త్రిపుండ్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిపుండ్రాన్ని ధరించిన శైవ సన్యాసి[1]
ఊర్థ్వ పుండ్రాన్ని ధరించిన విష్ణు భక్తుడు[2]

త్రిపుండ్రాలు హిందూమతంలో శైవులు నుదుటన అలంకరించుకునే విభూది. స్మార్త హిందువులు ధరించే తిలకాలలో ఇది కూడా ఒకటి. [3] నుదిటిపై విభూదితో మూడు అడ్డు రేఖలు, మధ్యలో బొట్టు ఉంటుంది. [4] వైష్ణవులు ధరించే నామాలను ఊర్థ్వపుండ్రాలు అంటారు. [2]

చరిత్ర[మార్చు]

భస్మజబల ఉపనిషత్తు, బృహజ్జబల ఉపనిషత్తు, కాలాగ్ని రుద్ర ఉపనిషత్తు వంటి హిందూ గ్రంథాలలో త్రిపుండ్రాల చర్చ ఉంది. [5] "మూడు విభూది రేఖల"ను మూడు వేదాగ్నులుగా, ఓం లోను మూడు అక్షరాలుగా, మూడు గుణాలుగా, మూడు ప్రపంచాలుగా, మూడు ఆత్మలుగా, త్రాయి వేదాలుగా, శివుని మూడూ అంశాలుగా భావిస్తారని డ్యూసెన్ పేర్కొన్నాడు. [1]

విశిష్టత[మార్చు]

త్రిపుండ్రాలు అంటే అడ్డంగా ఉండే మూడు నామాలు. నుదిటిపైనే కాక ఇతర శరీర భాగాలపైనా కొందరు ధరిస్తారు. [4] ఈ నామాలు శివుని సంకల్పం (ఇచ్ఛాశక్తి), జ్ఞానం (జ్ఞానశక్తి), చర్య (క్రియాశక్తి) అనే మూడు శక్తులను సూచిస్తాయని ఆంటోనియో రిగోపౌలోస్ రాసాడు. [4] శైవ గ్రంథాలలో త్రిపుండ్రము శివుని త్రిశూలాన్ని, బ్రహ్మ, విష్ణువు, శివుల దివ్య త్రయాన్నీ సూచిస్తుందని వివరించబడింది. [4]

త్రిపుండ్రాన్ని ధరించేవారికి అది జీవితపు ఆధ్యాత్మిక లక్ష్యాలను గుర్తుచేస్తూంటుంది. పాంచభౌతిక శరీరం ఏదో ఒక రోజు బూడిదగా మారతుంది. మోక్షమే మానవునికి పవిత్ర లక్ష్యం అని సూచిస్తుంది. త్రి అంటే మూడు, పుండ్ర అంటే విడుదలైనది. నుదుటిపై మూడు విభూతి రేఖలు, మధ్యన మూడవ కన్నుగా చుక్క ఉంటుంది. విభూతి శరీరపు క్షణభంగురమైన స్వభావాన్ని, ఆధ్యాత్మిక సాధనను, శివుని సామీప్యత యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. కాలాగ్ని రుద్ర ఉపనిషత్తులోని 2వ అధ్యాయం మూడు రేఖలను వివిధ త్రయాలుగా వివరిస్తుంది: పవిత్రాగ్నులు, ఓం లోని మూడు బీజాక్షరాలు, గుణాలు, ప్రపంచాలు, ఆత్మ రకాలు, శక్తులు, వేదాలు మొదలైనవాటికి త్రిపుండ్రం చిహ్నం. [6] [7]  

  • త్రిపుండ్రాల్లోని మొదటి వరుస నామం గార్హాపత్యాన్ని (వంటగదిలోని పవిత్రమైన అగ్ని), ఓం లోని ఆ అక్షరాన్ని, రజస్ గుణాన్ని, భూమిని, బాహ్యాత్మ అయిన క్రియను, ఋగ్వేదాన్ని, మహేశ్వరునీ సూచిస్తుంది. [6] [7]
  • రెండవ నామం దక్షిణాగ్నినీ (పూర్వీకుల కోసం దక్షిణాన వెలిగించిన పవిత్ర అగ్ని), ఓం లోని ఊ శబ్దాన్ని, సత్వ గుణాన్ని, గాలినీ, అంతర్గత ఆత్మ అయిన సంకల్పాన్ని, యజుర్వేదాన్ని, సదాశివుణ్ణీ సూచిస్తుంది. [6] [7]
  • మూడవ నామం ఆహవనీయాన్ని (హోమానికి ఉపయోగించే అగ్ని), ఓం లోని కారాన్ని, తామస గుణాన్ని, స్వర్గాన్ని, పరమాత్మనూ, గ్రాహక శక్తిని, సామవేదాన్ని, శివుణ్ణీ సూచిస్తుంది. [6] [7]

త్రిపుండ్ర పదంలోని "త్రి" సత్వ, రజస్ తమో గుణాలను సూచిస్తుంది. త్రిలోకాలు – భూ, భువః, సువః; త్రితపాలు - భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక కూడా సూచిస్తుంది. త్రిపుండ్రాన్ని భస్మ లేదా విభూతి అని కూడా అంటారు. త్రిపుండ్రం ప్రాణశక్తికి, బ్రహ్మ, విష్ణు, శివుడు నిర్వహించే మూడు ధర్మాలు - సృష్టి, స్థితి, లయాలు- కూడా సూచిస్తుంది. ఈ విధంగా త్రిపుండ్రం త్రిమూర్తులను సూచిస్తుంది. [8] త్రిపుండ్రను నుదుటిపై పూయడాన్ని "భస్మ ధారణ" అంటారు. త్రిపుండ్రను నుదిటిపై ధరించేవారు, దాని ఆధ్యాత్మిక అర్థాన్ని గుర్తుచేసుకుంటూ భగవంతుని ధ్యానిస్తారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Deussen 1997, pp. 789–790.
  2. 2.0 2.1 Lochtefeld 2002, p. 724.
  3. "Tilak".
  4. 4.0 4.1 4.2 4.3 Rigopoulos 2013, pp. 182–183.
  5. Klostermaier 1984, pp. 131, 371.
  6. 6.0 6.1 6.2 6.3 Deussen 1997, p. 790.
  7. 7.0 7.1 7.2 7.3 Nene 1999.
  8. "Hindu Scriptures | Vedic lifestyle, Scriptures, Vedas, Upanishads, Smrutis".