Jump to content

కాలేయం

వికీపీడియా నుండి
కాలేయం
గొర్రె కాలేయము: (1)కుడి తమ్మె, (2) ఎడమ తమ్మె, (3) కాడేట్ లోబ్, (4) క్వాడ్రేట్ లోబ్, (5) కాలేయ ధమని , పోర్టల్ సిర, (6) కాలేయ లింఫు కణుపులు, (7) పిత్తాశయము.
మానవ ఉదరములో కాలేయము (ఎరుపు రంగు) యొక్క స్థానము.
గ్రే'స్ subject #250 1188
ధమని కాలేయ ధమని
సిర కాలేయ సిర, పోర్టల్ సిర
నాడి సీలియాక్ గాంగ్లియా, వేగస్[1]
Precursor foregut
MeSH Liver

కాలేయం మానవుని శరీరంలోని అతి పెద్ద గ్రంథి. ఇది ఉదరంలో ఉదరవితానానికి (డయాఫ్రమ) క్రిందగా కుడివైపున మధ్యలో ఉంటుంది. కాలేయము పైత్యరసాన్ని తయారుచేస్తుంది. అది పిత్తాశయంలో నిలువచేయబడి జీర్ణక్రియలో చాలా తోడ్పడుతుంది. పైత్యరసవాహిక ద్వారా పైత్యరసము, ఆంత్రమూలానికి చేరుతుంది.

కాలేయము, ఆంత్రమూలానికి కుడి పక్కన ఉదరవితానానికి దిగువగా ఉంటుంది. ఇది బూడిద రంగులో ఉంటుంది. కాలేయానికి నాలుగు తమ్మెలుంటాయి. దీనిలోని కణాలను కాలేయకణాలంటారు.

కాలేయము, పరిసరములలో ఉన్న జీర్ణవ్యవస్థ పటము

ఒకేకాలేయం ఇద్దరికి

[మార్చు]

చెన్నై గ్లోబల్ ఆస్పత్రికి చెందిన కాలేయ సర్జన్ డా||మహ్మద్ రేలా 'స్ల్పిట్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్సను మనదేశంలో తొలిసారిగా చేశారు.దాత నుండి కాలేయాన్ని సేకరించేటప్పుడే రెండు ముక్కలుగా విడదీసి, ఓ ముక్కను అరుదైన కాలేయ వ్యాధితో బాధ పడుతున్న బాలికకు, మరోముక్కను ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్న వృద్ధురాలికి అమర్చారు.

పునరుత్పత్తి స్వభావం ఉన్న కాలేయం

[మార్చు]

పునరుత్పత్తి స్వభావం ఉన్న కాలేయాన్ని దానం చేయడం ఎంతో సులువు . అవయవంలో ఉండే ఎనిమిదింటిలో మూడు వరకు అరలు ఉన్నా అది సాధారణంగా పనిచేస్తుంది. దీంతో ఇతరులకు కాలేయం అవసరమైనపుడు దాతలకు చెందిన కాలేయంలో కొంత భాగాన్ని బాధితులకు అమర్చవచ్చు. రెండు నెలల్లో దాత కాలేయం పెరిగి సాధారణ స్థాయికి చేరుతుంది.కాలేయ మార్పిడికి హైదరాబాదు‌లో రూ.18-20 లక్షల వరకు ఖర్చవగా... ఇతర దేశాల్లో ఆ మొత్తం రూ.1.50 కోట్ల వరకు ఉంటుంది.కాలేయం శరీరంలో ఏకంగా 500 రకాల చర్యలను నిర్వహించే రసాయన కర్మాగారం.

  • హెపటైటిస్‌ ఎ, ఇలు కలుషిత మంచినీరు, ఆహారం తీసుకోవడం వల్ల సంక్రమిస్తాయి.హెపటైటిస్‌ బి, సి వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. లైంగిక సంబంధాలు, రక్త మార్పిడి, ఒకే నీడిల్స్‌ను ఇద్దరు, అంతకంటే ఎక్కువ మందికి వాడటం ద్వారా ఇవి సంక్రమిస్తాయి.
  • స్థూలకాయం వల్ల కొవ్వు పెరిగి, కాలేయంపై పేరుకుపోతుంది.
  • నూనె వస్తువులు, పిజ్జా, బర్గాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌ మద్యం సేవించడం ద్వారా వ్యాధులు వస్తున్నాయి.

