Jump to content

తెలుగులో వైకల్పనలు

వికీపీడియా నుండి

వైకల్పన అంటే ఏమిటి?

[మార్చు]

శాస్త్రాన్ని సామాన్య ప్రజలకి అందించటానికి స్థూలంగా రెండు మార్గాలు ఉన్నాయి. శాస్త్రాన్ని దంతపు మేడల బురుజుల్లోంచి నేలమట్టానికి దింపి, తేలిక భాషలో చెప్పటం ఒక పద్ధతి. దీనినే జనరంజక విజ్ఞానం (popular science) అంటారు. సైన్సుని ప్రాతిపదికగా తీసుకుని కథలు రాయటం రెండవ పద్ధతి. దీనిని వైజ్ఞానిక కల్పన సాహిత్యం లేదా వైకల్పనలు (science fiction) అంటారు.

కథలలో శాస్త్రాన్ని జొప్పించి రాయటంలో రెండు మార్గాలు ఉన్నాయి. శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని, శాస్త్రం కుంటు పడకుండా కథ రాయటం. ఉదాహరణకి పరీక్ష నాళికలో పిండోత్పత్తి చేసి, ఆ సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టేలా చెయ్యటమే తీసుకుందాం. దీని వల్ల కొత్త సమస్యలు ఎదురయే అవకాశం ఉంది కదా. ఉదాహరణకి గర్భాన్ని అద్దెకి ఇవ్వటం. దీని పర్యవసానంగా పుట్టిన పిల్ల ఎవరిది అనే ప్రశ్న ఉదయించటం. ఈ రకంగా కథ అల్లుకు పోవచ్చు. ఇక్కడ కథలో సంఘటనలు కల్పితాలు కావచ్చు. కాని కథలో కనిపించే సైన్సు కల్పితం కాదు.

సైన్సు కథలలో మరో రకం ఉన్నాయి. వీటిల్లో శాస్త్రపు పునాదుల లోతు తక్కువ, ఊహలతో విహరించే ఎత్తు ఎక్కువ. కవిత్వంలో కవి సమయాలలా సైన్సుని సాగదీసి కథ అల్లుతాం. ఈ రకం కథలలో అల్లికకి, కల్పనకి అవధులు లేవు. ఈనాడు కల్పితం అని కొట్టిపారేసినవి రేపు నిజం కావచ్చు. జురాసిక్ పార్కు కథ ఈ కోవకి చెందుతుంది. కాని భూతంలోకీ, భవిష్యత్తులోకి ప్రయాణం చేసినట్లు రాసిన కథలు మూడొంతుల ముప్పాతిక అసంభవం.

తెలుగులో వైకల్పనలు

[మార్చు]

పైన ఉదహరించిన ధోరణిలో తెలుగులో కథలు రాసిన వాళ్లు, రాసేవాళ్లు బహు తక్కువ - కాని, చిరకాలం నుండి ఉన్నారు. పదహారో శతాబ్దంలో పింగళి సూరన్న రాసిన కళాపూర్ణోదయం (తెలుగులో మొదటి నవల!) లో కలభాషిణి ఉయ్యాల ఊగుతూ ఉంటే నలకూబరుడు విమానంలోంచి చూసి కిందకి దిగి వస్తాడు. ఈ కథలో విమానం కనిపించినంత మాత్రాన దీనిని వైజ్ఞానిక కల్పన అనగలమా? విమానాలున్నంత మాత్రాన కథ “సైన్సు ఫిక్షన్” అనుకుంటే రామాయణం కూడా సైన్సు ఫిక్షనే. రామాయణంలో ఒక్క పుష్పక విమానం ఉండటమే కాదు. మరొక ఆసక్తి కరమైన వైజ్ఞానిక కల్పన ఉంది. రావణుడి రక్తం నేల మీద పడితే ప్రతి బొట్టు మరొక రావణుడిగా అవతరిస్తాడని విభీషణుడు రాముడిని హెచ్చరిస్తాడు. జురాసిక్ పార్కు సంభవం అయిన రోజున రావణుడి రక్తపు బొట్టు నుండి మరొక రావణుడు పుట్టటం కూడా సంభవం ఎందుకు కాకూడదు?

