జి. పుల్లారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి.పుల్లారెడ్డి
జననంగుణంపల్లి పుల్లారెడ్డి
ఆగష్టు 12,1920
కర్నూలు జిల్లా గోకవరం
ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
మరణంమే 7,2007
హైదరాబాద్
నివాస ప్రాంతంకర్నూలు, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం
ఇతర పేర్లుజి.పుల్లారెడ్డి
వృత్తివ్యాపారవేత్త, దాత,హిందూత్వ వాది
ప్రసిద్ధిపుల్లారెడ్డి నేతి మిఠాయిలు దుకాణ సముదాయ వ్యవస్థాపకులు
మతంహిందు
పిల్లలుముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు
తండ్రిహుస్సేన్ రెడ్డి
తల్లిపుల్లమ్మ

జి.పుల్లారెడ్డిగా సుపరిచితులైన గుణంపల్లి పుల్లారెడ్డి గారు పుల్లారెడ్డి స్వచ్ఛమైన నేతి మిఠాయిల దుకాణాల వ్యవస్థాపకులు. దాత, హిందూ జాతీయ వాది, విశ్వ హిందూ పరిషత్ మాజీ కోశాధికారి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

గుణంపల్లి పుల్లారెడ్డి 1920 ఆగస్ట్ 12న కర్నూలు జిల్లా గోకవరం గ్రామంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుల్లమ్మ హుస్సేన్ రెడ్డి దంపతులకు జన్మించారు. వీరి ధర్మపత్ని నారాయణమ్మ గారు. పుల్లారెడ్డి దంపతులకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు కలరు. చిన్నాన్న కసిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రోద్బలంతో పుల్లారెడ్డి గారు మిఠాయిల వ్యాపారం లోనికి అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ లోనే పుల్లారెడ్డి స్వచ్ఛమైన నేతి మిఠాయిల దుకాణాలను అగ్రగామిగా తీర్చిదిద్దారు.

వ్యాపారం[మార్చు]

తొలుత టీ దుకాణం, మజ్జిగ అమ్మడం, బట్టల దుకాణం వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసినా, చిన్నాన్న ప్రోత్సాహంతో కర్నూలులో 1948లో ప్రారంభించిన మిఠాయిల దుకాణం అయన జీవితాన్ని మార్చివేసింది. తన వ్యాపార దక్షతతో పుల్లారెడ్డి మిఠాయిలను స్వచ్ఛతకు, రుచికి మారుపేరుగా నిల్పారు. అనతికాలంలోనే పుల్లారెడ్డి నేతి మిఠాయిలు ప్రాచుర్యంలోకి రావడంతోపాటు వ్యాపారం కూడా విస్తరించింది. తరువాత 1957వ సంవత్సరం హైదరాబాద్ లోని అబిడ్స్ లో కూడా దుకాణాన్ని తెరిచారు. ఒక చిన్న దుకాణంగా ప్రారంభమైన అయన వ్యాపారం ఇప్పుడు వందల మంది పనివారితో విదేశాలకు సైతం మిఠాయిలు పంపేంతగా ఎదిగింది. పనివారిని సొంతమనుషుల్లా చూసుకుని వారికి ఇళ్లుకూడా కట్టించారు.

స్ఫూర్తి వ్యాక్యలు, వ్యాపార సూత్రాలు[మార్చు]

పుల్లారెడ్డి గారు వ్యాపార ప్రారంభ సమయంలో చిన్నాన్న వెంకటరెడ్డి చెప్పిన వ్యాపార సూత్రాలు జీవితాంతం ఆచరించారు. అవి

1.నీవు తినేదే నీ పనివాళ్ళకు పెట్టు.
2.వ్యాపారానికి కావలసిన ముడిసరుకులు నీవే కొని తెచ్చుకో. ఇతరులను పంపించకు.
3.మిఠాయి చేసిన తరువాత రుచి చూసి బాగుంటేనే అమ్ము బాగాలేకపోతే అమ్మకు.
4.ధనికుడికైనా దరిద్రుడికైనా ఒకటే ధరకు అమ్ము.
5.తూకంలో ఒక తులం ఎక్కువైనా పరవాలేదు కాని తక్కువ కాకుండా చూసుకో.
6.పాకశుద్ధి ఎంత అవసరమో వాక్శుద్ధి కుడా అంతే అవసరం కనుక అబద్దం ఆడకు.

సమాజ సేవ[మార్చు]

పుల్లారెడ్డి గారు పరిస్థితుల ప్రభావం వాళ్ళ 5వ తరగతి వరకు మాత్రమే చదివారు, కానీ ఆయనకు చదువంటే అమితమైన అభిమానం. వ్యాపారంలో ఎదిగిన కొద్దీ ప్రజలకు, సమాజానికి ఏమైనా చేయాలన్న తపనతో 1975వ సంవత్సరం హైదరబాద్ లో జి. పుల్లారెడ్డి ఛారిటీస్ ట్రస్ట్ ను ఏర్పరిచి దాని ద్వారా విద్యావ్యాప్తికై కృషిచేశారు. 1984-85 లో జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను,1994 -95లో జి.పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలను, మహిళల కోసం 1997లో జి.నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారు. ట్రస్ట్ తరపున ఎందరో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తూ విద్యావ్యాప్తికి తనవంతు కృషి చేసారు. కర్నూలు జిల్లాలోని ఎన్నో పాఠశాలల అభివృద్ధికి సహాయం చేశారు. అనాథ బాలురకోసం విజ్ఞాన పీఠం పేరుతొ విద్యాలయాన్ని స్థాపించి వారికి విద్యతో పాటు వసతి, భోజన ఏర్పాట్లను చూస్తున్నారు. ఎన్నో ప్రాథమిక, మధ్యమ, ఉన్నత పాఠశాలలను, డిగ్రీ కళాశాలలను స్థాపించారు.

హిందూత్వ ప్రభావం[మార్చు]

పుల్లారెడ్డి గారి పై భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలతో పాటు, హిందూ మత ప్రభావం ఏంతో ఉంది. తన దానధర్మాలలో భాగంగా అనేక దేవాలయాల పునరుద్ధరణకు, నిర్మాణాలకు భూరి విరాళాలు ఇచ్చేవారు. ఆ క్రమం లోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.), విశ్వ హిందూ పరిషత్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆర్.ఎస్.ఎస్ లో 1974లో సర్ సంఘ్ చాలక్ అయ్యారు. 1980లో విశ్వ హిందూ పరిషత్ హైదరాబాద్ శాఖకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. సంస్కృత భాషా ప్రచార సమితి అధ్యక్షునిగా, విశ్వ హిందూ పరిషత్ జాతీయ కోశాధికారిగా, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. వీరి మరణానంతరం వీరి కుమారుడు జి.రాఘవ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

పురస్కారాలు[మార్చు]

1991లో ఉడుపి పెజావర్ పీఠం వారు దానగుణ భూషణ అనే బిరుదునిచ్చి సత్కరించారు. 1992లో జమ్నాలాల్ బజాజ్ అవార్డు పొందారు.

నిర్యాణము[మార్చు]

2007, మే 7 న వీరు పరమపదించారు.[1]

మూలాలు[మార్చు]

  1. http://www.youtube.com/watch?v=Jb5SyBrNLZc