మలేరియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైక్రోస్కోపులో చూసినప్పుడు మలేరియా పరాన్నజీవి

చలిజ్వరం లేదా మలేరియా (Malaria), దోమల ద్వారా వ్యాపించే ఒక వ్యాధి. [1] మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. పరాన్నజీవులు తమ ఆహారం కోసం తాము నివసిస్తున్న మనుషులపైనే అధారపడతాయి. మలేరియా ఏ విధంగా వస్తుందో కనిపెట్టినందుకుగాను ఫ్రెంచి రక్షణ వైద్యుడయిన "చార్లెస్ లూయీ ఆల్ఫోన్సె లావెరెన్"కు 1907లో నోబెల్ బహుమతి లభించింది. మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రము, అది దోమలలో, మనుషులలో ఎలా నివసిస్తుందో తెలిపినందుకు 1902లో రొనాల్డ్ రాస్‌కు నోబెల్ బహుమతి లభించింది. సర్ రోనాల్డ్ రాస్ మలేరియా పరాన్న జీవి జీవిత చక్రాన్ని సికింద్రాబాదు నగరంలో పరిశోధన చేస్తున్నప్పుడు కనుగొన్నాడు. ప్రపంచంలో ఏటా 500 మిలియన్ల జనాభా మలేరియా జ్వరాల బారిన పడి వారిలో 2.7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. "ప్లాస్మోడియం" (Plasmodium) అనే ప్రొటోజోవా పరాన్నజీవి మలేరియా వ్యాధి కారకము. ప్రోటోజోవాలు ఏకకణజీవులు. కానీ వీటి నిర్మాణము బ్యాక్టీరియా కంటే క్లిష్టమైనది. బ్యాక్టీరియా చాలా సులువయిన నిర్మాణము కలిగి ఉంటాయి. వివిధ ప్లాస్ల్మోడియం స్పీసీస్లు మనుషులలో వివిధ రకాల మలేరియాలను కలుగజేస్తాయి. అందులో ముఖ్యమైనవి

 • ప్లాస్మోడియం ఫాల్సిపారం (falciparum)
 • ప్లాస్మోడియం వైవాక్స్ (vivax)
 • ప్లాస్మోడియం మలేరియై (malariae)
 • ప్లాస్మోడియం ఒవేల్ (ovale)
 • ప్లాస్మోడియం సెమీఒవేల్ (semiovale)
 • ప్లాస్మోడియం నోవెస్లి (knowesli)

పైవాటిలో ప.వైవాక్స్, ప.ఫాల్సిఫెరం ఎక్కుమంది ప్రజలకు సోకుతుంది. ఫాల్సిఫెరం మలేరియా అన్నింటికంటే ప్రాణాంతకమయినది.

చరిత్ర

[మార్చు]

50000 సంవత్సరాల క్రితం నుండే మలేరియా మానవజాతిని పట్టి పీడిస్తున్నది.[2] క్రీస్తు పూర్వం 2700 మొదలుకుని చైనాలో చాలాసార్లు మలేరియాలాంటి జ్వరాలు వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి[3]. మలేరియా అనే పేరు "మల అరియ" అనే ఇటాలియను పదాల నుండి పుట్టింది. "మల అరియ" అంటే చెడిపోయిన గాలి అని అర్ధం. చిత్తడి నేల ఉన్న చోట్ల మలేరియా అధికంగా ఉండటం వలన ఈ జ్వరాన్ని marsh fever (చిత్తడి జ్వరం) అని కూడా పిలిచేవారు.