మహా భారతంలో కౌరవులంతా నాళికా శిశువులే (test tube babies) కదా. కనుక భారతం కూడా వైజ్ఞానిక కల్పన - లేదా వై-కల్పన - కోవలోకే వస్తుంది. మన పురాణాలలో దేవుడు ప్రత్యక్షం అవటం అనే సన్నివేశానికి స్టార్ ట్రెక్ లో "బీం మి అప్ స్కాటీ" సన్నివేశానికి పోలికలు లేవూ? కనుక ఒక విధంగా మన పురాణ గాథలలో వైకల్పనలు లేకపోలేదు. మూడు కళ్లు, నాలుగు తలకాయలు, ఆరు చేతులు ఉన్న వ్యక్తులు కల్పన కాక మరేమిటి? మరోలోకం నుండి వచ్చిన మేనకని విశ్వామిత్రుడు పెళ్ళి చేసుకోకపోతే మనం అంతా ఇక్కడ ఉండే వాళ్లమా? హిందూ పురాణాల ప్రకారం మనం అంతా భూలోకులకీ, మరోలోకులకీ పుట్టిన సంకర సంతానమే కదా.

#ఇరవయ్యవ# #శతాబ్దంలో#

[మార్చు]

ఇరవయ్యవ శతాబ్దంలో, కొత్త పోకడలతో, తెలుగులో వైకల్పనలు రాసిన వాళ్లు లేకపోలేదు:

  • టేకుమళ్ల రాజగోపాలరావు "విహంగయానం" నవలలో నాయిక ఒక జలాంతర్గామిలో ప్రయాణం చేస్తుంది.
  • విశ్వనాథ సత్యనారాయణ రాసిన హాహాహూహలో ఒక గంధర్వుడు దివి నుండి భువికి దిగి వచ్చి లండన్ లోని ట్రఫాల్గర్ స్క్వేర్ లో తారసపడతాడు. ఇదొక రకం కాలయానం.
  • రావూరి భరద్వాజ "చంద్రమండలయాత్ర" రోదసియానం చిరుత ప్రాయంలో ఉన్నప్పుడు రాసిన నవల. చంద్ర మండలానికి రోజూ పొద్దున్నే లండన్ కి వెళ్లొచ్చినట్లు వెళ్లొస్తున్నాం కనుక ఈ కథని వై-కల్పన కోవ లోంచి తీసెయ్యవచ్చు.
  • బొల్లిముంతల నాగేశ్వరరావు "గ్రహాంతర యాత్రికులు"లో మరో లోకం నుండి పర్యాటకులు భూలోకం వచ్చి ఇక్కడ మన వారిలో ఉన్న ఆర్థిక వ్యత్యాసాలు చూసి చాల అసహజంగా ఉందే అని ఆశ్చర్య పోతారు. ఇది కచ్చితంగా వై-కల్పనే.
  • కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన "ఒకే రక్తం, ఒకే మనుష్యులు" దిట్టంగా ఉన్న సైన్సుని ప్రాతిపదిక తీసుకుని రాసిన నవలే అయినప్పటికీ అక్కడక్కడ వై-కల్పన ఛాయలు కనిపిస్తాయి.
  • కొడవటిగంటి కుటుంబరావు ఈ కోవకి చెందిన కథ ఒకే ఒకటి రాసేరని ఆయన కుమారుడు కొడవటిగంటి రోహిణీప్రసాద్ అన్నారు. ఆ కథ - గ్రహశకలం - నిజానికి సైన్సు ఫిక్షన్ కాదనిన్నీ, అది కేవలం "పొలిటికల్ ఎలిగొరీ" అనీ రోహిణీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
  • యండమూరి వీరేంద్రనాధ్ "యుగాంతం"లో ఒక గ్రహశకలం వచ్చి భూమిని గుద్దుకుంటుంది.
  • మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన "నత్తలొస్తున్నాయి, జాగ్రత్త!" పేలవమైన వై-కల్పనకి ఒక ఉదాహరణ. వీరేంద్రనాధ్, వేంకట కృష్ణమూర్తి జనాదరణ పొందిన నవలలు ఎన్నో రాసేరు కాని వీరికి పేరు తెచ్చిపెట్టినది వీరి సైన్సు ఫిక్షన్ రచనలు కావు.
  • రెంటాల నాగేశ్వరారావు "స్త్రీ లోకం" కథలో తల్లి తండ్రిగా మారిపోతుంది. (మారిపోతాడు అనాలా?)
  • చిత్తర్వు మధు ఈ మధ్య ప్రచురించిన: కుజుడి కోసం, ఎపిడమిక్ అనేవి పేరుని బట్టి వైకల్పనలలాగే ఉన్నాయి.
  • పదిహేనేళ్ల క్రితం రమేష్ చంద్ర మహర్షి రాసిన "పేరడైజ్" స్వాతి మాసపత్రికలో వచ్చిందిట. ఇది కూడా వై-కల్పన కథే అని అంటున్నారు.
  • మన్నె సత్యనారాయణ రాసిన "కాలంలో ప్రయాణం" రాష్ట్ర స్థాయి నవలల పోటీలో 20,000 రూపాయలు గెలుచుకుందిట. ఆంధ్రభూమి వారపత్రికలో ధారావాహినిగా ప్రచురించబడింది కూడా!
  • ఈ మధ్య అమెరికా నుండి వైకల్పన కథలు రాయడానికి ప్రయత్నితున్నవారిలో వేమూరి వేంకటేశ్వరరావు, అనీల్ రాయల్ ముఖ్యులు. వేమూరి రాసిన వైకల్పనలు రెండు పుస్తకాలుగా వెలువడ్డాయి. కించిట్‌ భోగో భవిష్యతి అనే కథల సంపుటిని అమెరికాలో వంగూరి ఫౌండేషన్‌ వారు ప్రచురించేరు. మహాయానం అనే కథల సంపుటిని కినిగె సంస్థ వారు ఇ-పుస్తకంగా ప్రచురిణంచేరు. అనిల్‌ రాయల్‌ రాసిన కథల సంపుటిని ఆయనే 2015లో ప్రచురించేరు. రాసిలో తక్కువే అయినా వీటిలో రెండు కథలు (నాగరికథ, రీబూట్) బాగా గుర్తింపు పొందేయి; ఈ రెండూ ఏటేటా ప్రచురితమయే కథలో ఎంపిక అవడం వైకల్పనలకి వస్తూన్న గుర్తింపుగా భావించవచ్చు.
  • భారతదేశంలో సాహిత్య అకాడమీ వారు తెలుగులో గత 50 ఏళ్లల్లోనూ ప్రచురితమైన వైకల్పనలలో కొన్నిటిని ఏర్చి, కూర్చి ఒక కథా సంపుటంగా ప్రచురించడం తెలుగు వైకల్పన సాహితీ రంగంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా భావించవచ్చు.

మూలాలు

[మార్చు]
  • వేమూరి వేంకటేశ్వరరావు, "తెలుగులో వైకల్పనలు," జీవిత సాఫల్య పురస్కార ప్రసంగం, వంగూరి ఫౌండేషన్‌ అఫ్ అమెరికా, హ్యూస్టన్‌, టెక్సస్‌, 2014
  • వేమూరి వేంకటేశ్వరరావు, పీఠిక, అనిల్‌ రాయల్‌ ప్రచురించిన సైన్‌సు ఫిక్షన్‌ కథల సంపుటి, 2015
  • వైజ్ఞానిక కల్పనలు