జ్యోతి (మాసపత్రిక)
| సంపాదకులు | వి.వి.రాఘవయ్య |
|---|---|
| సంపాదకులు | లీలావతీ రాఘవయ్య |
| ప్రచురణకర్త | వి.వి.రాఘవయ్య లీలావతీ రాఘవయ్య |
| దేశం | భారతదేశం |
| కేంద్రస్థానం | విజయవాడ మద్రాసు (1970-1979) |
| భాష | తెలుగు |
జ్యోతి మాసపత్రిక 1962 లో విజయవాడలో ప్రారంభమైంది.[1] వ్యవస్థాపక సంపాదకులు వెల్లంకి వీర (వి.వి.) రాఘవయ్య, లీలావతి రాఘవయ్య, సంపాదక వర్గ సభ్యులు వేమూరి సత్యనారాయణ, గాంధీ, యర్రంశెట్టి సాయి. సంపాదక మండలిలో ముళ్ళపూడి వెంకటరమణ, నండూరి రామమోహనరావు, బాపు, వి.ఎ. కె.రంగారావు వంటివారు కూడా ఉన్నారు. జ్యోతి పత్రిక వల్ల తెలుగునాట పలువురు రచయితలు ఉత్సాహం చెంది చక్కని రచనలు చేశారు.[2]
పత్రిక ప్రారంభ సంచికలో ఒక విశేషం యద్దనపూడి సులోచనారాణి రాసిన సెక్రెటరీ నవల ధారావాహికగా మొదలవడం.[3] అది ఆమె రాసిన తొలి నవల. ఈ నవల పెద్ద హిట్టై ఆ తరువాత సినిమాగా కూడా రూపొందింది.
1970 ల్లో శ్రీశ్రీ, జ్యోతిలో పదబంధ ప్రహేళిక పేరుతో క్రాస్‌వర్డ్ పజిల్ నిర్వహించాడు. కొన్నాళ్ళ తరువాత ఆ శీర్షికను ఆరుద్ర నిర్వహించాడు.
1970 లో పత్రిక ప్రచురణను విజయవాడ నుండి మద్రాసుకు మార్చారు. 1971 ఫిబ్రవరి 1 న ప్రచురణకర్త, సంపాదకుడూ అయిన వి.వి.రాఘవయ్య మరణించడంతో పత్రిక ప్రచురణ, సంపాదకత్వ బాధ్యతలను ఆయన భార్య లీలావతీ రాఘవయ్య చేపట్టింది.[4] 1980 లో పత్రిక ప్రచురణను మద్రాసు నుండి హైదరాబాదుకు మార్చారు.
1974 లో పత్రికతో పాటు ఒక నవలానుబంధాన్ని కూడా ఇచ్చే సంప్రదాయాన్ని నెలకొల్పారు. ఈ అనుబంధంలో ఒక పూర్తి నవలను ప్రచురించేవారు. నవల చిన్నదైతే రెండు నవలలను ప్రచురించేవారు.[5]
శ్రీశ్రీ 70 వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సమర్పించేందుకు గాను, జ్యోతి వారు 1979 డిసెంబరులో ఒక నిధిని నెలకొల్పి, పాఠకుల నుండి విరాళాలు సేకరించారు. ఒక్కొక్కరు పది రూపాయలు మాత్రం చందా ఇస్తే చాలని చెబుతూ, "నేను సైతం రెండుశ్రీలకు టెన్నరొక్కటి సమర్పిస్తాను" అనే నినాదాన్ని ప్రచురించారు.[6]
పాఠకుల లేఖలు
[మార్చు]పత్రికలో పాఠకుల లేఖలకు ప్రాముఖ్యత ఉండేది. తెలుగులో వస్తున్న మంచి సాహిత్యం పత్రికలలోనే వస్తోందంటూ కొడవటిగంటి కుటుంబరావు, యండమూరి వీరేంద్రనాథ్ వంటి ప్రముఖులు తమ లేఖల ద్వారా తెలియజేసారు.[7]