1880లో ఫ్రెంచి సైన్యంలో వైద్యుడైన చార్లెస్ లూయీ ఆల్ఫోన్సె లావెరెన్ అల్జీరియాలో పనిచేస్తున్నప్పుడు ఎర్రరక్తకణాలలో ఈ పరాన్న జీవులను కనుగొన్నాడు. ఈ పరాన్న జీవులే మలేరియా కారకాలని మట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పాడు.[4] దీని వలన, తరువాత కనుక్కున్న ఇంకొన్ని విశేషాల వలన ఈతనికి 1907లో నోబెల్ బహుమతి లభించింది. ఆల్ఫోన్సె కనుక్కున్న ఈ పరాన్న జీవికి ప్లాస్మోడియం అనే పేరును ఎట్టోర్ మర్చియఫవా, ఎంజెల్లో చెల్లి అనే ఇద్దరు ఇటలీ శాస్త్రవేత్తలు నిర్ణయించారు.[5] ఇది జరిగిన తరువాత సంవత్సరానికి, కార్లోస్ ఫిన్లే, అనే క్యూబా డాక్టరు ఈ పరాన్న జీవులు దోమల ద్వారా వ్యాపిస్తాయని ప్రతిపాదించాడు. 1898లో సర్ రొనాల్డ్ రాస్ భారతదేశంలో పరిశోధన చేస్తున్నప్పుడు దానిని నిరూపించాడు. అందుకు గాను రొనాల్డ్ రాస్‌కు 1902లో నోబెల్ బహుమతి లభించింది.[6]

మలేరియా ఎలా సోకుతుంది?

[మార్చు]

మలేరియా వ్యాప్తి సాధారణంగా దోమకాటు వలన జరుగుతుంది. తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడం కోసం మలేరియా పరాన్నజీవికి మనుషులు అవసరం. మనిషిని కుట్టినప్పుడు లాలాజలాన్ని వదులుతుంది. ఆ లాలాజలములో స్పోరోజాయిట్స్ ఉంటాయి. అవి మనిషి శరీరములోకి ప్రవేశిస్తాయి, అక్కడ నుండి అవి మీరోజాయిట్స్ గా కాలేయము, ఎర్ర రక్త కణాలలో పరిణతి చెందుతాయి. ఇలా పరిణతి చెందిన మీరోజాయిట్స్ వల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అయితే అన్ని దోమలూ మలేరియాను వ్యాప్తి చేయవు. కేవలం అనోఫిలస్ (anopheles) అనే జాతిలోని ఆడ దోమల వల్ల మాత్రమే మనుషులకు వ్యాధి సోకుతుంది.

ఇతర మార్గాల ద్వారా కూడా ఈ వ్యాధి సోకవచ్చు. గర్భంలో ఉన్న శిశువుకు తల్లినుండి వ్యాధి రావచ్చు. వ్యాధిగ్రస్తుని రక్తం ఎక్కించడం వలన, లేదా వ్యాధిగ్రస్తునికి వాడిన సిరంజిని వాడడం వలన కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

ఈ పరాన్నజీవులు మనుషులలో ఎలా బ్రతుకుతాయి?

[మార్చు]

