Jump to content

వంగపండు ప్రసాదరావు

వికీపీడియా నుండి
వంగపండు ప్రసాదరావు
వంగపండు ప్రసాదరావు
జననంవంగపండు ప్రసాదరావు
1943 జూన్
పార్వతీపురం మండలం, పెదబొండపల్లి
మరణం2020 ఆగస్టు 4(2020-08-04) (వయసు 77)
పార్వతీపురం
మరణ కారణంగుండెపోటు
ఇతర పేర్లువంగపండు ప్రసాదరావు
ప్రసిద్ధిజానపద వాగ్గేయకారుడు
, గాయకుడు,
జననాట్యమండలి అధ్యక్షుడు.
హేతువాది,
భార్య / భర్తవిజయలక్ష్మి
పిల్లలువంగపండు ఉష (కూతురు), దుష్యంత్ (కుమారుడు)
తండ్రిజగన్నాధం
తల్లిచినతల్లి
Notes
ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరుతెచ్చుకున్నాడు.

వంగపండు ప్రసాదరావు (1943 జూన్ - 2020 ఆగస్టు 4) జానపద వాగ్గేయకారుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు. అతను హేతువాది, ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరు తెచ్చుకున్నాడు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారం అందుకున్నాడు.

మూడు దశాబ్దాల పాటు 300కు పైగా జానపదపాటలు రచించిన అతను పేద ప్రజలు, గిరిజనులను ఎంతో చైతన్య పరిచారు. విప్లవ కవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందాడు. అతను అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమాతో సినీప్రస్థానం ప్రారంభించాడు. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ’ పాటతో ప్రజలను ఉర్రూతలూగించాడు. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడిపాడాడు. 1972లో జననాట్యమండలిని స్థాపించాడు.[1]

ఇతనిని ప్రజలకోసం బ్రతికిన నాజర్ లాంటి కళాకారుడని పోలుస్తారు. అతను గద్దర్ తో కలసి 1972లో పీపుల్స్ వార్ యొక్క సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించాడు. అతను మూడు దశాబ్దాలలో 300కు పైగా పాటలు వ్రాశాడు. అందులో 12 పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు తమిళం, బెంగాళీ, కన్నడ, హిందీ వంటి పది భారతీయ భాషలలోకి కూడా అనువదించబడినవి. వంగపండు "యంత్రమెట్టా నడుస్తు ఉందంటే..." అనే పాట ఒక ఆచార్యునిచే ఆంగ్లంలో కూడా అనువదించబడి అమెరికా, ఇంగ్లాండులో అభిమానం చూరగొన్నది.[2] విప్లవ కవిత్వంలో పాట ప్రముఖ పాత్ర వహించింది. ఇతనితో పాటు సుబ్బారావు పాణిగ్రాహి, గద్దర్ మొదలైనవారు విప్లవ భావాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళారు.

2008 నవంబరు 23 న తెనాలిలో ఈయనకు బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ అవార్డును బి.నరసింగరావు చేతులమీదుగా ప్రధానం చేశారు.[3]

జీవిత విశేషాలు

[మార్చు]

వంగపండు ప్రసాదరావు విజయనగరం జిల్లా పార్వతీపురం దగ్గర పెదబొండపల్లిలో జూన్ 1943న జగన్నాథం, చినతల్లి దంపతులకు సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. అతనికి ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. అందరి కంటే అతనే పెద్దవాడు. అతని చిన్నతనంలో పంట నూర్పిళ్లప్పుడు రాత్రిపూట మా తాత వాళ్లు పొలం దగ్గరకి వెళితే అతను వాళ్లతో పోయేవాడు. అప్పుడు అతని తాత, నాయిన, పెదనాయిన దేవుళ్ల కథలు చెప్పేవారు.

