తిట్టె కృష్ణ అయ్యంగార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిట్టె కృష్ణ అయ్యంగార్
Titte Krishna Iyangar.jpg
జననం1902
మైసూరు, మైసూరు రాజ్యం, బ్రిటీషు ఇండియా
మరణం1997 మార్చి 13(1997-03-13) (వయస్సు 95)
వృత్తిగాయకుడు, గీత రచయిత, స్వరకర్త
సుపరిచితుడుకర్ణాటక గాత్రసంగీతం
పురస్కారాలు

తిట్టె కృష్ణ అయ్యంగార్ మైసూరుకు చెందిన కర్ణాటక సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు.

విశేషాలు[మార్చు]

ఇతడు 1902లో జన్మించాడు. వీరి పూర్వీకులది తంజావూరు సమీపంలోని "తిట్టె" అనే గ్రామం[1]. ఇతని తాత తిట్టె రంగాచార్య సంస్కృత పండితుడు. అతడు మైసూరుకు వలస వచ్చి మైసూరు మహారాజా "కృష్ణరాజ ఒడయార్ III" వద్ద ఆస్థాన పండితుడిగా చేరాడు. అతని కుమారుడు, కృష్ణ అయ్యంగార్ తండ్రి నారాయణ అయ్యంగార్ మైసూరు మహారాజా "కృష్ణరాజ ఒడయార్ IV" వద్ద ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు. ఆ కాలంలో మైసూరు రాజ్యంలో కళలకు స్వర్ణయుగంగా ఉండేది. వీణ సుబ్బణ్ణ, వీణ శేషణ్ణ, బిడారం కృష్ణప్ప, వీణ శ్యామణ్ణ వంటి మహామహులు రాజాస్థానంలో ఉండేవారు. కృష్ణ అయ్యంగార్ సంగీత వారసత్వాన్ని వీరి నుండి అందిపుచ్చుకున్నాడు. ఇతనికి చిన్నవయసులోనే స్వరజ్ఞానం అలవడింది. ఇతడు తన తండ్రి నారాయణ అయ్యంగార్ వద్ద సంగీతాన్ని, సాహిత్యాన్ని అభ్యసించాడు. తరువాత వీణ శేషణ్ణ, జి.బి.కృష్ణప్పల వద్ద తన సంగీతాన్ని మెరుగు పరుచుకున్నాడు[2]. ఇతడు తన తొమ్మిదవ యేటనే తిరువయ్యారులో పాపా వెంకటరామయ్య వయోలిన్, తంజావూరు వైద్యనాథ అయ్యర్ మృదంగ సహకారాన్ని అందించగా మొట్టమొదటి కచ్చేరీని చేశాడు. ఇతని ప్రతిభను గుర్తించిన కృష్ణరాజ ఒడయార్ IV ఇతడిని 17ఏళ్ళ వయసులోనే ఆస్థాన విద్వాంసునిగా నియమించాడు. ఆ విధంగా "తిట్టె" వంశంలోని మూడవతరం కూడా మైసూరు రాజాస్థానంలో విద్వాంసుని పదవి చేపట్టింది. ఇతడు మైసూరు ప్యాలెస్‌లో 28 సంవత్సరాలు విద్వాంసునిగా సేవచేశాడు.

తిట్టె కృష్ణ అయ్యంగార్ సంగీతంలో తన స్వంత బాణీని ఏర్పరచుకున్నాడు. ఇతడు తాను ఆలపించే పాటల సాహిత్యాన్ని అర్థం చేసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఇతడు కర్ణాటక వాగ్గేయకారుల అపురూపమైన కృతులను స్వరపరిచాడు. ఇతని సంగీతం శృతి శుద్ధంగా, లయ శుద్ధంగా ఉండేది. ఇతడికి గాత్ర సంగీతంతో పాటు వీణ, జలతరంగం, హార్మోనియం మొదలైన వాద్యపరికరాలతో పరిచయం ఉంది. ఇతడు "శ్రీకృష్ణ" ముద్రతో కొన్ని కీర్తనలను కన్నడ, తెలుగు భాషలలో రచించాడు. ఇతడు వసంతభైరవి, ఉదయరవిచంద్రిక, రిషభప్రియ, కుంతలవరాళి వంటి విభిన్న రాగాలలో ఇతడు ఈ కీర్తనలను స్వరపరిచాడు. మైసూరు మహారాజా మహిళా సంగీత కళాశాలలో ఉపన్యాసకుడిగా సేవలందించాడు. ఇతడు "లక్ష్య లక్షణ పద్ధతి", "శ్రీ త్యాగరాజ స్వామిగళ చరిత్రె" అనే కన్నడ గ్రంథాలను, "మైసూర్ వీణై సుబ్బణ్ణవిన్ నాన్కు అపూర్వ సాహిత్యంకల్" అనే తమిళ గ్రంథాన్ని రచించాడు. 1941లో "శ్రీ త్యాగరాజ విద్వత్ సభ"ను స్థాపించాడు.

ఇతడు మంచి సంగీత గురువు కూడా. ఇతని శిష్యులలో పద్మామూర్తి, వేదవల్లి, ఎం.రుక్మిణి, ఎం.ఎస్.జయమ్మ, ఎన్.ఆర్.ప్రశాంత్ వంటి అనేకులు ఉన్నారు.

పురస్కారాలు[మార్చు]

జయచామరాజ ఒడయార్ ఇతనికి 1946లో గాన విశారద బిరుదును ప్రదానం చేశాడు. కర్ణాటక రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ అవార్డు 1965లో లభించింది. 1972లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వపు రాజ్యోత్సవ ప్రశస్థి లభించింది[1]. ఇతడు బిడారం కృష్ణప్ప ప్రసన్న సీతారామ మందిర 8వ వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఆ సందర్భంగా ఇతనికి "గానకళా సింధు" బిరుదును ప్రదానం చేశారు. 1972లో బెంగళూరు గాయన సమాజ వారు "సంగీత కళారత్న" బిరుదును ఇచ్చారు. మద్రాసు సంగీత అకాడమీ వారి "సంగీతాచార్య" బిరుదు, 1989లో సంగీత నాటక అకాడమీ అవార్డు[3], కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వపు కన్నడ సాంస్కృతిక విభాగం నుండి 1991లో కనక - పురందర అవార్డు[4] మొదలైనవి లభించాయి.

మరణం[మార్చు]

ఇతడు 1997, మార్చి 13వ తేదీన తన 95వయేట మరణించాడు[1].

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 రమా వి.బెన్నూర్ (1 June 2018). "Sangeetha Kalarathna Titte Krishna Iyengar" (PDF). లలిత కళా తరంగిణి. 2018 (2): 15–18. Retrieved 18 February 2021.
  2. web master. "Titte Krishna Iyengar". Sangeet Natak Akademi. సంగీత నాటక అకాడమీ. Retrieved 18 February 2021.[permanent dead link]
  3. శంకర నారాయణ, వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF). హైదరాబాదు: శాంతా వసంతా ట్రస్టు. p. 99. Retrieved 18 February 2021.
  4. web master. "Shri Nijugana Purandara Awards". KANNADA AND CULTURAL DEPARTMENT. Government of Karnataka. Retrieved 18 February 2021.