మనుషులలోకి వచ్చిన ప్లాస్మోడియాన్ని స్పోరోజోయైట్స్ (sporozoites) అని పిలుస్తారు. మనుషులలోకి ప్రవేశించిన వెంటనే ఇవి కాలేయంలోకి వెళ్ళి, అక్కడ తమ సంతతిని వృద్ది పరుచుకుంటాయి. అప్పుడే అవి మెరొజోయైట్ (merozoite) దశకు చేరుకుంటాయి. మెరొజోయైట్స్ దశలో ఉన్న ప్లాస్మోడియం ఎర్ర రక్తకణాలలో చేరతాయి. అక్కడ మరలా మరిన్ని మెరొజోయైట్స్ ని సృస్టిస్తాయి. వాటి సంతతి అలా పెరిగిపోయి, ఎర్ర రక్తకణాలలో ఏ మాత్రం ఇమడలేక వాటిని బద్దలు చేసుకుని బయటకు వచ్చేస్తాయి. సరిగ్గా ఈ దశలోనే వ్యాధిసోకిన మనిషి బాగా నీరసంగా కనిపిస్తాడు. జ్వరం కూడా వస్తుంది. ఇలా కొన్ని రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. దీనిని పరోక్సిసం (paroxysm) అని అంటారు, అనగా హటాత్తుగా జరిగే దాడి. అయితే పైన చెప్పిన ప్లాస్మోడియంలలో ప.వివాక్స్, ప.ఒవేల్ కాలేయంలో ఎక్కువ సేపు ఉంటాయి. అవి కాలేయంలో ఉన్నంత సేపు మనిషి బాగానే కనిపిస్తాడు, కానీ లోపల అవి వాటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. దీనిని నిద్రాణ దశ (dormant phase) " అని అనుకోవచ్చు. కొన్ని వారాలు లేదా నెలల తరువాత ప్లాస్మోడియం కాలేయం నుండి మెల్లగా రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలోనే మనిషికి జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. ఒవేల్ లోనూ మరో రెండు రకాలు కనిపిస్తాయి. కోతులకు పరిమితమయే నోవలేసే మనుష్యులకు విస్తరిస్తోంది. ఒకేసారి 2,3 రకాల ప్లాస్మోడియం దాడి చేయడాన్ని మిశ్రమ ఇన్ఫెక్షన్ గా భావిస్తున్నారు. వ్యాధి తీవ్రం గా బరిని పడుతున్న వారిలో 5 శాతం మందికి ఈ మిశ్రమ ఇన్ఫెక్షన్ కనుగొన్నారు. [7] ప.ఫాల్సిఫారుం అన్నింటి కన్నా భయంకరమయిన మలేరియా. ఇది రక్తంలో వ్యాప్తి చెందటం వలన మనిషి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. అంతేకాదు, దీని వలన ఎర్ర రక్తకణాలు బంకగా తయారయ్యి రక్తనాళాలకు అడ్డుపడతాయి. దీని వలన ఇతర అంగాలు దెబ్బతినే అవకాశం ఉంది.

మలేరియాలోని మూడు రకాల దశలు • చల్లని దశ: జ్వరం ప్రారంభ దశల్లో చిహ్నం ఇది జ్వరం యొక్క ఒక ప్రాథమిక భావన. • దాడి దశ: ఈ దశలో రోగి చాలా వెచ్చగా వున్నట్లుండి దగ్గర దగ్గర 40 డిగ్రిల వరకు జ్వరం కలిగి వుంటాడు. • చెమట దశ: ఈ దశలో రోగి వెచ్చదనం తగ్గుతున్నట్లు వుండి జ్వరం ౪౦ డిగ్రిల నుండి క్రమంగా తగ్గి రోగి శరీరం నుండి చెమట ప్రారంభం అవుతుంది, రోగికి జ్వరం తగ్గి చల్లగా అవుతాడు. ఈ మూడు దశలు మలేరియా యొక్క రకాన్ని బట్టి, 24, 48 లేదా 72 గంటల వ్యవధిలో పునరావృతం అవుతాయి. మలేరియా పరాన్నజీవి యొక్క తదుపరి జీవితం చక్రంలో భాగంగా ఎర్ర రక్త కణాల విడుదల/పగులుట వలన రోగికి జ్వరం ఎక్కువ అవుతుంది

మలేరియా ఏయే ప్రాంతాలలో వ్యాప్తిలో ఉంది?

[మార్చు]
మలేరియా పీడిత ప్రాంతాలు ఎర్రరంగులో ఉన్నాయి.