కాలేయ క్యాన్సర్

[మార్చు]

లివర్ కేన్సర్లన్నీ ఒకే రకం కాదు. అందువల్ల వాటికి చేసే చికిత్సలు కూడా అన్నీ ఒకే రకంగా ఉండవు. కేన్సర్ రకాన్ని అనుసరించి, చికిత్సలు కూడా వేరువేరుగా ఉంటాయి. ప్రధానంగా లివర్‌లో వచ్చే కేన్సర్ కణుతులు ప్రాథమికస్, సెకండరీస్ అంటూ రెండు రకాలుగా ఉంటాయి. లివర్‌లోనే పుట్టిన కణుతులను ప్రాథమిక లివర్ ట్యూమర్స్ అనీ, మిగతా భాగాల్లో అంటే, శ్వాసకోశాల్లో గానీ, పెద్ద పేగుల్లో గానీ, క్లోమగ్రం«థిలో గానీ, కిడ్నీలో గానీ, ఎముకల్లోగానీ కణుతులు పుట్టి అవి కాలేయానికి పాకే రకాన్ని సెకండరీ లివర్ ట్యూమర్స్ అనీ అంటాం. నిజానికి ప్రాథమిక లివర్ ట్యూమర్ల కంటే, ఈ సెకండరీ లివర్ ట్యూమర్లే ఎక్కువగా వస్తాయి.

ప్రాథమిక లివర్ ట్యూమర్స్

[మార్చు]

సాధారణంగా ఈ ప్రాథమిక స్థాయి కాలేయ కణుతులు నాలుగు రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది హెపటో సెల్యులార్ కార్సినోమా. ఇది లివర్ కణంలోనే పుడుతుంది. దాదాపు 80 శాతం ప్రాథమిక కేన్సర్లు ఈ రకమే. ఇక రెండవ రకం, కాలేయంలో ఉండే పిత్తాశయాల్లోని (బైల్ డక్ట్స్) కణాల్లో వచ్చే కేన్సర్. ఈ కేన్సర్ ను కొలాంజియో కార్సినోమా అంటారు. మూడవది హెపటో బ్లాస్టోమా. ఇది చాలా అరుదుగా వచ్చే కేన్సర్. ఇది చిన్న పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. నాలుగవది యాంజియో సార్కోమా. ఇది లివర్‌లోని రక్తనాళాల్లో వచ్చే కేన్సర్. ఈ ట్యూమర్లు రావడానికి హెపటైటిస్-బి వైరల్ ఇన్‌ఫెక్షన్ ఒక ప్రధాన కారణం, దీనికి తోడు హెపటైటిస్-సి వైరల్ ఇన్‌ఫెక్షన్, లివర్ సిరోసిస్, ఎఫ్లో టాక్సిన్స్, కొన్నిరకాల వారసత్వ వ్యాధులు. ఉదాహరణకు శరీరంలో ఇనుము ఎక్కువైపోవడం వల్ల వచ్చే హిమో క్రోమటోసిస్. వీరిలో పుట్టుకతో వచ్చే ఆల్ఫా-1 యాంటీ ట్రిఫ్సిన్ డెఫిషియెన్సీ వల్ల ఈ లివర్ కేన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటికీ లివర్ సిరోసిస్ మూలంగా ఉంటుంది.

హెపటైటిస్-బి వైరల్ ఇన్‌ఫెక్షన్

[మార్చు]

ఈ ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారిలో లివర్ కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. దాదాపు 20 నుంచి 30 ఏళ్లుగా ఇన్‌ఫెక్షన్స్ ఉంటూ వస్తున్న వారిలో ఈ కేన్సర్ వస్తూ ఉంటుంది. ఈ కేన్సర్ రావడం ఎలా ఉంటుందీ అంటే, హెపటైటిస్-బి వైరస్ తాలూకు జెనటిక్ మెటీరియల్, లివర్ సెల్‌లోని జెనటిక్ మెటీరియల్‌లోకి వెళ్లి, దాన్ని దెబ్బ తీసి, కేన్సర్ అయ్యేలా చేస్తుంది. పరిశీలిస్తే, హెపటైటిస్-బి వల్ల వచ్చే కేన్సర్స్‌లో అత్యధిక శాతం ఇన్‌ఫెక్షన్స్ 20 నుంచి 30 ఏళ్లుగా ఉన్నవారిలోనే కనిపిస్తాయి.

