Jump to content

నిద్ర

వికీపీడియా నుండి
సుఖంగా నిద్రిస్తున్న పిల్లవాడు.

నిద్ర లేదా నిదుర (Sleep) ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు, చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని, శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనదని, నిద్ర పౌరుల ప్రాథమిక హక్కని, ఆరోగ్య జీవనానికి చాలా అవసరమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవసరానుగుణంగా నిద్ర, నిశ్శబ్దం, విశ్రాంతి ఆరోగ్య రీత్యా మానవులకు తప్పనిసరి అవసరమని, నిశ్శబ్దం బంగారం లాంటిదని కోర్టు వ్యాఖ్యానించింది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల (2003) ఫలితంగా 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్థ్యం తగ్గినట్లుగా గుర్తించారు.[1] అయితే నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి.[2] ప్రతి సంవత్సరం మార్చి నెల మాడవ శుక్రవారం నాడు ప్రపంచ నిద్ర దినోత్సవం జరుపుకుంటారు.

ఎన్ని గంటలు నిద్రపోవాలి

[మార్చు]

సామాన్యంగా పిల్లలకు పెద్దలకంటే ఎక్కువగా నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం. అప్పుడే పుట్టిన పిల్లలైతే సుమారు 18 గంటల నిద్ర అవసరం, వారు పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గిపోతుంది.[3]

వయసు రోజుకు కావలసిన సగటు నిద్ర
పురిటిబిడ్డ సుమారు 18 గంటలు
1–12 నెలలు 14–18 గంటలు
1–3 సంవత్సరాలు 12–15 గంటలు
3–5 సంవత్సరాలు 11–13 గంటలు
5–12 సంవత్సరాలు 9–11 గంటలు
యువకులు 10 గంటలు
పెద్దవారు 7–8 గంటలు
గర్భణీ స్త్రీలు 8 (+) గంటలు

ప్రయోజనం

[మార్చు]
  • నిద్ర వలన మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దానితో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  • శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది.
  • నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది.
  • హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ నిద్ర వలన సక్రమంగా జరుగుతుంది.
  • నిద్ర తగ్గితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.
  • వస్తువులు, ప్రదేశాలు, వ్యక్తులు, సంఘటనల మధ్య సంబంధాలను ఏర్పరచడానికి మెదడు యొక్క సామర్థ్యానికి నిద్ర అవసరం.
  • నిద్ర మీకు ఒత్తిడి తగ్గించడానికి, మీ రోజును తాజాగా ప్రారంభించడానికి సహాయపడుతుంది.

నిద్ర మీద పాటలు

[మార్చు]

పిల్లలు నిద్ర పోవడానికి కొందరు తల్లులు పాటలు పాడతారు. వీటిని "జోల పాటలు" అంటారు.

  • నిదురపోరా తమ్ముడా
  • నిదురపో నా తండ్రి నిదురపోవోయి
  • పాడుతా తియ్యగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా
  • నీలాల కన్నులలో మెల మెల్లగా నిదుర రావమ్మ రావే నిండార రావే

నిద్ర పై సామెతలు

[మార్చు]
  • ఆకలి రుచిఎరుగదు నిద్ర సుఖమెరుగదు
  • నిద్రపోయేవాడిని లేపవచ్చు కానీ నిద్రనటించేవాడిని లేపలేము
  • నిద్ర చెడుతుందని నల్లి కుట్టదా?
  • నిద్రపోయేవాడు గోచి పెట్టుకుంటే వాడు లేచినంతవరకే దక్కినట్లు
  • నిద్రపోయినవాడికాళ్ళకు మొక్కినట్లు

హిందూ మతంలో నిద్ర

[మార్చు]
  1. జాగ్రదావస్థ=మెలకువ ఉంటుంది
  2. స్వప్నావస్థ =కలలోస్తాయి
  3. సుషుప్తి =కలలురావు గాఢనిద్ర
  4. తురీయావస్థ =ఆధ్యాత్మికలోకంలోకి వెళ్ళటం
  • నిద్ర ఒక చిన్న మరణం. మరణం అంటే దీర్ఘ నిద్ర. భవబంధాల విముక్తి రెంటిలోనూ లభిస్తుంది.
  • నిద్ర ఒక చిత్త వృత్తి—పతంజలి యోగ సూత్రాలు. ("అభావ ప్రత్యయ ఆలంబన వృత్తి నిద్ర" - సమాధి పాద)
  • నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే/ అండనే బంటు నిద్ర అదియునొకటే'--అన్నమయ్య.
  • నిద్ర ఎలా ఉండాలంటే 'సాధారణమైన చప్పుళ్లకు, కేకలకు, పిలుపులకు మెలకువ రాకూడదు'-- చిలకమర్తి.

