Jump to content

తెలంగాణ అమరవీరుల స్మారకం

వికీపీడియా నుండి
(తెలంగాణ అమరవీరుల జ్యోతి నుండి దారిమార్పు చెందింది)
తెలంగాణ అమరవీరుల స్మారకం
తెలంగాణ అమరవీరుల స్మారకం
సాధారణ సమాచారం
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ
దేశంభారతదేశం
యజమానితెలంగాణ ప్రభుత్వం
సాంకేతిక విషయములు
పరిమాణం3.29 ఎకరాలు (1.3 హె.)
2023 భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారకం, డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనం..
తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ అమరుల స్మారక చిహ్నం

తెలంగాణ అమరవీరుల స్మారకం, తెలంగాణకోసం జరిగిన పోరాటంలో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన స్మారక భవనం.[1] రాష్ట్ర రాజధాని హైదరాబాదు హుస్సేన్ సాగర్ సమీపంలోని జలదృశ్యంలో 177.50 కోట్లు రూపాయలతో ఈ భవనం నిర్మించబడింది.[2] ప్రపంచంలోనే అతిపెద్దదైన, అతుకులు లేని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో నిర్మించబడటం దీని ప్రత్యేకత.[3]

తెలంగాణ కోసం అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవంలో భాగంగా జూన్ 22న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మొదటగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, నిత్య జ్వలిత దీప్తి అమరజ్యోతిని వెలిగించాడు.[4]

రూపకల్పన

[మార్చు]
తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్, తదితరులు
స్విఛాన్ చేసి తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతిని వెలిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ అమరవీరులకు నివాళిగా క్యాండిల్‌ లైట్స్‌ ప్రదర్శనలో ముఖ్యమంత్రి కేసీఆర్, తదితరులు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969లో జరిగిన తొలి ఉద్యమంతోపాటు మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది ప్రాణాలు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి అనునిత్యం ప్రేరణగా నిలిచిన అమరవీరుల స్మృతి యావత్‌ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరవీరుల స్మృత్యర్థం అత్యాధునిక స్మారక భవనాన్ని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయంమేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ శాశ్వత స్మృతిచిహ్నాన్ని నిర్మించింది.

నిర్మాణం

[మార్చు]

2017లో దీనికి శంకుస్థాపన చేశారు. ప్రమిదలో వెలుగుతున్న దీపంలా ఇది నిర్మించబడింది. ప్రధాన స్మారకం ఎత్తు 150 అడుగులు కాగా, దీపం ఎత్తు 26 మీటర్లు ఉంది. ప్రమిద కాటన్ స్టీల్‌తో స్టీల్ రంగులో ఉండగా, దీపం అగ్నిరంగులో వత్తి వెలుగుతోన్న ఆకారంలో మాత్రమే ఉంటుంది. దానిపై లైటింగ్ వేస్తారు. ఈ ప్రాంగణంలో ఫౌంటెన్ల మధ్య బంగారు పూత పూసిన తెలంగాణ తల్లి విగ్రహం ఉంది.[5]

42 మీటర్ల ఎత్తులో 2.88 లక్షల చదరపు అడుగుల (3.29 ఎకరాల) విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనమంతటా ఏసీ సౌకర్యంతోపాటు మూడు లిఫ్ట్‌‌లు కూడా ఉన్నాయి. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న ఈ భవన నిర్మాణంలో రోజూ 200మంది వరకు పనిచేశారు.

ప్రత్యేకతలు

[మార్చు]

100 టన్నులు బరువున్న 3000 తుప్పు పట్టని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ప్లేట్లతో ఈ భవనం వెలుపల నిర్మాణం జరిగింది. వాటిని దుబాయ్‌లో ఫ్యాబ్రికేట్‌ చేయించి, సైట్‌పై వీటిని అత్యాధునిక టెక్నాలజీతో అతుకులు లేనివిధంగా అసెంబుల్‌ చేశారు. లోపలి గోడలు, స్లాబులకు మాత్రమే కాంక్రీట్‌ను ఉపయోగించారు. దీనికోసం సుమారు 1200 టన్నుల స్టీల్‌ను వినియోగించారు.[3]