హెపటైటిస్-సి వైరల్ ఇన్‌ఫెక్షన్

[మార్చు]

ఇన్‌ఫెక్ట్ అయిన రక్తం వల్ల గానీ, రక్తం ఉత్పత్తుల వల్ల గానీ, వాడేసిన సిరంజీల వల్ల గానీ, సిరోసిస్ వ్యాధి వల్ల గానీ, ఈ కేన్సర్ రావచ్చు. అయితే హెపటైటిస్-బి వైరల్ ఇన్‌ఫెక్షన్‌లా దీని జెనటిక్ మెటీరియల్, సాధారణంగా లివర్ కేన్సర్ జెనటిక్ మెటీరియల్‌లో కనపడదు. ఇది లివర్ దెబ్బ తినిపోయే సిర్రోసిస్ కారణంగానే వస్తూ ఉంటుంది. సిరోసిస్ కారణంగా లివర్ కణాలు దెబ్బతిన్నప్పుడు నార్మల్ కణాల పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఈ పునరుత్పత్తి సమయంలోనే కొన్నిసార్లు మ్యుటేషన్ వచ్చి లివర్ కేన్సర్ కలుగచేస్తుంది. హెపటైటిస్-సి వైరస్‌లో ఉందే మరో గుణం ఏమిటంటే, ఇది శరీరంలో సహజంగా ఉండే, కణుతుల్ని అణచివేసే జన్యువుల్ని అణచివేస్తుంది. దీనివల్ల కణుతులు సులువులు పెరుగుతూ వెళతాయి.

ఆల్కహాలిక్ సిరోసిస్

[మార్చు]

ఓ 30 నుంచి 40 ఏళ్లుగా మద్యపానం చేస్తూ వచ్చి, ఆ తరువాత మద్యం మానేసి మామూలుగా ఉన్నప్పుడు, లివర్‌లో కొత్త కణాల ఉత్పత్తి మొదలువుతుంది. ఇది అంతకాలం దెబ్బ తింటూ వచ్చిన కణాల స్థానంలో పుట్టుకొస్తాయి. ఈ కణాల పునరుత్పత్తి సమయంలో మ్యుటేషన్ మొదలై ఇది కేన్సర్‌గా మారుతుంది. అలాగే హెపటైటిస్-బి, హెపటైటిస్-సి వైరల్ ఇన్‌ఫెక్షన్లు ఉండడంతో పాటు మద్యం కూడా తీసుకుంటే, వాళ్లల్లో లివర్ కేన్సర్ వచ్చే అవకాశాలు మరీ ఎక్కువగా ఉంటాయి.

ఎఫ్లోటాక్సిన్-బి1

[మార్చు]

ఈ టాక్సిన్స్ లివర్ కేన్సర్‌ను కలిగించే అత్యంత తీవ్రమైన రసాయన మూలం. ఇది కొన్ని రకాల ఫంగస్‌లోంచి ఉత్పన్నమవుతుంది. ఉష్ణ వాతావరణంలో గానీ, ఒక నిర్దిష్టమైన విధానం లేకుండా గానీ నిలువ చేసే ఆహార ధాన్యాల్లో ఈ ఎఫ్లోటాక్సిన్ రసాయనం ఏర్పడి ఇది లివర్ కేన్సర్‌ను కలిగిస్తుంది. ఈ రసాయనం కూడా కణుతులను అణచివేసే జన్యువుల్ని దెబ్బ తీయడం ద్వారా కేన్సర్‌కు బీజం వే స్తుంది. కొంతమంది బాడీ బిల్డర్లు, క్రీడాకారులు కండరాల వృద్ధి కోసం ఎనబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు. అలాగే కొందరు నిరంతరం ఈస్ట్రోజన్ హార్మోన్స్ తీసుకుంటారు. వీటి కారణంగా కొందరిలో ఎడినోమా సమస్య తలెత్తి, చివరికి అది వారిలో కేన్సర్‌గా మారవచ్చు. ఇమేజింగ్ స్టడీస్‌లో వాడే తోడో ట్రాస్ట్ అనే ఒక రసాయనం, ప్లాస్టిక్ ఇండస్ట్రీలలో వాడే వినైల్ క్లోరైడ్ ఇవన్నీ లివర్ కేన్సర్ రావడానికి దారి తీస్తాయి. అలాగే కొన్ని రకాల వారసత్వ వ్యాధులు ముఖ్యంగా హిమోక్రోమటోసిస్ వంటి సమస్యల్లో లివర్ ఎక్కువ మొత్తంలో ఇనుము నిలువ అవుతుంది. ఇది కూడా ఒక దశలో కేన్సర్ కారకంగా మారవచ్చు. కొందరిలో ఇది లివర్ సిరోసిస్ కలుగచేసి ఆ తరువాత లివర్ కేన్సర్‌గా మారడానికి కారణం కావచ్చు.

