తిరగలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరగలి... వెంకట్రామాపురంలో తీసిన చిత్రము
తిరగలి ఉపయోగిస్తున్న ఇద్దరు మహిళలు

తిరగలి అనేది పప్పులను ధినుసులను మెత్తగా పిండి చేయుటకు ఉపయోగించే రాతి పరికరం. పల్లెలలో ప్రతి వారి ఇంట ఈ తిరగిలి అను సాధనం చూడవచ్చు. గుండ్రంగా బల్లపరుపుగా ఉండే రెండు పెద్ద బండ్లను ఒకదానిపై ఒకటి పెట్టి సమాంతరముగా త్రిప్పుతారు. ఇలా త్రిప్పేందుకు క్రింది బండ మధ్య ఒక రంద్రము చేసి దానిలో ఒక కర్ర లేదా ఇనుపకడ్డీ అమర్చుతారు.

దాన్యపు గింజలను పిండిగా మార్చుటకు, ఈ తిరగలి ని గతంలో పల్లెలలో విస్తారంగా వాడేవారు. ప్రస్తుత కాలంలో ఈ పని చేయడానికి యంత్రాలు రావడంతో ఇవి మరుగున పడ్డాయి. గతంలో ఈ చేతి యంత్రానికి జంతువులతో త్రిప్పి పని చేయించే వారు.

వేల సంవత్సరాల క్రితంనాటి నుంచి మనిషి నిత్యజీవితంలో కీలక సాధనాలుగా ఉపయోగిస్తున్న రాతి పరికరాలలో తిరగలి ఒకటి. ఆధునికత సంతరించుకున్న జీవన విధానం శారీరక శ్రమను తగ్గించేస్తుంది. మిక్సర్లు, గ్రైండర్ల రూపంలో వీటి వినియోగాన్ని తగ్గిస్తున్నాయి. తిరగలి పాటల పేరుతో గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ చక్కని జానపద గేయాలు వింటూనే ఉంటాం. పనిలో ఉండే శ్రమను పాట వల్ల పొందే ఉల్లాసం ద్వారా తగ్గించుకుంటారు. ధాన్యాన్ని, బియ్యాన్నేకాక, పప్పుదినుసులను పిండి చేసేందుకు, ఆయుర్వేద మూలికలను నూరేందుకు వీటిని ఉపయోగించేవారు. రోలు, తిరగలి వాడకం వల్ల శరీరం గట్టిగా ఉండేది. [1]

తిరగలిని రెండు గుండ్రని రాళ్ళతో తయారు చేస్తారు. ఒక రాయిని భూములో చదును చేసి అర్థ భాగాన్ని పాతిపెడతారు. భూమిలో ఉండే రాయికి మధ్యలో చిన్న రంధ్రం చేసి ఒక చిన్న బిళ్ళను అమరుస్తారు. దీన్నే క్రింది అచ్చు అంటారు ఆ బిళ్ళకు అనుకూలంగా పై రాతికి మధ్యలో పెద్ద రంధ్రం చేస్తారు. ఈ రాయిని భూమిలో పాతిన రాయిపై సమంగా ఉంచుతారు. పై రాతికి ఒక ప్రక్కన తిప్పడానికి వీలుగా కర్ర పిడిని అమర్చుతారు. దీన్నేపై అచ్చు అని అంటారు.

ధాన్యాన్ని పై తిరగలి మధ్యలో ఉండే రంధ్రంలో పోసి కర్ర పిడిని పట్టుకొని త్రిప్పుతారు. రెండు తిరగలి రాళ్ళమధ్య నలిగిన ధాన్యం పిండి రూపంలో బయటికి వస్తుంది.

ఈ తిరగలితో రాగులు, గోధుమలు, జొన్నలు, సజ్జలు మొదలైనవి విసిరి పిండి తయారు చేస్తారు. కందులు, పెసలు, మినుములు లాంటి దినుసుల్ని పప్పు బద్దలుగా చేయడానికి తిరగలిని వాడుతారు. వరిగలు అనే ఆహార ధాన్యపు గింజలకు పై పొట్తు పోవడానికి కూడా తిరగలిని వాడుతారు.

పిండి మరలు వచ్చాక విసురు రాళ్ళు విసరివేయబడ్డాయి. పాటలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.

