టెడ్డీబేర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టెడ్డీబేర్

టెడ్డీబేర్ అనేది ఒక ఎలుగుబంటి బొమ్మ. ఈ బొమ్మలో మెత్తటి దూదిని కుక్కుతారు. దానికి సున్నితంగా ఉండే ఊలు అతికిస్తారు. ఇది చాలా దేశాల్లో పిల్లల ఆటవస్తువుగా ప్రాచుర్యం పొందింది. పుట్టిన రోజులకూ ఇతర పర్వ దినాల్లో వీటిని బహుమతులుగా ఇస్తుంటారు.

పుట్టుక

[మార్చు]

1902 నవంబరులో అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ మిస్సిసిపి గవర్నర్ ఆహ్వానం మేరకు వేటకోసం అక్కడికి వెళ్ళాడు. పోటీలో పాల్గొన్న వాళ్ళంగా ఏదో ఒక జంతువుని వేటాడారు. కానీ రూజ్‌వెల్ట్ కు మాత్రం ఏమీ దొరకలేదు. అప్పుడు వేటలో సహాయకులుగా వచ్చిన వాళ్ళు ఎలాగో ఓ ముసలి ఎలుగుబంటిని పట్టుకున్నారు. అప్పటికే చాలా దెబ్బలు తగిలి నీరసపడిపోయిన దాన్ని చెట్టుకు కట్టేసి రూజ్‌వెల్ట్ కి చూపించి కాల్చమన్నారు. అందుకు ఆయన నిరాకరించి దాన్ని విడిచిపెట్టమన్నాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న క్లిఫర్డ్ బెర్రీమన్ అనే కార్టూనిస్ట్ యథాతథంగా దాన్ని రాజకీయ కార్టూన్ గా చిత్రీకరించాడు. క్లిఫర్డ్ మొదటగా గీసిన చిత్రంలో ముసలి ఎలుగుబంటే ఉన్నా వణుకుతూ నిలబడి ఉన్న పిల్ల ఎలుగుబంటిగా క్లిఫర్డ్ మార్చి గీశాడు. ఇదే అన్ని పత్రికల్లో వచ్చింది. అది గమనించిన బ్రూక్లిన్ కి చెందిన మోరిస్ మిచ్‌టమ్ అనే దుకాణం యజమానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఎలుగు బంటి బొమ్మనొకదాన్ని తయారు చేసి దానికి టెడ్డీస్ బేర్ అనే పేరు రాసి అంగడి ముందు వేలాడదీశాడు. టెడ్డీ అనేది రూజ్‌వెల్ట్ ముద్దుపేరు. అందుకు రూజ్‌వెల్ట్ అనుమతి కూడా తీసుకున్నాడు. ఇది అందరికీ బాగా నచ్చడంతో ఆయన ఐడియల్ నావెల్టీ అండ్ టాయ్ అనే కంపెనీని స్థాపించి టెడ్డీస్ బేర్ కాస్త టెడ్డీబేర్ అయింది.[1]

అయితే ఇదే సమయంలో జర్మనీకి చెందిన రిచర్డ్ స్టీఫ్ నమూనా ఆధారంగా స్టీఫ్ ఫర్మ్ కంపెనీ కూడా టెడ్డీబేర్ లను రూపొందించింది. ఓ బొమ్మల ప్రదర్శనలో ఇది అందరికీ నచ్చడంతో తర్వాత ఆ కంపెనీ కూడా వీటిని తయారు చేయడం ప్రారంభించింది. అలా టెడ్డీబేర్ ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో ఆవిర్భవించి అందరి మనసులూ చూరగొన్నది. ఆపై రెండు కంపెనీలు కలిసి రూజ్‌వెల్ట్ బేర్ లను తయారు చేసే పనిలో పడ్డాయి. తరువాతి ఎన్నికల్లో రూజ్‌వెల్ట్ దీన్నే తన మస్కట్‌గా వాడుకున్నాడు. ఆపై సేమర్ ఈటన్ రాసిన ద రూజ్‌వెల్ట్ బేర్స్ అనే పిల్లల పుస్తకాలు, జిమ్మీ కెనడీ ద టెడ్డీబేర్స్ పిక్నిక్ పాటతో ఇది మరింత ఆదరణ పొందింది.[2]

టెడ్డీబేర్ దినోత్సవం

[మార్చు]

టెడ్డీబేర్ దినోత్సవం, ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9 న జరుపుకుంటారు.2000 సంవత్సరంలో "వెర్మంట్" టెడ్డీబేర్ కంపెనీ వాళ్లు ఈ దినోత్సవంను ప్రారంభించారు.అమెరికాలో మొదలైన ఈ దినోత్సవం నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.ఈ రోజున పిల్లలు, పెద్దలు తమ టెడ్డీబేర్లతో పాటు విందులు, వినోదాలు చేసుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-23. Retrieved 2011-12-03.
  2. ఈనాడు ఆదివారం, నవంబరు 13, 2011

వెలుపలి లంకెలు

[మార్చు]