Jump to content

తవనం చెంచయ్య

వికీపీడియా నుండి

తవనం చెంచయ్య:- వీరు కొరిశపాడు మండలం, ప్రాసంగులపాడు గ్రామములోని ఒక వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించారు. యుక్తవయసులోనే కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితులైనారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీ విడిపోయినప్పుడు వీరు సి.పి.ఎం.లో చేరినారు. తుదిశ్వాస విడిచేవరకూ ఆ పార్టీలోనే కొనసాగినారు. జిల్లాలో జరిగిన అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు భూమి దక్కాలనే నినాదంతో, జిల్లాలో జరిగిన పలు భూపోరాటాలకు నాయకత్వం వహించారు. ఆగంచెరువు, చింతలపాలెం, నర్సాయపాలెం, దూబగుంట, రాజగోపాలరెడ్డినగర్, కెల్లంపల్లి గ్రామాలలో నిర్వహించిన భూపోరాటాలు, ఆయన జీవితంలో మైలురాళ్ళుగా నిలిచాయి. అంటరానితనం, సాంఘిక బహిష్కరణల వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, పోరాటాలు సాగించారు. వేతన సమస్యలపైనా ఉద్యమాలు చేశారు. 13 ఏళ్ళపాటు పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. చివరిదాకా విలువలతో గూడిన జీవనం గడిపారు. 2 సార్లు శాసనసభ్యునిగా పనిచేసినా, అందుమూలంగా లభించే వేతనాన్ని, అనంతరం వచ్చే పింఛనును గూడా, పార్టీకి ఇచ్చేసి, పార్టీ అందించే సహకారంతోనే జీవనం సాగించారు. ఆయన ఎం.ఎల్.ఏ.గా ఉన్న సమయంలోనూ ఆయన భార్య, కుటుంబపోషణ కోసం, కూలీగా పనిచేశారు. ఆయన చివరివరకూ, ఒంగోలులోని చిన్న పెంకుటింట్లోనే జీవనం సాగించారు. నిరాడంబర జీవనశైలితో పలువురి మన్నలనందుకున్న వీరు, 2014, ఫిబ్రవరి 23, శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, తన 92వ ఏట కన్నుమూశారు. [1]

మూలాలు

[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014, ఫిబ్రవరి-23; 16వ పేజీ