జాన్ గ్రీషమ్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (జూలై 2017) |
జాన్ రే గ్రీషమ్ అమెరికాలో పేరెన్నిక గల నవలా రచయిత. ఒకవైపు రచనలు చేస్తూనే రాజకీయవేత్తగా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా కూడా తనదైన పాత్రను పోషించారు. ఇతని పుస్తకాలు దాదాపు 42 ప్రపంచ భాషల్లో అనువాదమయ్యాయి. గ్రీషమ్ నవలలు అనేకం లీగల్ థ్రిలర్స్‌గా చెలామణీ అయ్యాయి. మిసిసిపీ స్టేట్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గ్రీషమ్ తర్వాత న్యాయశాస్త్రంలో కూడా డిగ్రీని పొందారు. క్రిమినల్ లాయర్‌గా గుర్తింపునూ పొందారు. 1984లో తన తొలి నవల ‘ఏ టైమ్ టు కిల్‘ను రాశారు. 1989లో ప్రచురణకు నోచుకున్న ఈ పుస్తకం 2012 నాటికి ప్రపంచవ్యాప్తంగా 275 మిలియన్ల కాపీలు అమ్ముడుపోయింది. అమెరికాలో తొలి పుస్తకమే 2 మిలియన్ల కాపీలు అమ్ముడైన రచయితలు ముగ్గురే ముగ్గురు. అందులో టామ్ క్లాన్సీ, జే. కే. రౌలింగ్లతో పాటు గ్రీషమ్ కూడా ఒకరు. 1991లో గ్రీషమ్ రాసిన ‘ది ఫర్మ్’ 7 మిలియన్ల కాపీలు అమ్ముడైపోయి రికార్డు నమోదు చేసింది. 1993లో ఇదే నవలను ఇదే పేరుతో టామ్ క్రూజ్ కథానాయకుడిగా సినిమాగా తెరకెక్కించారు. గ్రీషమ్ నవలల్లో సినిమాలుగా తెరకెక్కినవాటిలో ది ఛాంబర్, ది క్లైంట్, ఏ పెయింటెడ్ హౌస్, ది పెలికన్ బ్రీఫ్, స్కిప్పింగ్ క్రిస్‌మస్, ది రెయిన్ మేకర్, ది రన్ అవే జ్యూరీ మొదలైన వాటిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు.
జీవిత నేపథ్యం
[మార్చు]జాన్ గ్రీషమ్ అమెరికాలోని అర్కన్సాస్‌లో ఒక పత్తిరైతు కుటుంబంలో జన్మించాడు. గ్రీషమ్‌కు నాలుగేళ్లు ఉన్నప్పుడే అతని కుటుంబం మిసిసిపీకి తరలిపోయింది. చిన్నప్పటి నుండి జాన్‌కు బేస్‌బాల్ ఆటగాడు అవ్వాలన్నదే లక్ష్యం. ది పెయింటెడ్ హౌస్ నవలలోని ఘట్టాలన్నీ కూడా గ్రీషమ్ తన బాల్యం ఆధారంగానే రాయడం జరిగింది. కాలేజీ పూర్తయ్యాక గ్రీషమ్ ఎన్నో ఉద్యోగాలు మారాడు. ఒక డిపార్టుమెంటల్ స్టోరులో అండర్ వేర్లు అమ్మే వ్యక్తిగా తను పడిన కష్టాల గురించి కూడా గ్రీషమ్ అనేక ఇంటర్వ్యూలలో పేర్కొన్నాడు. తర్వాత ట్యాక్స్ లాయర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకున్నా అతని చదువు సజావుగా సాగలేదు. కోర్సు పూర్తి చేయడానికి మూడు కాలేజీలు మారాల్సి వచ్చింది.
