ఢిల్లీ కుట్ర కేసు
1912 లో బ్రిటిషు భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి తరలించే సందర్భంలో అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ హార్డింగేను నాటు బాంబు విసిరి హత్య చేయడానికి ప్రయత్నం చేసారు. ఈ ప్రయత్నాన్ని ఢిల్లీ కుట్ర కేసు అంటారు. దీన్ని ఢిల్లీ లాహోరు కుట్ర కేసు అని కూడా అంటారు. బెంగాల్, పంజాబుల్లో ఉన్న విప్లవకారులు, రాష్ బిహారీ బోస్ నేతృత్వంలో, ఈ కుట్రను పన్నారు. 1912 డిసెంబరు 23 న, ఢిల్లీ లోని చాందినీ చౌక్ శివారు గుండా వైస్‌రాయి వస్తున్న ఏనుగు అంబారీ పైకి నాటు బాంబును విసరడంతో ఈ కుట్ర పరాకాష్ఠకు చేరుకుంది.
బాంబు విసిరారు
[మార్చు]వైస్రాయి, అతని భార్య ఏనుగుపై కూర్చుని నగరంలోకి ప్రవేశిస్తూండగా, [1] నదియా గ్రామానికి చెందిన బసంత కుమార్ బిశ్వాస్ ఏనుగుపై కూర్చున్న వైస్రాయ్‌పై ఒక నాటుబాంబు విసిరాడు. ఆ దాడిలో వైస్రాయి గాయపడినప్పటికీ, పైపై దెబ్బల తోటి బయటపడ్డాడు. కానీ అతని వెనుక ఛత్రం పట్టుకుని ఉన్న సేవకుడు మరణించాడు. లేడీ హార్డింగ్ క్షేమంగానే ఉంది. ఏనుగు దాని మావటి కూడా క్షేమంగానే ఉన్నారు. బాంబు ముక్కలు గుచ్చుకుని లార్డ్ హార్డింగ్ వీపు, కాళ్లు, తలపై గాయాలయ్యాయి. అతని భుజాలు చీరుకుపోయాయి. [2] అంబారీ ముక్కలైంది. వైస్రాయ్‌ని ఏనుగు పైనుండి దించడానికి కొంత ఇబ్బంది ఎదురైంది.[3] వైస్రాయి ఛత్రధారి అయిన సేవకుడు లార్డ్ కర్జన్‌కు కూడా ఆ హోదాలో పనిచేసాడు. [4]
బాంబులో నింపిన మేకులు గుచ్చుకోవడంతో వైస్రాయ్ హార్డింగ్‌కు అనేక గాయాలు అయ్యాయి. మేకులు అతని భుజాల్లోకి, వీపులోకీ దిగబడ్డాయి. [5]
ఈ సంఘటన తరువాత, ప్రచ్ఛన్నంలో ఉన్న బెంగాలీ, పంజాబీ విప్లవ కార్యకర్తలను తుదముట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. దాంతో వాళ్ళపై కొంతకాలం పాటు తీవ్రమైన ఒత్తిడి కలిగింది. బాంబు విసిరిన వ్యక్తి రాష్ బిహారీ బోస్ అని గుర్తించారు. [6] దాదాపు మూడు సంవత్సరాల పాటు అతడు పట్టుబడకుండా తప్పించుకున్నాడు. గదర్ కుట్రలో పాల్గొన్నాడు. ఆ కుట్ర బయటపడ్డాక 1915 లో జపాన్ పారిపోయాడు.
అనంతర పరిణామాలు
[మార్చు]బాంబు విసిరిన వ్యక్తిని అరెస్టు చేసేందుకు రూ .10,000 బహుమతిని ప్రకటించారు. [7] హత్యాయత్నం తరువాత జరిగిన దర్యాప్తు ఢిల్లీ కుట్ర విచారణకు దారితీసింది. లాలా హనుమంత్ సహాయ్, బసంత కుమార్ బిశ్వాస్, భాయ్ బల్ముకుంద్, అమీర్ చంద్, అవధ్ బెహారీలపై కేసు నమోదైంది. 1914 అక్టోబరు 5 న లాలా హనుమంత్ సహాయ్ కు అండమాన్ దీవులలో జీవిత ఖైదు విధించారు. మిగిలిన నలుగురికి కుట్రలో పాత్ర పోషించినందుకు గాను మరణశిక్ష విధించారు. బసంత కుమార్ బిశ్వాస్‌ను 1915 మే 11 న పంజాబ్‌లోని అంబాలా సెంట్రల్ జైలులో అతనికి ఇరవై ఏళ్ళ వయసులో ఉరితీశారు. 20 వ శతాబ్దంలో భారత విప్లవ పోరాటాల సమయంలో మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కులలో అతనొకడు.
మూలాలు
[మార్చు]
- ↑ Jozuka, Emiko (10 May 2020). "he Indian revolutionary who fought to overthrow British rule while living in Japan". CNN. Retrieved 12 August 2021.
- ↑ "India Truly Loyal, Says Hardinge" (PDF). New York Times. 20 May 1916.
- ↑ "Viceroy of India is injured by Bomb Attendent killed". UCR Centre for Bibliographical studies and research. UCR. Retrieved 12 August 2021.
- ↑ "Viceroy of India is injured by Bomb Attendent killed". UCR Centre for Bibliographical studies and research. UCR. Retrieved 12 August 2021.
- ↑ "Viceroy of India is injured by Bomb Attendent killed". UCR Centre for Bibliographical studies and research. UCR. Retrieved 12 August 2021.
- ↑ Indian Freedom Fighters by Vipin Chandra
- ↑ "Viceroy of India is injured by Bomb Attendent killed". UCR Centre for Bibliographical studies and research. UCR. Retrieved 12 August 2021.