రబ్బెల్‌ కాస్త ఎక్కువ సమయం నీటిలోపల ఉండి ప్రయాణించేందుకు వీలైన తొలి జలాంతర గమన వాహనం సిద్ధం చేశాడు. గొర్రె తోలుతో కప్పిన చెక్క పెట్టెలాంటి దీని లో- తెడ్డువేసే వారితో సహా మొత్తం 20 మంది ప్రయాణించవచ్చు.

అంతర్జల హోరాహోరీ

[మార్చు]

1776 సెప్టెంబరు. న్యూయార్క్‌ ఓడరేవులో మోహరించిన బ్రిటన్‌ యుద్ధనౌకలపై 'దొంగదాడి'కి అమెరికా సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక యేల్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి డేవిడ్‌ బుష్‌నెల్‌ పైకి కనబడకుండా తాబేలులా నీటిలోనే ప్రయాణించే 'టర్టిల్‌'ను సిద్ధం చేశాడు. లోపలి వ్యక్తి చేత్తో పెడల్స్‌ తిప్పుతుంటే ప్రొపెల్లర్స్‌ సాయంతో నీళ్లలో కదిలిపోతుందిది. ప్రత్యర్ధుల కళ్లు గప్పి.. వాళ్ల ఓడలకు రంధ్రాలు చేసి, వాటిని ముంచెయ్యటం దీని లక్ష్యం.

ప్రచ్ఛన్నయుద్ధం

[మార్చు]

అమెరికాకు చెందిన రాబర్ట్‌ ఫల్టన్‌ 1798లో జలాంతర్గామి లోపలి గోడ చుట్టూ మరో పై గోడ నిర్మించి.. మధ్య ఖాళీలో నీరు నింపేలా 'బలాస్ట్‌ ట్యాంకులు' అమర్చాడు! ఆధునిక జలాంతర్గాముల్లో వాడే బల్లాస్ట్‌ ట్యాంకులకు కూడా ఈ నమూనానే ఆధారం. అమెరికా, రష్యాలు జలాంతర్గాములతోనే ప్రచ్ఛన్న యుద్ధం సాగించాయి.

తొలి అణు జలాంతర్గామి

[మార్చు]

జలాంతర్గాములకు ప్రధాన సమస్య ఇంధనం. తరచూ డీజిల్‌ నింపుకోటానికి పైకివస్తే శత్రువుల కంటబడటం తథ్యం. అణుఇంధనంతో ఈ ఇబ్బంది ఉండదు. ఇలా 1954లో అమెరికా మొట్టమొదటిసారిగా అణుఇంధనంతో నెలల తరబడి నీటిలోనే నడిచే 'యుఎస్‌ఎస్‌ నాటిలస్‌'ను, ఆ తర్వాత బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగ జలాంతర్గాములను రూపొందించింది. 'నాటిలస్‌' కేవలం 8 పౌనుల యురేనియాన్ని ఇంధనంగా తీసుకుని దాదాపు 60,000 మైళ్లు ఏకథాటిగా ప్రయాణించింది. 26,500 టన్నుల సామర్థ్యంతో రష్యా నిర్మించిన టైఫూన్‌ రకానివి అతి పెద్ద జలాంతర్గాములు.

మూలాలు

[మార్చు]
  1. Thomas Adam. Germany and the Americas. p. 1155.
  2. "Sindhughosh Class | Indian Navy". www.indiannavy.nic.in. Retrieved 2021-05-18.