చిన్నతనంలో అతనికి చదువు పెద్దగా అబ్బలేదు. ఎస్‌ ఎస్ ‌ఎల్ ‌సీ ఫెయిల్‌ కావడంతో బొబ్బిలిలో ఐటీఐ చేశాడు. అప్పట్లో చైనా యుద్ధంలో పాల్గొనాలనే పిలుపు వస్తే ఆ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. ఆ యుద్ధం ఆగిపోవడంతో ఊరుబాట పట్టాడు. అప్పటికే అతని తండ్రి ఊళ్లో భూమి అమ్మేసి రాయగఢలో భూమి కొన్నాడు. తన తండ్రికి వ్యవసాయంలో కొంతకాలం తోడుగా ఉన్నాడు. వారి భూమి అడవికి దగ్గరగా ఉండేది. దీంతో అక్కడి గిరిజనులతో పరిచయాలు, వారి పదాలు అతని పాటల్లో బాగా దొర్లాయి. ఈ పనుల్లో పడి తెలిసిన పల్లె పదాలతో తోచిన బాణీలు కట్టుకుని పాడుతుంటే ఊళ్లో అంతా ‘ఓరేయ్‌ కవీ’ అని అతనిని పిలిచేవారు. అప్పట్లో అర్థంకాని పదాలు రాస్తేనే కవిత్వం అనుకునేవాడు. అతను లల్లాయ పదాలతో పాటలు అల్లుకుపోయేవాడు. ప్రజలు అతని చేత పాటలు పాడించుకుని, సరదా పడేవారు. అంతవరకు అతనికి సరదా సరదాగా గడిచిపోయింది.

ఉద్యమంలో...

[మార్చు]

వివాహం చేసుకున్న తరువాత రెండు సంవత్సరాలకు మొదలైన నక్సల్బరీ ఉద్యమం అతనిలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఎక్కడ ఉన్నా ఉద్యమం అతని జీవితం లో ఒక భాగమయింది. ఆ ఉద్యమంలో ఎంతో మందిని కలిసాడు. ఎందరో కష్టాలను ప్రత్యక్షంగా చూసాడు. జనాన్ని జాగృతం చేయడానికి వాటన్నిటినీ పాటగా రూపుకట్టాడు. ఆ ఊపులో 400కు పైగా జాన పద పాటలు రాసాడు. వాటిలో 200కు పైగా గీతాలు మంచి గుర్తింపు తెచ్చాయి. ఉద్యమంలోకి వెళ్లిన ఏడాదికే విశాఖ షిప్‌ యార్డులో ఫిట్టర్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగం కంటే ఉద్యమమే అతనికి ఆత్మ సంతృప్తినిచ్చింది. షిప్‌యార్డులో పని చేస్తూ ఉన్నా మనసంతా అతనికి ఉద్యమం వైపే ఉండేది. దీంతో పదిరోజులు పనికెళ్లడం, ఇరవై రోజులు పాటలు పాడుకుంటూ ఊళ్లలో తిరగడం చేసేవాడు. అలా కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ , కర్ణాటక రాష్ట్రాలన్నీ తిరిగాడు. ఇలా తిరుగుతూ ఉంటే ఇంట్లో పూట గడవని స్థితి ఏర్పోడింది. ఒక పూట తింటే మరో పూట పస్తు ఉండే పరిస్థితి ఏర్పడింది. అయినా సరే అతను నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. ఆరేళ్ళు సర్వీసు ఉన్నా స్వచ్ఛంద పదవీవిరమణ చేసి పూర్తి స్థాయి ఉద్యమంలో కొనసాగాడు.

మధ్యతరగతి కుంటుంబాలకు ఉద్యమాలు సరిపోవని అనుకున్నాడు. ఉద్యోగం వదులుకున్నప్పుడు ఎంతో మానసిక క్షోభ అనుభవించాడు. ఇంట్లో నలుగురు పిల్లలు, భార్య. వారికి కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేనప్పుడు ఈ ఉద్యమాలెందుకన్న ఆలోచనలో మధనపడేవాడు. మళ్లీ కొన్నాళ్లు స్వంత గ్రామంలో వ్యవసాయం చేశాడు కానీ కలిసిరాలేదు. ఆకలి బాధ కోసం ఆత్మాభిమానం చంపుకోకూడద నిపించి మళ్లీ ఉద్యమం బాటే పట్టాడు.