గర్భవతులు, చిన్నపిల్లలు ఎక్కువగా ఈ వ్యాధిబారిన పడతారు. ప్రపంచ జనాభాలో 40% మంది మలేరియా పీడిత ప్రాంతాలలో నివసిస్తున్నారు. మలేరియా పీడిత ప్రాంతాలు ఇవి:

ప్రతీ సంవత్సరం 30,00,00,000 నుండి 50,00,00,000 మంది వరకు మలేరియా బారిన పడుతున్నారు. ప్రతీ సంవత్సరం 10,00,000 నుండి 20,00,000 వరకు ప్రజలు మలేరియా వలన మరణిస్తున్నారు. చనిపోతున్నవారిలో 90% మంది ఆఫ్రికావారే. అందులో సింహభాగం చిన్నారులే. ఆఫ్రికాలో 20% మంది పిల్లలు మలేరియా వలన 5 ఏండ్ల లోపే చనిపోతున్నారు. ఒకవేళ చనిపోక బ్రతికి ఉన్నా, వారి మెదడు దెబ్బతిని ఇతరుల మాదిరిగా తెలివితేటలతో ఉండలేరు.

ఈ మరణాలను ఆపవచ్చు. మలేరియాను మందులవలన గానీ లేదా దోమల వ్యాప్తిని అడ్డుకోవడం వలన కానీ అరికట్టవచ్చు. యూనిసెఫ్ ప్రకారం పెద్దలలో మలేరియాను తొలగించటానికి కావలసిన మందుల ఖర్చు కేవలం 100 రూపాయలే. మలేరియా ఎక్కువగా పేద దేశాలలోని ప్రజలకు సోకుతుంది. వారి వద్దగానీ, ఆ దేశ ప్రభుత్వాల వద్దగానీ ఆ మందులు కొనే స్తోమత లేదు.

భారతదేశంలో మలేరియా

[మార్చు]

భారతదేశంలో ఏటా మలేరియాతో లక్ష మంది మరణిస్తున్నారు.చాలా ప్రాంతాలలో (సముద్ర మట్టం నుండి 1800మీ. పైగా ఎత్తు ఉన్నవీ, కొద్ది తీర ప్రాంతాలూ మినహాయించి) మలేరియా వ్యాధి ప్రబలంగా ఉంది. ప్రతి 5 నుండి 7 సంవత్సరాల పరిధిలో ఈ వ్యాధి ప్రబలి ఎక్కువ మందికి సోకుతున్నది. 1990-93 మధ్య కాలంలో దీనివలన 500 నుండి 600 మిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా వేయబడింది. 1977-97 మధ్య కాలంలో దేశం మొత్తం ఆరోగ్యరంగం బడ్జెట్‌లో దాదాపు 25% వరకు మలేరియా నివారణ నిమిత్తం ఖర్చు చేయబడింది. 1997 ఇది మరింతగా పెంచారు. సంవత్సరానికి 60 మిలియన్ డాలర్ల వరకు మలేరియా నివారణ నిమిత్తం ఖర్చు చేయసాగారు. ఇందులో 70 నుండి 80% వరకు క్రిమి సంహారక మందులపైనే ఖర్చవుతున్నది.[8]

1946నుండి మలేరియా అదుపు చేయడానికి డి.డి.టి వినియోగం మొదలయ్యింది. 1953లో 7 కోట్ల పైగా ప్రజలు మలేరియా బారిన పడ్డారు. 8 లక్షల వరకు మరణాలు అందువలన సంభవించాయి. అప్పుడు 1958లో "జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమం" (NMEP - National Malariya Eradication Program) మొదలయ్యింది. డి.డి.టి చల్లడం పని ఉధృతం చేయడం ద్వారా పదేళ్ళలో ఈ వ్యాధిని తుడిచిపెట్టడం సాధ్యమని అనుకొన్నారు. కాని 1965లో ఈ వ్యాధి మరల విజృంభించింది. మలేరియా క్రిములు డి.డి.టి. మందుకు నిరోధ శక్తి ఏర్పరచుకోవడమే ఇందుకు ముఖ్య కారణంగా భావిస్తున్నారు. తరువాత చర్యలను మార్చి తీవ్రమైన కొన్ని క్రిములను అరికట్టే చర్యను ప్రారంభించారు. ఇది కొంత వరకు సత్ఫలితాలను ఇచ్చింది. కాని మళ్ళీ 1994లో పెద్దయెత్తున మలేరియా కేసులు నమోదయ్యాయి.[9]