నిద్ర పోయేముందు చదవవలసిన శ్లోకం

[మార్చు]

రామ స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం

శయనే యస్య స్మరణం దుస్వప్నం తస్య నస్యతి

శ్రీరామ చంద్రుడు, కుమారస్వామి, హనుమంతుడు, గరుత్మంతుడు, భీముడు - ఈ ఐదు మందిని ఎవరయితే నిద్ర పోబోయే ముందు స్మరిస్తారో వారికి పీడకలల వల్ల కీడు జరగదు, అని పై శ్లోకానికి భావం.

నిద్ర లేచిన వెంటనే చదవవలసిన శ్లోకం

[మార్చు]

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ

కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కర దర్శనమ్

చేతి వేలి కొనలందు లక్ష్మీదేవి, అరిచేతులందు సరస్వతీదేవి, అరిచేతి మొదల్లయందు పార్వతీదేవి ఉంటారు కనుక నిద్ర లేచిన వెంటనే అరిచేతులను పైనుంచి క్రింది వరకు చూచిన వారికి లక్ష్మ్, సరస్వతి, పార్వతీ దేవుల కృపా కటాక్షాలు కలుగుతాయి, అని పై శ్లోకానికి అర్థం.

ఇస్లాంలో నిద్ర

[మార్చు]
  • నిద్రించటం తిరిగి లేవటం దేవుని శక్తి సూచన (అర్రూమ్ 30:23)
  • దేవుడు నిద్రను మన విశ్రాంతికోసం సుఖప్రదంగా చేశాడు (ఫుర్ ఖాన్ 25:47 నబా 78: 10)
  • నిద్ర మరణానికి సోదరుడు -- ప్రవక్త
  • నిద్రపోయేటప్పుడు దేవా నేను నీ పేరుతోనే మరణిస్తాను నీపేరుతోనే జీవిస్తాను అని ప్రార్థించాలి.తిరిగి లేచినప్పుడు దేవా చనిపోయిన నన్ను మళ్ళీ బ్రతికించినందుకు కృతజ్ఞతలు చివరికి నీవద్దకే వస్తాను అని చెప్పాలి.
  • కప్పులేని ఇంట్లో, బొక్కబోర్లా, మర్మావయవాలు కనపడేలా, ఇషా నమాజుకు ముందే, ఉజూ చేసుకోకుండా నిద్రపోకూడదు.

క్రైస్తవంలో నిద్ర

[మార్చు]
  • దేవా నేను మరణనిద్ర పొందకుండా నా కళ్ళకు వెలుగునివ్వు -దావీదు (కీర్తనలు13:3)
  • ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు వలన దరిద్రత వచ్చును (సామెతలు 24:33)
  • కష్టజీవులు కొద్దిగా తిన్నా సుఖనిద్ర పొందుతారు.ఐశ్వర్యవంతులకు ధనసమృద్ధివలన నిద్రపట్టదు (ప్రసంగి 5:12)
  • సోమరితనం గాఢనిద్రలో పడవేస్తుంది (సామెతలు 19:15)
  • గాఢనిద్రవలన కలల ద్వారా తలంపులు పుడతాయి (యోబు 4:13)
  • కలల్లో దేవుడు ఉపదేశిస్తాడు (యోబు 33:15)
  • పండుకొని నిమ్మళిస్తాను నిద్రించి విశ్రాంతి పొందుతాను (యోబు 4:13)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Guidelines for the Care and Use of Mammals in Neuroscience and Behavioral Research. Institute for Laboratory Animal Research (ILAR), National Research Council. The National Academies Press. 2003. p. 121. ISBN 978-0-309-08903-6. Sleep deprivation of over 7 days with the disk-over-water system results in the development of ulcerative skin lesions, hyperphagia, loss of body mass, hypothermia, and eventually septicemia and death in rats (Everson, 1995; Rechtschaffen et al., 1983).{{cite book}}: CS1 maint: others (link)
  2. Bingham, Roger; Terrence Sejnowski, Jerry Siegel, Mark Eric Dyken, Charles Czeisler, Paul Shaw, Ralph Greenspan, Satchin Panda, Philip Low, Robert Stickgold, Sara Mednick, Allan Pack, Luis de Lecea, David Dinges, Dan Kripke, Giulio Tononi (2007). "Waking Up To Sleep". The Science Network. Archived from the original (Several conference videos) on 2012-07-19. Retrieved 2009-01-17.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  3. https://www.youtube.com/watch?v=K3_cDds-1YU
"https://te.wikipedia.org/w/index.php?title=నిద్ర&oldid=4275821" నుండి వెలికితీశారు