రాజకీయాలు – న్యాయవాదిగా ప్రస్థానం
[మార్చు]లాయర్‌గా మంచి పేరు, ప్రఖ్యాతులు గడించాక గ్రీషమ్ స్థానిక ఎన్నికల్లో డెమోక్రాట్‌గా పోటీ చేసి గెలిచాడు. ఆ పదవిలో 1983 నుండి 1990 వరకు ఉన్నాడు. ది ఫర్మ్ – నవల విడుదలై రికార్డు సాధించే వరకూ తను న్యాయవాదిగా కేసులు వాదించేవాడు. ది టైమ్ టు కిల్ పేరుతో గ్రీషమ్ రాసిన నవల వెనుక కూడా ఒక విషాదభరితమైన కథ ఉంది. ఒకసారి కోర్టు బయట తను తచ్చాడుతుండగా.. ఓ 12 ఏళ్ల అమ్మాయి వచ్చి తనను ఎలా కొందరు ముష్కరులు రేప్ చేసి, చిత్రహింసలు పెట్టారో చెప్పినప్పుడు గ్రీషమ్ మనసు ద్రవించింది. అదే అంశాన్ని సబ్జెక్టుగా తీసుకొని, ఒకవేళ ఆ అమ్మాయి తండ్రి ఆ ముష్కరులను తుదముట్టడించడానికి ప్లాన్ వేస్తే, ఎలాగుంటుంది అన్న ప్లాట్‌తో రాసిన నవలే ‘ది టైమ్ టు కిల్’. దాదాపు 28 మంది ప్రచురణకర్తలు ఆ నవలను ముద్రించడానికి ముందుకు రాలేదు. ఓ అపరిచిత పబ్లిషర్ ఓ 5000 కాపీలు మాత్రమే వేయడానికి ముందుకొచ్చాడు.
రచయితగా కెరీర్
[మార్చు]గ్రీషమ్ నవల ‘ది ఫర్మ్’ విజయవంతమయ్యాక తను వెనక్కి తిరిగి చూసుకొనే పరిస్థితి రాలేదు. తర్వాత తాను రాసిన అన్నీ నవలలూ దాదాపుగా బెస్ట్ సెల్లర్స్‌గానే కితాబునందుకున్నాయి. బేస్ బాల్ క్రీడను అభిమానించే గ్రీషమ్ 2004లో ఆ క్రీడానేపథ్యంతో ‘మిక్కీ’ అనే చిత్రాన్ని నిర్మించారు. దానికి స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు. 2010 నుండి గ్రీషమ్ 9-12 ఏళ్ల పిల్లల కోసం లీగల్ థ్రిల్లర్స్ రాయడం మొదలుపెట్టారు. 2006లో చార్లీ రోజ్ షో అనే ఒక టాక్ షోలో గ్రీషమ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తను సాధారణంగా ఒక పుస్తకాన్ని రాయడానికి 6 నెలలు తీసుకుంటానని చెప్పారు. తన అభిమాన రచయిత జాన్ లీ కారే అని కూడా పేర్కొన్నారు.
వ్యక్తిగత జీవితం - గ్రీషమ్ 1981 మే 8లో రీనీ జోన్స్‌ను వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలు.
అవార్డులు
[మార్చు]- 2005 పెగ్గీ వి హెల్మిర్చ్ స్మారక పురస్కారం
- 2007 గ్యాలక్సీ బ్రిటీష్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కారం
- 2009 కాల్పనిక సాహిత్యంలో చేస్తున్న సేవకు గాను లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ క్రియేటివ్ అచీవ్‌మెంట్ అవార్డు
- 2014 స్కామోర్ రో నవలకు లీగల్ ఫిక్షన్ విభాగంలో హార్పర్ లీ పురస్కారం
నవలలు
[మార్చు]- ఏ టైమ్ టు కిల్ (1989)
- ది ఫర్మ్ (1991)
- ది పెలికన్ బ్రీఫ్ (1992)
- ది క్లైంట్ (1993)
- ది ఛాంబర్ (1994)
- ది రెయిన్ మేకర్ (1995)
- ది రన్ అవే జ్యూరీ (1996)
- ది పార్టనర్ (1997)
- ది స్ట్రీట్ లాయర్ (1998)
- ది టెస్ట్‌మెంట్ (1999)
- ది బ్రెత్‌రెన్ (2000)
- ది పెయింటెడ్ హౌస్ (2001)
- స్కిప్పింగ్ క్రిస్‌మస్ (2001)
- ది సమ్మన్స్ (2002)
- ది కింగ్ ఆఫ్ టోర్ట్స్ (2003)
- బ్లీచర్స్ (2003)
- ది లాస్ట్ జూరర్ (2004)
- ది బ్రోకర్ (2005)
- ప్లేయింగ్ ఫర్ పిజ్జా (2007)
- ది అపీల్ (2008)
- ది అసోసియేట్ (2009)
- ది కన్‌ఫెషన్ (2010)
- ది లిటిగేటర్స్ (2011)
- కేలికో జోయ్ (2012)
- ది రాకెటీర్ (2012)
- సైకామోర్ రో (2013)
- గ్రే మౌంటెయిన్ (2014)
- రోగ్ లాయర్ (2015)
- ది విజ్లర్ (2016)