తిరగలి పాటలు

[మార్చు]

తిరగలి పాటల్నే విసురురాతి పాటలు అని కూడా అంటారు. సర్కారు ప్రాంతంలో విసురు రాయిని తిరగలి అంటారు. అనంతపురం జిల్లాలో "రాగురాయి" అనీ, చిత్తూరు జిల్లాలో "రాగల్రాయి" అని అంటారు. ఈ పాటల్ని కన్నడంలో "భీసువ పదగళు", "రాగికళ్ళిన పదగళు" అని , తమిళంలో "ఏందిరంకల్ పాడల్ గళ్" అని వ్యవహరిస్తారు. అయినా రాగుల రాతిలో పోసి త్రిప్పుతూ పాడే పాటలు కాబట్టి వీటికి తిరగలి పాటలు అంటారు. ఈ తిరగలి పంకి ఒకరు లేదా ఇద్దరు స్త్రీలు అవసరం. ఒక్కోసారి ధాన్యపు మోతాదును బట్టి ముగ్గురు కూడా విసురుతారు.

ఈ పాటలు ఆడవారి మనస్సులకు దర్పణాలు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ప్రచారంలోఉండే తిరగలి పాటల్ని తెలుసుకుందాం.

వయసు మళ్ళిన పురుషుణ్ణి వివాహం చేసుకున్న ఒక స్త్రీ ముందు తాను ప్రేమించిన కుర్రవాణ్ణి మరవలేక ఎలా బాధపడుతుందో క్రింది తిరగలి పాటలో చూడండి.

మెడలోని గోవొచ్చి
మేసి మందకు పోయె
తలలేని పులివచ్చి
తా పట్టి రాజా
బాలనే సిన్నదాన్ని
అల్ల కలవగిరి కొండల్లో
కలలొద్దు స్వామి
బాలనే సిన్నదాన్ని ...మెడ..
రాగులూ విసరంగ
రవగాలి గొట్టంగ
చేటా బోర్లాపడి
పిండి గాలికి బోయె
నీ మీద మోహంబు నిలిచేనే రాజా
బాలనే సిన్నదాన్ని ... మెడ...
తుమ్మెదలు చెలరేగి
దూలాలు తొలవంగ
ఊసాల్ అకేవన్న మోసమా రాజా
బాలనే సిన్నదాన్ని
దూలాల కేవన్న మోసమా రాజా
బాలనే సిన్నదాన్ని ...మెడ...

ఆరోగ్యానికి మూలం

[మార్చు]
Stone grinder

తక్కువ కాలంలో పిండి చేసుకుని రొట్టెలు చేసుకోవటానికి మన సాంప్రదాయ పరికరం తిరగలి. తిరగలితో పిండి చేసుకోవటం చాలా మంచిది. ఇది ప్రాచీన కాలం నుండి వాడబడుతున్న పరికరం. తిరగలితో పిండి చేసుకోవటం వల్ల ఎప్పటికప్పుడు తాజాగా ఉండటమేగాక తిరగలితో పిండి చేసేవారి శరీరం ఎంతో సౌకర్య వంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. శారీరికంగా శ్రమ పడాల్సి ఉంటుంది కాబట్టి, తిరగలి ఉపయోగించే మహిళలకు మోకాలి నొప్పులు, నడుంనొప్పులు, భుజాల నొప్పులు, మెడనొప్పులు ఉండవు. ఇంకా బ్లెడ్‌ప్రజర్‌, డయాబెటిస్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ. తిరగలికున్న మరో విశిష్టత ఏమంటే ఇది ఉపయోగించే వారికి ఒత్తిడి చేతులు కాళ్ళమీద కాకుండా పొట్టమీద పడుతుంది. పొట్టమీద ఒత్తిడి పడటం వల్ల తిరగలి ఉపయోగించే తల్లులకి ప్రసవించే సమయంలో సిజేరియన్‌ అవసరం ఉండదు. సుఖప్రసవం జరుగుతుంది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉంటారు. తిరగలి వాడకం వల్ల స్త్రీలు 43 సంవత్సరాల తర్వాత వచ్చే మోనోపాజ్‌ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. అధిక బరువుతో బాధపడేవారు, కచ్చితంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా తిరగలి తప్ప కుండా ఎంతో మేలు చేస్తుంది.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "రోలు.. తిరగలి.. సన్నికల్లును గుర్తుచేస్తున్నారు! - Prajasakti". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-07.
  2. రాజీవ్‌ దీక్షిత్‌ ఆరోగ్య రహస్యాలు పుస్తకం ఆధారంగా

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తిరగలి&oldid=3262712" నుండి వెలికితీశారు