Jump to content

తాళ్ళపాక తిరువెంగళనాధుడు

వికీపీడియా నుండి
(తాళ్ళపాక చిన్నన్న నుండి దారిమార్పు చెందింది)

తాళ్ళపాక చిన్నన్నగా పేరొందిన తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు, తాళ్ళపాక అన్నమయ్య మనుమడు. అతను నందవరీకబ్రాహ్మణుడు; ఆశ్వలాయనసూత్రుడు; భరద్వాజగోత్రుడు. ఈ కవి పరమయోగివిలాస మనుపేర నాళ్వారుల చరిత్రమును ద్విపదకావ్యముగా నెనిమిదాశ్వాసములగ్రంథమును రచించెను. ఈ గ్రంథరచన బట్టియే యితడు విష్ణుభక్తుడని స్పష్టమగుచున్నది. ఇతడు తాళ్ళపాక అన్నమయ్య యొక్క మనుమడు. తిరుమలార్యుని కుమారుడు అయినట్టు గ్రంథారంభము లోని యీక్రిందివాక్యములవలన దెలియవచ్చుచున్నది.

ద్వి. హరిసేవ కాశ్వలాయనసూత్ర నంద
వరవంసభవ భరద్వాజగోత్ర
పావనశ్రీతాళ్ళ పాకాన్నయార్య
ధీవిశారదసూను తిరుమలాచార్య
వినుతనందను దిరువేంగళనాధు.

ఈకవితాత యైనయన్న యార్యుడు కృష్ణదేవరాయనికాలములో నుండి కొన్నియగ్రహారముల నందెను. కవి తనకు వేంకటాద్రిరాయలు కుండలములు వేసినట్లు తనగ్రంథములోని యెనిమిదవయాశ్వాసాంతము నందీవాక్యములచే జెప్పుకొన్నాడు.

ద్వి. అతిలోకమతికి శేషాచలరాజ
పతికి బరాముఖ్య భక్తసంతతికి
నంకితంబుగను శ్రీహరిభక్తనికర
పంకజార్యమ తాళ్ళపాకాన్నయార్య
తనయ తిమ్మార్య నందన రత్నశుంభ
దనవమ శ్రీవేంకటాద్రీశ దత్త
మకరకుండలయుగ్మ మండితకర్ణ-

కవి కాలాదులు నిర్ణయము

[మార్చు]

ఈకవికి మకరకుండలములువేసిన వేంకటాద్రిసుచరిత్రము కృతినందిన తిరుమలదేవరాయని తమ్ముడని తోచుచున్నది. అట్లే యైన పక్షమున కవి 1570 వ సంవత్సరప్రాంతములయం దుండెను. అట్లు గాక యతడు తిరుమలదేవరాయని కొడుకైన వేంకటాద్రి యైనపక్షమున, అతడు 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ సంవత్సరమువఱకును రాజ్యముచేసినందున కవియు నాకాలమువాడే యయి యుండవలెను. కవియొక్క కవిత్వరీతి తెలియుటకయి ద్వితీయాశ్వాసమునుండి కొంచెముభాగ ముదాహరించ బడింది.

ద్వి. భానుకోటిస్ఫూర్తి బ్రహసించుచున్న
మౌనినందను గాంచి మది సంతసించి
పిల్లిగా దోరి జాబిల్లి గాబోలు
జల్లనివెన్నెల జల్లుచున్నాడు;
అనుచు నబ్బాలు ఱెప్పార్ప కెంతయును
గనుగొని వేడుకకడలి నోలాడి
యానందబాష్పంబు లాననాబ్జంబు
మైనుండి దిగువార మై గరుపార
బెన్నిధి గన్నట్టిపేదచందమున
నున్నతోన్నతు డైనయోగినందనుని
దనయులు లేని యాదరమున నెత్తి
కొని కూర్మితోడ నక్కున జేర్చి వేడ్క
గొనకొని యావేత్రకుంజంబు వెడలి
తనవార లెల్ల నెంతయు జోద్యపడగ
మునిపుత్రుగొని పురంబున కేగుదెంచి
తనయాలిచేతి కెంతయు బ్రేమ నొసగె.

రచనలు

[మార్చు]

తాళ్ళపాక చిన్నన్న ఎనిమిది భాషలలో పండితుడు. ఇతని రచనలు

  1. శృంగార సంకీర్తనలు
  2. సంకీర్తన లక్షణము
  3. అష్టబాషా దండకము
  4. ఉషా పరిణయము
  5. అష్టమహిషీ కళ్యాణము
  6. పరమయోగి విలాసము
  7. అన్నమాచార్య చరిత్రము

మూలాలు

[మార్చు]
  • ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు [తాళ్ళపాక తిరువెంగళనాధుడు]
  • సరస కమనీయ సాహితీమూర్తి - తాళ్ళపాక చిన్నన్న, ఆచార్య కె.జె.కృష్ణమూర్తి, 150 వసంతాల వావిళ్ల వాజ్మయ వైజయంతి.

బయటి లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ ఆర్చీవులలో లభిస్తున్న రచనలు