పత్రికలో అచ్చుతప్పులు ఎక్కువగా వస్తున్నాయని పాఠకులు తమ లేఖల్లో ప్రస్తావించేవారు.[8] ఆరుద్ర పదబంధ ప్రహేళికలో కూడా అచ్చుతప్పులు వస్తే ఎలా అని ఒకరు వాపోయారు. 1986 జూన్ సంచికలో రాసిన ఉత్తరంలో రాజకుమార్ మెహ్రా అనే పాఠకుడు, "నేను చిన్నతనం నుంచి జ్యోతి చదువుతున్నాను. కాని యిప్పుడు జ్యోతిలో అంతకు ముందెన్నడూ దొర్లనంత భారీగా అచ్చుతప్పులు దొర్లుతున్నాయి. తగిన శ్రద్ద వహించగలరు. అసలే ఆరుద్ర, పైగా ఆరుద్ర కూర్చిన ప్రహేళిక, అందులోనూ అచ్చుతప్పులు దొర్లితే జుట్టు పీక్కోవడంతప్ప వేరే మార్గం లేదు" అని రాసాడు.[9]
1979 సెప్టెంబరు సంచికలో ప్రచురించిన ఒక కథలో ఇంగ్లీషు మాటలు ఎక్కువగా వాడారని విమర్శిస్తూ అక్టోబరు సంచికలో ఒక పాఠకుడు ఉత్తరం రాసాడు. ఆ లేఖను విమర్శిస్తూ మరొక పాఠకుడు నవంబరు సంచికలో ఉత్తరం రాయగా,[10] దాన్ని విమర్శిస్తూ మొదటి పాఠకుడు మళ్ళీ రాసిన ఉత్తరాన్ని డిసెంబరు సంచికలో వేసారు.[11]
మూలాలు
[మార్చు]- ↑ "ఎన్ .టి రామారావు రాజకీయ ప్రవేశం .తరువాత ఏమి జరిగిందంటే .? - Navyamedia". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-08-14.
- ↑ భమిడిపాటి, రామగోపాలం (March 1990). ఇట్లు మీ విధేయుడు (నేనెందుకు రాస్తున్నాను). విశాఖపట్టణం: విశాఖ సాహితి. Retrieved 10 March 2015.
{{cite book}}: CS1 maint: date and year (link) - ↑ "ఆ పాత్రతో ఇప్పటికీ గొడవే!". www.andhrajyothy.com. Archived from the original on 2020-08-14. Retrieved 2020-08-14.
- ↑ V.V Raghavaih (1971). జ్యోతి (in Telugu). మద్రాసు: వి.వి.రాఘవయ్య. p. 1.
{{cite book}}: CS1 maint: unrecognized language (link) - ↑ వి.వి., రాఘవయ్య (1974). జ్యోతి (in Telugu). Vol. 5–6 (12 ed.). విజయవాడ: వి.వి.రాఘవయ్య. p. 9.
{{cite book}}: CS1 maint: unrecognized language (link) - ↑ V.V Raghavaih (1979). జ్యోతి. Vol. 11 (17 ed.). మద్రాసు. p. 5.
{{cite book}}: CS1 maint: location missing publisher (link) - ↑ V.V Raghavaih (1979). జ్యోతి Volume 17 Issue 5. మద్రాసు: లీలావతీ రాఘవయ్య.
- ↑ V.V Raghavaih (1979-11-01). Jyothi జ్యోతి Volume 17 Issue 10 (in Telugu).
{{cite book}}: CS1 maint: unrecognized language (link) - ↑ వెల్లంకి, లీలావతీ రాఘవయ్య (1979). జ్యోతి. Vol. 5 (23 ed.). హైదరాబాదు: లీలావతీ రాఘవయ్య. p. 6.
- ↑ V.V Raghavaih (1979-11-01). Jyothi జ్యోతి Volume 17 Issue 10 (in Telugu).
{{cite book}}: CS1 maint: unrecognized language (link) - ↑ V.V Raghavaih (1979). Jyothi జ్యోతి Volume 17 Issue 11. మద్రాసు.
{{cite book}}: CS1 maint: location missing publisher (link)