జాతీయ మలేరియా పరిశోధనా సంస్థ (National Institute of Malaria Research ), National Academy of Vector Borne Diseases ఈ ప్రయత్నంలో ప్రధానపాత్ర నిర్వహిస్తున్నాయి.[10]

మలేరియాను ఈ విధంగా గుర్తించండి

[మార్చు]

మలేరియా సోకిన 10 నుండి 30 రోజులలో జ్వరం రావచ్చు (అంటే ప్లాస్మోడియం రక్తంలోకి చేరిందన్నమాట). ఆ తరువాత ఇంకో వారం రోజులకుగానీ వ్యాధి లక్షణాలు కనిపించవు. కొంతమందికి మలేరియా సోకిన సంవత్సరానికిగానీ వ్యాధి లక్షణాలు కనిపించవు. ఎక్కువ మందికి 10 నుండి 30 రోజులలో జ్వరం వస్తుంది. మలేరియా సోకినప్పుడు జ్వరం హటాత్తుగా వస్తుంది. జలుబు చేసిందేమోనన్న అపోహను కలుగజేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది.

కొని లక్షణాలు:

వ్యాధినిర్ధారణ

[మార్చు]
ఎర్ర రక్తకణాలలో మలేరియా పరాన్న జీవులను చూపిస్తున్న గీంసా ద్రావకం

సాధారణంగా మలేరియా పీడిత ప్రాంతాలలో మలేరియా లక్షణాలు కనిపిస్తే, అప్పుడు ఆవ్యాధి మలేరియా అనే నిర్ధారించవచ్చు. డాక్టర్లు రక్తపరీక్ష చేసి మలేరియా అని నిర్ధారిస్తారు. ఈ పరీక్షను గీంసా బ్లడ్ స్మీయర్ (Giemsa blood smear) అని పిలుస్తారు. వ్యాధిగ్రస్తుని నుండి సేకరించిన రక్తం బొట్టును ఒక సన్నటి గాజు పలకపై ఉంచి, దానిపై గీంసా (Giemsa) ద్రావకం వేస్తారు. దీనివలన డాక్టర్లు సూక్ష్మదర్శిని (మైక్రోస్కోపు) కింద మలేరియా జీవులను చూడగలుగుతారు. ఆ జీవులు ఎర్ర రక్తకణాలను నాశనం చేయడం మనకు కనిపిస్తుంది. ఈ రకమయిన పరీక్ష చాలా తేలికయినది, ఖర్చులేనిది. కాకపోతే సరయిన సూక్ష్మదర్శిని వాడకపోయినా, ద్రావకం సరిగ్గా లేకపోయినా పరీక్షించే వ్యక్తికి ప్లాస్మోడియం కనిపించకపోవచ్చు. ఇంకా ఖరీదయిన పరీక్షలు కూడా ఉన్నాయి. కానీ వాటిని పెద్దగా ఎవరూ వాడరు. తీసుకున్న మందులు వ్యాధిని నయం చేయనప్పుడు ఈ తరహా ఖరీదయిన పరీక్షలు చేస్తారు.

మలేరియా చికిత్సా విధానం

[మార్చు]