లక్షణాలు

[మార్చు]

సాధారణంగా, లివర్ కేన్సర్ చాలా కాలం దాకా ఏ లక్షణాలూ కలిగించదు. సహజంగానే లివర్ అపారమైన పునరుత్పత్తి సామర్థ్యం ఉన్న అవయవం. లివర్‌లో ఎక్కడో కేన్సర్ కణితి ఉన్నంత మాత్రాన లివర్ పనితీరులో తేడా ఏమీ రాదు. కణితి ఒకవేళ లివర్ ఉపరిభాగానికి దగ్గరగా ఉండి, క్యాప్సూల్ పైకి లేవనెత్తిన ప్పుడు మాత్రం, ఒక మోస్తరు నొప్పి, కొద్దిపాటి జ్వరం కూడా రావచ్చు. ఆకలి తగ్గిపోయి, నీరసం, నిస్సత్తువా ఏర్పడవచ్చు. వ్యా«ధి బాగా ముదిరిపోయి ఉంటే, కామెర్లు, కాళ్లల్లో వాపు రావడం కనిపిస్తుంది. ఇక సిర్రోసిస్ సమస్య ఉన్నవారైతే ఒక దశలో వారి ఆరోగ్యం చాలా హఠాత్తుగా క్షీణించిపోవడం కనిపిస్తుంది. అంటే కామెర్లు రావడమో, పొట్టలో నీరు చేరిపోయే ఎస్సైటిస్ సమస్య తలెత్తడమో కనిపిస్తుంది. కండరాలు కరిగిపోతూ, వేగంగా బరువు తగ్గిపోవచ్చు. ఎప్పటి నుంచో సిరోసిస్ సమస్య ఉన్నవారిలో హఠాత్తుగా ఈ లక్షణాలు కనిపించడం మొదలైతే, వారికి కేన్సర్ వచ్చిందేమోనని అనుమానించవలసి ఉంటుంది. లివర్‌లో కణుతులు బాగా పెద్దవైపోతే మాత్రం అప్పుడింక చాలా తీవ్రమైన నొప్పే వస్తుంది. ఏమైనా వ్యాధి బాగా ముదిరితే గానీ లివర్ కేన్సర్ లక్ష ణాలేవీ కనిపించవు. అందుకే చాలా మంది వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడు డాక్టర్ వద్దకు వెళ్లరు.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు

[మార్చు]

సహజంగా ఎఎఫ్‌పి (ఆల్ఫా-ఫీటో-ప్రొటీన్) అనేది శరీరంలో ఒక మిల్లీ మీటర్ లో 10 మేనోగ్రాముల కన్నా తక్కువే ఉంటుంది. అయితే, లివర్ కేన్సర్ ఉన్నవారిలోనూ, అండాశయంలో, వృషణాల్లో కణుతులు ఉన్నవారిలోనూ ఈ ప్రొటీన్ పరిమాణం పెరుగుతుంది. ప్రత్యేకించి లివర్ కేన్సర్ ఉన్నవారిలో ఈ ప్రొటీన్ పరిమాణం 500 మేనోగ్రాముల దాకా పెరుగుతుంది. అయితే, ఎఎఫ్ పి పెరిగినంత మాత్రాన కేన్సర్ వచ్చినట్టు కాదు. కాకపోతే, అలా పెరగడాన్ని ఒక హెచ్చరికగా మాత్ర గుర్తించాలి. అయితే, ఎఎఫ్‌పి 500 మేనోగ్రాముల దాకా ఉన్నప్పుడు అది కేన్సర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి సిరోసిస్ సమస్య ఉన్నవారు తరుచూ ఎఎఫ్‌పి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం, ఉన్నట్లుండి ఎప్పుడైనా ఎఎఫ్‌పి అతిగా పెరుగుతూ వెళితే, కేన్సర్ వచ్చిందేమో అనుకుని, సీటీస్కాన్, పెట్ సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షలకు వెళ్లవ లసి ఉంటుంది.

