జీన్ పెరిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీన్‌ పెరిన్/Jean Baptiste Perrin

జీన్ బాప్టిస్ట్ పెరిన్ (1870 సెప్టెంబరు 30 - 1942 ఏప్రిల్ 17) ఒక ఫ్రెంచి భౌతిక శాస్త్రవేత్త. ఈయన ద్రవ పదార్థాలలో తేలియాడే సూక్ష్మ కణాల కదలికలకు సంబంధించిన బ్రౌనియన్ చలనం గురించి పరిశోధన చేశాడు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన వివరణను ఈయన నిర్ధారించాడు. ఇది పదార్థపు పరమాణు నిర్మాణాన్ని రూఢిపరిచింది. ఈ పరిశోధనలకు గాను ఈయనకు 1926 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

ఫ్రాన్స్‌ దేశంలోని లిలీ నగరంలో 1870 సెప్టెంబరు 30న పుట్టిన పెరిన్‌ ప్యారిస్‌లో చదువుకున్నాడు. కేథోడ్‌ కిరణాలు, ఎక్స్‌ కిరణాలపై చేసిన ప్రయోగాల వల్ల ఇరవై నాలుగేళ్లకే డాక్టరేట్‌ సాధించాడు. ఆపై అధ్యాపకుడిగా చేరి, ప్రొఫెసర్‌గా ఎదిగాడు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ, ఫ్రాన్స్‌ను ఆక్రమించేవరకూ అదే పదవిలో కొనసాగాడు. తర్వాత నాజీల బారి నుంచి తప్పించుకోడానికై అమెరికాకు వలస వెళ్లాడు.

కేథోడ్‌ కిరణాలకు రుణ విద్యుదావేశం ఉంటుందని నిరూపించాడు. వాయువుల వాహకత్వం (conductivity) పై ఎక్స్‌రేల ప్రభావం, రేడియం ప్రతిదీప్తి (fluorescence), ధ్వని ఉత్పాదన, ప్రసారాల గురించి కూడా ముఖ్యమైన పరిశోధనలు చేశాడు. అతి నిశితమైన సూక్ష్మదర్శిని సాయంతో ఆయన చేసిన పరిశోధన వల్ల నీటి అణువు పరిమాణాన్ని, అవగాడ్రో సంఖ్య కచ్చితమైన విలువను కనుగొన్నాడు. అలాగే సూర్యశక్తికి మూలకారణమైన థర్మోన్యూక్లియర్‌ చర్యలను కూడా వివరించగలిగాడు. కృష్ణ వస్తువు వికిరణం (black body radiation), రేడియో కెమిస్ట్రీలలో కూడా అనేక ప్రయోగాలు చేశాడు.

ఎన్నో పుస్తకాలు, పరిశోధన పత్రాలు వెలువరించిన ఆయనకు అనేక గౌరవ పురస్కారాలు లభించాయి. ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్లు, ఎన్నో దేశాల సైన్స్‌ అకాడమీల్లో సభ్యత్వాలు దక్కాయి.

మూలాలు

[మార్చు]