సినిమా ప్రస్థానం

[మార్చు]

దర్శకులు టి.కృష్ణ, ఆర్‌. నారాయణమూర్తిలతో పాటు మరికొందరు వారి సినిమాలకు పాటలు రాయమని అతనిని కోరారు. అలా 30 సినిమాల వరకు రాశాడు. అలాగే ఆరేడు సినిమాల్లోనూ నటించాడు. కొన్ని సినిమాలకు పాటలు రాసే అవకాశాలొచ్చినా జననాట్యమండలి నిబంధనలకు కట్టుబడి రాయలేదు. సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే అతని జీవితం మరోలా ఉండేది.

అతని అనుభవాలు

[మార్చు]

అతనికి చిన్నతనం నుండి శివుడంటే ఇష్టం. శివుడు నిరాడంబరంఆ ఉన్నందున అతనికి సామాన్యమైన జీవితం అని అతనిని ఎక్కువగా ఇష్టపడేవాడు ఈక్రమంలో అతను శివుని మీద ‘ఓమ్‌ ఉమాశంకరా .. వందిత పురంధరా.. హిమాచలాద్రి మందిరా.. ’ అంటూ చాలా పాటలు పాడాడు. శివయ్య బుర్ర కథలకూ బాణీలు కట్టాడు. అలాగని, ఏనాడూ శివాలయానికి వెళ్లిందీ లేదు. పూజల పేరిట వృథాగా డబ్బు ఖర్చుపెట్టేవాడు కాదు. కనపడని దైవాన్ని నిందించడం, కోపం తెచ్చుకోవడం ఎందుకని భావించేవాడు. అపుడు మనలోని శక్తిని మనమే తిట్టుకున్నట్టు అవుతుంది అని అనుకునేవాడు. దైవం, దైవత్వం అంటే ఆపదలో ఉన్నవాడికి సాటిమనిషిగా సాయపడటం అని అతను నమ్మేవాడు. అతనిని మంచి మిత్రుడు ఉద్యమకారుడైన ఆదిభట్ల కైలాసం. ఆదిభట్ల కైలాసం నమ్మిన సిద్ధాంతం కోసం సెంటు భూమికూడా ఉంచుకోకుండా తనకున్న 150 ఎకరాలను నిరుపేదలకు రాసిచ్చేశాడు. ఆ భూములు పొందిన వారు ఇళ్లలో ఆయన్ని ఓ దేవుడిగా కొలుస్తారు. మూర్తీభవించిన మానవత్వానికి ఇంతకంటే ఉదాహరణ ఉంటుందా? అని చెప్పేవాడు. ఎదుటివాడికి సాయపడమనే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ బోధిస్తున్నాయనీ, కానీ మనం వాటిని మతగ్రంథాలుగానే చూస్తున్నామనీ తెలిపేవాడు.

దైవం అంటే భయం కంటే భక్తి ఉండాలనీ, మనం నమ్మి భక్తిగా ఏ పని చేసినా విజయం సిద్ధిస్తుంది. భయంతో ఏ పని చేసినా ఫలితం దక్కదనీ అతని అభిప్రాయం.

వంగపండు గీతాలు నృత్యరూపకాలు

[మార్చు]
  • భూమిబాగోతం
  • ఏంపిల్లో ఎల్దమొస్తవ
  • తరమెల్లిపోతున్నది ఆనాటి స్వరమాగిపోతున్నది
  • జజ్జనకరి జనారే -ఝనకు ఝనా ఝనారే

జజ్జనకరి జజ్జనకరి జజ్జనకరి జనారే

[మార్చు]

