Jump to content

చేయి

వికీపీడియా నుండి
Tupaia javanica, Homo sapiens

చేయి అనగా మానవులు, చింపాంజీలు, కోతులు, లెమూర్లకు గల శరీరభాగమునకు వేళ్లు కలబాహ్యంగము. కోలా చేతికి ఎదురెదురుగా వున్న రెండు బొటనవ్రేళ్లు వుంటాయి కాబట్టి దాని శరీరభాగాన్ని కూడా చేయి లేక 'పా'లు అంటారు.

చుట్టూవున్న పర్యావరణంతో క్రియాశీలమవటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇవి స్థూల కదిల్చే నైపుణ్యాలు ( పెద్ద వస్తువుని పట్టుకోవడం), సూక్ష్మ కదిల్చే నైపుణ్యాలు (చిన్న రాయిని పట్టుకోవడం) ప్రదర్శించడంలో ప్రముఖపాత్ర వహిస్తాయి. చేతి వేళ్లమొనలు, చాలా నాడీకొనలతో వుండి, స్పర్శకి ప్రధానపాత్ర వహిస్తాయి, స్థానాన్ని తెలియచేయడంలో శరీర అంగాలలోముఖ్యమైనవి. ఇతర జతగావుండే శరీరభాగాలవలె, ప్రతి చేయి దాని వ్యతిరేఖ దిశలోని మెదడుతో నియంత్రించబడుతుంది. చేతివాటం మెదడు పనిచేసేతీరుని తెలుపుతుంది,

మానవుని చేతిలో మణికట్టు, అరచేయి, వేళ్ళు చేతిలోని ప్రధానమైన భాగాలు. మన రెండు చేతులు ఎముకలు, కీళ్ళు, కండరాలు, నాడులు, రక్తనాళాలు మొదలైన వాటితో చేయబడినవి.మానవుని చేతిలో 27 ఎముకలు, వాటిలో వేళ్లకు 14 ఫలాంజిస్ (దగ్గరి, మధ్యస్థ, దూరపు) ఎముకలు వుంటాయి. మెటాకార్పల్ ఎముకలు వేళ్లని మణికట్టుకి కలుపుతుంది. ఇవి ఐదు.

ప్రయోజనాలు

[మార్చు]

మనం భౌతికంగా ఏవిధమైన పని చేయడానికైనా చేతులు మీదుగానే చేయగలుగుతున్నాము. ఇవి శక్తివంతమైన పనులే కాకుండా సున్నితమైన కళాత్మకమైన పనుల్ని కూడా ఇవి సాధ్యపడేటట్లు చేస్తాయి. చేతివేళి కొనలలో అతి సున్నితమైన నరాల మూలంగా స్పర్శ జ్ఞానం గురించిన సంకేతాల్ని మెదడుకు పంపించేలా చేస్తాయి. ఇతర అవయవాల వలెనే చేతుల్ని కూడా వ్యతిరేక దిశలోని మెదడు నియంత్రిస్తుంది.

కరచాలనం

[మార్చు]
కరచాలనం చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులు

కరచాలనం ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు వారి చేతులు కలిపి చేసుకొనే సంప్రదాయం. ఇందులో ఇద్దరూ చేతుల్ని కలిపిన తర్వాత కొద్దిగా పైకీ క్రిందకీ కదిపిస్తారు. ఇది పాశ్చాత్యుల సంప్రదాయమైనప్పటికి, ప్రపంచీకరణ ఫలితంగా విశ్వవ్యాప్తమైంది.

చేతివాటం

[మార్చు]

చేతివాటం అనేది మానవులలో సున్నితమైన పనులు చేయడంలో కుడి, ఎడమ చేతుల మధ్య వ్యత్యాసం ఉండడం. కుడి చేతితో పనులు సులువుగా చేసుకొనే వారిని కుడి చేతివాటం కలవాడు అంటారు. అలాగే ఎడమ చేతితో చేసుకొనే వారిని ఎడమ చేతివాటం వాడు అంటారు. చాలా తక్కువమంది రెండు చేతులతో ఒకే విధంగా పనిచేసుకోగలవారుంటారు. వారిని సవ్యసాచి అంటారు. అయితే ఒక వ్యక్తి ఏ చేతివాటం కలవాడో తెలుసుకోవడానికి సాధారణంగా వారు ఏ చేతితో రాస్తారో అనేదాని మీద నిర్ణయిస్తారు.

