జోల పాటలు
చిన్న పిల్లలను నిద్ర పుచ్చడానికి వారి తల్లులు పాడే పాటలే జోల పాటలు. ఏడ్చే పిల్లలని లాలిస్తూ పాడే పాటలే లాలి పాటలు. ఈ పాటల్లో ఉండే లయ, శబ్దాలంకారాలు, గానానికి తగినట్లుగా ఉయ్యాల ఊపడం, వీపుపై తట్టడం వంటి లయబద్ధమైన చర్యలతో కలిసి పిల్లలను మైమరపించి, నిద్రపుచ్చుతాయి. జోలపాటలు, లాలిపాటలూ పిల్లలకే కాక, తల్లికి కూడా లాభమేనని యూనివర్సిటీ ఆఫ్ లండన్ పరిశొధకుల పరిశీలనలో తేలింది. [1]
పిల్లల పాటలు జానపద సాహిత్యంలో భాగం. సాధారణంగా ఈ పాటలన్నీ మౌఖిక సంప్రదాయంగా వస్తున్నవే. [2] అయితే సినిమాల్లో ప్రత్యేకంగా పిల్లల పాటలను రాయించిన సంఘటనలు ఉన్నాయి. వేటూరి సుందరరామమూర్తి, వెన్నెలకంటి ఇలాంటి పాటలు రాసారు. గరికిపాటి నరసింహారావు తన సాగర ఘోష పద్యకావ్యంలో "జోజో తరంగ బాలా జోజో డిండీర చేల" అని మొదలయ్యే జోల పద్యం ఒకటి రాసాడు. సముద్ర తరంగాన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని జోల పాడుతున్నట్లు భావిస్తూ కవి పాడే కంద పద్యపు జోల పాట అది. అలాగే ఒక సీస పద్యం దానికింద ఎత్తుగీతి కూడా రాసాడు.
తెలుగు నాట వ్యాప్తిలో ఉన్న కొన్ని జోలపాటల జాబితా కింద ఉంది.
జో అచ్యుతానంద జోజో ముకుందా
[మార్చు]జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా..జో జో
తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించీ
నాలుగూ వేదాల గొలుసులమరించీ
బలువైన ఫణిరాజు పానుపమరించీ
చెలుల డోలికలలొన చేర్చి లాలించీ..జో జో
ముల్లోకములనేలు ముమ్మూర్తులారా
అడ్డాలలో నేడు బిడ్డలైనారా
ఏ జన్మలో నోములే నోచినానో
ఈ జన్మలో నాకు బిడ్డలైనారూ..జో జో
ఉళుళుళు
[మార్చు] ఉళుళుళు హాయీ ఆపదలు గాయీ
చిన్నవాళ్ళను గాయీ శ్రీవెంకటేశా..ఉళుళుళు
చిలకల్లు చెలరేగి జీడి కొమ్మెక్కు
అబ్బాయి చెలరేగి మామ భుజమెక్కు
మామ భుజమెక్కి ఏమేమి అడుగు?
పాల్ త్రాగు గిన్నడుగు పాడావునడుగు
..ఉళుళుళు
ఆడితే పాడితే అవ్వలకు ముద్దు
చప్పట్లు తట్టితే తాతలకు ముద్దు
చిట్టి ముత్యము పుట్టె సీత కడుపునా
స్వాతి వానలు కురిసె సంద్రాల మధ్య
..ఉళుళుళు
అందరి మామల్లు చందమామల్లు
అబ్బాయి మామల్లు రామలక్ష్మణులు
బూచివాడా రార బుట్టల్లుకోరా
బుట్టలో బాబును పట్టుకొని పోరా
నిద్రకు వెయ్యేండ్లు నీకు వెయ్యేంఢ్లు
నీతోటి బాలురకు నిండు వెయ్యేండ్లు..ఉళుళుళు
ఆయమ్మబాయమ్మ అక్కఛెల్లెల్ల్లు తొలిఒక్క జన్మాన తొడికోడళ్ళూ
ఈ పాటకు వేరే రూపాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు
చిలకల్లు చెలరేగి జీడి కొమ్మెక్కు
అబ్బాయి చెలరేగి మామ భుజమెక్కు
మామ భుజమెక్కి ఏమేమి అడుగు?
పాల్ త్రాగు గిన్నడుగు పాడావునడుగు
స్థానంలో
చిలకల్లూ చెలరేగీ చింతా చెట్టెక్కూ
అబ్బాయీ చెలరేగీ తాతా భుజాలనెక్కు
తాతా భుజాలనెక్కీ తానేమీ కోరూ?
ఉయ్యాలలే కోరూ ఉగ్గిన్నెలే కోరు
అనే రూపంలో పాడుకుంటూంటారు.
చందమామ రావే
[మార్చు]
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగు పూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
వెండి గిన్నెలో వేడిబువ్వ తేవే
పైడి గిన్నెలో పాలబువ్వ తేవే
అందాల పాపకు అందిచ్చి పోవే
తెల్ల మబ్బుల తేరు మీద రావే
పాల వెన్నెల పానకాలు తేవే
అందాల పాపకు అందిచ్చి పోవే
కస్తూరి రంగ
[మార్చు]
కస్తూరి రంగ రంగా మాయన్న కావేటి రంగ రంగా శ్రీ రంగ రంగ రంగా నినుబాసి నేనెట్లు మరచుందురా
కంసునీ సంహరింప సద్గురుడు విష్ణువే కృష్ణావతారమెత్తినప్పుడు ఆదివారము పూటనూ, అష్టమి దినమందు జన్మించెను
తలతోటి జనన మయితే, తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళన బుట్టెను, ఏడుగురు దాదులను చంపెనపుడు
నెత్తురుతోటిండియు యాబాల కావు కావున ఏడ్చెను ఇకనైన ఎత్తుకొనవే నా తల్లి దేవకీ వందనంబు
వడలెల్ల హీనంబుతో ఈ రీతినున్నావు కన్న తండ్రీ నిన్ను నే నెత్తుకోనీ ఏ త్రోవ పోదునే చిన్నబాలా
నీ పుణ్యమాయె కొడక నీవొక్క నిమిషమ్ము తాళరన్న గంగనూ ప్రార్ధించెను జల నిధుల గంగతానుప్పొంగెను
గంగానదీలోనప్పుడు దేవకీ జలకంబులాడగానూ నీ పుణ్యమాయె కొడక నీవొక్క నిమిషమ్ము తాళరన్న
కామధేనువునప్పుడు దేవకీమదియందు తలచగానూ పాల వర్షమె కురిసెను, అప్పుడు ఆ బాలపై చల్లగాను
తడివస్త్రములు విడిచి, దేవకీ పొడివస్త్రములు కట్టెను పొత్తుళ్ళమీదనపుడు ఆ బాలుడు చక్కంగ పవళించెను
వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠ వాసుడమ్మా సీతా కళాస్తుడమ్మా ఈ బిడ్డ శ్రీరామ చంద్రుడమ్మా
వీపునా వింజామరా, నా తండ్రి బొడ్డునా పారిజాతం అరికాల తామరాలు, భుజమందు శంఖుచక్రములు కలవు
మూలాలు
[మార్చు]- ↑ "జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!". BBC News తెలుగు. Archived from the original on 2021-05-07. Retrieved 2021-05-07.
- ↑ reserved, © Ushodaya Enterprises Pvt Ltd All rights. "జానపద సాహిత్యం". www.eenadupratibha.net. Archived from the original on 2021-05-07. Retrieved 2021-05-07.