369 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకునేలా రెండు అంతస్తులలో పార్కింగ్ ప్రాంతాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌‌లో వివిధ రకాల వర్క్‌‌షాపులు నిర్వహించుకునేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. 10,656 చదరపు అడుగలతో నిర్మిస్తున్న మొదటి అంతస్తులో తెలంగాణ మ్యూజియం, ఫొటో గ్యాలరీ, 100మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఆడియో-విజువల్‌ హాలును ఏర్పాటుచేశారు. 16,964 చదరపు అడుగులతో 650 మంది కూర్చునే విధంగా రెండో అంతస్తులో కన్వెన్షన్ హాలు, 8,095 చదరపు అడుగులు ఉండే మూడవ అంతస్తులో రెస్టారెంట్‌, హుస్సేన్‌సాగర్‌ అందాలు, బుద్ధవిగ్రహం, బిర్లామందిర్‌, అంబేద్కర్‌ విగ్రహం, సచివాలయం తదితర నిర్మాణాలు వీక్షించేందుకు వీలుగా టెర్రస్‌పై రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్ర, తెలంగాణ మహానుభావులకు సంబంధించిన ఫొటోలు, ఇతర రూపాల్లో తెలియజేయడానికి ఏర్పాట్లుచేశారు. అత్యాధునిక గ్రంథాలయంతోపాటు, భవనం చుట్టూ పచ్చదనంతో కూడిన అతి పెద్ద పార్కు ఏర్పాటుచేశారు.[6]

అమరజ్యోతి

[మార్చు]

అమరులకు గౌరవ సూచికంగా కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడమనే ఆనవాయితీకి అనుకూలంగా సీఎంకేసీఆర్‌ వెలుగుతున్న దీపం ఆకృతిగల ఈ నిర్మాణాన్ని ఎంపికచేశాడు. చుట్టూ స్టీలు వలయం ఉన్నప్పటికీ భవనం వేడెక్కకుండా ఉండేలా ఇది డిజైన్‌ చేయబడింది. పఫ్‌ మెటీరియల్‌, సపోర్టింగ్‌ జీఆర్‌సీ (ఫైబర్‌-రీయిన్‌ఫోర్స్‌ కాంక్రీట్‌) షీట్‌లు లోపల ఉష్ణోగ్రతను నియంత్రించటంలో సహాయపడతాయి.[3]

1200 టన్నుల స్టీల్‌తో మొదటి నుంచి చివరి అంతస్తు వరకు అమరజ్యోతి నిర్మాణం జరిగింది. పైన 54 X 37 మీటర్ల ప్రమిద, ఆ ప్రమిదపై 26 మీటర్ల ఎత్తున వెలుగుతున్న జ్యోతి ఏర్పాటు చేయబడింది. ఈ జ్యోతి నిరంతరం వెలిగుతూనే ఉంటుంది. మూడో అంతస్తు నుండి అమరుల జ్యోతికి నివాళులు అర్పించడం, అమరుల జ్యోతి చుట్టూ ప్రదక్షిణలు చేయవచ్చు.

ముఖ్యమంత్రి పర్యవేక్షణ

[మార్చు]
  • 2023 మార్చి 10న ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ అమర వీరుల స్మారకార్థం నిర్మిస్తున్న అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతి పర్యవేక్షణలో భాగంగా మొదటి అంతస్తులో ఆడియో, వీడియో ప్రదర్శనల కోసం నిర్మిస్తున్న ఆడిటోరియం, లేజర్ షో, ర్యాంప్, సెల్లార్ పార్కింగ్ పనులను పరిశీలించారు.[7]
  • 2023 మే 29న ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ అమర వీరుల స్మారకార్థం నిర్మిస్తున్న అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతి పర్యవేక్షణలో భాగంగా చివరిదశ సుందరీకరణ పనులను పరిశీలించి, అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని, విగ్రహానికి రెండు వైపులా అత్యద్భుతమైన ఫౌంటేన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని సూచించాడు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలులో జూన్‌ 22న ‘అమరుల సంస్మరణ’ కార్యక్రమం సందర్భంగా అమరవీరుల జ్యోతిని ఆవిష్కరించనున్నాడు. ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లుచేయాలని సూచించాడు.[8]

ప్రారంభోత్సవం

[మార్చు]
800 డ్రోన్లతో డ్రోన్ షో
తెలంగాణ అమరవీరులకు పోలీసుల గౌరవ వందనం
వెలుగుతున్న తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతి

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 2023, జూన్ 22న నిర్వహించబడిన అమరుల సంస్మరణ దినోత్సవం రోజున ఈ స్మారకం ప్రారంభించబడింది. జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు జోహార్లు అనే నినాదాలతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి హైదరాబాదులోని తెలంగాణ సచివాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన అమరవీరుల సంస్మరణ వేదిక వరకు బైక్‌ ర్యాలీలు జరిగాయి.