వ్యాధిగ్రస్తునికి సోకిన మలేరియా ఏ రకమో తెలుసుకొని దానికి తగ్గట్లుగా మందులు ఇవ్వవలెను. ఒక రకం ప్లాస్మోడియానికి పనిచేసిన మందు వేరొక దానికి పని చేయకపోవచ్చు. ఒకవేళ ఏరకమయిన మలేరియా సోకిందో తెలియనప్పుడు ఫల్సిపరుం మలేరియా సోకిందనే అనుకోవాలి, ఎందుకంటే అది అన్నిటికంటే భయంకరమయిన మలేరియా కాబట్టి. అప్పుడు వ్యాధిగ్రస్తునికి ఫల్సిపరుం మలేరియాకు ఇవ్వవలసిన మందునే ఇవ్వాలి. వ్యాధిగ్రస్తుడు ఉన్న ప్రదేశాన్ని బట్టి కూడా ఇవ్వవలసిన మందు మారుతుంది. ఆఫ్రికాలో ఇచ్చే మందులు అమెరికాలో ఇచ్చే మందులు వేరుగా ఉంటాయి. డాక్టర్లు ఎప్పటికప్పుడు తమ ప్రాంతంలో మలేరియా ఏవిధంగా ఉందో పరిశీలిస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఆయా ప్రాంత ప్రజానీకం మలేరియా మందులకు అలవాటు పడిపోవచ్చు. కాబట్టి డాక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకొని చికిత్స చేయవలెను.

ఒకప్పుడు మలేరియా చికిత్సకు క్లోరోక్వినైన్ (chloroquinine) వాడేవారు. కానీ రానురాను మలేరియాను ఇది ఎంతమాత్రం నయం చేయలేక పోవటం వలన క్వినైన్ (quinine) మరియూ దాని ప్రత్యామ్నాయాలయిన క్వినైనాక్రిన్ (quinacrine), క్లోరోక్విన్ (chloroquine), ప్రైమాక్విన్ (primaquine) వాడుతున్నారు. ఇప్పుడు క్వింగ్ షాహు అనే చైనీస్ మందు నుండి తయారుచేసిన ఆర్టిసునేట్, ఆర్టిమీతర్ అనే సూది మందులు, బిళ్ళలు ఇస్తారు.[11][12]

మలేరియాను ఎలా నివారించాలి?

[మార్చు]

మలేరియాకు అన్నిటి కంటే మంచి చికిత్స, అది రాకుండా నివారించడమే

మలేరియాను మూడు రకాలుగా నివారించవచ్చు:

 1. దోమలను అదుపుచేయడం
 2. దోమలు మిమ్మల్ని కుట్టకుండా చూసుకోవడం
 3. దోమకాటుకు గురయితే సరయిన మందులు తీసుకోవడం

దోమలను అదుపుచేయడం

[మార్చు]

దోమలను అదుపుచేయడం అనేది చాలా మంచి పద్ధతి. ఇదికూడా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు దోమలను అరికట్టటానికి డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరోఈథేన్ (డి.డి.టి) అనే క్రిమి సంహారక మందును వాడేవారు. ఇది చాలా తక్కువధరలో లభిస్తుంది, బాగానే పనిచేస్తుంది. మనుషులకు కూడా పెద్దగా అపాయం కాదు. కానీ ఇది పర్యావరణంలో ఎక్కువసేపు ఉండి కాలుష్యాన్ని పెంచి, తద్వారా దీర్ఘకాలంలో కీడును కలుగ చేస్తుందని కనుగొన్నారు. కానీ ఈ వాదన మలేరియాకు గురికాని ధనిక దేశాలలో మాత్రమే వినిపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా డి.డి.టిని వాడమనే చెబుతుంది. ఎందుకంటే ప్రతీ నిముషానికి ఇద్దరు చిన్నారులు మలేరియా వలన మరణిస్తున్నారు. దీని ముందు డి.డి.టి చేసే హాని చాలా తక్కువ. కానీ వచ్చిన చిక్కల్లా కొన్ని ప్రాంతపు దోమలు ఈ డీడీటీని తట్టుకునే సామర్థ్యం పెంచేసుకున్నాయి. ఈ క్రింది ప్రాతాలలో డి.డి.టితో దోమలను అరికట్టడం చాలా కష్టమయిపోతుంది:

ఈ ప్రాంతాలలో వేరే మందులు వాడాలి. కానీ అవి ఖరీదయినవి. అవి ఆర్గానో ఫాస్ఫేట్ లేదా కార్బమేట్ మొదలయిన క్రిమిసంహారక మందులు.