చేయి నిర్మాణం

[మార్చు]

మానవుని చేతిలో విశాలమైన అరచేయి దానికి అనుబంధంగా అయిదు వేళ్లు వుండి ముంజేయికి మడతబందు కీల ద్వారా కలపబడి వుంటుంది.[1]

మానవుని చేయికున్న వేళ్ళు.

చేతివేళ్లు

[మార్చు]

ఎముకలు

[మార్చు]
మానవుని చేతిలోని ఎముకల ఏర్పాటు.

మానవుని చేతిలో 27 ఎముకలు ఉంటాయి:[2] వీనిలో 8 చిన్న కార్పల్ ఎముకలురెండు వరుసలలో అమర్చబడి వుంటాయి. వెనుక వరుసలో నాలుగుముంజేతి ఎముకలతో బంధించబడితాయి. ముందు వరుసలో నాలుగు 5 మెటాకార్పల్ ఎముకలతో సంధించబడతాయి. అయిదు చేతివేళ్లకు కలిపి 14 పొట్టి ఎముకలు (ఒక్కొక్క వేలికి మూడు చొప్పున; కానీ బొటనవేలికి రెండు మాత్రం) ఉంటాయి.

ఇవికాక చేతిలో చాలా సెసమాయిడ్ ఎముకలు ఉంటాయి. ఇవి చిన్న ఎముక భాగాలుగా టెండాన్లలో ఉంటాయి. వీటి సంఖ్య మారుతూవుంటాయి:[3] చాలా మందిలో ఒక జత సెసమాయిడ్ ఎముకలు బొటనవేలి కీలు ప్రక్కన ఉంటాయి.

కండరాలు

[మార్చు]
మణికట్టు, అరచేయిలోని కండరాలు, ఇతరాలు

చేతికి వున్న కండరాలను రెండు రకాలుగా విభజిస్తారు: బాహ్య కండరాలు, అంతర్గత కండరాలు.

అంతర్గతకండరాలు

[మార్చు]

ఇంట్రిన్సిక్ కండరాలు నాలుగు రకాలు: బొటనవేలి వైపుండే థీనార్ కండరాలు, చిటికెనవేలి వైపుండే హైపోథీనార్ కండరాలు ; మెటాకార్పల్ ఎముకల నుండి వచ్చే ఇంటరాషియస్ కండరాలు;, లుంబ్రికల్ కండరాలు.[4]

బాహ్య కండరాలు

[మార్చు]
మణికట్టులో ఎక్స్టెన్సార్ గదులు (చేతి క్రింద)

బాహ్య కండరాలు పొడవైనవిగా ఉండి మోచేయి నుండి మొదలై చేతి వేళ్ళకు టెండాన్ల ద్వారా అతుక్కుంటాయి. ఇవి వేల్లు ముడుచుకొనడానికి, విప్పుకోడానికి ఉపయోగపడతాయి. ఫ్లెక్సార్ కండరాలు మోచేయి ముందు భాగంలో ఉండి చేతివేళ్ళు ముడుచుకోడానికి ఉపయోగపడతాయి. ఎక్స్టెన్సార్ కండరాలు మోచేయి వెనుక భాగంలో ఉంటాయి. ఇవి చేతివేళ్ళలు తిన్నగా చేయడానికి సాయపడతాయి.

హస్తసాముద్రికం

[మార్చు]

హస్తసాముద్రికం లేదా సాముద్రికం అనేది అరచేయిని అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తు గురించి వివరించే కళగా చెప్పవచ్చు, దీనిని అరచేతి పఠనం లేదా చిరోలాజీ అని కూడా పిలుస్తారు. ఈ విధానం పలు సాంస్కృతిక వైవిధ్యాలతో ప్రపంచవ్యాప్తంగా ఉనికిలో ఉంది. సాముద్రికాన్ని సాధన చేసిన వారిని సాధారణంగా హస్తసాముద్రికులు, అరచేతిని చదవగలిగేవారు, చేతిని చదివేవారు, చేతి విశ్లేషకులు లేదా సాముద్రికులు అని పిలుస్తారు.

