జార్జి ఉగ్లోవ్ పోప్
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
"పోప్ అయ్యర్"గా తమిళులు పిలుచుకునే జార్జి ఉగ్లోవ్ పోప్ (1820–1908) [1] లేదా రెవరెండ్ జి. యు. పోప్ లేదా జి. యు. పోప్ క్రిస్టియన్ మత బోధకుడు, తమిళ పండితుడు. తన జీవితంలో 40 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని తమిళ నాట గడిపి అనేక తమిళ రచనలను ఆంగ్లంలోకి అనువదించారు. ప్రాచుర్యం పొందిన ఆయన అనువాదాల్లో తిరుక్కురళ్, తిరువాచకం వంటివి ఉన్నాయి. బెంగళూరులోని బిషప్ కాటన్ బాయ్స్ స్కూలులో ప్రధానోపాధ్యాయునిగా, ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన బాలైల్ కాలేజిలో ఉపన్యాసకునిగానూ పనిచేశారు. తమిళ సంస్కృతిని ప్రచారం చేయడంలో ఆయన కృషిని గుర్తిస్తూ చెన్నైలో పోప్ విగ్రహాన్ని నెలకొల్పారు.
జీవిత చరిత్ర
[మార్చు]జార్జి ఉగ్లోవ్ పోప్ 1820 ఏప్రిల్ 24న కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపానికి చెందిన బెడెక్ లో జన్మించారు. ఆయన తండ్రి జాన్ పోప్ (1791 - 1863) మొదట్లో వ్యాపారస్తుడు, తర్వాతికాలంలో మతబోధకుడై 1818లో ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపానికి వలసవెళ్ళారు. 1826లో ఇంగ్లాండుకు తిరిగివెళ్ళడానికి ముందే సెయింట్ విన్సెంట్ ప్రాంతానికి మారారు.[2] జార్జ్ ఉగ్లోవ్ పోప్ తమ్ముడు విలియం బర్ట్ పోప్ (1822-1903) కూడా వెస్లేయన్ పద్ధతికి చెందిన మతబోధకునిగా, క్రైస్తవ సిద్ధాంతకర్తగా సుప్రసిద్ధి పొందారు.[3]
1839లో దక్షిణ భారతదేశానికి బయలుదేరి, ట్యుటికోరన్ ప్రాంతానికి వచ్చారు. పోప్ తన యౌవనంలోనే ఇంగ్లాండులో తమిళం చదువుకోవడం ప్రారంభించారు. కృషి కొనసాగిస్తూ తమిళ, సంస్కృత, తెలుగు భాషల్లో పండితుడు అయ్యారు. పలు పాఠశాలలు నెలకొల్పి లాటిన్, ఆంగ్లం, హీబ్రూ, గణితం, తత్వశాస్త్రం బోధించారు.
1849లో పోప్, అతని రెండవ భార్య హెనిరెట్టా వాన్ సోమెరాన్ ఇంగ్లాండుకు తిరిగివెళ్ళి, ఆక్స్ ఫర్డ్ లో పలు ఆక్స్ ఫర్డ్ ఉద్యమంలోని పలువురు ఆంగ్లో-కేథలిక్ నేతలతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు.[4]
1851లో పోప్ భారతదేశానికి తిరిగివచ్చి, తంజావూరులో సెయింట్ పీటర్ పాఠశాలలో ఆరేళ్ళు బోధించారు. 1886 సెప్టెంబరు 1లో తిరుక్కురళ్ అనువాదం పూర్తిచేశారు. తిరుక్కురళ్ అనువాదమైన సేక్రెడ్ కురళ్ లో ప్రవేశిక, వ్యాకరణం, అనువాదం, నోట్స్, వంటి విభాగాలు ఉన్నాయి. గ్రంథం ఎఫ్. డబ్ల్యు. ఎలీస్ చేసిన ఆంగ్లానువాదం, కాన్స్టాంజో బెస్కీ చేసిన లాటిన్ అనువాదం సహా 436 పేజీల్లో విస్తరించింది. 1893 ఫిబ్రవరిలో నాలాదియార్ అనువాదం పూర్తిచేశారు.