అమరవీరుల గౌరవార్థం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో 125 అడుగుల డా. బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నుండి రాష్ట్ర సచివాలయం ఎదురుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం వేదిక వరకు 30 కళారూపాలకు చెందిన  6200 మందికి పైగా కళాకారులతో భారీ ఎత్తున 'అమరవీరుల సంస్మరణ ర్యాలీ' నిర్వహించబడింది. లక్షలమంది జనసంద్రంలో ఒగ్గుడోలు ఓంకార నాదాల మధ్య బోనాల కోలాటం ఆట పాటలతో తమ ప్రదర్శనలతో, విన్యాసాలతో అమరవీరులకు ఘనమైన సాంస్కృతిక నివాళిని అర్పించారు.[9]

ఈ సందర్భంగా తెలంగాణ కోసం అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, నిత్య జ్వలిత దీప్తి అమరజ్యోతిని వెలిగించాడు. మొదటగా పోలీసులు అమరవీరులకు గౌరవ వందనం చేసి, 12 తుపాకులతో గన్‌ సెల్యూట్‌ నిర్వహించారు.[10]

‘జోహారులూ.. జోహారులూ.. అమరులకు జోహార్‌.. వీరులకు జోహార్‌’ అంటూ గేయాలాపనతో 10 వేల క్యాండిల్‌ లైట్స్‌ ప్రదర్శిస్తూ సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు అమరవీరులకు అర్పించిన నివాళితో అమరవీరుల సంస్మరణ సభ ప్రారంభమవగా, అమరవీరుల త్యాగాలను గుర్తుచేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించాడు.[11][12]

మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాల్ని త్యాగం చేసిన అమరవీరుల కుటుంబ సభ్యులను (అమరుడు కాసోజు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ, తమ్ముడు రవీంద్రచారి... అమరుడు పోలీసు కిష్టయ్య భార్య పద్మావతి, కూతురు ప్రియాంక, కొడుకు రాహుల్‌... అమరుడు వేణుగోపాల్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ, అన్న వెంకట్రామిరెడ్డి, మేనమామ సిద్ధారెడ్డికి... అమరుడు సిరిపురం యాదయ్య వదిన లక్ష్మమ్మ, సోదరుడు మహేశ్‌... అమరుడు యాదిరెడ్డి తల్లి చంద్రమ్మ, సోదరుడు ఓంరెడ్డి... కావలి సువర్ణ తల్లిదండ్రులు) వేదిక మీదకు ఆహ్వానించి అమరజ్యోతి సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా సత్కారం అందించి గౌరవించారు.[13]

800 డ్రోన్లతో తెలంగాణ ఖ్యాతి నింగిని తాకేలా డ్రోన్ షో ప్రదర్శించబడింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్రవ్యాప్త ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

భవన విశేషాలు

[మార్చు]
  • ప్రాజెక్టు వైశాల్యం: 3.29 ఎకరాలు (13,317చ.మీ.లు)
  • నిర్మాణ వైశాల్యం (బిల్టప్‌ ఏరియా): 26,800చ.మీ.లు (2,88,461 చ.అ.లు)
  • మొత్తం అంతస్తులు: 6 (రెండు సెల్లార్లు కలిపి)
  • స్మారకం మొత్తం ఎత్తు: 54మీటర్లు
  • దీపం ఎత్తు: 26 మీటర్లు
  • స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ క్లాడింగ్‌: 100 మెట్రిక్‌ టన్నులు
  • నిర్మాణానికి ఉపయోగించిన స్టీల్‌: 1500 మెట్రిక్‌ టన్నులు
  • ప్రాజెక్టు వ్యయం: రూ.177.50 కోట్లు
  • పరిపాలనా అనుమతుల జారీ: 2017, జూన్‌ 17
  • పనుల ఒప్పందం: 2018, సెప్టెంబరు 14
  • కాంట్రాక్టు సంస్థ: కేపీసీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌
  • కన్సల్టెంట్‌: ఎంవీ రమణారెడ్డి, తనికెళ్ల ఇంటిగ్రేటెడ్‌ కన్సల్టెంట్స్‌ ప్రై.లి