లైంగిక భేదాలు

[మార్చు]

చేతి నిర్మాణంలో స్త్రీలు, పురుషుల మధ్య భేదం వుంటుంది. పురుషులలో చేయి సగటు పొడవు 189 మిల్లీమీటర్లు, అయితే అదే స్త్రీల చేయి పొడవు 172 మిల్లీమీటర్లు. సగటు చేయి వెడల్పు పురుషులు, స్త్రీలలో 84, 74 మిల్లీమీటర్లు ఉంటుంది.[5] అందువలననే స్త్రీల చేతులు సన్నగా నాజూగ్గా ఉంటాయి.

సంస్కృతి సాంప్రదాయాలు

[మార్చు]

భారతీయ సంస్కృతిలో చేతికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. సూర్యోదయాన్నే లేచిన వెంటనే ఈ క్రింది శ్లోకం చదువుకొని దైవప్రార్థన చేసుకుంటే ఆ రోజంతా మంచే జరుగుతుందని కొందరు నమ్ముతారు.

కరాగ్రే వసతే లక్ష్మీ కరమూలే సరస్వతి ; కరమధ్యేతు గోవిందా ప్రభాతే కరదర్శనం.
నమస్కార ముద్రలోని నాట్యకత్తె.

ముద్ర అనగా హిందూ మతం లో, బౌద్ధ మతంలో చేతులతో, వేళ్ళతో చేసే సంజ్ఞలు లేదా గుర్తులు. వీటిని కార్యాల్లోనూ, నృత్య రూపకాల్లోనూ, శిల్పకళ,, చిత్రకళల్లోనూ గమనించవచ్చు.[6]. ముఖ్యంగా నాట్యాల్లో ప్రదర్శించే ముద్రలు, అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇవి చాలా సంక్లిష్టంగా, గూఢార్థాలను కలిగి ఉంటాయి. భారతీయ శాస్త్రీయ నాట్యంలో ప్రదర్శించే హస్త ముద్రల్లో సుమారు 500 రకాలైన అర్థాలను వ్యక్తపరచవచ్చని ఒక అంచనా. వీటన్నింటిలోకి భారతీయతను చాటి చెప్పే నమస్కారం ఉన్నతమైనది. ఇది ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్రగా పరిగణింపబడుతుంది. గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని ప్రకటించుకొనే ప్రక్రియ.

హిందువుల వివాహంలో పాణిగ్రహణము ఒక ప్రధానమైన ఘట్టం. పాణి అనగా సంస్కృతంలో చేయి అని గ్రహణం అనగా గ్రహించడం లేదా పట్టుకోవడం అని అర్ధం.

మనం చేసే పనుల్ని బట్టి మన చేతులకు మంచి / చెడు భేదాన్ని కల్పిస్తాయి. మనం చేసే దానాలు చేతుల మీదగానే చేస్తాము. కొందరి హస్తం దీనుల్ని కాచే అభయ హస్తం మరి కొందరిది ఇతరుల్ని నాశనం చేసే భస్మాసురుని హస్తం అవుతుంది.

వ్యాధులు

[మార్చు]
గాంగ్లియాన్ తిత్తి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nature Bulletin No. 611". Division of Educational Programs, Argonne National Laboratory. 1960-10-01. Retrieved 2007-12-24.
  2. Tubiana, Raoul; Thomine, Jean-Michel; Mackin, Evelyn (1998). Examination of the Hand and Wrist (2nd ed.). Taylor & Francis. p. 4. ISBN 9781853175442.
  3. Schmidt, Hans-Martin; Lanz, Ulrich (2003). Surgical Anatomy of the Hand. Thieme. p. 105. ISBN 158890007X.
  4. "Medical mnemonics". LifeHugger. Archived from the original on 2011-07-13. Retrieved 2009-12-19.
  5. Agnihotri, A. K.; B. Purwar, N. Jeebun, S. Agnihotri (2006). "Determination Of Sex By Hand Dimensions". 1 (2). The Internet Journal of Forensic Science. Archived from the original on 2007-09-26. Retrieved 2007-12-24. {{cite journal}}: Cite journal requires |journal= (help)CS1 maint: multiple names: authors list (link)
  6. "గూగుల్ బుక్స్ లో ముద్ర గురించిన వ్యాసం".

వెలుపలి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=చేయి&oldid=4318604" నుండి వెలికితీశారు