ఆయన సుప్రసిద్ధ రచన, తిరువాచకం అనువాదం 1900లో పూర్తైంది. ఈ సందర్భంగా ఆయన రాస్తూ - ఇది నా 80వ జన్మదినం. నా తొలి తమిళ పాఠం 1837లో ప్రారంభించాను. తమిళ అధ్యయనానికి కేటాయించిన నా సుదీర్ఘ జీవిత భాగం దీనితో పూర్తవుతోంది. లోతైన ఆర్ద్రతతోనే నా జీవితపు సాహిత్య కృషిని ముగిస్తున్నాను అని పేర్కొన్నారు.
బెంగళూరులోని బిషప్ కాటన్ స్కూలు వ్యవస్థాపక సభ్యుల్లో రెవరెండ్ జార్జ్ ఉగ్లోవ్ పోప్ ఒకరు, దీనికి వార్డెన్ గా కూడా ఆయన పనిచేశారు. బెంగుళూరులోని ఆల్ సెయింట్స్ చర్చిలో తొలి మతబోధకునిగా ఆయన పనిచేశారు.[5] ఊటీలోని హోలీ ట్రినిటీ చర్చ్ ఆయన స్థాపించారు, 1859 నుంచి 1870 వరకూ ఒక గ్రామర్ స్కూల్ కూడా నడిపించారు.
1906లో రాయల్ ఆసియాటిక్ సొసైటీ వారి బంగారు పతకం బహుమతిగా పొందారు. ఆయన 1908 ఫిబ్రవరి 12లో మరణించారు. ఇంగ్లాండుకు చెందిన మధ్య ఆక్స్ ఫర్డ్ ప్రాంతంలోని జెరికోలో సెయింట్ సెపుల్క్రెస్ సెమెంటరీలో ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేశారు.
విమర్శలు
[మార్చు]జి.యు.పోప్ ప్రాచీన తమిళ సాహిత్యాన్ని భారతీయేతర, హిందూయేతర సాహిత్యంగా పేర్కొంటూ క్రైస్తవానికి అనుసంధానం చేయడంలో కీలకపాత్ర పోషించారని రాజీవ్ మల్హోత్రా, అరవిందన్ నీలకందన్ లు పేర్కొన్నారు. పోప్ తన అనువాదానికి పీఠికలో ప్రాచీన తమిళ కవి తిరువళ్ళువర్ క్రైస్తవ ప్రభావానికి గురయ్యాడనీ, క్రైస్తవ మత ప్రబోధకుల నుంచి సెర్మన్ ఆన్ ది మౌంట్ గ్రహించడం వల్లనే నైతిక సూత్రాలు అలవరుచుకున్నాడనీ వివాదాస్పద, ఆధార రహిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని తమిళ భాషను అధ్యయనం చేసిన సమకాలీన క్రైస్తవ బోధకులు సహా పలువురు తిరస్కరించగా, అనంతర కాలపు చరిత్రకారులు ఈ ప్రయత్నం తమిళ మూలాలను క్రైస్తవీకరించే ఉద్దేశంతో చేసిందని విమర్శించారు.[6]
మూలాలు
[మార్చు]- ↑ http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/17924/11/11_chapter%205.pdf
- ↑ "Uglow Family History". www.kent.ac.uk. Retrieved 2015-12-31.
- ↑ "The Dictionary of National Biography - William Burt Pope".
- ↑ Oxford Dictionary of National Biography. oxforddnb.com/view/article/35572?docPos=16.
{{cite book}}
: CS1 maint: location (link) - ↑ Rizvi, Aliyeh (29 December 2014). "Resident Rendezvoyeur: A natural state of grace". Bangalore Mirror. Retrieved 29 December 2014.
- ↑ మల్హోత్రా, రాజీవ్; నీలకందన్, అరవిందన్ (మే 2014). "ద్రావిడజాతి ఆవిష్కరణ". భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు (in తెలుగు (అనువాదం)). హైదరాబాద్: ఎమెస్కో బుక్స్. pp. 56–67.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)