జిఎస్ఎన్ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జిఎస్ఎన్ శాస్త్రి

ప్రముఖ రంగప్థల నటులు, దర్శకులు, నట శిక్షకులు, రచయిత అయిన జిఎస్ఎన్ శాస్త్రి గారి పూర్తిపేరు గరికపాటి సుబ్బ నరసింహశాస్త్రి. 1934లో గుంటూరులో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు అంజమ్మ, గరికపాటి లక్ష్మీనరసింహశాస్త్రి. ఈయన 9వ ఏట నాటకాలు మొదలుపెట్టి కొన్ని వేల పౌరాణిక నాటక ప్రదర్శనలు ఇచ్చారు. రఘురామయ్య, పీసపాటి, అద్దంకి శ్రీరామ్మూర్తి, బందా కనకలింగేశ్వరరావు వంటి మహానటులు, జనస్వామి సుబ్రహ్మణ్యశాస్త్రిలాంటి అలంకార శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసారు.

1968లో రాష్ట్రప్రభుత్వ ఉద్యోగిగా బదిలీపైన హైదరాబాద్ కు వచ్చి, కొత్త నటులకు తర్ఫీదు ఇవ్వడంతోపాటు రాయబారం, గయోపాఖ్యానం లాంటి అనేక పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. 1981లో డైరెక్టరేట్ ఆఫ్ కల్చరల్ అఫెయిర్స్ ఏర్పడినపుడు దానికి తొలి డైరెక్టర్ జెవి సోమయాజులు గారు. ఆయన కోరిక మేరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అక్కడ చేరారు. నటనను మానుకుని ఔత్సాహిక నటులకు శిక్షణ ఇవ్వడం, ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీలలో ఉపన్యాసాలు ఇవ్వడం చేసేవారు. 1992లో పదవీ విరమణ చేశారు.

రచనలు

[మార్చు]

దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు పద్య నాటకానికి ఆంగిక, వాచికాభినయంలో ప్రత్యేక శాస్త్ర గ్రంథాలు లేని లోటును తీర్చారు. రెండు గ్రంథాలు రచించారు.

1. అభినయ కౌముది (పద్యనాటక ప్రయోగ సిద్ధాంతం)[1]
2. అభినయ సంగ్రహము (శ్రీకృష్ణ తులాభారం, సత్యహరిశ్చంద్రీయం, గయోపాఖ్యానం, పాండవ నాటకాలు, చింతామణి నాటకాల మీద విశ్లేషణ, పాత్రల విశ్లేషణ…ఏ పాత్ర ఎలా అభినయించాలి..ఏ పద్యానికి ఏ రాగం ఉండాలి.. వంటి అభినయానికి సంబంధించిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. రస నిర్వచనం, సాత్త్విక భావాలు, సంచారీ భావాలు, స్థాయీ భావాలను ఇందులో వివరించడం జరిగింది)

1993లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, రాష్ట్ర ప్రభుత్వం కలసి పద్యనాటక పోటీలు నిర్వహించాయి. అందుకోసం ఒక 40 మంది నటులను ఎంపిక చేసి వర్క్‌షాప్ నిర్వహించి వారిని పద్యనాటకంలో తీర్చిదిద్దాలి. మనం ఇస్తున్న ఈ శిక్షణ మాటల్లో కాక అక్షరరూపంలో ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో ‘అభినయ కౌముది’ రాయడానికి పూనుకున్నారు. అప్పటి దాకా పౌరాణిక పద్యనాటకానికి గ్రంథరూపమేదీ లేదు. అభినయం, ఆంగికాభినయం, వాచికాభినయం, పద్యం ఎలాగుండాలి, ఏ రాగంలో ఉంటే ఆ రసానుభూతి వస్తుంది. పద్యాన్ని ఎక్కడ విరవాలి…ఇవన్నీ ఎవరికీ తెలియదు. రెండేళ్లు కష్టపడి రాశారు.

తెలుగు వర్సిటీ విసిగా ఉన్న జివి సుబ్రహ్మణ్యం గారికి తెలుగు పద్యనాటకంపై ఒక డిప్లొమా కోర్సు పెట్టాలన్న ఆలోచన ఉండేది. ఆయన కోర్కె మేరకు నేను అక్కడి విద్యార్థులకు పాఠాలు చెబుతూ.. సిలబస్ కూడా తయారు చేశారు. పద్య నాటకం కోర్సు థియరీ, ప్రాక్టికల్స్ చెప్పడంతోపాటు ప్రతి ఏడాది ఒక సంస్కృత నాటకాన్ని వారి చేత ఆడించేవారు. అలా ఐదేళ్లు తెలుగు వర్సిటీ పనిచేశారు. కొన్ని కారణాల వల్ల తెలుగు యూనివర్సిటీ ద్వారా ‘అభినయ కౌముదిని’ ప్రచురించలేకపోయింది. ఇచ్చిన ప్రతి కూడా అభించకపోవడంతో చేసేదేమీ లేక మళ్లీ ఏడాది పాటు కష్టపడి మొత్తం రాసి అభినయ కౌముదిని టిటిడి ఆర్థిక సహాయంతో ప్రచురించారు.

మూలాలు

[మార్చు]
  1. Srihari, Gudipoodi (2012-08-02). "The best of the verse". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2022-10-23. Retrieved 2022-10-23.

ఇతర లింకులు

[మార్చు]