Jump to content

పట్టపు రమేశ్

వికీపీడియా నుండి
(డప్పు రమేష్ నుండి దారిమార్పు చెందింది)

పట్టపు రమేశ్ (డప్పు రమేష్ గా సుపరిచితుడు) జననాట్య మండలి కార్య‌కర్త, విప్లవకారుడు.[1] తన డప్పు వాయిద్యాన్ని విప్లవానికి ఆయుధంగా మలచిన కార్యకర్త. అతను నాలుగు దశాబ్దాలుగా విప్లవ సాంస్కృతిక రంగానికి ఊపిరి పోసాడు. ప్రజల గుండె చప్పుడును జననాట్యమండలి డప్పుగా మలిచి ఇంటిపేరునే డప్పుగా మార్చుకున్న‌ ప్రజాకళాకారుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

రమేశ్‌ అసలు పేరు ఎలియాజర్‌. అతను గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతం అంగలకుదురు గ్రామంలో 1960 లో అహరోన్‌, ఎమేలిమ్మ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులు గ్రామంలో సొంతంగా చర్చిని నిర్మించి నిర్వహించేవారు. రమేశ్‌ తెనాలిలోని వీ ఎన్ ఆర్‌ కళాశాలలో బీఏ చదువుతుండగా, విప్లవ రాజకీయాలు పరిచయమయ్యాయి. తెనాలిలో అధ్యాపకునిగా పనిచేసే విరసం నాయకుడు వీజే వర్థనరావు అతనికి రాజకీయ మార్గదర్శి. గ్రామంలోని చర్చి ప్రార్థనల్లో రమేశ్‌ డోలక్‌, డ్రమ్స్‌ వాయించేవాడు. ఈ ప్రావీణ్యం ఆయనను పీపుల్స్‌వార్‌ పార్టీకి అనుబంధంగా ఉండే కళాసంస్థ జననాట్యమండలి వైపు ఆకర్షించేలా చేసింది.[2] పీడిత ప్రజలపై జరుగుతున్న దోపిడీ, అణచివేతతో చలించిపోయి వాటిని పరిష్కరించే విప్లవంలో చేరాడు.

నెల్లూరులో 1983-84లో ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు ఆధ్వర్యంలో నెలపాటు జరిగిన కార్యశాల అతని ఆలోచనలు, దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. పూర్తి జీవితాన్ని కళారంగంలో గడపాలని ఆయన నిర్ణయించుకుని.. చివరివరకు అలాగే కొనసాగాడు. ప్రజా కళాకారులు గద్దర్‌, వంగపండుకు డప్పు సహకారం అందిస్తూ దేశమంతా ప్రదర్శనలు ఇచ్చాడు. కారంచేడులో 1985లో దళిత సామాజికవర్గంపై దాడులు జరిగాయి. ‘దళిత పులులమ్మా..’ అంటూ ఈ ఘటనపై పాడిన గీతం అతనికి మంచిపేరు తెచ్చింది. గుంటూరుకు చెందిన కళాకారిణి కుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జననాట్యమండలిని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సంస్థలతో కలిపి 1992 మే 21న నిషేధించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. [3]అక్కడ ఉండగానే అతని భార్య కుమారి మలేరియా బారినపడి 1997లో మరణించింది. ఆ తర్వాత జ్యోతి అనే కళాకారిణిని జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సల్స్‌ తో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ కాలంలో అతను అజ్ఞాతవాసం వీడి బయటకు వచ్చాడు. తర్వాత హృద్రోగ సమస్యలు బయటపడటంతో ఉద్యమాన్ని విరమించి హైదరాబాద్‌లో స్థిర పడ్డాడు. జననాట్యమండలిలో పనిచేస్తుండగా 1980ల్లో ఖమ్మంలో ఒకసారి రమేశ్‌ అరెస్టు అయి కొంతకాలం జైలుజీవితం గడిపారు. ఛత్తీస్ గఢ్ నాగర్‌నార్ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఇతర ప్రజాసంఘాల నాయకుల ఇళ్లతోపాటు ఇటీవల విజయవాడలోని ఆయన నివాసంలోనూ ఎన్‌ఐఏ పోలీసులు సోదాలు నిర్వహించారు. [2]

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కామ్రేడ్ రమేష్ సాంస్కృతిక రంగంలో మరువలేని సేవలందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వివిధ సాంస్కృతిక బృందాల కృషి ఎంతో విలువైనది. జెఎన్‌ఎం స్ఫూర్తితో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అనేక కళా బృందాలు ముందుకు వచ్చాయి. కామ్రేడ్ రమేష్ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులపై, తెలంగాణపై దోపిడీ, అణిచివేతలపై ఎన్నో పాటలు రూపొందించాడు. తెలంగాణ జానపద కళాకారులను పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావడంలో కామ్రేడ్ రమేష్ గొప్ప కృషి చేశాడు.

రచనలు

[మార్చు]

అతను అమరవీరుల త్యాగం, ప్రజాసైన్యం, చంద్రబాబు హైటెక్ పాలన, సమకాలీన ప్రజా సమస్యలపై 86 పాటలు రాశాడు. జననాట్యమండలి (జేఎన్‌ఎం) కృషిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంలోనూ, ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో డాక్యుమెంట్ చేయడంలోనూ ఆయన ప్రత్యేక కృషి చేశాడు. అతను జననాట్య మండలి చరిత్రను రూపొంచించడంలో కృషి చేసాడు.

మరణం

[మార్చు]

అతను 2022 మార్చి 18న తన 61వ యేట మరణించాడు. అతను చాలా కాలంగా బిపి మరియు డయాబెటిస్‌తో బాధపడుతున్నాడు. ఎన్.ఐ.ఏ దాడులు, వేధింపుల కారణంగా అతని ఆరోగ్యం మరింత క్షీణించి మరణించాడు. [1][4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "పాటే ఆయన ఊపిరి..డప్పే విప్లవాయుదం.. డప్పు రమేష్ కు రెడ్ సెల్యూట్స్ - మావోయిస్ట్ పార్టీ". avaninews.com. Retrieved 2024-10-17.
  2. 2.0 2.1 ABN (2022-03-19). "ఆగిన ఉద్యమ 'డప్పు'". Andhrajyothy Telugu News. Retrieved 2024-10-17.
  3. "Dappu Ramesh : క‌ళాకారుడు డ‌ప్పు ర‌మేష్ ఇక లేడు - TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-19. Retrieved 2024-10-17.
  4. Bharat, E. T. V. (2022-03-19). "dappu ramesh died : కళాకారుడు డప్పు రమేష్ మృతి." ETV Bharat News. Retrieved 2024-10-17.

బాహ్య లంకెలు

[మార్చు]