ఎఎఫ్‌పి పరీక్ష వ్యాధి నిర్ధారణ కోసం కాదు గానీ, కేన్సర్‌ను అన్వేషించే ఆలోచనలను, కేన్సర్ ఉండి వైద్య చికిత్సలు జరుగుతున్నప్పుడు కేన్సర్ తగ్గుతోందో లేదో తెలుసుకోవడానికి ఈ ఎఎఫ్‌పి పరీక్ష తోడ్పడుతుంది. దీనితో పాటు ఆల్ట్రాసౌండ్ పరీక్ష, సీటీ, థ్రై-ఫేజిక్ సీటీ స్కాన్, పెట్ సీటీ స్కాన్ ఎంఆర్ఐ ఈ పరీక్షల ద్వారా కణితి లివర్‌లోని ఏ భాగంలో ఉంది, ఏ సైజులో ఉంది వంటి వివరాలన్నీ తెలుస్తాయి. అంతిమంగా వ్యాధి నిర్ధారణ జరిగేది ముక్క పరీక్ష (బయాప్సి) ద్వారానే.

వైద్య చికిత్సలు

[మార్చు]

కేన్సర్ వ్యాపించిన పరిధిని అనుసరించి వేరు వేరు సర్జరీ విధానాలు ఉంటాయి. కాకపోతే, లివర్ కేన్సర్ వచ్చిన వారిలో ఎక్కువ మంది సిరోసిస్ సమస్య ఉన్నవారే ఉంటారు. వారిలో లివర్‌లోని మిగతా భాగం కూడా దెబ్బ తినిపోయి ఉంటుంది. పైగా రక్తస్రావానికి సంబంధించి, రక్తం గడ్డ క ట్టడానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉంటాయి. అందుకే వీరిలో చాలా మందికి శస్త్ర చికిత్స చేయలేం. సర్జరీ ద్వారా కణితినీ, దెబ్బ తిన్న భాగాన్నంతా తొలగిస్తే మిగతా లివర్ శరీరానికి సరిపోదు. ఇలాంటి స్థితిలో లివర్ మార్పిడి చికిత్సే మార్గంగా ఉంటుంది. ఒకవేళ కేన్సర్ కణితి ఉన్నా, మిగతా లివర్ అంతా బాగానే ఉంటే అప్పుడు ఆ కణితిని మాత్రమే తొలగించే హెపాటిక్ రిసెక్షన్ సరిపోతుంది. క ణితి 5 సెంటీమీటర్లకన్నా మించకుండా ఉండి, అది రక్తనాళాల్లోకి వ్యాపించకుండా ఉంటే హెపాటిక్ రిసెక్షన్ చేయవచ్చు. లివర్ స్థితిని అనుసరించి, కొన్ని సార్లు కీమోథెరపీలు ఉంటాయి. ఇటీవలి కాలంలో దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉండే కొత్త తరహా కీమోథెరపీలు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా కీమోఎంబలైజేషన్ థెరపీ ఒకటి. ఇది కీమోథెరపీగానే కాకుండా కేన్సర్ కణితికి రక్రప్రసరణ కూడా అందకుండా చేస్తుంది. బాగా పెద్దవైన కణుతులకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇటీవలి కాలంలో రేడియో ఎంబలైజే షన్ థెరపీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, క్రయో అబ్లేషన్, ఇథెనాల్ అబ్లేషన్ థెరపీలు కూడా వచ్చాయి. వీటిలో కొన్ని సిరోసిస్ వ్యాధిగ్రస్తులకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో లివర్ కేన్సర్ నివారణలో అత్యాధునికమైన టెక్నాలజీ కీలక పాత్ర వహిస్తోంది.[2]

ఒకదాన్ని మించి మరొకటి లివర్ చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే లివర్ కేన్సర్ లక్షణాలను గుర్తించిన మరుక్షణమే డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. వ్యాధిని ముందే గుర్తించి, మునుముందే చికిత్స తీసుకోవడం ఒక్కటే రోగి ముందు లేదా అతని అయినవాళ్ల ముందున్న ప్రధాన బాధ్యత. కాకపోతే వైద్యపరీక్షలకు వెళితే ఎక్కడ కేన్సర్ ఉన్నట్లు బయటపడుతుందోనని చాలా మంది పరీక్షలకే వెళ్లకుండా ఉండిపోతారు. ఒకవేళ నిజంగా కేన్సర్ ఉంటే పరీక్షలు చేయించకుండా ఉండిపోవడం వల్ల దానికదే తగ్గిపోదు కదా! తగ్గకపోగా వ్యా«ధి మరింత ముదిరి ప్రాణాపాయానికి దారి తీస్తుంది. మన ప్రాణాల మీద మనకు ఏకాస్త ప్రీతి ఉన్నా, అనుమానం కలిగిన వెంటనే పరీక్షలకు వెళ్లడం అత్యవసరం.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కాలేయం&oldid=3588141" నుండి వెలికితీశారు