Jump to content

తెల్లవారవచ్చె తెలియక నా సామి (పాట)

వికీపీడియా నుండి
"తెల్లవారవచ్చె తెలియక నా సామి"
చిరంజీవులు సినిమాలో ఒక సన్నివేశం
సంగీతంఘంటసాల వెంకటేశ్వరరావు
సాహిత్యంమల్లాది రామకృష్ణశాస్త్రి
ప్రచురణ1956
భాషతెలుగు
రూపంమేలుకొలుపు పాట
గాయకుడు/గాయనిపి.లీల
చిత్రంలో ప్రదర్శించినవారుజమున

తెల్లవారవచ్చె తెలియక నా సామి చిరంజీవులు (1956) చిత్రంలోని సుప్రసిద్ధ భక్తగీతం. దీనిని ప్రముఖ గాయని పి.లీల, నటీమణి జమున కోసం ఆలాపించారు. ప్రముఖ రచయిత అయిన బహుభాషావేత్త మల్లాది రామకృష్ణశాస్త్రి దీనికి సాహిత్యం అందించారు. ఈ పాటకు స్వరకర్త ఘంటసాల. ఈ పాట ఒక మేలుకొలుపు గీతం. ఈ పాటను సినీసాహిత్యంలో ఒక మణిహారంగా తెలుగు వెలుగు పత్రిక వ్యాసంలో పేర్కొన్నారు.[1]

భగవంతుని భక్తుడు మేల్కొలుపు పాడుతున్న సందర్భంలో ఈ పాటను రచించారు. పాటలో భక్తుడు భగవంతుడి అమ్మ యశోద స్థానాన్ని తీసుకోవడం, చిన్న మార్పులతో రెండు అర్థాలను సాధించడం, తప్పుపట్టడం లాంటివెన్నో చేశారు కవి. "తెల్లవారెనమ్మ, చల్లనేమందు/నల్లని నా సామి లేరా" అన్న జానపద గీతం దీనికి ఈ పాటకు స్ఫూర్తి అని స్వయంగా కవి మల్లాది రామకృష్ణశాస్త్రి కుమారునికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

పాట పల్లవి

[మార్చు]

తెల్లవారవచ్చె తెలియక నా సామి

తెల్లవారవచ్చె తెలియక నా సామి

మళ్ళీ పరుండేవులేరా

మళ్ళీ పరుండేవులేరా

సాహిత్య విశేషాలు

[మార్చు]

తెల్లవారవచ్చె తెలియక నా సామి అని పాట మొదలౌతుంది. రాత్రి అలా పడుకున్నామో లేదో ఇంతలోనే మనకు తెలియకుండానే తెల్లవారిపోయిందనే అర్ధముంది. అదే భక్తికోణంలో చూస్తే దేవదేవా! పొద్దుకు తెలియదు నీవు నిద్రపోత్తున్నట్లు అందుకే వచ్చేసింది, దాని పరువు కాపాడడానికైనా నిద్రలేవయ్యా అనే అర్ధం కనిపిస్తుంది. మళ్లీ పరుండేవు లేరా అనే పదాల్లోనూ రెండు అర్ధాలున్నాయి. కావాలంటే మళ్ళీ పడుకోవచ్చు ఇప్పుడైతే లేవరా అనేది సాధారణ అర్ధం అయితే నేనిటు లేపుతుంటే నువ్వటు పడుకుంటావేమిటనేది అంతరార్ధం. మళ్ళి - మళ్ళీ పదాల మధ్య చిన్నపొల్లు మార్పుతో ఈ అర్ధాలను సాధించారు మల్లాది. మారాము చాలింక లేరా ప్రయోగం వెనుక చిన్ని కన్నయ్యను నిద్రలేపుతున్న యశోదమ్మ వాత్సల్యం కనిపిస్తుంది. అలాగే నల్లనయ్య, నను కన్నవాడా, బుల్లితండ్రి, బుజ్జాయి అంటు అమ్మ ప్రేమతో బిడ్డను పిలుస్తుంది. నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలుస్తోంది రా అంటూ ఆ మాధవునికి మేలుకొలుపు పాడారు. కళ్యాణ గుణధామ లేరా అనే పదానికి జగత్కళ్యాణ కారకుడైన భగవంతుడు బారెడు పొద్దెక్కువరకు పడుకుంటే ఎలా మరి తప్పుకదా అంటున్నారు కవి.

మూల జానపద గీతం

[మార్చు]

మల్లాది వారి కలం నుండి పుట్టిన ఈ గీతానికి మూలం శృంగార రసాన్ని ఒలికించే ఒక జానపద జీతం. ఇందులో మొత్తం 8 చరణాలు వుంటాయి. దీనినుండి స్పూర్తిని పొంది రచించినట్లుగా తన కుమారునికి రాసిన లేఖలో మల్లాది పేర్కొన్నారు.

తెల్లవారెనమ్మ, చల్లనేమందు
నల్లని నా సామి లేరా
మరల పడుకునేవు మసలుచున్నావు
మరియాద గాదిక పోరా

కలకలమని పక్షి గణములు కుసెను
కాంతుడ యిక నిద్రలేరా
జలజారి కాంతులు వెలవెల బారెను
తలుపుదీసి చూడు లేరా

తరుణులందరు లేచి దధిచిల్కు వేళాయె
తడవుండ రాదింక లేరా
అరగంటి చూపుతో నట్టిల్లు చూచేవు
నెరజాణవౌదువు లేరా

మూలాలు

[మార్చు]
  1. మళ్లీ పరుండేవు లేరా!, తెలుగు వెలుగు బృందం, తెలుగు వెలుగు, ఫిబ్రవరి 2014, పేజీలు: 80-1.

బయటి లింకులు

[మార్చు]