అంతస్తుల వివరాలు

[మార్చు]
2023 జూన్ 22న జరిగిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరులకు కొవ్వొత్తుల నివాళులు
  • బేస్‌మెంట్‌-2: 1,06,993 చ.అ వైశాల్యం. (175 ఫోర్‌ వీలర్లు, 200 టూ వీలర్ల పార్కింగ్‌, లాంజ్‌, లిఫ్ట్‌, 3 లక్షల లీటర్ల సంప్‌)
  • బేస్‌మెంట్‌-1: 1,06,993 చ.అ వైశాల్యం. (160 ఫోర్‌ వీలర్లు, 200 టూ వీలర్ల పార్కింగ్‌, లాంజ్‌ ఏరియా, డైవర్లు, సెక్యూరిటీ రూములు)
  • గ్రౌండ్‌ ఫ్లోర్‌: 28,707 చ.అ విస్తీర్ణం. (మెయింటనెన్స్‌ రూమ్‌లు, చిల్లర్‌ ప్లాంట్‌, ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు అవసరమైన ఏరియా, స్టోర్‌ రూమ్‌లు, కిచెన్‌, కోల్డ్‌స్టోరేజీ)
  • మొదటి అంతస్తు: 10,656 చ.అడుగులు. (మ్యూజియం, ఫొటో గ్యాలరీ, 70మందికి సరిపడా ఆడియో విజువల్‌ రూమ్‌, ఎస్కలేటర్‌)
  • రెండవ అంతస్తు: 16,964 చ.అడుగుల విస్తీర్ణం. (సుమారు 500 మంది సామర్ధ్యంగల కన్వెన్షన్‌ హాలు, లాబీ ఏరియా)
  • మూడవ అంతస్తు, టెర్రస్‌ ఫ్లోర్‌: 8095 చ.అడుగుల విస్తీర్ణం. (రెస్టారెంట్‌, ఓపెన్‌ టెర్రస్‌ సిట్టింగ్‌ ఏరియా)
  • మెజనైన్‌ ఫ్లోర్‌: 5900 చ.అడుగుల విస్తీర్ణం. (గ్లాస్‌ రూఫ్‌ రెస్టారెంట్‌, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌)
  • దీపం: కార్బన్‌ స్టీల్‌తో నిర్మాణం, 26 మీటర్ల ఎత్తు. గోల్డెన్‌ ఎల్లో కలర్‌, ఎక్స్‌టర్నల్‌ లైటింగ్‌
  • బేస్‌మెంట్‌-2 నుంచి నాలుగవ అంతస్తు వరకు మూడు లిఫ్టులు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Today, Telangana (2022-11-01). "Telangana Martyr's Memorial, eternal 'lamp' of supreme sacrifices". Telangana Today. Archived from the original on 2022-11-01. Retrieved 2022-11-02.
  2. "సచివాలయం ఎదుట తెలంగాణ అమరవీరుల స్థూపం". www.andhrabhoomi.net. 2019-08-07. Archived from the original on 2019-08-07. Retrieved 2022-01-23.
  3. 3.0 3.1 3.2 telugu, NT News (2023-06-21). "Telangana Martyrs Memorial | అమరుల యాదిలో అఖండ జ్యోతి.. 22న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-06-21. Retrieved 2023-06-21.
  4. telugu, NT News (2023-06-23). "CM KCR | పాలకుల్లో స్ఫూర్తి రగిలించేలా ఆకాశమంత దీపకళిక.. ఇకపై ప్రముఖులు ఎవరొచ్చినా ఇక్కడే తొలివందనం: ముఖ్యమంత్రి కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-06-24. Retrieved 2023-06-24.
  5. "తెలంగాణ 'అమరుల' స్మారకం: 3 ఎకరాల ప్రాంగణంలో 'త్యాగాల దివ్వె'.. 150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం". BBC News తెలుగు. 2023-06-21. Archived from the original on 2023-06-21. Retrieved 2023-06-25.
  6. Velugu, V6 (2019-06-01). "తెలంగాణ అమర వీరుల జ్ఞాపకార్థం : సిద్ధమవుతున్న 'అమరజ్యోతి'". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2019-06-04. Retrieved 2022-01-23.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Today, Telangana (2023-03-10). "CM KCR inspects Secretariat, Ambedkar Statue and Martyrs' Memorial". Telangana Today. Archived from the original on 2023-03-28. Retrieved 2023-04-11.
  8. telugu, NT News (2023-05-29). "CM KCR | అమరజ్యోతిని పరిశీలించిన సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-05-29. Retrieved 2023-05-31.
  9. telugu, NT News (2023-06-23). "అమరుల స్ఫూర్తి నిత్య జ్వలిత దీప్తి". www.ntnews.com. Archived from the original on 2023-06-24. Retrieved 2023-06-24.
  10. "అమ‌రుల స్మార‌క చిహ్నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్". Sakshi. 2023-06-22. Archived from the original on 2023-06-24. Retrieved 2023-06-24.
  11. "త్యాగనిరతి.. అమరజ్యోతి". EENADU. 2023-06-23. Archived from the original on 2023-06-24. Retrieved 2023-06-24.
  12. "మీ వెలుగులో ముందుకు". Sakshi. 2023-06-23. Archived from the original on 2023-06-22. Retrieved 2023-06-24.
  13. telugu, NT News (2023-06-23). "Telangana Martyrs Memorial | అమర జ్యోతి.. అఖండ స్ఫూర్తి.. ఫొటో గ్యాల‌రీ". www.ntnews.com. Archived from the original on 2023-06-24. Retrieved 2023-06-24.

ఇతర లింకులు

[మార్చు]