జజ్జనకరి జజ్జనకరి జజ్జనకరి జనారే
గేటులు కాసిన సిన్నోడా/ మూటలు వోసిన కుర్రోడా/ ఎన్నాళ్లయి తిన్నావో/ ఎండుతొక్కలాగున్నావో/ అన్నాననకు రారన్నా/ నిన్నుదిన్న తుసపోతునుతన్న
||జజ్జనకరి||
కొండలు ఎక్కిన కోదోడా/ కట్టెలుగొట్టిన పేదోడా/ మంచులోన తొంగున్నావు/ మన్నుబెడ్డ కప్పుకున్నావు/ ఆ ఉన్నోడు తెగ తిన్నోడు/ నీ ఉసురుతగిలి మరి సవ్వకపోడు
||జజ్జనకరి||
భూమిని దున్నిన రైతన్నా/ ఏమీలేని కూలన్నా/ కాకిలాగ నువ్వున్నావు/ కావుకావు మంటున్నావు/ కాయితాలలో దాసిన భూములు/ కాల్చర నువ్వు కాగడాలతో
||జజ్జనకరి||
ఇనుపకొండ మీదున్నోడా/ ఇంజినులు కడుతున్నోడా/ ఎప్పుడు ఇంటికి వస్తావో/ ఎక్కడ పడి నువు సస్తావో/ ఆ దిక్కులేని సావు సచ్చేకన్నా/ వీరుడివై నువ్వు సావరా అన్నా
||జజ్జనకరి||
మట్టిని వోసిన మాలన్నా/ గట్టులు పోసిన కూలన్నా/ గునపామెత్తి పొడలేక/ గుండెలు పీకుతు ఉన్నాయా/ ఆ గుండెబలం మరి కావాలంటే/ రండిర అన్నా దండుగ ఎళ్దాం
||జజ్జనకరి||
ఎండిన గొంతుకుతీసి/ ఇంజను సైరనుచేసి
ఆరిన పేగులుతీసి/ ఆయిలు గొట్టాలుచేసి
నరం నరం తీగజేసి కరెంటెలుగు తెచ్చినోడా/ దివ్వలోన చమురులేక దిగులు వెుకం పెట్టకురా
||జజ్జనకరి||
నువ్వు మేడిపట్టి దున్నకున్న/ బువ్వ బుక్కలేడు ఎవడు/నువ్వు బురద మట్టి కుమ్మకుండ/ మేడ కట్టలేడు ఎవడు/ సుక్కసుక్క చెమటజేసి వెుక్కవెుక్క నువు పెంచితే/ ఆ పంటలన్ని పట్టుకెళ్లి బటాచోర్లు బతుకుతుండ్రు/ బాకుతియ్... బదులు చెయ్
||జజ్జనకరి||

పురస్కారాలు

[మార్చు]
వంగపండు ప్రసాదరావు అభినయం 

వివాదాలు

[మార్చు]

వంగపండు ప్రసాదరావు రాసిన "ఏం పిల్లడో ఎల్దమొస్తవా" పాట తనకు తెలియకుండా, తన అనుమతి పొందకుండా ప్రజా గేయాన్ని మగధీర చిత్రంలోని అశ్లీల సన్నివేశంలో వాడుకోవడం పై అభ్యంతరం తెలిపి దాన్ని తొలగించాలని డిమాండ్ చేసాడు. ఆ పాట శ్రీకాకుళం జిల్లాలోని గ్రామీణ వాసులదని కొందరు చెబుతున్నారు.

మరణం

[మార్చు]

అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలో 2020 ఆగస్టు 4న తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశాడు.

మూలాలు

[మార్చు]
  1. 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
  2. "Sings his way into hearts - The Hindu ఆగష్టు 02, 2004". Archived from the original on 2010-08-25. Retrieved 2008-12-29.
  3. "Vangapandu feted The Hindu నవంబర్ 24, 2008". Archived from the original on 2012-11-05. Retrieved 2008-12-29.
  4. 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
  5. "ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం". andhrapradesh.suryaa.com. 2017-03-28. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.

యితర లింకులు

[మార్చు]