దోమలు కుట్టకుండా చూసుకోవడం

[మార్చు]

మలేరియాను మోసుకువెళ్ళే దోమలు తెల్లవారుతున్నప్పుడు లేదా చీకటి పడుతున్నప్పుడు వస్తాయి. ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దోమలను తరిమి వేసేందుకు ఉపయోగపడే దోమారులను వాడాలి. పొడుగు చేతులున్న చొక్కాలు ధరించాలి. దోమతెరలు కూడా వాడవచ్చు. దోమలు మురుగు నీటిలో లేదా చెత్తలో గుడ్లు పెడతాయి కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడయినా మురుగునీరు బహిరంగంగా కనిపిస్తే, దాని మీద కిరోసిన్ పొరలా చల్లాలి. ఇది గుడ్లను దోమలుగా ఎదగకుండా చేస్తుంది.

దోమకాటుకు గురయితే సరయిన మందులు తీసుకోవడం

[మార్చు]

మలేరియా పీడిత ప్రాంతాలలో నివసించేవారు ప్రొఫైలాక్సిస్ (prophylaxis) అనే మందును మలేరియా రాకుండా వాడవచ్చు. ఈ మందు కొంచెం ఖరీదయినదే. అంతేకాదు, కొన్ని ప్లాస్మోడియాలు ఈ మందును కూడా తట్టుకునే శక్తి పెంచేసుకున్నాయి. కాబట్టి ప్రొఫైలాక్సిస్ తీసుకున్నప్పటికీ మలేరియా వచ్చే అవకాశం ఉంది. ఈ మందును ఎక్కువగా మలేరియా పీడిత ప్రాంతాలను సందర్శించేవారు వాడుతూ ఉంటారు. ప్రొఫైలాక్సిస్ మందుని మలేరియా పీడీత ప్రాంతాలకు వెళ్ళే ముందూ, వచ్చిన తరువాత 4 వారాల వరకూ వాడితే మంచి గుణము కనిపిస్తుంది.

మూలాలు

[మార్చు]
 1. ఆంధ్ర భారతి తెలుగు నిఘంటువులు
 2. Joy D; Feng X; Mu J; Furuya T; Chotivanich K; Krettli A; Ho M; Wang A; Suh E; Beerli P; Su X (2003). "Early origin and recent expansion of Plasmodium falciparum". Science. 300 (5617): 318–21. PMID 12690197.
 3. కాక్స్ ఎఫ్ (2002). "మనుషులపై ఆధారపడిన పరాన్న జీవుల చరిత్ర (History of human parasitology)". Clin Microbiol Rev. 15 (4): 595–612. PMID 12364371.
 4. "ఆల్ఫోన్సె లావెరెన్ జీవిత చరిత్ర(Biography of Alphonse Laveran)". నోబెల్ పురస్కార సంఘం. Retrieved 2007-07-15.
 5. "ఎట్టోర్ మర్చియఫవా (Ettore Marchiafava)". Retrieved 2007-07-15.
 6. "రొనాల్డ్ రాస్ జీవిత చరిత్ర". నోబెల్ పురస్కార సంఘం. Retrieved 2007-07-15.
 7. మలేరియా పనిపట్టండి! ఈనాడు. 23 April 2024
 8. "Malaria in India". Archived from the original on 2007-08-09. Retrieved 2007-07-21.
 9. "Status of Malaria in India" (PDF). Shiv Lal, G.S.Soni, P.K.Phukan. Archived from the original (PDF) on 2006-06-03. Retrieved 2007-07-21.
 10. "National Institute of Malaria Research". Retrieved 2007-07-21.
 11. Prescription drugs for malaria Retrieved February 27, 2007.
 12. "New malaria drug modeled after Traditional Chinese Medicine (TCM)". Archived from the original on 2007-08-14. Retrieved 2007-07-22.

బయటకు లింకులు, వనరులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మలేరియా&oldid=4196327" నుండి వెలికితీశారు